Previous Page Next Page 
మానవత పేజి 5


    ముకుందం గారి మనసేమీ బావుండలేదు. ఇంట్లో ఏమీలేవు. అన్నీ నిండు కున్నాయి. వాస్తవంగా పూజకు ఉపక్రమించే ఉత్సాహం లేదు. ఏదో మనశాంతి లభిస్తుందని ప్రారంభించారు. సెమ్మెట్లో నూనె లేదు. అది చూచి వారికి బాధ మరింత పెరిగింది. దారిద్ర్యం కఠినం అయింది. మృత్యువె కాస్త దయాళువేమో అనిపించింది.
    ముకుందంగారు భాగవతం అందుకున్నారు. వ్యాసపీఠం మీద ఉంచి తెరిచారు. గజేంద్ర మోక్షం వచ్చింది. అదంటే వారికి చాలా ఇష్టం. గొంతెత్తి పద్యం చదివారు.
    "కలడందురు దీనుల యెడ
    కలడందురు పరమయోగి గణముల పాలన్
    కలడందురు రన్ని దిశలను
    కలడు కలండనెడి వాడు కలడో లేడో!"
    జానకి వచ్చి గుమ్మం ముందు నుంచుంది. తండ్రి చదువుతున్న పద్యం విన్నది. తండ్రి గొంతు విదారకంగా ఉంది. పద్యం కంటే ధ్వని ఆమెను కలిదించింది. కళ్ళు చెమ్మగిల్లాయి.
    పద్యం పూర్తయింది.
    జానకి కళ్ళు తుడుచుకుంది.
    జానకి లోన ప్రవేశించింది. ఆమె చేతిలో సంచి ఉంది. అది ఖాళీగా ఉంది. దాన్ని తండ్రికి చూపదల్చలేదామె. చాటున పెట్టుకుంది. గదిలో కూర్చుంది. విగ్రహాలను చూచింది! చేతులు జోడించింది. కళ్ళు మూసుకుంది.
    ముకుందంగారు జానకిని చూస్తున్నారు.
    జానకి కళ్ళకు షావుకారు కనిపిస్తున్నారు.
    విగ్రహాలు ఎవరికీ కనిపించడం లేదు.
    ఇద్దరికీ తిండి గింజలే కనిపిస్తున్నాయి.
    ముకుందంగారు కాస్త తేరుకున్నారు. జానకి కళ్ళు తెరిచింది. ఆమె ముకుందంగారిని చూడనట్లు నటించింది. ముకుందంగారు అలవాటు చొప్పున హారతి పళ్ళెం అందుకున్నారు.
    పళ్ళెంలో కర్పూరం లేదు.
    ముకుందంగారి మనసు కలుక్కుమంది.
    పళ్ళెం చేతి నుంచి జారింది- వదల్లేదు ముకుందంగారు. కర్పూరం లేకుండా హారతి ఇచ్చారు.
    జానకికి తీర్ధం ఇచ్చారు. ఆమె తీర్ధాన్ని కళ్ళ కద్దుకుంది. అంతకు ముందే కళ్ళలో నీరుంది. జానకి బయటికి వచ్చింది.
    ముకుందంగారు తీర్ధం తీసుకున్నారు. పై పంచతో కళ్ళు తుడుచుకున్నారు. గదినుంచి బయటికి వచ్చారు. వారు గ్రహించారు జానకి వట్టి చేతుల్తో వచ్చిందని అయినా ఉండపట్టలేక పోయారు. అడిగారు-
    "అయితే అప్పివ్వనన్నాడు కదూ?"
    జానకి తండ్రిని చూచింది. వారి ముఖంలో విచారం కాదు, విషాదం కనిపించింది.
    "కాదు నాన్నా కూర్చో. బాధపడకు." తండ్రిని వాలు కుర్చీలో కూర్చో పెట్టింది జానకి. తాను కుర్చీ వెనక నుంచుంది. తండ్రి బట్టతల  నిమురుతూ అడిగింది.
    "నాన్నా! వాడున్నాడా?"
    మాటలు కన్నీటి మూటల్లా వున్నాయి. ప్రశ్న సూదిలా ఉంది. సూటిగా గుండెల్లో గుచ్చుకుంది. తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి తూట్లు పొడుస్తున్నట్లుంది.
    ముకుందంగారు చలించారు. తలెత్తి జానకిని చూచారు. ఆమె చప్పున కొంగుతో కళ్ళు తుడుచుకుంది. కళ్ళలోని ఎరువును తుడుచుకోలేకపోయింది. ముకుందంగారు చూడలేకపోయారు. విలవిల్లాడిపోయాడు. తల దించుకున్నారు.
    "ఏడుస్తున్నావా అమ్మా! ఏడవకు."
    "నాన్నా వాడున్నాడా?" మళ్ళీ అడిగింది జానకి.
    ఈ తడవ తలెత్తి జానకిని చూడలేదు - కాని జవాబు చెప్పారు.
    "ఎవడమ్మా! భగవనుడా? ఉన్నాడమ్మా ఉన్నాడు."
    "ఎక్కడున్నాడు నాన్నా? ఉన్నాడు వున్నాడంటావు. అది నీ పిచ్చి మాత్రమే! కలడందురు దీనుల యెడ అని చదివితే-మనం దీనులం కాదా? మనకంటే దీనులున్నారా? రోజూ కీర్తిస్తున్నావు. వాన్నే నమ్ముకున్నావు. ఆ ఏనుగుకంటే తీసి పోయామా. రాడేం? రక్షించడేం"
    "వస్తాడమ్మా-వస్తాడు. రక్షిస్తాడమ్మా-రక్షిస్తాడు"
    "ఎప్పుడు నాన్నా? ప్రాణాలు పోయినాకనా? ఎన్నాళ్ళు భరించాలి బాధలు-యాతనలు?"
    "ఇది తెలుగు దేశం తల్లీ!-నేను తెలుగు మాష్టర్ని. ఇంతేనమ్మా తెలుగు పంతుళ్ళ గతీ! రిటైరైనాక బతకగూడదమ్మా.....బతలగూడదు తల్లీ! బతికిన వాళ్ళ గతి ఇంతే! చితి ఒక్కసారే కాల్చేస్తుందమ్మా! చింత బతికి వున్నన్నాళ్ళూ కాలుస్తుంటుందమ్మా"
    వాకిట తలుపు తట్టిన చప్పుడయింది. ముకుందంగారు అదిరిపడ్డారు. "అమ్మా! మళ్ళీ ఎవరో అప్పులవాళ్ళు వచ్చినట్లున్నారు. నేను లోపాలకి వెళతా. లేనని చెప్పమ్మా. అదరువు లేదు. అప్పులవాళ్ళతో ప్రాణాలు పోయేట్లున్నాయి" ముకుందం గారు లేచి ఇంటిలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు, తలుపు తట్టినట్టు కాదు-గుండెను నెట్టినట్లుంది.
    "పోస్టుమాన్ పోస్టుమాన్, తలుపు తియ్యండి"
    ఆ మాటలు విన్నారు తండ్రీ కూతుళ్ళు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు "అప్పులవాడు నోటీసు ఇచ్చాడేమో?" అన్నారు ముకుందంగారు. జానకి మాట్లడేల్దు. మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళింది. తలుపు తీసింది. ముకుందంగారు వాకిలివైపు చూస్తూ నుంచున్నారు. పోస్టువాడు రిజిస్టర్ లెటర్ ఇచ్చాడు-సంతకం చేయించుకున్నాడు. వెళ్ళిపోయాడు. అది జానకి పేర వచ్చిన ఉత్తరం. కవరు చించింది, కాగితం తీసింది, ఎగిరి గంతేసింది.
    "నాన్నా అపాయింట్ మెంట్ ఆర్డర్, నాకు ఉద్యోగం దొరికింది" ఒక్క గంతులో తండ్రి దగ్గర వాలింది. కాగితం అందించింది.
    ముకుందరావుగారు కాగితం చదువుతుంటే వారి ముఖం మీద ఆనందం, ఉత్సాహం, భయం, అవమానం ఒకదాని తరువాత ఒకటి తెరల్లా దిగుతున్నాయి. పడుతున్నాయి. కాగితం జానకి చేతికిచ్చి కుర్చీలో కూలపడ్డారు ముకుందంగారు.
    "అమ్మా! ఆడపిల్లవు, నువ్వు ఉద్యోగం చేస్తావా? కూతురు సంపాదన తిని కులకాలా నేను?" తలమీద చేయి వేసుకున్నారు.
    "నాన్నా! ఎందుకిలా కుంగిపోతావు! కొడుకునయినా, కూతురునయినా నేనేగా నీకు. కొడుకు ఉద్యోగంచేస్తే కాదంటావా? పరిస్థితులు చూస్తున్నావుగా, ఉద్యోగం రావడమే అదృష్టం"
    "ఏమోనమ్మా! రాముడిలా రాసిపెట్టాడు. నీ సంపాదన తినమన్నాడు; ఏల చేస్తాం. తప్పదు. బడిపంతులు కూతురు బడిపంతులమ్మ అవుతూంది. అదీ ఉన్న ఊళ్ళో కాదు. పొరుగూరికి ఎలా పంపనమ్మా?"
    "నాన్నా? నీ పిచ్చిగాని - పొరుగూరంటే ఎంత దూరం! ఉదయం వెళ్ళి సాయంకాలం వస్తాను. అర్ధగంట కాలి నడక అంతకంటే దూరం లేదు. కాలాన్ని బట్టి నడుచుకోవాలి నాన్నా! కాదంటే ఎలా?" గారాబంగా తండ్రి భుజాలు పట్టుకుంది కూతురు.
    
                                                                 7
    
    జానకి ఉద్యోగంలో చేరే రోజు. తలమీంచి స్నానం చేసింది. ఉన్నంతలో కాస్త మంచి చీర కట్టుకుంది. అది ఆమెకు అద్దినట్లుగా వుంది. సహజంగా అందగత్తె జానకి. అందం అంతా ఆమె కురులలో వుంది. కన్నుల్లో వుంది. కళ్ళల్లో సోయగం వుంది కాస్త ఎరుపు, ఆ కళ్ళతో ముఖం కళకళ లాడుతుంది. అంతే ఆమె అందం.
    జానకి వున్నంతలో అలంకరించుకుంది. కళ్ళకు కాటుక దిద్దడం మాత్రం మరువలేదు. అలంకరించుకున్న జానకి దేవుని గదిలోకి వెళ్ళింది. దణ్ణం పెట్టింది. కళ్ళు మూసుకుంది. ఏవేవే కోరుకుంది. బయటికి వచ్చింది. తండ్రి పాదాలంటి నమస్కరించింది. ముకుందంగారి నోట మాట పెగల్లేదు. మనసులోనే దీవించారు.

 Previous Page Next Page