Previous Page Next Page 
మల్లమ్మదేవి ఉసురు పేజి 5


    "అయ్యోరిని కొడుతోంది. బుర్ర బద్దలు కొట్టేత్తాంది" అంటూ యెన్నడూ నా గదిలోకి రావటానికి సాహసించని పనిమనుషులుకూడా వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు.
    "రెండిచ్చుకోమంటారేటండి మిమ్మల్ని బుర్ర బద్దలు కొట్టేత్తాంది" అంటూ ఒకడు ముందుకు వచ్చాడు అతని కోపాన్ని నేను రెచ్చకొడితే లిల్లీపూవులా వున్న మార్లిన్ ని నలిపేసేవాడు.
    "ఒరే తండ్రీ! నాకు బుర్ర అంటూ ఒకటి వుండటం నించేకదా బద్దలు కొట్ట గలుగుతోంది అంతట శాంతించు. ముందు మీరంతా బైటకు పొండి" అన్నాను. అందరూ వెళ్ళిపోయినారు.
    ఆమెను కూర్చోమన్నాను. యిహ సంగతి యేమిటో జాగ్రత్తగా అర్ధం చేసుకుంటూ మాట్లాడాలి అనుకున్నాను.
    "నేను బాబాయిని త్వరగా కలవాలి" అంటోంది మార్లిన్.
    "ఎందుకు?" అని అడిగాను ప్రశాంతమయిన స్వరంతో.
    "ఎందుకేమిటీ? నా మరిది వెంగళరాయుడి పెళ్ళికదూ! ఆ ఏర్పాట్లు అన్నీ చూచుకోమని బాబాయికి చెప్పాను. ఏర్పాట్లు యెంతవరకూ అయినాయో! మరిది రెండురోజులుగా కన్పించటమే మానివేశాడు. సామర్లకోటకు కబురు వెళ్ళిందా? నా చెల్లెలు జగ్గమాంబ యింకా రాలేదు. నీలాద్రి రాయిణంగారు, నా మరదులువారు యింకా రాలేదు. యెందుకు రాలేదు?
    "నా తండ్రి కశింకోట ప్రభువులు రామరాయుడువారు యింకా రాలేదు. నా తల్లి మహాదేవి వెంకమాంబాదేవిగారు రాలేదు. యెందుకని యెవరూ రాలేదు. రాజాం ప్రభువులు తాంత్ర పాపయ్య అన్నవారు రాలేదు. పెళ్ళికి రాకుండా మోసం చేద్దామనుకుంటున్నారా వీళ్ళందరూ?బొబ్బిలి మహారాణి మహాదేవి మల్లమ్మదేవిని మోసం చేస్తారా? నన్ను మోసం చేస్తారా?" అంటూ మాటల దొంతరను దొర్లిస్తోంది మిస్ మార్లిన్. పేర్లూ ఆ కధలూ వింటున్న నేను రాటనే అయ్యాను. కుర్చీకి ఆశ్చర్యర్యంతో కరుచుకుపోయాను రెప్పలు నలుపుకుని చూచాను! జరుగుతున్నది వింటున్నది కలలోకాదు- నిజం.
    "విజయనగరం ప్రభువులు విజయ రామరాజువారు మాత్రం నాకు తండ్రిలాంటివారు వారి ఆశీస్సులకోసం అర్ధించాను అన్నట్లు యినుగంట నరసారాయుడు మహామంత్రివారు యేమయ్యారు?" అని అడుగుతోంది మిన్ మార్లిన్. ఆ చూపులు శూన్యంలో గ్రుచ్చుకుంటున్నాయి.
    "అమ్మా! తల్లీ! చెల్లీ! ఐరోపానించి వచ్చిన లిల్లీ! యిప్పుడు నువ్వు వారూ, వీరూ అంటూ చెప్పావే పేర్లు. వారంతా బొబ్బిలియుద్దంలో రెండువందల పాతిక సంవత్సరాలనాడు యిహలోకంలో తనువు చాలించారు. నీవు  వాళ్ళకోసం స్వర్గంలో ఎంక్వయిరీ చెయ్యి అడ్రస్సులు దొరకవచ్చు" అన్నాను జంకుతూనే అనుకున్నంతా అయింది.
    "యూ రాస్కెల్, పూల్! చచ్చిపోయారు అన్నావంటే నిన్ను చంపేస్తాను" అంటూ కుర్చీలోంచి లేవబోయింది మార్లిన్.
    "అనన్లే కూర్చో" అన్నాను గబుక్కున ఆమె కూర్చుంది.
    "ఇంతకూ నువ్వెవరు? లాగూ, చొక్కా తొడిగావు ఫ్రాన్సునించి వచ్చావా?" అని అడుగుతోంది మల్లమ్మదేవి అలియాస్ మార్లిన్.
    "కాదు తల్లీ నువ్వే ఫ్రాన్సునించి వచ్చి వుంటావు మా ప్రాణం తియ్యటానికి" అని మనసులో అనుకున్నాను.
    "అలా అనకు ఆంద్రదేశంలోనే  అవతరించిన అల్పజీవిని. నా సంగతి అలా వుంచు. యిప్పుడు నీకు కావలసింది యేమిటి?" అన్నాను.
    "ఏమిటా యేకవచన ప్రయోగం. నేను మహాదేవి మల్లమ్మను యేకవచనంతో పిలిచావంటే తల తీయిస్తాను" అంటూ గ్రుడ్లు యింతింత చేసి హెచ్చరించిందామె.
    "చిత్తం తల్లీ!" అన్నాను వినయంగా. "భగవంతుడా! యీ పిడుగుపాటు నా నెత్తిన యెందుకు వేశావు? ఏమిటీ అగ్నిపరీక్ష? యీమె యెవరు?" అనుకున్నాను.
    ఇరవయ్యవ శతాబ్దపు వుత్తరార్ధంలో యిటువంటి వింతను చూస్తూయెలా జీర్ణించుకోవాలి? యిప్పుడీమెను యేమి చెయ్యాలి? అని నేను ఆలోచిస్తున్నాను. యిటువంటి సందర్భాల్లో మనోధైర్యం యివ్వటానికి పనికి వస్తాడని ఫ్రేములో బిగించి యెదురుగా తగిలించుకున్న దైవానికి నమస్కరించాను. నన్ను ఒడ్డున పడవెయ్యి స్వామీ అని ప్రార్దించాను.
    ఇక్కడి సంగతి అంతా చూచివెళ్ళిన పనివాళ్ళు రాజమాతకు యీ విషయం వివరించారు. ఆమె ఎకా ఎకిన వచ్చేశారు.
    రాజమాత పేరు గాయత్రీదేవి. ఆవిడ రాగానే లేచి గౌరవ పరస్పరంగా ఆహ్వానించాను. మిస్ మార్లిన్ వంక చిత్రంగా చూస్తున్నారు గాయత్రీదేవి.
    "నువ్వెవరు?" ఠీవిగా ప్రశ్నించింది మిస్ మార్లిన్.
    "బొబ్బిలిలో నీళ్ళు త్రాగినవాళ్ళు కాని, యీ యింటిలో కాలు పెట్టినవాళ్ళు కాని మమ్మల్ని ఆ ప్రశ్న వెయ్యకూడదు. నువ్వెవరో! యెక్కడనించి వచ్చావో నీకు మతిచలించి యెన్ని రోజులు అయిందో తెలుసుకుందామనే వచ్చాను" అంటూ చెప్పుకుపోయారు గాయత్రీదేవి.
    "బొబ్బిలిరాణి మహాదేవి మల్లమ్మను" అన్నది మిస్ మార్లిన్.
    "మహాదేవి మల్లమ్మవా?" అంటూ నోరు తెరిచారు గాయత్రీదేవి.
    "అవును యెందుకలా నోరు వెళ్ళబెట్టుకుని చూస్తావు? నా మరది పెళ్ళి యేర్పాట్లు అన్నీ యెక్కడివి అక్కడే వుండిపోయినాయి నువ్వు వెళ్ళి నా స్నేహితురాలు కోమటివారి కమలక్కను పిలువు. దామెర్ల ధర్మారాయుడు బాబాయిని పిలుపు యినుగంటి నరసారాయుడు మహా మంత్రివారికి కబురు పంపండి. వూఁ యింకా యెందుకలా రాటల్లా నిలబడిపోయారు. వెళ్ళండి చెప్పిన పని వెంటనే చెయ్యండి. అలక్ష్యం చేస్తే తలలు తీయిస్తాను" అని వురుముతోంది మార్లిన్ మల్లమ్మదేవిలాగ.
    రాజమాత ఆశ్చర్యంతో చూస్తున్నారు.
    "ఇది మామూలు పిచ్చికాదు" అన్నారు చివరికి.
    "ఇది అసలు పిచ్చికానే కాదు. పునర్జన్మ కేసు" అన్నాను నేను.
    "నాతోరా!" అంటూ రాజమాత ముందు నడిచారు. నేను అనుసరించాను. గది దాటి వెళ్ళిపోతూ తలుపులు బైటనించి గెడపెట్టాను ఎందుకయినా మంచిది అనుకుని యింటి లోపలకు వెళ్ళాం.

 Previous Page Next Page