"నాకేమీ అభ్యంతరంలేదన్నాను" అంది శాంత మాతో అంతా చెప్పి.
"అంటే అన్నావులే, ఇప్పుడ మించిపోయిందేమీ లేదు ఇంకా పెట్టుకోలేదు. కదా? తెలిస్తే చెప్తున్నా తెలికే చెప్తున్నా మా మాట విను శాంతా? నీకేం ఖర్మ చెప్పు? రెండో పెళ్ళివాడంటే నీకెలా ఇష్టపడింది? పోనీ అతనికి నువ్వంటే ఇష్టమా అంటే అదీ లేదు. అతని దగ్గిర నువ్వేం సుఖపడాలి? తీరా ధైర్యంచేసి చేసుకుంటావు. అతను మారకపోతే నీకేసి కన్నెత్తి చూడకపోతే బ్రతుకంతా ఏమైపోతుందో ఆలోచించావా? అతని ఆస్థికి మోజుపడుతున్నావా?' అంటూ ఎన్నోవిధాల చెప్పబోయినా ఎన్నోరకాల దెప్పిపొడిచినా శాంతది ఒకే నిర్ణయం - "నామీద ప్రేమతో నా మంచికోసం ఇంత చెప్తున్నారు. నాకు తెలుసు రేణూ! కాని ఆవిడ చెప్పిన సమయంలో నువ్వంటే నిజంగా ఏడ్చేదానివి - నాచేతులు పట్టుకొంది - "నిన్ను మొహమాట పెట్టటం లేదమ్మా! నువ్వు చదువుకున్నదానివి. మంచీ చెడ్డా తెలుసుకొంటున్నదానివి. నీకు మన స్పూర్తిగా ఇష్టమైతేనే చెప్పు. రఘుని నువ్వు చిన్ననాటినుంచీ ఎరుగుదువు. వాడి గుణగణాలూ అంద చందాలూ వేరే చెప్పనక్కర్లేదు. నీ శాంతంతో వాణ్ణి తప్పకుండా మార్చుకుంటావు. నాకు తెలుసు. నీమొహాన కళ వుందమ్మా! చెప్పు, నీ కిష్టమైతేనే చెప్పు." అంటూంటే నేను సహించలేక పోయాను. నేను ముందే నిర్ణయించుకున్నాను అంగీకరించాలని. ఆమాటే అన్నాను. "నాకిష్టమేనండీ! నిజంగానే చెప్తున్నాను" అని. ఆవిడ నన్ను దగ్గిరకి తీసుకొంది. తల నిమురుతూ "నీకు కష్ట సుఖాలు తెలుసమ్మా!" అంది...."
"అది సరే! నువ్వా నిర్ణయమే ఎందుకు చేసుకున్నావని అడిగేది? త్యాగం చేస్తున్నాననుకుంటున్నావా?" అంది రేణు - "నేనంత పెద్ద పెద్ద విషయాలేమీ ఆలోచించ లేదే! ఇందులో త్యాగమేమిటి? కావాలనే ఇష్టంతో ఒప్పుకున్నాను. అతను మారతాడని నాకు నమ్మకం వుంది. నీడలా వెనక నేను తిరుగుతూ వుంటే ఎన్నేళ్ళని బైరాగిలా వుండిపోతాడు?"
"ముదిపోయి ముచ్చటనీ. అతనెప్పుడో మారితే - మారక పోతే ఏమిటి? అంతమాత్రపు వాడు దొరకడనా నీ భయం?"
"క్షమించు రేణూ! ఇంతగా నా శ్రేయస్సు గోరే మీవంటి స్నేహితుల మాటలు కాదంటున్నాను. ఎందుకో అలా నిర్ణయించుకున్నాను. నన్ను మార్చటానికి ప్రయత్నించకండి. ఏవిధంగా చూసినా రఘుకి నేనే తగినదాన్ని కాదు. అతని భార్యని కావటానికి ఎంత పుణ్యం చేసుకున్నానో"
ఇంకేం మాట్లాడుతాం? చాలించుకు వూరుకున్నాం. క్షణం పోయాక అంది రేణు - "నీ పెళ్ళికి నేను రాను" శాంత నవ్వింది - "కృష్ణ వేణీ! నువ్వు?" అంది.
"మేం రాకపోయినా ఆగదుగా?" అన్నాను.
"పెళ్ళికొడుకు లేకపోయినా అవుతుంది గానీ మీరిద్దరూ రాకపోతే - అందులో రేణు దగ్గిర లేకపోతే ..." అంటూ నవ్వింది. శాంత పెళ్ళి వైభవంగానే జరిగింది. వారం రోజులపాటు మేమిద్దరం వాళ్ళింట్లోనే మకాం పెట్టేశాం.
పెళ్ళికొడుకుని విడిదికే వెళ్ళి చూడాలను కున్నాంగానీ, అతని ఒంటరితనాన్ని పాడు చెయ్యటం ఇష్టంలేక పోయింది. ఎవరితోనూ కలవకుండా వేరే గదిలో కూర్చున్నాడట.
"ఇంతకీ అతనీ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నట్టు?" అంతవరకూ నాకీ అనుమానం తట్టనేలేదు. శాంత నడిగితే "అతనొప్పుకున్నాడని ఎవరన్నారు? వాళ్ళమ్మగారి ఇష్ట ప్రకారం మూడు ముళ్ళు మాత్రం వేస్తాడట. ఆసంగతి నాకెప్పుడో తెలుసు" అంది. నేనే నిర్ఘాంతపోయాను. దేన్ని చూసి శాంత ఈ పెళ్ళికిష్ట పడిందో భగవంతుడికే తెలియాలి.
పెళ్ళి పీటలమీద అతన్ని - శాంత భర్త కాబోతూన్న రఘుని చూసి శాంత భవిష్యత్తేమి కాబోతుందో వూహించాలనుకున్నాను. నాకేమీ అంతుపట్టలేదు. రఘు అందమైనవాడు. సన్నగా చిక్కిపోయినట్టూ కన్పించాడు. అతని చూపుల్లో శూన్యం తప్ప నాకేమీ గోచరించలేదు. సామాన్య మైన బట్టల్లో మగతనిద్ర పోతున్న మనిషిలా కన్పించాడు.
ఆ మూడు ముళ్ళూ వేస్తున్నప్పుడైనా అతను నిశ్చలంగా వుండిపోయాడు కానీ దాని పరిణామం ఎలా వుంటుందోనని నా మనసు ఆరాటపడింది. నిండు ముస్తాబులో పచ్చటి పసుపుతాడుతో, శాంత సుమంగళిగా కన్నులపండువుగా కన్పించింది.
పెళ్ళయిన వుదయమే శాంత అతనితో వెళ్ళి పోయింది. మూడురోజులు గడపటానికి అతను ఇష్టపడలేదట.
"వాడి మనసు మారాకనే కదమ్మా ఏ ఆచార మైనా. అమ్మాయిని తీసికెళ్తాను. ఆవిషయంలో మీరు నిశ్చింతగా వుండండి. నాబిడ్డ వేరూ - శాంత వేరూ కాదు" అంది శాంతా వాళ్ళ అత్తగారు. స్టేసన్ కి చాలామంది వెళ్ళాం. వెంటనే వుత్తరం రాయమని శాంతకి మరీ మరీ చెప్పాం. శాంతని సాగనంపి తిరిగి వస్తూంటే అంతా అక్రమంగా జరిగిందనిపించింది. మూర్కంగా శాంత నిండుజీవితం నాశనం చేసుకుందనిపించింది.
బహుభార్యాత్వం అంటే నువ్వు అసహ్యించు కుంటావా? అన్న మీ ప్రశ్నకి వేరే నేను సమాధానం చెప్పనక్కర్లేదనుకుంటాను. రెండోపెళ్ళి వ్యక్తినే ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధించలేని నేను బహు భార్యాత్వాన్ని సహిస్తానా మాధవ్ కారణమేమిటో ఆడ మనసుకే తెలుస్తుంది.
ఇంతకీ మీరుగాని ఇద్దర్ని వరిస్తున్నారేమిటి? చాలా చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు సుమండీ! తర్వాత మీ ఇష్టం.
* * *
మీరడిగిన మరో విషయం - అదే వ్యభిచార నిర్మూలన నీ దృష్టిలో సమంజస మేనా? అన్నది నాకెలా తర్కించాలో ఏమీ అంతు చిక్కటంలేదు. ఈవిషయం గురించి నేను పెద్దగా చెప్పలేను గానీ ఏదో తోచినంతవరకూ ప్రయత్నిస్తాను.
నూరేళ్ళ బ్రతుకుల్ని కలిపి వుంచే వివాహ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కారాదంటాను. దంపతుల్లో పరస్పరానురాగమే లోపించి నప్పుడు ఆదాంపత్యమే నిరర్ధక మవుతుంది. దాంపత్యాన్నే నిరర్ధక పరిచే వ్యభిచారం ఎవరి దృష్టిలో సమంజసమవుతుంది? నా దృష్టి అదే కదా? భార్యా భర్తల్లో ఏ ఒక్కరు అపవి త్రత పాలైనా మరొకరికి తీరని వేదనా - ఆ సంసారంలో ఆరని చిచ్చూ - వారి సంతతిలో అవకతవకలూ - దేని సమంజసంగా భావిస్తారు?
పోనిద్దురూ! ఇంతకన్నా ఏం చెప్పుకోవాలి గనక.
ఇక భార్యాభర్తల మధ్య వుండాల్సిన బంధాలెటువంటి వంటారా? నేనా సంగతి నెప్పుడూ కలగానైనా వూహించుకోలేదండీ! బుద్ధి తెలిసిన దగ్గర్నుంచీ ఇంటా బయటా, చూస్తున్న విషయమే కదా? అనుభవంలేని నేను ఎక్కువ చెప్పలేక పోయినా దంపతులిద్దరూ నీరూ పాలలా - పూవూ తావిలా వున్ననాడే సుఖపడతారంటాను. సౌఖ్యవంతమైన దాంపత్య బంధాన్ని విడదీసు కోవటం - పెనవేసుకోవటం దంపతుల చేతు ల్లోనే వుంటుంది కదా?
* * *
చాల పెద్ద వుత్తరమే పోస్ట్ చేశాను. నా అభిప్రాయాలు మాధవ్ దృష్టిలో ఎలా వున్నాయో గానీ జవాబుమాత్రం వెంటనే రాలేదు. పదిరోజులను కార్డు రాశాడు. అక్కడే చివుక్కు మనిపిస్తుంది నా మనసు. తనెంత నిర్లక్ష్యం చేస్తున్నా ఎప్పటి కప్పుడు మర్చిపోతూనే వున్నాను. అతని వుత్తరాలకీ ప్రవర్తనకీ సంబంధమే వుండదు. నేనన్నా, నా స్నేహమన్నా తహతహలాడుతున్నట్టే రాస్తాడు.
* * *
చనువుకాబోతే దూరంగా వుండిపోతాడు. ఏమనుకోవాలో తెలీదు. శెలవల మూలంగా బయటికి వెళ్ళకపోవటం, ఇంట్లో వదినైనా లేక పోవటం బొత్తిగా ఏమీ తోచదు. రేణు తరుచూ వస్తూ వుంటుంది. అప్పుడప్పుడు మాధవ్ గురించి-ఇంకా పంపని మాధవ్ ఫోటో గురించే తెగ అడుగుతుంది. ఏం చెయ్యను? ప్రతీ వుత్తరంలోనూ రాస్తూనే వున్నాను ఫోటో కోసం. ఏవిధంగానూ అంతుపట్టని మాధవ్ గురించి అలోచించటం తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది.
మాధవ్ దగ్గిర్నుంచి కవరొచ్చింది. అందులో ఫోటోవుంది. ఆఫోటో అలా అరచేతిలో వుంచుకుని చాలా సేపు చూశాను. ఆనాడు బస్ లో చూసిన మాధవ్ తిరిగి ప్రత్యక్షమైనట్లని పించింది. ఆనొక్కులజుట్టు-మోటు పెదవులు కొట్టవచ్చి నట్టే కన్పిస్తాయి. మాధవ్ మొహం చేతుల్లో తీసుకు చూస్తున్నట్లు భ్రమ గలిగి నవ్వుకున్నాను. ఉత్తరం సంగతి గుర్తు వచ్చి వెంటనే చదివాను. సౌభాగ్యవతి.
కృష్ణవేణికి ...... ఆశీస్సులు.......
చాలా ఆలశ్యంగా జవాబు రాస్తున్నందుకు కోపం వచ్చినామన్నించు. ఖాళీ లేదనిగాని, బద్ధకించాననిగాని అబద్దమాడలేను. జవాబు రాయాలని లేక-అసలేం రాయాలో తెలీక-మనసు బావుండక ఇంతవరకు వుత్తరమంటూ ప్రారంభించలేక పోయాను. నేనడిగిన విషయాల గురించి నువ్వు రాసింది ఎన్నోసార్లు చదివాను. నీ అభిప్రాయాలు ఉత్తమమైనవే ఐనా నాకే విధంగానూ సంతోషాన్నివ్వ కలిగేవి కావు. నిన్ను చూశాక మన స్నేహం ప్రారంభమయ్యాక నేను నీగురించి ఆలోచించని క్షణంలేదు. నీలా చొరవగా మాట్లాడే ధైర్యం లేదు నాకు. మొన్నటి నీ వుత్తరంతో నేను తీవ్రంగా నిర్ణయించుకున్నదేమంటే సాధ్యమైనంత త్వరలో నీ స్నేహం మానివెయ్యాలి అని. నిన్ను మర్చిపోవాలని. ఎంతో కష్టానికలవాటైన నా మనసుకిదేమీ కొత్తది కాదు. వెనకాముందు ఆలోచించకుండా తొందర పడి నిన్ను పిలిచి నీతో స్నేహం ప్రారంభించాను. ఇప్పుడు నాకై నేనే ముగించ బోతున్నాను. ఈ రెండు పనులూ నీకెలా తోచినా నన్ను మనస్పూర్తిగా మన్నించు కృష్ణవేణి.