Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 50

 

    ఎంత ఆపుకుందామన్నా కళ్ళు మూతలు పడుతున్నాయి అతనికి.
    
    ఆమె ఆశ్చర్యపోయింది. తన పుట్టినరోజు సంగతి ఇతనికి ఎలా తెలుసు? తను పుట్టినరోజు తెలుసుకుని రాత్రి పన్నెండు గంటలకు వచ్చి శుభాకాంక్షలు చెబుతున్న ఇతన్ని ఏమనాలి?
    
    అతనివైపు అలా చూస్తూ వుండిపోయింది.
    
    మసక చీకటికి కళ్ళు అలవాటు పడడం వల్ల అతను ఆమెకి బాగా కనిపిస్తున్నాడు.
    
    అతని పెదవులు నవ్వుతున్నా అతనికి ఏదో అయిందని ఆమె కనిపెట్టింది.
    
    "ఏమైంది నీకు" ఆమె కంగారుగా అడిగింది.
    
    "మీకోసం వస్తుంటే పాము కరిచింది" అంతవరకే చెప్పగలిగాడు. శరీరం మొత్తం విషం పాకడంతో అతను దబ్బున కిందపడ్డాడు.
    
    జితేంద్ర కింద పడిపోవడంతో ఏం జరిగిందో ఒక్కక్షణం అర్ధం కాలేదు లిఖితకు.
    
    పరుగున కిటికీ దగ్గరికి వచ్చింది.
    
    అతను స్పృహలో లేడు. అలాగని పూర్తిగా స్పృహ తప్పిపోలేదు.
    
    మగత కమ్మేసినట్టు వున్నాడు. ఏదో భరించలేనితనం ముఖం నిండా అలుముకుని వుంది. నోట్లో నురగ అప్పుడే ప్రారంభమైనట్టుంది. తెల్ల చార పెదవులు రెండింటినీ వేరు చేస్తోంది.
    
    "ఏం జరిగింది?" అతన్ని కుదుపుతూ అడిగింది. అతన్ని తాను పట్టుకున్నానన్న స్పృహ కూడా ఆమెకు లేదు.
    
    "హరికథ నుంచి వస్తున్నప్పుడు పాము కరిచినట్టుంది" అతను బలవంతంగా కళ్ళు తెరిచి చెప్పాడు.
    
    ఆ వాక్యంతో ఏం జరిగిందో ఆమెకు అర్ధమైంది.
    
    అతడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాడు. అదీ ఖచ్చితంగా రాత్రి పన్నెండు గంటలకు. అంతవరకు మేల్కొని వుండడానికి పక్కవూర్లోని దేవాలయం దగ్గర జరిగుతున్న హరికథ దగ్గరికి వెళ్ళాడు.
    
    అర్దరాత్రి అక్కడి నుంచి బయల్దేరాడు. మధ్యలో పాము కరిచింది. తనకు శుభాకాంక్షలు చెప్పడం మినహా ప్రాణం కూడా విలువైనది కాదు. అందుకే పాము కరిచినా నేరుగా తన దగ్గరికి వచ్చాడు.  

 

    'ఇప్పుడెలా?' ఆమె తనలో తాను అనుకుంటూ అటూ ఇటూ చూసింది. ఆ క్షణంలో ఏం చేయాలో పాలుపోలేదు ఆమెకి.
    
    అంతలో ఆమె తల్లిదండ్రులు మేల్కొన్నారు. ఆమె తండ్రి ఆమె కోసం గదిలో చూశాడు. ఆమె లేదు. ఎక్కడికెళ్ళిందోనని ఆందోళన పడుతుంటే కిటికీ పక్క నుంచి మాటలు విన్పించాయి.
    
    ఆ నిముషంలో ఆయన ఏవేవో ఆలోచించాడు.
    
    అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చాడు. లిఖిత తల్లి అయితే అప్పటికే ఆమెకోసం ఇంట్లోని ప్రతి గదిని వెదుకుతోంది.
    
    "ఏమిటమ్మా? ఏమైంది?" ఓ వ్యక్తి కిందపడిపోయి వుండడం, పక్కనే తన కూతురు వుండడం ఆయనకు భయాన్ని కలగజేసింది.
    
    "పాము కరిచింది"
    
    "ఎవరితను?"
    
    ఏం చెప్పాలో తెలియ లేదామెకి అంతలో బుర్ర పనిచేయడం ప్రారంభించింది. "చిన్నస్వామి ఇంట్లో వుంటాడు"
    
    "ఎందుకొచ్చాడిక్కడికి?"
    
    "నేనే రమ్మన్నాను. నిద్ర రాలేదు, ఏవైనా పుస్తకాలు వున్నాయా అని అడిగాడు. ఏవైనా వుంటే వెదికి ఇస్తా రమ్మన్నాను" తను అంత అతికినట్టు అబద్దాలు చెప్పడం ఆమెకి ఆశ్చర్యంగా వుంది.
    
    ఇలాంటి విషయాల్లో మునిగితే అబద్దాలు చెప్పడం దానంతట అదే వచ్చేస్తుంది కాబోలు.
    
    "నాముపాము అయినట్టుంది- నురగ కూడా వస్తోంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి" ఆయన మోకాళ్ళ మీద వంగి అతన్ని పరీక్షిస్తున్నాడు.
    
    "అవును- అర్జెంట్ మరి టౌన్ వరకు ఎలా తీసుకెళ్ళడం?"
    
    అతను స్పృహ తప్పకుండా ఆమె అతని బుగ్గలు పట్టుకుని తడుతూ వుంది. బలంగా తట్టినప్పుడు ఆ ఒత్తిడికి అతను కళ్ళు తెరుస్తున్నాడు. మిగిలిన సమయంలో అతనికి తెలియకుండానే కళ్ళు మూతలు పడిపోతున్నాయి.
    
    లిఖిత తండ్రి బయటికి వచ్చి పక్కింటికి పరిగెత్తాడు. ఆ ఇల్లు వీరాస్వామిది.
    
    అతన్ని నిద్రలేపి విషయం చెప్పాడు.
    
    సద్దల్లో వచ్చిన లాభాన్ని తిరిగి రైతులకు పంచినప్పట్నుంచీ జితేంద్ర అంటే వాళ్ళకంతా ఎంతో అభిమానం.
    
    "అలానా-అయ్యయ్యో-మంచికుర్రాడు. క్షణంలో బండి సిద్దం చేస్తాను" అని వీరాస్వామి నిద్రమత్తునంతా వదుల్చుకున్నాడు.
    
    పెరట్లోకి వెళ్ళి బండి కట్టుకొచ్చాడు.
    
    అప్పటికి విషయమంతా ఆ వీధిలో తెలిసిపోయింది. చుట్టుపక్కల ఇళ్ళలోని వారంతా నిద్రలేచి, జితేంద్ర దగ్గరికి వచ్చారు.
    
    విషం ఒళ్ళంతా పాకకుండా కాలి పైభాగాన టవల్ కట్టింది లిఖిత.
    
    "చాలా ప్రమాదంగా వుంది అర్జెంట్" నారాయణ అరిచాడు.
    
    వీరాస్వామి బండిని వీధిలో నిలబెట్టాడు.
    
    అందరూ కలిసి జితేంద్రను బండిలోకి పట్టారు.
    
    బండితోపాటు ఎవరెళ్ళాలి? ఎవరికి అతనితో సంబంధం?
    
    లిఖిత అవేమీ ఆలోచించకుండా బండి ఎక్కింది.
    
    ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు. తన కూతురు ఎందుకెళ్ళాలి? ఇదంతా తెలిస్తే వూర్లో ఏమనుకుంటారు?
    
    ఏదో మానవతా దృక్పథంతో వెళ్ళినట్టు వూరికి కనపడాలంటే తనూ వెళ్ళాలి.

    ఆయనా ఎక్కి కూర్చున్నాడు.
    
    బండి కదిలింది.

 Previous Page Next Page