Previous Page Next Page 
శతఘ్ని పేజి 5

 

    "అప్పుడే......"
    
    "అదికాదు సర్...... ప్రాక్టికల్ మనిషిని యింకా ఏం చేయబోతున్నదీ చెప్పమంటున్నాం"
    
    "అలాగడిగారు బాగుంది" ఆశ్చర్యంగా చూస్తున్న విలేఖర్ల ముందు మరో అస్త్రాన్ని సంధించారు" వెంటనే మంత్రిమండల్ని విస్తరిస్తున్నాను."
    
    "అదేమిటి? ఇప్పటికే డెబ్బైమంది మంత్రులున్న ప్రభుత్వంలో యింకా మంత్రుల్ని పెంచడంలో ఆలోచన తోచలేదు. ఇప్పటికే మీపార్టీకే మీ పార్టీ ఎమ్మెల్యేల్లో డెబ్బై మందికి పదవుల్ని యివ్వడంతోపాటు మరో డెబ్బైమందికి కార్పోరేషన్ చైర్మన్లుగా పట్టం కట్టారు ......."
    
    "అలానూత నలభైమందికి అవకాశం యిచ్చినా యింకా నాపార్టీలో ఏభైమంది ఖాళీగా వున్నారు. అతడ్ని నాయకుడ్ని చేసిందినూటతొంభైమంది ఎమ్మెల్యేలు.......
    
    "అందుకని......"
    
    "రేపే మరో నలభై మందిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నాను."
    
    నిశ్చేష్టగా చూస్తూ అడిగాడు విలేఖరి" అంటే మొత్తంనూట పది మంది మంత్రులా ......"
    
    "అవును...... నన్ను నాయకుడిగా ఎన్నుకున్న ఆ సభ్యుల్ని సంతృప్తి పరచలేనినాడు యిక ప్రజల్నేం తృప్తిపరచగలనని యిలాంటి నిర్ణయంతీసుకున్నాను ......."
    
    రాష్ట్రమంత్రివర్గంలో ఇంతమంది మంత్రులుండడం ఇది తొలిసారి.
    
    "అలా మంత్రివర్గ విస్తరణచేయటానికి యింకా పోర్ట్ ఫోలియయోలు ఏం చేయాలని" ఓ విలేఖరి అడిగాడు నిశ్చేష్టుడిలా చూస్తూ......
    
    ఫకాల్ననవ్వేడు రాజారాం ......అంతేకాదు ......ఏమిటీపిచ్చి ప్రశ్న అన్నట్టుగా చూసేడుకూడా......
    
    "అసలు మనుషుల్లో కులాలుగట్రా వున్నట్టేచేపల్లోనూ చాలారాకాలున్నాయి"
    
    హటాత్తుగా చేపల ప్రసక్తి ఎందుకో అర్ధం కాలేదెవరికీ.......
    
    "అవును సోదరుల్లారా ....... ఆ మాటకొస్తే దేవుల్లోనూ చాలా తెగలున్నాయని మీరు గ్రహించితీరాలి"
    
    "వివరంగా చెప్పండి"
    
    "ఇంకా వివరంగా చెప్పాలీ అంటే పశువుల్లోనూ చాలా జాతులున్నాయి."
    
    "మీరుపాయింట్ కి వస్తే సంతోషిస్తాం"
    
    "అద్గదీ అలా అడిగారు బాగుంది. అసలు మీ ప్రశ్నేమిటీ" క్షణం పాటు విలేఖర్ల వైపు తదేకంగా చూశారు ముఖ్యమంత్రి" ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో నలభైమందికి ఏ పోర్డుఫోలియోలు యిస్తారూ అని...... అవునా...... అప్పుడు నేను చేపలసంగతి, దేవుళ్ళ సంగతి, పశువుల సంగతి చెప్పాను కదా...... అంటే ఏమిటి..... చేపల్లో జంజరాలు, మట్టగిడసలు, రొయ్యలు, సొరలూ గట్రారకరకాలున్నాయిగా కాబట్టి ఇప్పటి మత్స్యశాఖమంత్రిత్వ శాఖలో పోర్టు ఫోలియోల్ని పెంచుతాను...... దేవాదాయశాఖని మన దేవుళ్ళు ఆడ దేవతలకి సంబందించిన ఆలయాలకి అనుకూలంగా విడగొట్టి మంత్రుల్ని ఏర్పాటు చేస్తాను...... అలాగే పశువులకి సంబందించిన పశువర్ధక శాఖని ఆవులశాఖ, గేదెలశాఖ, ఎద్దుల శాఖలుగా విడదీసి......"
    
    "అర్ధమైంది" ఆయన చెబుతున్నదింకా పూర్తికానేలేదు.
    
                                                                     * * *
    
    అప్పుడు కదిలిందో ఆకారం......
    
    కాదు....... మేరువులా నిలబడిచూస్తున్నాడా యువకుడు....... వయసుపాతికలోపే..... మాసిన గెడ్డంతో మకిలిపట్టినకంచు విగ్రహంలా కనిపించడమే
    
    కాదు
    
    "ఎవరితను......"
    
    అతడెవరా అని క్షణం సందేహంగా చూశారు చీఫ్ మినిష్టర్......
    
    "ఎప్పుడూ చూసినట్టు లేదు"
    
    "అవును....." కంచు నగారాలా వినిపించింది అతడి కంఠం "నేనువచ్చింది తొలిసారి"
    
    "అవునవును తెలుస్తూనే వుంది" ఎందుకో అతడి చూపుల్తో చూపులని కలపడం.
    
    కష్టమనిపించిందేమో- దృష్టి మరల్చుకుంటూ అన్నారు" ఇందాకటి నుంచి చెతురులు విసిరిందీ నువ్వే అనుకుంటాను!"
    
    "బాగానే గుర్తించారు ముఖ్యమంత్రిగారూ.....అందుకు నా అభినందనలు......"
    
    "ఏ పత్రికకి చెందిన జర్నలిస్టుమీద?"
    
    "ఇంగ్లీష్ డైలీ అబ్జర్వర్"
    
    ముఖ్యమంత్రేకాదు అక్కడున్న విలేఖర్లు కూడా ఆసక్తిగా చూశారతడ్ని.....
    
    "శభాష్....... ఇప్పుడు నా గురించి ఏంరాయబోతున్నారు"
    
    ఈ ప్రశ్న అడిగి తానెంత పొరపాటుచేసిందీ తెలుసుకోలేకపోయారు ముఖ్యమంత్రిగారు.
    
    "శాతవాహనుల చరిత్ర పునరావృతం కాబోతూందని ......"
    
    "గుప్తుల యుగంలా స్వర్ణయుగం తిరిగి రాబోతుందని....... రాయల రాజ్యంలోలా అంగళ్ళలో మళ్ళీ రతనాలను అమ్మబోతున్నారని...... అలనాటి రామరాజ్యాన్నే తలదన్నే అసలు సిసలైన పాలనేప్రజలు కళ్ళచూడబోతున్నారని...... "క్షణం ఆగేడు" రాసి ఆత్మద్రోహంచేసుకోలేను......."
    
    హఠాత్తుగా అక్కడ గాలి గడ్డకట్టుకుపోయింది.
    
    "ఓటుహక్కుని సవ్యంగా సజావుగా వినియోగించుకోవడం తెలీని అమాయకప్రజల అండతో ఇక్కడోవ్యక్తి పదవిని చేపట్టాడని.....
    
    భారతదేశంలోని అతి ముఖ్యమైన అవయవమైన ఆంద్ర రాష్ట్రాన్ని అనాగరిక ఆటంక వ్యవస్థవేపునడిపించడానికి కంకణంకట్టుకున్నాడని......ప్రజల నమ్మకాన్ని కుదువబెట్టి వీధిగూండాలకి, బందిపోట్లకి నాయకుడిగా యీ నేలనుదోచుకుపోతున్నడని రాస్తాను......"
    
    "షటప్" ఆవేశంగా లేచాడు ముఖ్యమంత్రి.
    
    వెనువెంటనే అతడి సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడివైపు నడవబోయారు......

 Previous Page Next Page