Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 45

  

     "ఎవరూ ఇంతవరకు నోటితో చెప్పలా! ఒకరి చూపులు నన్ను శాసించాయి"
   
    "ఎవరిది ఆ చూపు? నాదా?"
   
    "అవును మీదే" అంది సుజాత వాడిగా.
   
    "నేను కఠినుడ్ని సుజాతా కఠినుడ్ని."
   
    "అవును" అంది సుజాత మెల్లగా.
   
    జానకిరాం అక్కడే నిలబడి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ "నువ్వు పెరిగావు సుజాతా! నా హృదయానికి ఓ స్వరూపం ఇచ్చావు" అన్నాడు.
   
    ఆమె కన్నులు మిలమిల మెరిసాయి. "నేనిప్పుడు ఎన్నో అంతస్థులో వున్నాను?" అంది తన్మయంగా.
   
    "చివరి అంతస్థు."
   
    "క్రిందకి పడిపోనా?"
   
    "జానకిరాం నీడనిదాటి అవతలకు పోనంతవరకూ నువ్వు క్రిందకి పడిపోవు సుజాతా! నేను వెళ్తాను" అంటూ అతను కర్రను ఆధారంగా చేసుకుని వెనక్కి తిరిగాడు.
   
    "ప్రభాకరం నాటకాల్లోంచి మానేస్తున్నాడు" అంది వెనకనుంచి సుజాత.
   
    జానకిరాం ఆగి "అలాగా? అతను చాలామంచి ఆర్టిస్టు. అతను మానెయ్యటం నష్టమే" అని అక్కడ్నుంచి కదిలి వెళ్ళిపోయాడు.
   
    సుజాత తలుపులు వేసుకుని లోపలకు వెళ్ళిపోయింది.
   
                            18
   
    జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. వారం రోజుల్లోనే మళ్ళీ శివనాథరావు మామూలు మనిషయ్యాడు. ఇన్ని రోజులూ చదువు పోయిందే అని అతనికి చింత పట్టుకుంది. రోజురోజుకూ పరీక్షలు దగ్గరికొస్తున్నాయి. పాసవుతానా అన్న అనుమానం కలగసాగింది. ఎంత చదివినా తరగని కోర్సు. రెండో సంవత్సరం అంత క్లిష్టమైనదైనా తను ఎందుకు తప్పలేదా అని అతను చాలా రోజులు ఆశ్చర్యపడేవాడు. అప్పటికి సరోజిని తన జీవితాన్ని ఇంకా ఆక్రమించలేదు. ఈ వియోగం, క్లిష్టపరిస్థితి అంతకన్నా లేవు. పరీక్ష చదువులో అతనెప్పుడూ లోపం చెయ్యలేదు. పాసయ్యాడు. కాని చదివినంత మాత్రాన పాసవ్వాలని గ్యారంటీ లేదు యిప్పుడు. ప్రయత్నించాలి, సాధించాలి. అతను రాత్రింబవళ్ళు ఏకదీక్షగా చదవసాగాడు. మొదట పుస్తకం తీసుకోగానే గజిబిజిగా వుండేది. ఏవో విషయాలు జ్ఞప్తికివచ్చి మనసును వికలం చేస్తుండేవి. ఏం చదువుతున్నాడో సరిగా బోధపడేదికాదు. అలా-ఆ అవస్థ ఒక్క అరగంట అనుభవించేవాడు. తర్వాత ఏకాగ్రత కుదిరేది. పుస్తకంలో లీనమైపోయేవాడు. గంటలు గడిచిపోయేవి. రోజుకు మూడుగంటలకన్నా ఎక్కువ నిద్రపోయేవాడు కాదు. కష్టపడి పనిచేస్తే కలిగే ఆత్మవిశ్వాసం, ఓ ఊరటా అతనికి కలుగుతూ వుండేది. ఆత్మ ఓ దివ్వెలా వెలుగుతున్నట్లుగా అనుభూతి.
   
    ఒకరోజు అతనికి కృష్ణ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. అతను బెజవాడ నుంచి రాయలా. మైసూరు నుంచి రాశాడు.

    ప్రియమైన శివా!
   
    ఏమిటి? నేను సాధారణంగా ఎవరికీ ఉత్తరాలు రాయను. సాధారణంగా ఏమిటి? అసలు రాయను. ఈ నాలుగేళ్ళలో నీకు ఒక్క ఉత్తరంకూడా రాసినట్లు గుర్తులేదు. ఇప్పుడు వ్రాయుచున్నాను. అవసరం వచ్చిందనికాదు, అవకాశం కలిగింది.
   
    ఆ రాత్రి నా గత జీవితానుభావాలు నువ్వు వినగోరావు. నేను దాపరికం లేకుండా కొన్ని చెప్పాను. ఇంకా చాలా వున్నాయి. ఈ నా చిన్న వయస్సులోనే నేను అనుభవాలను అన్వేషించగలను. అలా అన్వేషించేవాళ్ళంటే నాకు అసహ్యం. నేను వాటితాలూకు సౌందర్యాన్నీ, మృదుత్వాన్ని మాత్రమే బయటకు యీడ్చి, మిగతాదంతా దాచి ఓ సౌందర్యోపాసకుడ్ని అని చెప్పుకుని తిరగొచ్చు. అలా నేను చెయ్యను. జీవితంలోని నిరాశలను గురించి అందంగా చెప్పుకుని ఇతరుల సానుభూతీ, ఆకర్షణ పొందాలని నాకనిపించదు. జీవితంలో నేనన్వేషించే సత్యం ఒక్కటే. ఆత్మ ఉద్దీపన. నేను నా ఆత్మకు అన్యాయం చేయదలచుకోలేదు. ఆత్మ ఓ జ్యోతిలాంటిది. ఆత్మజ్యోతిలో నేను తగలబడి పోతానా? సంసిద్దుడ్ని అలాగాక ఇద్దరం ఒకరితో ఒకరు పెనవేసుకుని, నలిగి కరిగిపోతామా? మరీ మంచిది. మొత్తానికి ఓ అంతులేని జీవితం కాదు నాది. ఆ అంతూ ఎంతోదూరం లేదనికూడా యిప్పుడు బోధపడింది.
   
    మన స్నేహబృందంలో ఓ విశిష్టత వుంది. ప్రతివాడికి ఓ ప్రత్యేక ప్రహావం, పదునైన వాతావరణమూ వున్నాయి. అందరూ లోతు కలిగినవాళ్ళే. అందుచేత రోజురోజుకూ మనలో చాలామార్పు వస్తోంది. విశాలమైన పరిధి ఏర్పడుతోంది. భౌతికంగా ఒకరికొకరు దూరంగా పోతూ మానసికంగా చేరువగా వస్తున్నాం. సాఫీగా పోయే జీవితం ఒక్కడిదీ కాదు. నీ విషయంచూడు కళాకారుడివి. గొప్ప కళాహృదయం నీది. కాని డాక్టరువి, బహుశా ప్రేమికుడివి. నీ మనస్సు అతి సున్నితము. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన నిన్ను ప్రపంచం నీ దారిన నిన్ను బతకనివ్వదు. చంద్రం! వాడు ఓ అయోమయం మనిషి, బ్రహ్మాండమైన క్రికెట్ ప్లేయరు. మరో దేశంలో పుట్టివుంటే ప్రపంచ ప్రఖ్యాతి పొందేవాడు. వాడు ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలీదు. దేన్నీ లెక్కచేయడు. తను కావాలనుకున్నది సాధించి తీరతాడు. సమర్ధుడు. ఈమధ్య అనుకోకుండా వైడ్ని కలిశాను. వాడి చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. వాడో ప్రణయ కలాపంలో పడ్డాడీమధ్య. నీకు కొంచెం తెలిసేవుంటుంది. వాడి ముఖతఃనే విందువుగాని మరి మోహన్ గురించి వాడు పుట్టింది పల్లెటూరిలో చాలావరకు పెరిగింది పల్లెటూరిలో. మనకు పల్లెజీవితం, ఆ రాజకీయపు వాతావరణం చాలావుంది. కొన్ని విషయాలలో అంతటి ధైర్యశాలి. కుటుంబంలోని కష్టసుఖాలూ, మంచీ-చెడూ, పొరపొచ్చాలూ మనకంటే హెచ్చుగా వాడనుభవించాడు. మనకి వ్యక్తిగతమైన జీవితం ఎక్కువగాని కుటుంబరీత్యా మనపాత్ర చాలా తక్కువ. వాడు ఆ విధంగా నిండైన మనిషి. రాజకీయాలంటే అభిలాష మెండు. ఎప్పటికైనా మంత్రిపదవి వచ్చినా, రాకపోయినా రాకకీయంగా ఓ ప్రముఖస్థానం ఆక్రమిస్తాడనే నా నమ్మకం.
   
    ఇదంతా ఎందుకు రాస్తున్నాడాని నీకాశ్చర్యంగా వుంది కదూ. మన నలుగురి గురించీ కాస్త ముచ్చటించాలని చాలా కుతూహలంగా ఉంది యివాళ. మీ అందరికీ దూరంగా ఉన్నానుకదూ. అందుచేత నా గురించిన ముచ్చట ఎక్కువుంటుంది ఓపిగ్గా విను.
   
    ఇక్కడ బృందావనంలో ఆ సౌందర్యాల మధ్య ఆ మనోహరసీమల్లో నేనూ, నా ప్రేయసీ ఒకరిచెయ్యి ఒకరు పట్టుకుని ఎన్నోసార్లు విహరించాం. ఎంతోకాలం అనంతమైన సౌఖ్యం వ్యయపరిచాం. ఒకరినొకరు విడువకుండా పెనవేసుకుని తిరిగాం. నా ప్రేయసి ఎవరో తెలుసా? మాధవి.    

    మాధవంటే నీకర్ధంకాదు. అనామ అంటే తెలుస్తుంది. ఆమె అసలుపేరు మాధవి.
   
    ఆరాత్రి నీకు గుర్తుందో లేదో- నేనామెను ప్రేమించానని నీకు చెప్పాను. ప్రపంచంలో అంతకంటే నిర్మలమైన సత్యం మరొకటి లేదు. ఇన్ని విచిత్రాలు ఎందుకు జరుగుతాయో మరి నాకు తెలీదు. చంచలమైన నా మనస్సు మాధవిని ఎందుకంత నిలకడగా వరించిందో, ఆమెకెలా దాసోహమందో నేను జీవితకాలంలో తెలుసుకోలేను. అందుచేత ఆమె నన్ను అవమానించినా సహించాను. ఆ ప్రేమకోసం - నీకా విషయం చెప్పిన ఇరవైనాలుగు గంటల్లోనే ఆమెతో లేచివచ్చాను. ఆరోజు స్టేషన్ లో నీవు హైదరాబాద్ పోయే రైల్లో కూర్చుని వుండి వుంటావు. మరోమూల నేనూ, మాధవీ మరో రైల్లో వున్నాము.
   
    భవిష్యత్ ని గురించి ఆలోచించకుండా బయల్దేరి వచ్చాను. ఆలోచించేదేముంది? నేనేది చేస్తే అదే భవిష్యత్. అయితే ఓ గమ్మత్తు చెప్పనా? మాధవి నన్ను ప్రేమించలేదు. ఆ విషయం నీకంటే స్పష్టంగా ఎవరికీ తెలీదు. అయినా ఆమెకోసం నా కుటుంబాన్ని వదిలి వచ్చాను ఆమెను కాపాడ్డంకోసం. ఆనాడు రైల్లో ప్రయాణం చేస్తున్నాం. తలనిండా ముసుగేసుకుని కిటికీదగ్గర కూర్చుంది మాధవి. బయటినుంచి వచ్చేగాలికి కొన్ని ముంగురులు కంటిమీదా. చెక్కిళ్ళమీదా పడుతుంటే తీఉస్కోకుండా అలా నిర్లక్ష్యంగా కూర్చుంది. అప్పుడెందుకో అనిపించింది - ఈమెను పాడుచెయ్యకూడదని అయితే యింత దూరం ఎందుకు తీసుకువెళ్ళేట్లు? పుస్తకాల్లో పాత్రలా జీవించాలని నా అభిమతం కాదు. కాని పుస్తకాల్లో కంటే జీవితంలో మనుషులు ఉదాత్తంగా ప్రవర్తిస్తారు - కొన్ని సందర్భాలలో.
   
    సాధారణంగా లేచిపోయేవారందరు మద్రాసు పరిపోతారు. మేము మైసూరు వచ్చాం. నా చేతిలో ఓ వెయ్యిరూపాయలదాకా వున్నాయి. ఓ చిన్నయిల్లు తీసుకున్నాం. మా నాన్నని క్షమాపణలు కోరుతూ ఓ ఉత్తరం రాశాను. ఆ స్త్రీని మర్చిపోయి యింటికివస్తే క్షమిస్తానని రాశాడు. మాధవి నాతో నవ్వుతూ మాట్లాడుతుంది. అందులో వెటకారం కావలసినంత ధ్వనిస్తూ వుంటుంది. ఆమె వంట చేస్తూ వుంటుంది. ఇద్దరం కలిసే భోంచేస్తాం. ఎక్కడెక్కడికో తిరుగుతాం. నేను సంతోషంవస్తే ఆమె భుజంమీద కొట్టి మాట్లాడతాను. ఆమె నా జుట్టంతా రేపి పాడుచేస్తుంది. కాని నేనామెను ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను ప్రేమించడంలేదు. కాని నేనేం ప్రవరాఖ్యుడ్ని కాదు. ఆమెను పాడుచేయకూడదన్న సంకల్పం ఒకటి తప్ప మిగతా నిగ్రహ శక్తులేవీ నాకులేవు. ఒక్కోసారి ఆ సౌందర్యాన్ని, యవ్వనాన్ని చూసి చలించి పోయేవాడ్ని. అక్కడ వుండలేక రాత్రిళ్ళు యింట్లోంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ప్రొద్దున్న కొంపకి చేరుతుండేవాడ్ని.
 

 Previous Page Next Page