Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 44

   

       ఆ సాయంత్రం చెప్పినట్లుగా కృష్ణ శివనాథరావును కలుసుకోలేదు. తను ఎంత సాహసం చేయబోతున్నాడో అతనికి తెలుసు. ఒక స్త్రీ కోసం యిదివరకెప్పుడూ తననింత అవస్థలో పెట్టుకోలేదు. అందులో యీమె తనని ప్రేమించని స్త్రీ తననో ఉపకరణంగా భావించి సహాయం అర్దిస్తోన్న స్త్రీ. తను మోసపోవటంలేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా తెలుసు. ఒక విషవలయంలోకి దూకుతున్నాడని తెలుసు. అయినా యిది చేయకుండా వుండలేడు. తను ఈనాటికి ఓ విచిత్రమైన దశలో పడ్డాడు.
   
    ఆ రాత్రి అతనా అపురూప సుందరిని తీసుకుని రైలెక్కాడు.
   
                               17
   
    సరళ ఆర్టు థియేటర్ వారి కొత్తనాటకం దేశంలో విజయవిహారం చేస్తోంది. పెద్దపెద్ద పట్టణాల్లో వారాలతరబడి ప్రదర్శించబడుతోంది. "సుజాత" అంటే ప్రజల్లో ఆకర్షణ ప్రబలింది. ఇదివరకు ప్రజలు సినిమాతారల్ని మాత్రమే ఆరాధించేవారు. కాని సుజాతతో ఓ కొత్తశకం నిజంగానే ప్రారంభమయింది. ఆమె ఆరాధకులు హెచ్చయినారు. తన కీర్తి అధికమైనకొద్దీ ఆమెలో చిత్రమైన పరిణామం రాసాగింది. అది గర్వంకాహ్డు అని అధిగమించిన వ్యక్తిత్వం. ఆమె ఏదో ఓ కొత్త ప్రపంచంలో పరిగెడుతోంది. ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోతోంది. ఈ మనుషులు, ఈ స్నేహాలు యివన్నీ చాలా తుచ్చంక్రింద కనిపించసాగాయి. ఎంతసేపు పనిచేసినా అలసిపోయేది కాదు. నిరంతరోత్సాహం ఆమెను ఆక్రమించి వుండేది. రాత్రిళ్ళు చాలా కొద్దిసేపు నిద్రపోయేది. దీపం ముందుకూర్చుని ఏదో పుస్తకం చదువుతూనో, తపస్సు చేస్తున్నట్లుగా ఆలోచిస్తున్నట్లుగా వుండేది. మనసులో ఎప్పుడూ ఏదో దివ్వె వెలుగుతున్నట్లుగా వుండేది. ప్రభాకరం అంత ఎత్తుకు పెరగలేకపోయేవాడు. ఇదివరకటిలాగా ఆమెతో చనువుగా మాట్లాడలేకపోయేవాడు. ఆమెముందు సిగ్గుపడుతూ వుండేవాడు. తనకిక ఆమె దక్కదేమోనని భయపడుతూ వుండేవాడు. అయితే యింత చిన్న వయస్సులో వచ్చిన ఈ మానసికమైన ఉద్వేగం, ఇదంతా చాలా తాత్కాలికమనీ, ఆమె మళ్ళీ ప్రాపంచికమైన అనుభవాలకోసం దిగిరాక తప్పదనీ అతనికి తెలియదు. అందుకని భయపడేవాడు.
   
    అంతేకాదు. సుజాత జానకిరాంకి కొంచెం కొంచెం అంకితం అయిపోసాగింది. అతని ప్రభావంలో మరుగుపడి పోసాగింది. పూర్వం అతనంటే ఆమెకు భయభక్తులు మాత్రమే వుండేవి. ఇప్పుడతన్ని ఆరాధిస్తోంది. ప్రభాకరం అసూయతో భగ్గుమనేవాడు. కానీ ఏం లాభం? అక్కడ్నుంచి పారిపోలేడు.
   
                              *    *    *
   
    పత్రికలన్నీ నాటకాన్నీ, జానకిరాంనీ, సుజాతనూ పొగిడి వదిలిపెట్టాయి. నాటకబృందం ఊరూరా పర్యటించి మూడు నెలల్లో తిరిగి మద్రాసు చేరింది. మద్రాసులో యింతవరకు ప్రదర్శన యివ్వలేదు. ఒకరోజు అక్కడకూడా ఏర్పాటు చేయబడింది.
   
    ఈ మూడునెలలూ చంద్రం సుజాతని విడిచిపెట్టలేదు. కాని వ్యాపారం మీద పనులవల్ల ఎక్కువభాగం బొంబాయిలో వుంటూ వచ్చాడు. అంతేగాక రంజీట్రోఫీ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగానే అతను సెలక్టు అయ్యాడు. పోటీల్లో పాల్గొంటూ వుండటంవల్ల ఊళ్ళు తిరగసాగాడు. ఓసారి మైసూరులో ఆడుతుండగా అక్కడ సుజాత నటిస్తున్న నాటకం ప్రదర్శిస్తున్నారు. ఉత్సాహంతో వెళ్ళి తిలకించాడు. నాటకం అయిపోయాక పోయి ఆమెను కలుసుకుందామనుకున్నాడు. కానీ కూడావచ్చిన తోటి ఆటగాళ్ళు పడనివ్వక బరబర లాక్కుపోయారు. మరునాడు క్రికెట్ ఆట మొదలయింది. ఎలా జరిగిందో తెలీదుగాని - నాటక బృందంలోని వాళ్ళంతా ఆట చూడ్డానికి వచ్చారు. చంద్రం సుజాతని చూశాడు. అతనిలో ఉత్సాహం పెల్లుబికింది. అతని ఫాస్ట్ బౌలింగ్ ఎదుటి టీమ్ వాళ్ళని భయసంభ్రమాల్లో ముంచెత్తింది. ఆరోజు అతనికి ఏడు వికెట్లు వచ్చాయి. లంచ్ వేళ కాగానే ఓ ఆడపిల్ల ప్రేక్షకుల్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెళ్ళో పూలహారం వేసింది. సుజాత ఇదంతా చూస్తూనేవుంది. "అబ్బా! ఇతను చాలా పెద్ద ఆటగాడే" అనుకుంది. మనసులో అభినందించింది. ఇంత గొప్పవాడు తనకోసం....ఆమె గర్వించింది. కాని బయటకొచ్చి నాటకశాలవైపు దారి పట్టే సరికి అంతా...మరిచిపోయింది. మళ్ళీ నాటకం, మళ్ళీ జానకిరాం, ఆ నటన, ఆ కళ...అందులో ఆమె మునిగిపోయింది. తను ఏ ఊళ్ళో ఉన్నా చంద్రం ఆమెకు ప్రేమగా ఉత్తరాలు రాసేవాడు. కాని ఆమె వాటిలో ఒక్కదానికీ జవాబు యివ్వలేదు. ఓ గదిలో, విద్యుత్ వెలుగులో ధగధగ మెరుస్తూన్న దుస్తుల్లో ఓ దేవతలా కూర్చుని శూన్యంలోకి చూస్తుండేది సుజాత.
   
    ఆరోజు నాటకం ముగిసింది. ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అభినందన పరంపరలు వచ్చిపడినాయి. సుజాత మేకప్ తీసేసుకోవటానికి తన గదిలోకి వెళ్ళింది. వెనక అలికిడి అయింది. ప్రభాకరం!
   
    "ఏమిటి?" అంది సుజాత మృదువుగా.
   
    ఇవాళ ప్రభాకరం తెగించివచ్చాడు. తన సిగ్గునూ, భయాన్నీ కొంచం అవతలకు త్రోశాడు. విషాదం కలిగితె కలగనియ్యి సుజాత నాది అనుకుంటూ వచ్చాడు.
   
    "చూడు సుజాతా!" ప్రభాకరం బొంగురుకంఠంతో ప్రారంభించాడు. "నువ్వు గొప్పదానివైపోయావు. ప్రపంచం నిన్ను ఎవరూ ఎగరలేనంతటి ఎత్తుకి ఎగుర వేసింది. నేను సామాన్యుడ్ని, సామాన్యుడ్ని అయినా నిన్ను ప్రేమిస్తున్నాను. అది నా స్వార్ధం, సంకుచితత్వం. ఓసారి నీకు నేను చెప్పాను. నువ్వు నాకు కావాలి అంతే."
   
    సుజాత అద్దంలో తన ముఖం చూసుకుంటూ "ఎందుకు ప్రభాకరం నీకింత పిచ్చి! నేను వొట్టి శూన్యాన్ని నేను ఎవరికీ చెందని అందమైన బొమ్మని. నాకు ఈ స్థితి ఒద్దని మొత్తుకున్నాను. ఎవరూ కాంక్షలేని ఒ౦ యంత్రంగా మార్చింది. నేనంటే ఎందుకింత మోహపడతావ్?" అంది.
   
    "అలా జరిగిపోయిందంతే  నేను నీకోసం నటిస్తున్నాను. నీకోసం బ్రతుకుతున్నాను నీ కోసం...."
   
    "నా కోసం..." అంటూ సుజాత కిలకిల నవ్వింది. "నేను నటిని నాకు పేరు రానంతవరకూ నన్ను పాడుచేయాలని అంతా చూసినవాళ్ళే నన్ను గురించి అంతా నీచమైన అభిప్రాయం కలిగి వున్నవాళ్ళే నా ప్రస్తుత పరిస్థితి శాశ్వతంకాదు. అసలీ ఆరాధనలో కూడా స్వార్ధం వుంది తెలుసా? నేను అనాఘ్రాత పుష్పంలా వుండడం ఎవరికీ ఇష్టంలేదు. ఎలాగో నన్ను పాపపంకిలంలోకి లాగినప్పుడు నేను ఒట్టి అసహ్యపు ముద్దను, మాలిన్యపు రాశిని అయిపోతాను. నన్ను చూసి ప్రజలు ఉమ్మేస్తారు. ఈ స్త్రీని ఒకప్పుడు ప్రేమించినందుకు నువ్వు సిగ్గుతో కుచించుకుపోతావు. అప్పుడూ భరించలేవు ఆవేదనని. నేను నటిని. నా మనస్సు చంచలము. నా మనస్సు ఎప్పుడు ఎట్లా మళ్ళుతుందో చెప్పలేను. మామూలుగా తన దారిన యింట్లో కూర్చున్న స్త్రీని బయటకు యీడ్చి తమ జీవితాల్లోకి లాక్కోవాలని ప్రయత్నిస్తారు ప్రజలు. ఇహ నాలాంటిదాని అనుభవాలకు హద్దేముంది? అప్పుడు నీ పశ్చాత్తాపం చూసి నేను భరించలేను. ఒద్దు. ఒద్దు ప్రభాకరం వెళ్ళిపో."
       
    ప్రభాకరం దీనంగా నిలబడ్డాడు. ఓ నిముషం మౌనంగా ఊరుకుని "నీ జీవితంలో ప్రేమకే అవకాశం లేదా?" అన్నాడు బాధగా. సుజాత నిట్టూర్చింది. "చెప్పలేను. నేను యింటికి పోయేసరికి యేం జరుగుతుందో నాకు తెలీదు. ఏ అమానుష శక్తి వచ్చి నన్ను ఎక్కడకు ఈడ్చుకుపోతుందో? అసలు ప్రేమించినవాళ్ళని మరచిపోవటంలో ఓ ఆనందం వుంది. అది అనుభవించడానికి ప్రయత్నించు ప్రభాకరం."
   
    "నేను ఇవాళనుంచీ నాటకాల్లో వేయటం మానేస్తున్నాను సుజాతా. నిన్నింత దగ్గరగా చూస్తూ, దూరంగా ఉండలేను" అన్నాడు ప్రభాకరం.
       
    "మంచిది" అంది సుజాత.
   
    ప్రభాకరం ఒక్కక్షణం మెదలకుండా నిల్చుని మెల్లిగా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. సుజాత స్తబ్దుగా చూస్తూ ఊరుకుంది. తను తప్పు చేస్తున్నానా అనుకుంది. ఇంతలో అద్దంలో ఆమె ప్రతిరూపం గోచరించింది. ఆ సౌందర్యం...ఆ కళ్ళు, ఆ భావాలు...తృటిలో ఆమె జరిగిందంతా మరిచిపోయింది. గిరుక్కున వెనుదిరిగి తలుపులు వేద్దామని గుమ్మందగ్గరకు వచ్చింది. గుమ్మం అవతల జానకిరాం నిలబడి వున్నాడు.
   
    "ప్రభాకరం ఏం మాట్లాడాడు?" అన్నాడు జానకిరాం లోపలకు వచ్చి.
   
    సుజాత కొంచెంగా నవ్వి "ప్రేమ సంభాషణ" అన్నది.
   
    జానకిరాం ఓ అడుగు ముందుకువేసి "సుజాత! నువ్వతన్ని ప్రేమిస్తున్నావా?" అనడిగాడు.
   
    "ప్రేమని చంపుతున్నాను."       
   
    "ఒకప్పుడు ప్రేమించావా?"
   
    సుజాత తల ఊపి "అనుకుంటాను" అన్నది.
   
    "నీ ప్రేమను చంపుకొమ్మని ఎవరు చెప్పారు?"

 Previous Page Next Page