Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 46

    "నువ్వొచ్చి సెలెక్టు చేయకూడదూ?"

    "ఇంత చిన్న పనికి నేనెందుకు?"

    "ఆ డిజైన్స్, ఆ కలర్స్ అవీ నాకస్సలు తెలియదు! కారులో రావడమే కదా? వస్తే ఏం?"

    "పిల్లలు రానీయండి! వచ్చాక వాళ్ళని తీసుకు వస్తాను!"

    "పిల్లల్ని ప్రతిసారీ మనతో త్రిప్పడం అంత మంచి అలవాటు కాదు! అరగంటలో వెళ్ళి వచ్చేస్తాం! బయల్దేరు!"

    పిల్లలు వెంటలేకుండా ఒక్కతే అతడితో వెళ్ళడమంటే ఏమిటో సంకోచమనిపించింది సంధ్యకు. కాని, ఉద్యోగం అన్నతరువాత యజమానికి ఎదురు చెప్పడం మర్యాదగా ఉండదని అతడితో బయల్దేరింది.

     "ప్రేమలూ, శ్రీకాంత్ కి ఇద్దరికీ తీసుకుందాం! ఇద్దరికీ రెండు మూడు జతలు సెలెక్ట్ చెయ్యి!" రెడీమేడ్ షాప్ లోకి దారితీస్తూ అన్నాడు చక్రపాణి. సెలెక్షన్ పూర్తిగా సంధ్యకే వదిలిపెట్టి తను డబ్బు చెల్లించడం మాత్రమే చేశాడు.

    తరువాత బట్టలు షాపుముందు కారు ఆపి దిగుతూంటే సంధ్య మౌనంగా అనుసరించింది.

    "ఏం కావాలి, సార్?"

    "పట్టుచీరలు తీయండి!"

    కారులో దిగిన ఖరీదైన మనిషికి ఎలాంటి చీరలు కావాలో చెప్పక్కరలేకుండానే తీశాడు సేల్స్ మాన్.

    "చూడు సంధ్యా! వీటిలో రెండు చీరెలు సెలెక్ట్ చెయ్యి!"

    "ఎవరికి?"

    "ఎవరికో ఒకరికి! నీ ఒంటిరంగులో ఉన్న ఆమెకు ఏరంగులు బాగుంటాయో చూసి సెలెక్ట్ చెయ్యి!"

    "మీ చెల్లెలికా?"

    "కాదు! నా భార్య చెల్లెలికి!"

    "ఈ చీరల నాణ్యం నాకంతగా తెలియదు!"

    "నాణ్యమైన చీరెలే ఉన్నాయమ్మా మా షాపులో! చెత్తసరుకును మేం తీసుకురాం!" అన్నాడు ప్రొప్రైటర్ అభిమానంగా.

    అరగంటసేపు చీరెలెన్నో చూశాక, రెండు చీరెలు సెలెక్ట్ చేసింది సంధ్య.

    "వాటికి బ్లౌజు పీసులు కూడా తీసుకో!"

    బ్లౌజ్ పీసుల్తో సహ ఖరీదైన అట్టపెట్టెల్లో ఉంచి ఇచ్చాడు సేల్స్ మాన్.

    బిల్లు చెల్లించి బయటికి వచ్చాడు చక్రపాణి.

    ఆ రోజు ఆ అట్టపెట్టెలు తన దగ్గరే ఉంచుకొన్నా మరుసటి రోజు ఉదయం శ్రీకాంత్ చేతికిచ్చి,  "ఇవి మీఆంటీ కివ్వు" అని చెప్పాడు చక్రపాణి.

    "ఆంటీ, డాడీ మీకిమ్మన్నారు ఇవి!" అట్ట పెట్టెలతో ఉత్సాహంగా పరిగెత్తాడు శ్రీకాంత్.

    ప్రేమకు తలంటిపోసి, జుట్టు దువ్వి క్రొత్త రిబ్బన్ కడుతూంది సంధ్య.

    "తీసి పెట్టమన్నారా బీరువాలో?"

    "ఏమో!"

    "అడిగిరా, శ్రీకాంత్!"

    "శ్రీకాంత్ వెళ్ళి అడగక్కరలేకుండానే చక్రపాణి గుమ్మందగ్గర ప్రత్యక్షమయ్యాడు.

    "ఆ చీరెలు నీకనే తీసుకొన్నాను, సంధ్యా! ప్రేమను తీసుకొని గుడికి వెడతావుకదా, క్రొత్తచీరకట్టుకొని వెళ్ళు."

    "పుట్టినరోజు ప్రేమకు! నాకు కాదు! అయినా ఇప్పుడు ఈ పట్టుచీరెల బహుమతి ఎందుకిస్తున్నారు?" కొంచెం పదునుగానే అడిగింది సంధ్య.

    "నువ్వు నా పిల్లలపట్ల చూపుతున్న శ్రద్దకు అనుకో!"

    "నా ఉద్యోగ ధర్మమే అది అయినప్పుడు ప్రత్యేకంగా బహుమతులెందుకు? పరాయివాళ్ళ నుండి ఇలా బహుమతులు తీసుకొనే అలవాటు నాకు లేదు" నిష్కర్షగా అంది సంధ్య.

    వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు చక్రపాణికి.  "నీకనే అవి తీసుకొన్నాను. ఈ ఒక్కసారికి అవి తీసుకో. ఇంకెప్పుడూ నిన్నడక్కుండా నీకని ఏమీ తీసుకోను. నా హద్దులు ఇంకెప్పుడూ దాటను."

 Previous Page Next Page