"సుశీలకి చాలా ప్రమాదంగా ఉందట. నీకోసం రెండు మూడు రోజులనుంచి మనుషులు వస్తూనే ఉన్నారు." అన్నాడు సూర్యం హటాత్తుగా.
"ఏమిటీ? సుశీలకా? ప్రమాదంగా ఉందా? ఎవరు చెప్పారు?" కంగారుగా అడిగింది పార్వతి.
"మళ్ళా ఏదో జబ్బు చేసిందని పుట్టింటికి తీసుకొచ్చి ఆస్పత్రి లో చేర్చారట. రెండు రోజులు చూసి డాక్టర్లు లాభం లేదు, తీసుకు పొమ్మంటే ఇంటికి తీసుకొచ్చేశారట. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని, అస్తమానూ నీకోసం కలవరిస్తోందని నాలుగైదు సార్లు వాళ్ళింట్లో మనుషులు వచ్చి వెళ్ళారు. నువ్వు ఊరెళ్ళావని విని, నాకోసం మా అత్తారింటికి కూడా వచ్చారు. రెండు మూడు రోజుల్లో వచ్చేస్తావని చెప్పాను నిన్న. రాగానే మాత్రం నీకీ కబురు చెప్పమన్నారు." గబగబా సంగతంతా చెప్పి బాధ్యత తీర్చుకున్నట్లు మళ్ళా పుస్తకాల్లో తల దూర్చేసుకున్నాడు సూర్యం.
పార్వతి కేమిటో నమ్మశక్యంగా లేదు. సుశీలకు మళ్ళా ఎందుకంత జబ్బు చేసింది? చాలా ప్రమాదం అంటే చచ్చిపోదు కదా?
పార్వతి రైలు దిగి రాగానే ఈ కబురు తెలిస్తే ఎప్పుడో వెళ్ళి పోయేది. దుమ్ముకోట్టుకు పోయిన గదులు తుడుచుకుని, బోర్లించుకున్న పాత్రలన్నీ తోముకుని, స్నానం చేసి, కుంపటి అంటించి ఎసరు పెట్టింది. అప్పటికి పార్వతి పంపిన కబురు విని సూర్యం వచ్చాడు. వచ్చిన ఓ పావుగంట కు తాపీగా చెప్పాడు -- "సుశీలకు చాలా ప్రమాదం ....' అంటూ.
"రాగానే అయినా చెప్పావు కాదురా! ఈసరికి వెళ్ళేదాన్ని. సరేలే. అన్నం వార్చేశాను. ఈపూట కూరా అదీ చెయ్యలేను. ఏ పచ్చడి ముక్కో అద్దుకు తినచ్చు. నేనోక్కసారి వెళ్లొస్తాను. ఉంటావా, ఇంట్లో?"
"ఉంటాలే. ప్రయాణం కబుర్లు చెప్పావే కాదు. రుక్కు కొడుకేలా ఉన్నాడు? అసలేం సుస్తీ చేసింది?"
"అట్నుంచి వచ్చి చెప్తాగా? తొందరగా వచ్చేస్తాలే" అంటూ ఆత్రుతగా బయలు దేరింది పార్వతి.
గేటుకు అవతల నుంచే ఆ యింట్లోకి వచ్చే పోయే జనాన్ని చూస్తె పార్వతి గుండెలు దడదడ లాడాయి. తడబడే కాళ్ళతో అతి ప్రయత్నం మీద వేగంగా నడుస్తూ లోపలికి వెళ్ళింది. ఎన్నడూ ఎరగని రకరకాల మనుష్యులూ ఎవరికి తోచినట్లు వాళ్ళ మాటలూ , పలకరింపులూ , పరామర్శ లూ, సన్నసన్నగా ఏడుస్తున్న ఆడవాళ్ళ కంఠస్వరాలు -- ఒక్కసారిగా గందరగోళం లో ప్రవేశించినట్టయింది. ఎవర్ని అడగాలన్నా ఎవ్వరూ వినిపించుకోవటం లేదు. కాస్త చొరవ చేసి మెడ ఎక్కుతున్న వాళ్లతో పాటు పైకి వెళ్ళింది. మెట్ల దగ్గరి నుంచి గదులన్నీ కిటకిటలాడుతున్నట్టే ఉన్నాయి. అంతలోనే ఎవరో పార్వతిని గుర్తు పట్టి పిలుచుకు వెళ్ళారు.
"పార్వతి వచ్చిందర్రా! రా, అమ్మా, రా! ఒక్కసారి ఇలా రా!" అంటూ కంగారుగా పిలిచింది ఒకావిడ.
"ఈవిడే నేమిటి పార్వతంటే?" అన్నట్టు చాలా కళ్ళు పార్వతి కేసి చూశాయి. ఏమీ పట్టించుకోకుండా గబగబా సుశీల మంచం దగ్గరికి వెళ్ళింది పార్వతి.
సుశీల తలను ఒళ్ళో పెట్టుకు కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చుంది తల్లి. ఎవరెవరో బంధువులూ, అప్తులూ మంచం చుట్టూ మూగి వున్నారు.
"అమ్మా! సుశీ! ఒక్కసారి చూస్తావూ? పార్వతి వచ్చిందమ్మా!" ఎంత అనునయంగా పిలిచినా సుశీల కళ్ళెత్తి చూడలేదు. పార్వతి కూడా దగ్గరే కూర్చుని సుశీల తల మీద చెయ్యి వేసింది. జుట్టంతా తాళ్ళు కట్టుకు పోయి వుంది. ఎముకలు తేలిన వీపు మీద చేతితో నిమిరింది. సుశీల దాదాపు బాహ్యస్మృతి కోల్పోయి పడి వుంది. గతరాత్రి నుంచీ అలాగే ఉందనీ, పలవరింతలు కూడా మానేసిందనీ -- ఎవరో చెప్పుకుంటుంటే తెలిసింది.
"పార్వతి అక్కయ్యా....అక్కయ్య.... లేదా అమ్మా? రాలేదా?" అంటూ విధి విరామం లేకుండా ఎన్నోసార్లు అడిగిందిట. పిచ్చిదాన్ని లాగా చుట్టూ మూగిన వాళ్ళ మొహాల్లోకి తీక్షణంగా చూసిందట. సుశీల తల్లి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ చెప్పింది.
"పాపిష్టి పెళ్ళి చెయ్యకుండా నైనా ఉన్నాను గాదు. నా తల్లి ప్రాణాలు నిలువునా తీశారు . నా బిడ్డని నాకు దూరం చేశారు" అంటూ ఆవిడ ఏడుస్తుంటే పార్వతి భయం భయంగా చుట్టూ చూసింది. రఘుపతి రాలేదేమో అన్న సంశయం కూడా అప్పుడే వచ్చింది. అతని ప్రసక్తి కూడా ఎవ్వరూ ఎత్తటం లేదు. సుశీల చావు బ్రతుకుల్లో ఉంటె రఘుపతి దగ్గర లేకపోవటం చాలా ఘోరంగా తోచింది పార్వతికి. రఘూ కు కబురు ఈ తెలీలేదా? తెలిసి కూడా రాలేదా?
ఎవరో డాక్టరు వచ్చాడు. అంతా కాస్త దూరంగా జరిగి ఖాళీ ఇచ్చారు. సుశీలకు ఇంజక్షన్ ఇవ్వటానికి సిద్దపడ్డాడు డాక్టరు.
"డాక్టరు గారూ! నా బిడ్డని బ్రతికించలేరా, డాక్టరు గారూ? ఇరవై ఏళ్ళ నుంచీ అపురూపంగా పెంచుకున్నాను. కష్టానికి నిష్టూరానికి కడుపులో దాచుకున్నాను. ఈ కడుపు తీపి మీకు తెలుసా డాక్టరు గారూ? నా బిడ్డని బ్రతికించి పుణ్యం కట్టుకోండి, డాక్టరు గారూ! గర్భశోకం నేను భరించలేను, డాక్టరు గారూ!"
సుశీల తల్లి దాదాపు డాక్టరు పాదాల మీద ఒరిగి భోరుమంటూ ఏడ్చింది. రెండూ కాళ్ళూ పట్టుకుని వదలకుండా వెళ్ళాడింది.
డాక్టరు తడబడుతూ ఆవిణ్ణి లేవనెత్తి "చూడండమ్మా! మీరిలా అధైర్య పడిపోకూడదు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి. నా శక్తి కొద్దీ ప్రయత్నించి చూస్తాను. మీరు కంగారు పడకండి." అంటూ రెండడుగులు ముందుకు వేసి కట్టేలా పడి వున్న సుశీలకు ఇంజక్షన్ ఇచ్చాడు. నోటికి కొంగు అడ్డం పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ కూర్చుంది తల్లి.
పార్వతి ముని వేళ్ళతో కనుకొలకులలో నిలిచిన నీటి బొట్లు విదుల్చుకొంది. గంట కావస్తున్నా సుశీల లో ఏ మార్పూ కనిపించలేదు. అలాగే కళ్ళు మూసుకుని చేతులూ కాళ్ళూ నిర్జీవంగా పడేసుకుని పరుపు మీద పడి వుంది. కాళ్ళు తిమ్మిర్లు పుడుతుంటే కాస్త దూరంగా వెళ్ళి గోడ వారగా కూర్చుంది పార్వతి. తన నెవ్వరూ పలకరించక పోయినా , తనకేసి ఎవ్వరూ కన్నెత్తి చూడకపోయినా, అసలు తనక్కడుందన్న సంగతి కూడా ఎవ్వరూ పట్టించుకోక పోయినా అక్కడి నుంచి కదలాలనిపించలేదు పార్వతికి. అలాగే గోడ కానుకుని కూర్చుంది.
"అయితే ఆ పిల్లాడింకా ఇంటికి చేరలేదూ?"
"ఎటు పోయాడని ఎవరు వెదుకుతారు? నెల్లాళ్ళ నుంచీ ఆతీ గతీ లేదట. అదేం పోయే కాలమో! లక్షణంగా కాపరం చేసుకోలేడూ?"
'అసలు మూడు ముళ్ళూ వేసిందగ్గర్నుంచీ అలాగే కాల్చుకు తిన్నాడట కదూ? ఓ మాటా మంతా? ముద్దా ముచ్చటా?"
ఉలిక్కిపడి చూసింది పార్వతి. ఆ అడవాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎవరి మాట? రఘుపతి గురించేనా?
"పోనీ , అత్తగారైనా రాలేదేమిటో , చోద్యం!"
"ఆవిడా మనేది తో తీసుకు చస్తోందిట. కొడకు దేశాలు పట్టి పోయాడు. కోడలు రోగిష్టి మారిదై పోయింది. ఏం చూసుకు సంతోషిస్తుంది. ప్చ్! అలాగే పోతాయి బ్రతుకులు."
"ఏమైంది పిన్నిగారూ? సుశీల భర్త రాలేదేమీ?" అని అడిగి విపులంగా అన్నీ తెలుసుకుందామనిపించింది పార్వతి కి. ఎంత ప్రయత్నించినా నోరు పెగిలి రాలేదు. కంఠం దుఃఖం తో పూడుకు పోయింది. చటుక్కున కళ్ళు ఒత్తుకుంది కొంగుతో. హటాత్తుగా ఏదో జరిగింది. ఘొల్లుమంది సుశీల తల్లి. "అయ్యో! తల్లీ! వెళ్ళిపోయావా? నన్ను వదిలి వెళ్ళిపోయావా? భగవంతుడా! తీసుకు పోయావా? నా బిడ్డని తీసుకు పోయావా? నా కడుపులో చిచ్చు పెట్టావా? దేవుడా!" కంగారు పడి అంతా దగ్గర మూగారు.
సుశీల అస్తమించింది.
సూర్యుడూ అస్తమించాడు. చిమ్మ చీకటి అలుముకుంది. పార్వతి కూర్చున్న చోటే కూర్చుండి పోయింది. మోకాళ్ళ లో తల దూర్చుకుని ఏడ్చింది. సుశీల చచ్చిపోయింది. సుశీల చచ్చిపోయింది రఘుపతి కి తెలీనే తెలీదు. దుర్మార్గుడు . నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టు కున్నాడు. అయ్యో! సుశీల తనకేదో చెప్పాలను కొంది . తన కోసం ఎంతో ఎదురు చూసింది. చివరి క్షణాలలో ఎంతో బాధ పడింది. వెళ్ళి పోయింది. ఎవ్వరితోనూ చెప్పుకొని లోకానికి ఎవ్వరి కోసం ఎదురు చూడని లోకానికి, దేని కోసమూ భాధపడని లోకానికి వెళ్ళిపోయింది శాశ్వతంగా.
నిన్న నయినా వచ్చి వుంటే .... సుశీల ఏదో చెప్పేది . తను ఒదార్చితే ధైర్యం తెచ్చుకునేది. తప్పకుండా బ్రతికేది.....తప్పకుండా.....
పసుపు కుంకాలతో ముస్తాబయిన సుశీల , ప్రశాంతంగా నిద్రపోయిన సుశీల, ఇహ లోక బంధాలకు అతీతురాలైన సుశీల, పూల కారులో ఊరేగుతున్న సుశీల పార్వతి కన్నీటి లో కరిగి పోయింది. మరి కనిపించలేదు.
* * * *