Previous Page Next Page 
సూర్యుడు దిగిపోయాడు పేజి 4


    "రాత్రిళ్ళు మీరేనా మురళి వాయించేది?" ఆ అమ్మాయే ముందుగా పలకరించింది.
    అతనికి గర్వం కలిగింది- కళ్ళలో ఆనందం తొణికిస లాడింది. అవునన్నట్లు తల ఊపాడు.
    "మీరు చాలా బాగా వాయిస్తారు"
    అతను తికమకపడ్డాడు. "అబ్బే! నాకేమీ రాదండీ. ఏమీ తోచక....అంతే...." అంటూ నేవ్వేశాడు.
    "బాగా వచ్చిన వాళ్ళంతా అలానే అంటారులెండి"
    ఇంతలో "అమ్మా! సీతా!" అంటూ లోపల్నుంచి వాళ్ళమ్మగారు వేసిన కేక వినిపించింది.
    "అమ్మో! అమ్మ" అని గుండెలు నొక్కుకుని "ఆఁ వస్తున్నా" అంటూ ఆ అమ్మాయి లోపలకు వెళ్ళిపోయింది.
    తియ్యటి కల తెగిపోయినట్లయింది.
    ఆ రాత్రి అతను ప్రక్కమీద కూర్చుని మురళిమీద స్వరాలు పలికిస్తోంటే- ప్రక్కింటిలోంచి ఓ పదహారేళ్ళపిల్ల తన అమాయకమైన కనులు తెరచిపడుకుని, చెవులను యీ యింటిమీదే వుంచి, మధురమైన అనుభూతిలో మునిగివుందన్న భావన అతని మనసులోంచి పోవటంలేదు. నూతన ఉత్తేజం కలుగుతోంది. తర్వాత పడుకున్నా ఆ రాత్రికి ఎంతకీ నిద్రపట్టలేదు.
    మరునాడు ఆమెకోసం అతని కళ్ళు ఆతృతగా వెదికాయి. కనిపించలేదు.
    ఆ మరునాటి ఉదయం అన్నంలోకి కంది పచ్చడి తినాలనిపించి పెరటిలో కూర్చుని రోట్లో పచ్చడి రుబ్బేస్తున్నాడు.
    ఆ పిల్ల చూడనే చూసింది.
    ఫక్కుమని నవ్వింది.
    సిగ్గుపడిపోయాడు. తలవంచుకుని పనిపూర్తి చేసుకుని, లోపలకు వెళ్ళి పచ్చడేసుకుని అన్నం తిని కాలేజీకి వెళ్ళిపోయాడు.
    ఆ సాయంత్రం పెరట్లో వుండగా పట్టుకుంది.
    "మీకు వంట చెయ్యటం వచ్చా?"
    మాట రాలేదు. తల ఊపాడు.
    "అబ్బో! మీకు చాలా వచ్చు!"
    అది అభినందనో, ఎగతాళో అర్ధంకాలేను.
    "కంది పచ్చడి మీకిష్టమా?"
    ముఖం ఎర్రబడింది. ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.
    "సిగ్గయ్యితే చెప్పొద్దులెండి. మీ పేరేమిటి?"
    "నా పేరు మీకు తెలుసు."
    పాత పేరులో కొన్ని చాలాఅందంగా వుంటాయి. సీత, శకుంతల, రాధ-యిలాంటివి.
    ఇంతలో "అమ్మాయి సీతా" అన్న కేక వినబడింది లోపల్నుంచి.
    "అమ్మో! అమ్మ పిలుస్తోంది" అని పరుగెత్తింది.
    అలా వోణీ, పరికిణి వేసుకుని పరుగెడుతూంటే, పొడుగాటి జడ సర్రున కదులుతూంటే ఎంత బాగుంది అని విస్మితుడయిపోయాడు.
    మరో రోజు....
    "మీరేం చదువుతున్నారు?"
    "ఇంటిర్మీడియట్."
    "అబ్బా!" అంటూ చక్రాల్లాంటి కళ్ళు త్రిప్పింది.
    "మీరు?"
    "మెట్రిక్ చదివి మానేశాను"
    "అదేం?"
    "ఇంట్లో ముసలివాళ్ళ గోల వుంటుంది కదా"
    "మీ నాన్నగారేం చేస్తారు?"
    "ఫారెస్టు ఆఫీసర్"
    గబుక్కున "మీ నాన్నగారి దగ్గర తుపాకీ వుంటుందా?" అని అడిగేశాడు.
    "ఏం? మీకు తుపాకి అంటే భయమా?" ఫక్కున నవ్వేసింది.
    "అబ్బే.....అదికాదు.....ఫారెస్టులొ తిరుగుతూంటే....అని తడుముకున్నాడు.
    "ఓ! చాలా పెద్దది వుంది చూస్తారా?"
    "అక్కరలేదు లెండి"
    ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుకుంటూనే వున్నారు. ఎప్పుడూ రెండు మూడు నిమిషాలకంటే ఎక్కువ కుదరటంలేదు. వాళ్ళమ్మ గొంతు ఏమూలనుంచో వినిపించేది. ఆదివారమైతే వాళ్ళ నాన్నగారు యింట్లోనే వుండేవారు.
    తమ పరిచయాన్ని గురించి మూర్తికి చెబుదామనుకున్నాడు. ఎందుకో-విమర్శిస్తాడేమో ననిపించింది. అతని ముందు బయటపడలేకపోయాడు.
    "నువ్వు రెండు రోజులు కనిపించకపోయినా, నీతో మాట్లాడకపోయినా పిచ్చెక్కినట్లు వుంటుందెందుకని?" ఒక రోజు ధైర్యం చేసి అడిగేశాడు.
    కిలకిలమని నవ్వేసింది.
    "ఎందుకే నవ్వుతున్నావు?" లోపల్నుంచి వాళ్ళమ్మగొంతు.
    "అబ్బే! ఏంలేదమ్మా" గుండెమీద చెయ్యి వేసుకుని నొక్కుకుని లోపలకు పరుగెత్తింది.
    మరునాడు...
    "నీ నవ్వుకు కారణమేం చెప్పావు?"
    "ప్రక్కింటి అబ్బాయి కందిపచ్చడి రుబ్బుతున్నాడు. చూస్తే నవ్వొచ్చిందని చెప్పాను"
    "ఛీ! అలా చెప్పవచ్చా?"
    "మరేం చెయ్యను? అంతకంటే తట్టలేదు."
    "నిన్ననే చెప్పింది విన్నాడు?"
    "ఏమిటది?"
    కొంచెం కోపం వచ్చింది. "కొన్ని విషయాలు తిరిగి చెబితే అందులో మాధుర్యం పోతుంది" అన్నాడు నిష్ఠూరంగా.
    "ఓహో! అదా?  అని ఆమె కొంచెంసేపు ఆలోచించి "ఏం చేద్దాం? నాకూ అలానే వుంటుంది" అన్నది.
    అతనికి శరీరమంతా పులకించింది. "నిజంగానా?"
    "అబద్దం చెప్పలేదు." తలవొంచుకుని అన్నది.
    ఇలా రెండు నెలలూ శరవేగంగా పరిగెత్తాయి. ఇప్పుడు తల్లిదండ్రులు తీర్ధయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చే సమయం ఆసన్నమయ్యేసరికి అతని గుండెల్లో రైళ్ళు పరిగెత్తసాగాయి.
    సీత అతనిలోని కంగారు గమనించింది గాని అర్ధం చేసుకోలేదు.
    చివరకు ఓ ఉదయం తల్లిదండ్రులిద్దరూ యింటిముందు గుర్రబ్బండి దిగారు. బహుశా జీవితంలో పెద్దవాళ్ళ గురించి చికాకు పడ్డ సమయం అదే అయివుంటుంది. అదయినా కొన్ని క్షణాలే. తర్వాత పెద్దవారివల్ల అతనికున్న భర్త గౌరవాలు ఆ చికాకుని మటుమాయం చేశాయి.
    వస్తూనే తండ్రికి మంచంమీద పడివున్న పిల్లనగ్రోవి కనబడింది.

 Previous Page Next Page