"ఊహూఁ!" మళ్ళీ మొదలెట్టావా?" అని కొడుకు ముఖంలోకి ఓచూపు చూశాడు.
ఆ చూపులో.
"వరేయి! నీమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానురా' నీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగన్నానురా. ఆఖరికి నువ్విట్లా తయారవుతావురా. వరేయి. ఇక నువ్వు పైకిరావురా. నువ్వు నా కడుపున చెడబుట్టావురా ఇలా ఎన్నెన్నో భావాలు కనిపించి రాఘవ పశ్చాత్తాపంతో మెలితిరిగిపోయాడు.
"అమ్మో! నాన్నకి కొంచెం కోపం వచ్చింది. నాన్న మనసు కష్టపెట్టాను. అని బాధపడి పోయాడు.
"ఇంట్లో ఒక్కడినే వుంటే తోచలేదు నాన్నా. అందుకని..." అంటూ నసిగాడు.
"సరే! ఇంకెప్పుడూ ఆ పొరపాటు చెయ్యకు?
మళ్ళీ పిల్లనగ్రోవి పెట్టిలోకి-బట్టల అడుక్కు వెళ్ళి పోయింది. ఆ ఇంట్లోంచి ఆ మధురధ్వని వినిపించటం మానేసింది.
వారం రోజులకుగాని సీతతో మాట్లాడటానికి వీల్లేక పోయింది. అక్కడ వాళ్ళమ్మ, ఇక్కడ తన తల్లి-తండ్రి.
ఓ సాయంత్రం తండ్రి ఇంట్లో లేడు. తల్లి ప్రక్క వీధిలో పేరంటానికి వెళ్ళింది.
సీత-గోడవతల గుమ్మం దగ్గరకు వచ్చింది.
మురళి వినబడటం లేదేం?"
"మా అమ్మా నాన్న వచ్చేశారు."
ఆమె ఆశ్చర్యంగా చూసింది. "వాళ్ళు రావటానికి, గానం ఆపెయ్యటానికీ సంబంధమేమిటి?"
"మా నాన్న గారికిష్టంలేదు."
"ఎందుకని?"
"సరిగ్గా తెలీదు ఇష్టం లేదు మరి."
"ఆయన కిష్టం లేకపోతే మీరు మానుకుంటారా?"
"పెద్దవాళ్ళ కిష్టం లేకపోతే అంతే మరి"
సీత అతనివంక చూసింది. ఆ చూపులో విచారం వుంది, బాధవుంది, అతని వ్యక్తిత్వాన్ని దెబ్బకొట్టే ఇంకేవేవో భావాలున్నాయి.
ఏదో అనబోయింది. అనివుంటే ఆ మాట ఎంత పదునుగా వుండేదో-ఇంతలో అనుకోని విధంగా రాఘవ తల్లి సుందరమ్మగారు పెరట్లోకి వూడిపడటంలొ చప్పున లోపలకు వెళ్ళిపోయింది.
కాని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం సుందరమ్మగారి కళ్ళ పడనేపడింది.
వెంటనే ఆవిడ ముఖం నల్లబడింది.
కొడుకుని గబగబ లోపలకు పిలిచింది. "ఏమిటి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావు?" అనడిగింది నిలదీసి.
అమ్మకి దొరికిపోయాను. యిహ అబద్దమాడి ప్రయోజనం లేదనుకున్నారు.
"వాళ్ళా ఇంట్లోకి క్రొత్తగా వచ్చారమ్మా. మెట్రిక్ దాకా చదువుకుంది. చదువుకునేందుకు పుస్తకాలేమైనా యిమ్మంటోంది. అన్నాడు కొంత మాత్రం నిజం చెబుతూ.
ఆవిడ అంతటితో వొదిలిపెట్టలేదు. దగ్గర కూర్చోబెట్టుకుని హితబోధ చేసింది. ఈ వయసులో ఆడపిల్లల పరిచయం అయితే దానివల్ల ఎన్ని అనర్దాలున్నాయో, తన మేనమామ అలా ప్రేమలోపడి జీవితాన్ని ఎలా తారుమారు చేసుకున్నాడో, అంతెందుకూ తన తమ్ముడు యిలా పిచ్చిలో పడి అందరికీ ఎలా దూరమైపోయాడో, అలా ఎందరి జీవితాలు బలి అయినాయో, ఎన్ని చరిత్రలు తలక్రిందులయినాయో ఏకరువు పెట్టింది. అలా చెబుతూ పోతుంటే ఆవిడ గొంతు గద్గదమైంది. కళ్ళల్లో నీళ్ళు కారాయి.
రాఘవ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అతనికి కూడా కళ్ళవెంట నీళ్ళు కారాయి.
"ఛీ" చాలా తప్పు చేశాను. అమ్మ మనసు బాధ పెట్టాను" అని మధన పడిపోయాడు.
"అమ్మా! నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడూ ఇలాంటి పాడుపని చెయ్యనమ్మా. ఇంకెప్పుడూ నీ మనసు కష్టపెట్టనేమ్మా."
తల్లి ఊరుటపొంది. యింకెప్పుడూ ఆ పిల్లతో మాట్లాడనని కొడుకుతో వొట్టేయించుకుంది.
అప్పట్నించీ ప్రక్కింటి గుమ్మంకేసి చూడటం మానేశాడు. అసలు ఎంతో అవసరం వుంటేనేగాని పెరటి లోకి వెళ్ళేవాడు కాడు. వెళ్ళినా తలవంచుకుని ఇట్టే వెళ్ళి అట్టే వచ్చేసేవాడు. చారడేసి వున్న సీతకళ్ళు అతన్ని ఎంత వెంటాడుతున్నా తలవంచుకుని, తప్పించుకుని తిరిగాడు.
ఓరోజు ప్రొద్దుట స్నానంచేసి వస్తోంటే ప్రక్కింట్లోంచి ఓ కాగితపు వుండ ఎగిరి వచ్చి కాళ్ళ దగ్గర పడింది. గుండె గబగబ కొట్టుకుంది. ఎవరూ చూడలేదు కదా అని అటూ ఇటూ చూసి వంగి తీసుకుని లోపలకు వెళ్ళిపోయాడు.
కాలేజీకి వెళ్ళాకగానీ చూడటానికి ధైర్యం చాలలేదు. ఎవరూ లేకుండా జాగ్రత్తపడి ఆ కాగితం విప్పాడు.
"మీతో మాట్లాడాలి. సాయంత్రం పరస్పరం మల్లెతోటల్లోకి రండి?"
వెళ్ళనా వద్దా? వెళ్ళనా వద్దా? అని చాలాసేపు మధనపడ్డాడు. మనసులో ఏదో కదిలింది. చివరకు వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు.
ఆ సాయంత్రం కాలేజీ నుంచి, అనంతమూర్తి కేదో వొంకచెప్పి తప్పించుకుని పరస్పరం తోటల్లోకి వెళ్ళాడు. గుండె దడదడ లాడుతోంది. ముచ్చెమటలు పడుతున్నాయి.
సీత అప్పటికే అక్కడికి చేరుకుని, ఓ చెట్టుక్రింద ఎదురు చూస్తూ నిలబడి వుంది. ఇంకా అక్కడక్కడ మనుషులున్నారు. తమని ఎవరైనా గుర్తు పడితే? తల్లిదండ్రులకి చెప్పేస్తే?
భయపడుతూనే వెళ్ళి ఆమె ప్రక్కన నిల్చున్నాడు.
సీత నవ్వింది. "భయపడకండి. యిక్కడ తెలిసిన వాళ్ళెవరూ లేరు?"
"నాకేం....భయంలేదు" అన్నాడు బింకంగా.
"గానం మానెయ్యటానికి తల్లిదండ్రులు కారణం చెప్పారు. నాతో మాట్లాడటం, నావంక చూడటం మానేశారు. తప్పించుకుని తిరుగుతున్నారు. దీనికేం చెబుతారు?"
వాజబు చెప్పటానికి అతడు తడుముకుంటున్నాడు. "ఏం...లేదు?"
"ఏం లేకపోతే మీలో యీ మార్పెందుకు వస్తుంది?"
ఇది మార్పుకాదు. ఆ మధ్యలో వచ్చిన రెండు నెలలే మార్పు. ఇదే నిజరూపం అని ఆ చిన్నపిల్ల కెలా తెలుస్తుంది?
రాఘవ చెప్పేయటానికి నిశ్చయించుకున్నాడు. "మనం మాట్లాడుకోవటం మా పెద్దవాళ్ళ కిష్టంలేదు."
"అందుకని....?"
"మనం ఆపెయ్యాలి?"
"నువ్వు రెండు రోజులు కనిపించకపోయినా, నీతో మాట్లాడకపోయినా పిచ్చెక్కినట్లు వుంటుందని అన్నారు అప్పుడే మరచిపోయారా?"