Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 5

       
    "మా మేనమామ క్షయమూలాన్ని చనిపోయాడు" అందామె.

    "మంచిపని చేశాడు" అతను తిరిగి యిలా అన్నాడు.

    "మీరందుకు నర్సుగా చేరారూ?"

    "ఆయన యుద్దంలోకి వెళ్ళిపోయారు. మరి నేనేం చెయ్యను? ఏదో దిగులుగా ఉండేది. ట్యూషన్లు చెప్పమన్నారు."

    "బాగానే వుంది"

    "కాని చెప్పలేదు"

    "ఏం?"

    "నా కసహ్యం"

    "తర్వాత?"

    "నర్సుగా చేరాను ఒక హాస్పిటల్లో"

    "మరి?"

    "ఒక రోగి వచ్చాడు"

    "ఎవరూ?"

    "ఒకరు. ఎంతో గంభీరంగా ఉండేవాడు. ఎప్పుడూ జాలిగా నాకేసి చూసేవాడు. నేను లేకపోతే మందైనా తాగేవాడు కాదు."

    "ఊ"

    "అతనంటే ఏదో ఇష్టం కలిగింది. పరిచర్యతో, అనురాగంతో అతని బాధను తగ్గించాలనుకునేదాన్ని అతనిలాగా నాభర్త ఎక్కడేనా పడి ఉన్నాడేమో......"

    ఆమె గొంతు రుద్దమయినట్టనిపించింది. అతను జేబులోకి చేతిని పోనిచ్చి తీసేశాడు.

    "తర్వాత" అన్నాడతను భయంగా.

    "నర్సు పని మానేశాను"

    "ఏం?"

    "ఆ రోగి పోయాడు"

    అతను నిట్టూర్చాడు. ఒక షెల్టరు దగ్గిర ఎవడో ముష్టివాడు నిద్రలో కలవరిస్తున్నాడు. అతను మళ్ళీ అన్నాడు.

    "ఇలా ఎక్కడికి నడుస్తున్నాం?"

    "అగమ్యం" అంది ఆమె.

    "మీకు తెలుగు బాగా వచ్చునే."

    "పరీక్షలో పోయేది ఎప్పుడూ"

    అతను నవ్వాడు ఏదో గౌరవార్ధంగా అన్నట్టు.

    "మరి....." సందేహిస్తూ ఆగాడు.

    ఏఁవిటి అన్నట్టుగా ఆమె అతనికేసి చూసింది.

    "మరి సైన్యంలో నర్సుగా ఎందుకు చేరారు?" అన్నాడతను.

    "కొన్నాళ్ళు ఈజిప్టు నుండి ఉత్తరం రాలేదు. కంగారుపడ్డాను"

    "ఆహఁ"

    "అతని భుజంలోంచి గుండు దూసుకుపోయిందని వార్త వచ్చింది"

    "అరె!" -అప్రయత్నంగా ఆమె భుజంమీద చెయ్యివేశాడు.

    "మళ్ళీ నేటివరకూ ఏ వార్తా రాలేదు. బతికి వున్నాడో లేదో కూడా తెలియదు"

    ఆమె నుదుటిమీద పడే ముంగురుల్ని వణకే చేత్తో సవరించుకుంది. మళ్లీ యిలా అంది.

    "అప్పట్నుండి సంక్షోభంగా ఉండేది మనస్సు. సైన్యంలో నర్సుగా చేరాను"

 Previous Page Next Page