కొన్నాళ్ళ వరకూ మనిషి కాలేకపోయింది పార్వతి. జబ్బు పడి లేచినట్టే నీరసించి పోయింది. ఎటు చూసినా విషాదం తప్పితే ఏమీ కనిపించటం లేదు. ఆ అర్ధం లేని బంధాలూ, బాంధవ్యాలూ, ప్రేమలూ , మమతలూ బొత్తిగా అర్ధ రహితాలే! ఏది శాశ్వతం? ఏదీ కాదనిపించింది.
"అక్కయ్యా! నా పచ్చ అట్ట నోట్స్ కనిపించదేం? నిన్న ఇక్కదేగా వ్రాసి పెట్టాను?" కంగారుగా వెదుక్కుంటూ అడిగాడు సూర్యం.
"నాకు తెలీయదురా, సూర్యం! కొంచెం నెమ్మదిగా వెదుక్కో మరి. అదే కనిపిస్తుంది."
సూర్యం చిరాకు ఎక్కువైంది. "ఇంకా ఎలా వెదుక్కోవాలి? అసలు ఇంట్లో ఉంటె కనిపించకేం చేస్తుంది? ఏ పిల్ల వెధవలు పట్టుకు పోయారో! దొంగ వెధవ లందర్నీ చేర్చుక్కోర్చుంటావు."
"అదేమిటి. సూరీ? పిల్లదేదో సరదాగా ఆడుకోటానికి వస్తారు. నీ పుస్తకాలూ, అవీ ఎందుకు తీస్తారు? నేను జాగ్రత్త గా చూస్తూనే వుంటాను గానీ, తియ్యనిస్తానా?"
"అయితే ఆ నోట్సు కనిపించదేం? దేవుడెత్తుకు పోయాడంటావేమిటి?"
తమ్ముడెందుకంత చిరాకు పడిపోతున్నాడో పార్వతికి అర్ధం కాలేదు. తన మట్టుకు తను శాంతంగా నే అంది. "రాత్రి గాని వెళ్తూ వెళ్తూ చేత్తో పట్టుకు పోయావేమో కాస్త జ్ఞాపకం చేసుకో, సూర్యం!"
జ్ఞాపకం చేసుకోటానికి ప్రయత్నించక పోగా వినిపించీ వినిపించకుండా సణుక్కోవటం మొదలెట్టాడు , వినీ విననట్టు ఊరుకుంది పార్వతి.
బొత్తిగా యాంత్రికంగా తయారైనట్టుంది జీవితం. గబగబా వండుకోవటం, ఆఫీసుకు వెళ్ళి రావటం, ఆలోచిస్తూ పడుకోవటం మినహా మరో విశేషమేమీ లేదు.
"సూర్యం! మరదల్ని ఇంటికి తీసుకు రాకూడదూ? ఇల్లు కాస్త సందడిగా ఉంటుంది" అంది గతం లోనే.
"తను ఇక్కడెలా ఉంటుంది? మన మిద్దరం బయటికి పొతే రోజంతా ఒక్కతీ ఉండద్దూ?" అన్నాడు సూర్యం. పార్వతి కేం చెప్పాలో తోచనట్ట యింది. మరి పెళ్ళయిన తర్వాత అత్తవారింటి కి రాదూ ఆడపిల్ల? ఎవళ్ళ సంసారం వాళ్ళు చేసుకునేటప్పుడు ఒక్కళ్ళూ ఉండక ఇంకెవరోస్తారు? ఖచ్చితంగా తన ఉద్దేశ్యం చెప్పలేకపోయినా ఏదో కాస్త వెల్లడించకుండా ఉండలేక పోయింది. "నువ్వు ఉన్నా లేకపోయినా రాత్రుళ్ళు కూడా ఒక్కదాన్నీ ఉంటున్నాను. పగలు కాస్సేపూ ఉండటానికి ఏం ఫర్వాలేదు , సూర్యం! సాయంత్రం నాలుగయ్యే సరికి రానే వస్తాను నేను. అందాకా ఏ పుస్తకాలో చదువు కొంటూ కూర్చుంటుంది."
"ఆవిడ గారి కేం వంటా గింటా రాదు. వచ్చి మాత్రం ఏం చెయ్యాలి గనకా?" పెళ్ళానికి పని పాటలు రానందుకు తనెంతో బాధ పడుపోతున్నట్టు కనిపించాడు సూర్యం. పార్వతి, తమ్ముడి గుణం గ్రగించినా ఊరుకోలేకే అంది: "ఇక్కడి కొస్తే మాత్రం వంటా వార్పూ ఆ పిల్ల మీద పెడతానా నేను? నేనేం పాటు పడిపోవాలి గనక? ఇంట్లో ఉండవలసిన మనిషి కదా-- తీసుకొస్తే బావుంటుందని అన్నాను, పోనీ, నీ కిష్టం లేదంటే అలాగే కానీ!"
"నాకు కాదు . అసలు తనకే ఇష్టం లేదంది. పోనీ, ఊళ్ళో వాళ్ళ పుట్టిల్లు ఉంది గదా? అక్కడే ఉంటుంది లే అని నేనూ ఊరుకున్నాను. నా చదువు కాస్తా ముగిసిపోతే ...."
ఆ చదువుకూ, పెళ్ళాన్ని తీసుకు రావటానికీ సంబంధం ఏమిటో బోధపడింది కాదు పార్వతికి. చదువు సాగదని భయపడుతున్నాడేమో అనుకుందామా అంటే ప్రతి రాత్రీ అక్కడికే బయల్దేరుతున్నాడయ్యే!
సూర్యం మూడు రోజుల వరకూ ఇంటికి రాకపోతే కంగారు పడి కబురు పంపింది పార్వతి.
"రేపు వాళ్ళిద్దరూ కలిసి వస్తామని చెప్పమన్నా రత్తా!" అనేసి పరిగెత్తాడు పొరుగింటి వాళ్ళ పిల్లాడు.
పార్వతి ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ కొట్లో కి వెళ్ళి కాస్త గోధుమ రవ్వా, సెనగ పిండి , జీడిపప్పు వగైరా ఏవేవో పొట్లాలు కట్టించుకు వచ్చింది.
మర్నాడు ఆదివారం పొద్దుట తొమ్మిది గంటల వేళ తమ్ముడూ, మరదలూ రిక్షా దిగుతుంటే గబగబా కుంపటి అంటించి కాఫీ పెట్టింది. ఇద్దరికీ చెరో కప్పూ ఇచ్చి తర్వాత వంట గదిలో కూర్చుని వంటలు తయారు చేసింది.
"సూరీ! పన్నెండవుతోంది . భోజనాలు చెయ్యకూడదు?" అంటూ ఇద్దరికీ నీళ్ళూ తువ్వాలు అందించి అన్నాలు వడ్డించింది. తింటూ తింటూ , "రాణీ! మా అక్కయ్య దగ్గర నువ్వు వంట నేర్చు కోరాదూ?" అంటూ హాస్యమాడాడు సూర్యం.
"ఈ మాత్రం వంట నాకు రాదేమిటి?" రాణి మూతి విరుచుకుంటూ అంది.
"కోస్తావ్ మరీ! వంకాయ ఉల్లికారం పెట్టి ఇంత రుచిగా వండగలవూ? పెసర పచ్చడి ఇంత కమ్మగా రుబ్బగలవూ?" నవ్వుతూ చూశాడు సూర్యం.
రాణీ మొహం జేవురించినట్టే అయింది. "మీ మట్టుకు మీకు మహా గొప్పగా ఉన్నాయి కాబోలు. నాకిలాంటి గొడ్డు కారాలు తినటం అలవాటే లేదు. బొత్తిగా రుచీ పచీ తెలీకుండా...."
పార్వతి కలగాజేసుకోక తప్పలేదు. కూరల మీద లేచిన ప్రసంగం కీచులాటల వరకూ పోకుండా ఉంటె చాలు. "ఎవరి మట్టుకు వాళ్ళు వండుకు తినక పస్తులుంటారా ఏమిటీ సూర్యం? అడ పుటక పుట్టాక వంటా వార్పూ రాకుండా ఎవరు ఉంటారు?" అంది ఆప్యాయంగా.
రాణీ అదోలా నవ్వుతూ, "మీకు కోపం వచ్చిందేమిటి? నిజంగా నా కింత లేసి కారాలు తినటం అలవాటు లేదు. అందుకే అన్నాను" అంది.
"అబ్బే! ఇందులో కోపం రావటాని కేముంది? మా అమ్మ చచ్చిపోయే నాటికీ నేనే వంటా నేర్చుకో లేదు. తీరా అన్ని పనులూ మీదపడితే ఎలాగో అలవాటు చేసుకున్నాను. పెద్దవాళ్ళు నేర్పని వంటలూ అవీ ఏమి ఉంటాయి? మీ అమ్మ గారి దగ్గర శ్రద్దగా నేర్చుకుంటే సరి. అన్నీ చక్కగా చెయ్యగలవు."
తర్వాత పెద్దగా మాట లేమీ జరగలేదు.
తమ్ముడూ మరదలూ గదిలోకి పోయి తలుపులు వేసుకున్న తర్వాత, తనూ రెండు ముద్దలు తిని లేచి మళ్ళా కుంపటి అంటించి మధ్యాహ్నం తింటారని కాసిన్ని పకోడీలు వేయించింది. వేడి కుంపటి మీద కాపీ కి నీళ్ళు పడేసి వంటింటి గడపలో తుంగ చాప పరుచుకుని పడుకుంది.
మధ్యాహ్నం కాఫీలు అవీ అయ్యాక మొగుడూ పెళ్ళా లిద్దరూ కాస్సేపు పేకాడుకున్నారు.
"అక్కయ్యా , నువ్వూ వచ్చి కూర్చో కూడదు?" అన్నాడు సూర్యం మధ్యలో గుర్తు వచ్చినట్టు.
"ఛ! నాకు పేకాడటం రాదురా!" అంది పుస్తకం చదువుకుంటున్న పార్వతి.
"అంటే? పెకాడటం నామోషీయా ఏమిటి?" ముక్కలు పేర్చుకుంటూ వారగా చూసింది రాణి.
"అలా ఎవరన్నారు? నా కేమిటో చిన్నప్పట్నుంచీ పెకాటంటే అసహ్యం. సరదాకి నేర్చుకోబోయినా పట్టు బడలేదు. నాతో ఏమిటి? మీరాడు కొండి."
రాణీ చిత్రంగా పార్వతి కేసి చూసింది. ఇంత మూర్ఖపు మనుషులతో ఏం సరదాలు తీరుతాయి? ప్రపంచం ఎంత మారుతున్నా గొర్రె తోక సిద్దాంతాలతోనే ఉంటారు కొంతమంది. తనలో తను నవ్వుకొంది.
పెళ్ళయిం తర్వాతే సూర్యం సిగరెట్లు కాల్చటం పేక ముక్కలు పరచుకు కూర్చోటం అలవాటు చేసుకున్నాడు. పార్వతి రెండు మూడు సార్లు అడగాలనుకునే విరమించుకుంది.
రాణీ తన చేతులతో తనే సూర్యం సిగరెట్ల కు అగ్గి పిల్లలు అంటించటం చూస్తె ఒళ్ళంతా కలదరించి నట్టయింది పార్వతికి. క్లబ్బు ల్లో కబుర్లు చెప్పుకుంటూన్నట్టు ఇంట్లో అస్తమానూ పేకాటల గురించి మాట్లాడుకోవటం కూడా కంట కింపు గానే ఉంది. కాని, తనేమీ చూడనట్టే ఊరుకుంది.
వాళ్లిదరూ మళ్ళా పేకాట లో మునిగి కోపాలు ప్రదర్శించు కొంటున్నారు. రాణి రాక విషయం ఆ పిల్ల దగ్గరే ఎత్తుదామా అనుకొంది కొంతసేపు. సూర్యానికే ఆ ఉద్దేశ్యం లేనప్పుడు తను అడిగి ప్రయోజనం ఉండదేమో నని అప్పటి కా ఆలోచన విరమించుకొంది. అయినా ఇంటికి తను పెద్దది. అమ్మాయిని పంపించమని అడగక పోవటం మర్యాదగా ఉండదు. ఆ బాధ్యత తను చూసుకోకపోతే ఇంకెవరు చూస్తారు? అ ఉద్దేశ్యంతో తమ్ముడి అత్తగార్ని అడిగిందో రోజు.
"మంచి రోజు చూసి మరదల్ని పంపించండి అత్తగారూ!" అంది చిట్ట చివర. ఆవిడ ఏమంత పట్టించుకోనట్టు నవ్వేస్తూ , ఆ దాని కేముందమ్మా? ఊళ్ళో మేమేలాగూ ఉన్నాం. అబ్బాయి వచ్చి పోతూనే ఉన్నాడు. అది ఎక్కడుంటే ఏమిటి? నువ్వు ఆఫీసుకి పొతే అది ఇంటి పనులూ అవీ చేసుకోలేదు. బొత్తిగా చిన్న పిల్ల. ఏదో పెళ్ళి చేశాం గానీ...' అంటూ భారతం లా చెప్పుకుపోయింది.
పార్వతి మరేమీ మాట్లాడ లేకపోయింది . వాళ్ళ అయిష్టాలు తెలిసి కూడా పెద్దరికం వహించి తను అడగటానికి రావటం తనదే తప్పని చివాట్లు పెట్టుకుంటూ లేచింది. ఇంటికి వచ్చేసరికి --
సూర్యం బట్టలన్నీ వెదికి వెదికి పెట్టెలో సర్దుకుంటున్నాడు. "నా టేరిలిన్ షర్టు కనిపించటం లేదక్కయ్యా! చాకలికి పడిందంటావా?" అన్నాడు పార్వతి రాగానే.
"మాసిందని ఇచ్చావు కదూ? సబ్బు పెట్టి ఉంచాను. అదేమిటి? బట్టలూ అవీ సర్దుతున్నావు?" ఆశ్చర్యంగా అడిగింది పార్వతి.
సూర్యం ఆ మాటేదో వినిపించనట్టే టవెల్సు మడిచి పెట్లో అణచటానికి ప్రయత్నిస్తున్నాడు.
'అడగకూడదు గానీ ఎక్కడి కైనా బయలు దేరుతున్నారా , సూర్యం?" భార్య భర్త లిద్దరూ ఏ శృంగార యాత్రకో ప్రయాణ మౌతున్నారన్న అనుమానం రాకపోలేదు పార్వతికి.
సూర్యం అదో మాదిరిగా నవ్వాడు. "అడక్కూడదంటూనే అడిగావుగా? ఈ పెట్టె తీసి కెళ్ళి ఆక్కడ పడేస్తా నక్కయ్యా! వెధవది బొత్తిగా ఇబ్బంది అవుతోంది."
పార్వతి కేం అర్ధం కాలేదు. "ఎక్కడ పడేస్తావు> నీ బట్టలూ అవీ....."
"బట్టలు మాసినప్పుడల్లా , ఎన్ని పనులున్నా ఇక్కడికి రావలసి వస్తోంది. పోనీ అక్కడే ఉంటె అంత ఇబ్బంది ఉండదు."
అదిరిపడింది పార్వతి. "నువ్వు వాళ్ళింట్లో నే ఉంటావా?"
"ఎన్నాళ్ళు ఉండిపోతాను? నాలుగైదు రోజుల కోసారి వస్తూ వుండను?"
"సూర్యం! " పార్వతి శరీరం కంపించింది. సూటిగా చెప్పకపోయినా తమ్ముడి ఉద్దేశ్యం పూర్తిగా తెలిసిపోయింది. "కాస్త వెనకా ముందూ ఆలోచిస్తున్నావా , సూర్యం? నువ్వు లేకుండా నే నొక్కదాన్నీ ఉండగలనా?"
"చ! నే నెక్కడి కేల్తా నక్కయ్యా?"
"బట్టలు మార్చుకుందుకైనా రెండు రోజుల కోసారి వస్తున్నావు. ఇక ఆ అవసరం కూడా లేకపోతె ఇక్కడ నీకేముంది? ఒక్కసారి ఆలోచించు, సూర్యం! నువ్వు ఉద్యోగం మానేస్తా నన్నావు , మానేశావు. నాకిష్టం లేకపోయినా నీకు నచ్చిన పిల్లని పెళ్ళి చేసుకున్నావు! నేనూ సంతోషించాను. మామగారు చదివిస్తోంటే చదువు కుంటున్నావు. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకు రాకపోయినా అక్కడికి వెళ్ళి వస్తూనే ఉన్నావు. బాగానే ఉందనుకున్నాను. పోనీ, ఇలాగే జరగనివ్వరాదూ? కాదన్నది ఎవరూ? ఇక నువ్వు కూడా బయలుదేరి వెళ్ళి పోతానంటే?" పార్వతికి ఎన్నడూ ఎరగనంత దుఃఖం ముంచుకు వచ్చింది.
'అంత బాధ పడతా వెందు కక్కయ్యా? అక్కడి కి కాలేజీ దగ్గర. నా చదువు విషయంలో కూడా మామగారు సహాయం చేస్తుంటారు. కాస్త సౌకర్యంగా ఉంటుందని గానీ.... అయినా వారం వారం వస్తూ వుండనా? ఊరు వదిలి వెళ్ళి పోతున్నానా ఏమిటి నువ్విలా నిష్టూరంగా మాట్లాడటానికి? ప్రతి ఆదివారం రాణీని తీసుకు వస్తూనే ఉంటాగా?"
పార్వతి మాటలు మరిచిపోయిన మనిషిలా మూగగా చూస్తూ నించుంది. సూర్యం ఓ క్షణం వెనకా ముందూ తచ్చాడాడు. బయటి నుంచి అరుస్తూన్న రిక్షా వాడి మీద , "ఏమిటోయ్ ఆ కంగారూ? పొతే పో!" అంటూ విరుచుకు పడ్డాడు.
"అలీసెం అయిపోతుంది బాబూ! మళ్ళా నేను సినిమా హాలు దగ్గరికి పోవాల" అంటూ సంజాయిషీ చెప్పుకున్నాడు వాడు.
"అయితే మాత్రం ఏమిటా అరుపులు? అవతల మా పని తెమలాలా, అక్కర్లేదా? సరేలే. ఇలా రా! అదిగో ఆ పెట్టి తీసికెళ్ళి జాగ్రత్తగా పెట్టు."
"బరువుగా ఉంది బాబూ! కసింత చెయ్యే స్తివా...."
రిక్షా వాడికి సాయం పట్టి భోషాణం లాంటి బట్టల పెట్టి రిక్షా లోకి ఎక్కించాడు సూర్యం.
"వెళ్తా నక్కయ్యా! రేప్పోద్దుటే వచ్చి కనిపిస్తాను. 'అంత బరువు రిక్షా పార్వతీ గుండెల మీదగా కదిలింది. హృదయం పిండి పిండయింది. "సూరీ!" అంటూ మొహానికి చేతులు కప్పుకుంది.
"నీకు స్వార్ధం లేదక్కయ్యా! స్వార్ధ మే లేదు.
"నువ్వు దేవతవి, అక్కయ్యా! నాకు అమ్మవే.
"అక్కయ్యా! నీ ఋణం ఏనాటికి తీర్చుకో లేను--"
అన్న సూరి! అయ్యో, సూర్యం! ఈనాటి కింత పరాయి దాన్నయిపోయానా , నాయనా? నీ కష్ట సుఖాలు విస్మరించానా? నీ ముద్దు ముచ్చట్లు చూడనన్నానా? నీ సంతోషానికి దుఃఖ పడ్డానా? ఏం చేశాను, సూర్యం? ఏం చేశానని వెళ్ళిపోయావు?"
ఎంత ఏడ్చినా ఆ బాధ తీరనే లేదు. రుక్కూ సూరీ -- తనకు రెండు కళ్ళే అనుకొంది. జ్యోతుల్లాంటి ఆ కళ్ళ తోనే తను లోకాన్ని చూస్తా ననుకోంది. జీవితం ఇంత చిత్రమైందని తనకేం తెలుసు? తన నింత అనాధను చేస్తారనా వాళ్ళను పెంచింది? పరాయిదాన్ని చేసి తరిమేస్తారనా కోరుకున్న వాళ్ళను త్రోసి పుచ్చింది? ఇంత దుఖం ప్రసాదిస్తారనా తన సుఖాలన్నీ జారవిడుచుకుంది? భగవంతుడా ! ఎంత పిచ్చిది తను! అందరిలా తనకూ స్వార్ధ చింతన ఉంటె? అందరిలా తనకూ సుఖ పడటం చేతనైతే? ఎంత బావుండేది! ఎంత బావుండేది!
అణుచుకోవటానికి అవశ్యకమై పోయిన ఆవేదనతో బావురుమంటూ కూలబడిపోయింది పార్వతి.