నా ఫోటో పంపుతున్నాను. నాకిష్టం లేక పోయినా నీకు మాటిచ్చి వున్నాను కాబట్టి పంపక తప్పలేదు. దాన్ని రేణుకి చూపించి నీదగ్గరే వుంచుకుంటావో తిరిగి పంపిస్తావో నీ యిష్టం.
రేణు నా ఫోటోకి పంగనామాలు పెడుతుందేమో నని భయంగా వుంది సుమా ఈమధ్య కొత్తగా తీయించిన వేమీ లేవు. ఎప్పుడో కాలేజీ మేగుజైనుకీ బ్లాక్ చెక్కించటానికి పంపాను. తిరిగి రావటంలో చాలా నలిగింది. ఉంటాను.
మాధవరావు.
నాకా ఉత్తరమేమిటో అంతు పట్టలేదు ఏమీ తోచక అలా కూర్చుండి పోయాను-" నీ స్నేహం మానివెయ్యాలనీ నిన్ను మరచిపోవాలనీ బావురుమని ఏడవాలనిపించింది. ఏమిటీ మాధవ్ ఎందుకిలా తను బాధపడి నన్ను బాధపెడతాడు? మనసు విప్పి మాట్లాడడానికి తనకి అడ్డేమిటి? మనసిచ్చి చెప్తున్నా పెడచెవిన బెడతాడేమిటి? ఏమిటీ మనిషి? అనుకున్నాను.
ఆ సాయంత్రం మాధవ్ ఫోటో రేణుకి చూపించాను. చాలా సేపు పరీక్షించి, -"అందగాడేనన్న మాట" అంది నవ్వి, "దానికేం గాని యీ వుత్తరం చదువు" అంటూ ఉత్తరం ఇచ్చాను. చదివి అయోమయంగా చూస్తూ "ఏమిటది?" అంది.
"అదే నాకూ అంతు పట్టడం లేదు."
"క్రిందటిసారి ఏమి రాశావు?"
ఆ రాసిందేదో చెప్పాను.
"ఈ ధోరణేమిటో నాకేం అర్ధం కావటం లేదు." అంది. నేను క్షణం వూరుకున్నాను. అతను అయిష్టంగానైనా రాయడు రేణూ! తనకంతదృష్టం లేదంటాడు. ఎన్నో కష్టాలు భరించానంటాడు. నిన్ను మర్చిపోలేనంటాడు. స్నేహం మానేస్తానంటాడు. నేనేమి అందరాని వస్తువుగా లేను కదా? నా గురించే అయితే ఎందుకిలా మధనపడాలి?.....నీకేం తోస్తుందో చెప్పు రేణూ!"
"అతని భావాలు తెలుసుకోటానికి నీకన్నా నాకెక్కువ అవకాశాలు లేవుగాని అతనేదో అస్వతంత్రుడై వుండాలనుకుంటాను. లేదా నీ స్నేహం పెంచుకోలేని పరిస్థితులేమైన వుండి వుండాలి. ఏది ఏమైనా ఇలా మనస్సుల్లో వ్యవహారం చాలా ప్రమాదకరం సుమా! అర్ధం కాని ఉత్తరాలు కాదు. అతని అభిప్రాయమేమిటో విష్పష్టంగా తెలుసుకోవాలి. యీ విషయం నువ్వింకా నిర్లక్ష్యం చెయ్యకు. కృష్ణవేణీ! ఏ విధంగానైనా పరిస్థితులు విషమిస్తే బాధ పడేది నువ్వేకదా? నువ్వతన్ని మరచిపోలేక పోతే ఆవిషయమే తెలీపర్చు. లేకపోతే అతనే అన్నట్టుగా ఏ గొడవా లేకుండా అతన్ని మరచిపో. ఏ నిర్ణయమైనా నీ మనోబలం మీద ఆధారపడి వుంటుంది."
రేణు చెప్పింది పదేపదే మననం చేసుకున్నాను. మాధవును మరచిపోవడం సాధ్యం అనిపించలేదు. వూహలలోనైనా విచ్చలవిడిగా విహరించ లేదు గాని మాధవ్ మీద తొలిక్షణం నుంచి ఏదో అనురాగం పెంచుకుంటూనే వచ్చాను. దాని పర్యవసానం ఏమవుతుందోనని ఏనాడూ ఆలోచించలేదు నాయిష్టం జరగడానికి ఏవిధమైన ఆటంకాలు కల్పించలేదు కాబట్టే నన్నాకర్షించిన మాధవ్ ని మనసులో చోటుచేసిపెట్టుకున్నాను.
మనసైన మాధవ్ ని మర్చిపోవాలనుకోలేదు.
ఆ రాత్రే ఉత్తరం వ్రాశాను.
ప్రియమైన మాధవ్!
మీ ఉత్తరం చదివాను గాని అర్ధం చేసుకోలేక పోయాను. ఆనాడు పార్కులో కలుసుకున్నప్పటినుంచి మీ మాటల్లో నిరాశ చూస్తూనే వున్నాను. మీకేమి లోటో - మీరేవిషయములో బాధ పడతారో నాకు తెలీటం లేదు. ఇన్నాళ్ళుగా అడుగుతున్నా ఒక్కనాడు మనసు విప్పి చెప్పలేదు. మీరు చెప్పనంత కాలం నాకేదీ అర్ధం కాదు. మీకు అందం, విద్య, ఉద్యోగం అన్నీ వున్నాయి. మా పెద్దలైనా అంతకుమించి కోరేదేమీ వుండదు. అన్నిటినీ మించిన నా కోరికను ఎవరూ కాదనలేరు. మీ మనసు దాపరికం చేసి నన్ను బాధ పెట్టకండి. మాధవ్! మీ స్నేహితురాలిగా, మీ ఆప్తురాలిగా మీ వేదన తెలుసుకోవాలని కోరటం తప్పా? తప్పక నాకు చెప్పండి. లేదా మీకయిష్టమైన నాడు మీరుకోరినట్లుగానే ఈ వుత్తరాలు యీ స్నేహం ఆపుచేయండి. మిమ్మల్ని ఏవిధంగాను ఆజ్ఞాపించే అధికారం నాకు లేదు.
నాకీ ముసుగులో వ్యవహారం సంతృప్తిగాలేదు
జవాబు కోసం ఎదురు చూస్తాను.
-కృష్ణవేణి.
ఆ జవాబు కోసం క్షణాలు యుగాలుగా గడిపాను. మాధవ్ మీద ధ్యాస మరీ ఎక్కువైంది. ఆ నొక్కుల జుట్టులో వెళ్లుంచి దువ్వాలని ఆలోచనలోనైనా హద్దులు మీరుతున్నామేమోనని నన్ను నేను మందలింక్నుకున్నా. మరుక్షణం లోనే బంధించుకోలేని మనసు మాధవ్ కేసి పరుగులు పెట్టేది.
వదినకు ఆడపిల్ల పుట్టిందని టెలిగ్రాం వచ్చింది అన్నయ్య డిస్పెన్సరీ తెరిచే హదావిడిలో వున్నాడు. ఇంట్లో ఫోను - బయట కారూ సిద్ధమయ్యాయి.
"పాప పుట్టినవేళ మంచిదన్నయ్యా!" అంటే మనసారా నవ్వాడు. అమ్మకి మరీ సంతోషంగా వుంది. కాలేజీ తెరచినా నాకు పొద్దు గడవటం కష్టంగానే వున్నట్లుంది.
మాధవ్ రాసే ఉత్తరం ఏమి సమాధానాలు మానుకొస్తుందోనని ధ్యాస తప్ప వేరేం లేదు.
క్షణాలు యుగాల్లా ఎదురుచూసిన ఆ ఉత్తరం వచ్చింది. నా హృదయం దడదడలాడింది. ఎందుకో చేతులు వణికాయి. ఆతృతగా విప్పుకున్నాను.
కృష్ణవేణికి!
ఆశీస్సులు :-
ఇన్నాళ్లుగా మరుగు పరుస్తూ వచ్చిన విషయాన్ని మొండి ధైర్యంతో ఇవాళ నీ ఎదుట వెల్లడిస్తున్నాను.
తొందరలో నన్ను అన్యధా భావించకు.
నాకు మూడేళ్ళ క్రిందటే పెళ్ళయింది. ఆవిడ నా భార్య అరుణ బి.ఎ. లక్షాధికారిణి! అందాల భరిణ! మేమిద్దరం భార్యాభర్తల మంటుంది లోకం. కాని ఆ భావన మాలో మాత్రం లేదు.
కృష్ణవేణీ! ఎన్నో విషయాలలో సుదీర్ఘంగా ఉత్తరం వ్రాయాలనే ప్రారంభించాను. కానీ కలం సాగటం లేదు. నాకేం చెప్పాలో తోచడం లేదు. ఇప్పటికైనా యీ కబురు చెప్పెయ్యగలిగినందుకు మనస్సు తేలిగ్గా వుంది. తర్వాత మరొక ఉత్తరం వ్రాస్తాను. నీకేవిధంగానైనా బాధకలిగితే క్షమించు వేణూ!
స్నేహితుడు,
-మాధవరావు!
నాకళ్ళు చీకట్లు కమ్మాయి. తల గిర్రున తిరిగినట్టయింది. నిర్ఘాంతపడి కూర్చుండి పోయాను. ఎంతసేపు కూర్చున్నానో నాకు తెలీదు. ఆపుకోలేని కోపంతో వూగిపోయాను. చేతిలో కాగితాన్ని ముక్క ముక్కలుగా చించి పారేశాను.
* * *
శ్యామసుందర్ కి ఆ రాత్రి సుదీర్ఘమైన జాబు రాస్తున్న కృష్ణవేణి తెలతెలవారే సమయంలో వుత్తరం ఆపుచేసి లేచివెళ్ళి పరువు మీద ఒరిగి పోయింది.
పదిగంటల సమయంలో వదిన వచ్చి లేపేంత వరకు నిద్రపోయింది.
"ఇదేం నిద్రమ్మా? రాత్రంతా ఏం పాటు పడ్డావ్?" అంటూ వదిన సాధిస్తూంటే వింటూ మవునంగా క్రిందికొచ్చింది.
స్నానం - భోజనం, మళ్ళా సాయంత్రం వరకూ ఒళ్ళు ఎరగని నిద్ర! సాయంత్రం వదిన బలవంతంతో పార్కుకేసి వెళ్తే అంతా నిరాశా మయంగా తోచింది.
ఆ రాత్రితోనైనా ఉత్తరం పూర్తి చేసి శ్యామసుందర్ కి పంపితే - అతను క్షమిస్తే - ఏమో!.....ఏమవుతుందో!
ఆరాత్రి తిరిగి జాబు రాయటం ప్రారంభించింది కృష్ణవేణి!
* * *
మాధవ్ స్నేహంలో రెండో అధ్యాయం ప్రారంభమైంది. అణచుకోలేని కోపంలో ఆ ఉత్తరం ముక్క ముక్కలు చేశాక కలం కాయితం తీసుకుని నాలుగు వాక్యాలు గిలికి పారేశాను.
రావ్!
నమస్తే!
మీ ఉత్తరం చేరటం - చదవటం, చించి పారెయ్యటం అన్నీ ఆక్షణంలోనే జరిగిపోయి నాయ్. మీ నిష్కపటమైన స్నేహానికి జోహారు లర్పించాల్సిందే. దారిపోయే అమ్మాయిని పిలిచి ఓర్పుగా కబుర్లేసుకున్నట్లు ఎదుటి హృదయాలతో ఆడుకోటం కూడా మీకు పరిపాటే అయి వుండాలి. ఇంతకాలం నేను నడచి వచ్చిన దారి చూసుకుని నేనే సిగ్గుపడుతున్నాను. కాని ఇప్పటి కైనా సిగ్గుపడటం తెలుసుకున్నాను. ఇకమీదట నాకెటువంటి ఉత్తరాలూ అనవసరం. వచ్చేవి తిరిగి పంపబడతాయి.
-కృష్ణవేణి!
ఆ ఉత్తరం ఆ క్షణంలోనే పోస్టు చేయించాను. కొంత కసి తీర్చుకున్నట్టు ఫీలయ్యాను. కాని మనసంతా ఆశ్చర్యంలో మునిగి వుంది. ఆలోచనలతో కొట్టుకుంది. మాధవ్! బస్ లో, పార్కులో, నల్లని సూటులో.... నొక్కుల జుట్టుతో, ఎప్పుడూ చిరునవ్వుతోనే వెలిగి పోయే మాధవ్! ఎన్నిరకాల ఆలోచించాను. ఎన్ని నిర్ణయాలు చేసుకున్నాను. ఎప్పటికైనా నా సొత్తవుతాడనుకున్నానే! ఇష్టంతో స్వంతం చేసుకోవాలనుకున్నానే! ఎంత మోసపోయాను. లేదు...... ఎంత మోసం చేశాడు...... ఎంత నాటకం ఆడాడు. పెళ్ళి కానివాడిలా ఆడ స్నేహం తెలీనట్లు ఎన్ని కబుర్లు చెప్పాడు. ఎందుకలా మభ్యపెట్టాడు?
"ఆవిడ - నా భార్య - అరుణ బి.ఎ., లక్షాధికారిణి, అందాల భరిణె"
ఆ మాటలు గుర్తు వచ్చి అర్ధం కాని ఆవేదనతో విలవిల్లాడి పోయాను. తను వివాహితుడై కూడా నన్నెందుకీ స్నేహంలోకి దించాలి? నా మనసెందుకు పాడు చెయ్యాలి? నాకెందుకీ రంపపు కోత? ఎంత దుర్మార్గుడివి మాధవ్! నిన్ను ఎంత ఉచ్చస్థితిలో వుంచుకున్నాను. నిన్నెన్ని విధాల పొగుడుతున్నాను.
"మేమిద్దరం భార్యాభర్తలమంటుంది లోకం. కాని ఆ భావన మాలో మాత్రం లేదు......' అయిన ఆడది మగవాణ్ణి - మొగుణ్ణి ఆకర్షించలేక పోతుందా? ఉత్తది. అంతా ఉత్తది. ఇదో అబద్ధం. తప్పుకోటానికి తతంగం. ఎందుకింత మోసం? నేనేం కీడు చేశాను తనకి? నన్నెందుకిలా బాధ పెట్టాలి?.... నాకు వూహ తెలిశాక తొలిసారి ఆ రాత్రే బావురుమని ఏడ్చాను. దుఃఖం ఆపుకోటానికి దిండులో మొహం దాచుకు వుండి పోయాను. మమతలు పెంచుకొని నేనూ ఇలా ఏడవాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నానా?
ఇంట్లో తిరుగుతున్నా, క్లాసులో కూర్చున్నా, పుస్తకం తెరచినా, దోమతెరలో పడుకున్నా, అదె ధ్యాస! అదే వూహ!"మాధవ్ మంచివాడే కదూ? నన్నెందుకిలా మోసం చేశాడు?"
తర్వాతేదో ఉత్తరం రాస్తానన్నాడే నాకెంత మాత్రం యిష్టం లేదు. ఆ వుత్తరం వస్తే తీసుకోటం ఇంకానా? తెలీనప్పుడు గోతిలోకి సగం దిగి పోయాను. తెలిసీ లోపలికే పోతానా?
ఓసారి రేణు అడిగింది విశేషాలేమిటని. ఎప్పుడూ అడుగుతూనే వుంటుంది. ఇష్టమైతే చెప్పటం లేకపోతే తప్పించుకోటం. నాలుగైదు రోజులు ఆ విషయం నామనసులోనే వుంచుకున్నానుగానీ అప్పటికి రేణుకి చెప్పయ్యాలని పించింది. "మాధవ్ కి పెళ్ళయిందట" అన్నాను పొడిగా.
రేణు అదిరిపడింది. "ఏమిటి?" అంది.
వూరుకున్నాను.
"ఎప్పుడు కృష్ణవేణీ?" అంది.
"మూడేళ్ళ క్రిందటే"