"నేను ఊఁ, అనాలిగాని పిల్లనివ్వడానికి ఎందరో తయారవుతారు. నాసాటి వాళ్లే నాకు పిల్లనిస్తారు. కాని, అసలు వివాహమే చేసుకోకూడదని, పిల్లలకి సవితి తల్లిని తేకూడదని అనుకొన్న నేను పెళ్ళికి తయారయ్యానంటే నువ్వు నాకు నచ్చడం, నా పిల్లలు నీ చేతిలో సురక్షితంగా పెరుగుతారన్న నమ్మకం ఏర్పడ్డంవల్లా!"
తన జవాబువల్ల అతడు నొచ్చుకొన్నాడని గ్రహించింది సంధ్య. "ఆయాగా వచ్చి అమ్మగారిగా మార్పుచెందే అర్హత నాకుందా లేదాని ఆలోచిస్తున్నానుగాని, మీమీద నాకు చిన్న చూపు ఏర్పడి కాదండీ!"
"నీ అర్హత గురించి ఆలోచించాల్సింది నేను."
ఇంకేం మాట్లాడాలో తోచలేదు సంధ్యకు.
"ఆలోచించాలీ అంటే ఆలోచించు. నిన్ను ఒత్తిడి చేయాలనీ, బలవంతానికి ఒప్పించాలనీ నాకేం లేదు. ఇలాంటి విషయాల్లో బలవంతం పనికిరాదని నాకుతెలుసు. నువ్వుఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా నువ్వు మాత్రం నా పిల్లలని అర్ధాంతరంగా వదిలేసి మాత్రం వెళ్ళకు. నీకిష్టం లేకపోతే నిన్నీ విషయంలో ఇంకెప్పుడూ కదపను."
చక్రపాణి ఆ తరువాత ఇంకేం మాట్లాడలేదు. నిశ్శబ్దంగా భోజనం ముగించి వెళ్ళిపోయాడు.
* * *
ఇంటికి రంగులు వేయిస్తూ పనివాళ్ళని అజమాయిషీ చేస్తున్న జానకమ్మ, ఆవరణలో ఆగిన కారునుండి దిగి, పిల్లలని చెరోప్రక్క చెయ్యి పట్టుకు నడిపిస్తూ వస్తూన్న సంధ్యనిచూసి కళ్ళు ఇంతింత చేసుకుచూసింది.
తాము జాలిపడి తీసుకువచ్చిన ఆ సంధ్యేనా? కనకాంబరం రంగు పట్టుచీరలో, ఎవరో కోటీశ్వరుడి కూతురంత హుందాతనంతో వెలిగిపోతూంది.
"ఆఁ, వాడి పెళ్ళి ఏమని పెట్టుకొన్నానోగాని ఒక్క నిమిషం తీరిక లేదంటే నమ్ము! చిన్నపని పెద్దపని నేనేకదా?"
"అరుణ్ చూచుకోడా?"
"అరుణ్ ఒక్కటీ పట్టించుకోవడంలేదు. వారం రోజులనుండి అసలు ఊళ్ళోనేలేడు. "రా, కూర్చో!" అంటూ హాల్లోకి తీసికెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. "ఎలా ఉన్నారు పిల్లలు? నీకు బాగా అలవాటు అయ్యారా? ఎలా ఉంది నీకా ఇంట్లో?" ప్రశ్నల వర్షం కురిపించేసింది.
"బాగానే ఉంది."
క్రొత్తచోటులో పిల్లలు బెదిరిపోయినట్టుగా పిల్లలు సంధ్యకి ఒదిగినట్టుగా కూర్చొన్నారు చెరోప్రక్క.
"చీర క్రొత్తగా కొన్నావా? ఎంత పడింది?" కొంచెం ఈర్ష్యగా చూస్తూ అడిగింది.
"నేను తీసుకోలేదు. చక్రపాణిగారు కొన్నారు! పధ్నాలుగు వందలు పడింది!"
"తంతే గారెల బుట్టలో పడ్డావన్నమాట!"
ఆమె అసహ్యమైన అర్ధాలు వచ్చేట్టు మాట్లాడకముందే, చక్రపాణి తనని పెళ్ళి చేసుకొంటానని చెప్పిన విషయం చెప్పేసింది సంధ్య. చెప్పి, "నీ సలహా కావాలని వచ్చాను, అత్తా! నాకు పెద్దదిక్కంటూ ఉన్నదానివి నువ్వొక్కత్తివే!" అంది.
"సలహా ఎందుకే పిచ్చి మొద్దూ! వెంటనే ఒప్పేసుకోవలసినమాట! ఎంత అదృష్టం చేసుకొన్నావో అంతటి శ్రీమంతుడి ఇంట్లో కాస్త చోటు దొరికిందంటే చక్రపాణి నీకు భర్త అవుతున్నాడు! అందులో ఆలోచించడానికీ, ఎవరి సలహాలో కోరడానికీ ఏముంది?" శాశ్వతంగా పీడవిరగడైపోతుందన్న సంతోషం జానకమ్మ మనసులో నిండిపోయింది. "అరుణ్ ఆవేశంతో పెళ్ళిపీటలమీది నుండి లేవగొట్టి తీసుకువచ్చాడే, ఆ పిల్లకి ఏ దారీ చూపలేదే అన్న దిగులు పీడించేది నన్ను. ఇవాస్టికి అది తీరిపోయింది. చివరికి నీ జీవితం సుఖతీరం చేరుతోంది! అరుణ్ ఆ రోజు చేసింది మంచి పని అని ఇవాళ అనుకొంటున్నాను! చక్రపాణి రెండోపెళ్ళివాడైనా వయసు ఏభైలోపేననుకుంటాను! అది మగవాళ్ళకు పెద్దవయసు కాదనుకొంటాను!"
'కాని, నాన్న బ్రతికి ఉంటే ఆయన వయసు ఉండేవాడు' అనాలనుకొంది గాని, 'అయితే నీకు ఈడూ జోడూ అయిన మగణ్ణి ఎవరు తెస్తారట!' అని తుడుతుందన్న భయంతో వూరుకొంది. తనలాంటి ఆడపిల్ల కోరుకొనేది ఏమిటి? ఈడూ జోడైన మగడిని! ఆస్తినీ, ఐశ్వర్యాన్నీ కోరదు. పాతికేళ్ళు తన భార్యతో వైవాహిక జీవితం గడిపి, ఇద్దరు బిడ్డల తండ్రి అయిన వాడితో తన వైవాహిక జీవితం మొదలవుతూందంటే సంధ్యలో ఏ కోశానో ఉత్సాహం, సంతోషం ఏర్పడ్డంలేదు.