"లేదు" కూల్ గా జవాబిచ్చాడు అతను.
"వాడు దొరకలేదా?"
"వాడేమన్నా దాక్కున్నాడా దొరక్కపోవటానికి?"
"మరి?"
"వాడు నా ఎదుట పడ్డాడు. రాజాలా తల ఎత్తుకొని ఫోజు కొడుతూ నన్ను చూశాడు..."
"మరెందుకు అరెస్ట్ చేయలేదు?"
"వాడు కొండంత అండతో చాటంత అభయహస్తం కింద నిర్భయంగా వున్నాడు."
"అంటే?"
"ఠాకూర్ ఏడుతలల నాగేంద్రుడు అయితే ఆ పడగల నీడన గోపన్న నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాడు."
"అంటే మీరు ఆ ఠాకూర్ గాడి విషపుతలకాయలను చూసిగోపన్నని అరెస్ట్ చేయటానికి జంకారన్నమాట."
అలాగని కాదు..."
"మరి ఠాకూర్ గాడు మంచం వాల్చి కంచం వడిలో పెట్టాడా?" వ్యంగ్యంగా అడిగాడు బన్సీలాల్.
గోపన్నని అరెస్ట్ చేసి ఆ శుభవార్త వినిపిస్తాడేమోనని కొండంత ఆశతో ఇన్ స్పెక్టర్ నున్చిఉ అందే ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో అతను ఫోను చేసి చావు కబురు చల్లగ వినిపిస్తుంటే ఎవరికైనా మండుతుంది. అలాంటిది బన్సీలాల్ లాంటి వాడికి ఎలా వుంటుంది. నూట యిరవై డిగ్రీల ఎండలో దిగంబరంగా నిలబెట్టి వళ్ళంతా పండుమిరపకాయల ఖారం రాసి సలసల కాగేనీళ్ళు అదే పనిగా పోస్తున్నట్లు అనిపించింది. ఆ మంటలో ఇన్ స్పెక్టర్ శీలాన్ని పూర్తిగా శంకించటం కూడా జరిగింది. అందుకే వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది.
"ఠాకూర్ మంచం వాల్చి కంచం పెట్టలేదుగాని మర్యాదగా మాట్లాడాడు.... వాళ్ళ ప్లాన్ చూసి నా బుర్ర తిరిగిపోయింది" అతను మామూలుగా చెప్పాడు.
"ఫోన్ లో విషయం అర్ధం కాదు మీరు మా ఇంటికి అర్జంట్ గా బయలు దేరి రండి."
"ఇప్పుడా?"
"ఇప్పుడా అంటే అర్ధం?"
"డ్యూటీ మీద వున్నాకదా అని..."
"ఈ వూళ్ళో నిన్నెవరయ్యా అడిగేది? నీవు డ్యూటీ మీద వున్నా అడగరు. డ్యూటీలో వుండి గుర్రమెక్కినా అదేమని అడిగేనాధుడు లేడు....ఓసారి వచ్చివెళితే నాకు తృప్తిగా వుంటుంది ఫోన్ లో మాటలు వేరు ముఖాముఖి మాట్లాడుకోవటం వేరు."
"తప్పదంటారా?"
"తప్పదు రావాల్సిందే...వేయికన్నులతో ఎదురు చూస్తూ వుంటాను. ఎంత తొందరగా వస్తే అంత సంతోషం" నవ్వుతూ అన్నాడు బన్సీలాల్.
"తప్పనిసారి అయినపుడు తప్పుతుందా మరి? ఫైవ్ మినిట్స్ లో బయలుదేరుతున్నాను" అంటూ ఇన్ స్పెక్టర్ ఫోన్ పెట్టేవాడు.
బన్సీలాల్ క్రెడిల్ మీద రిసీవర్ పెట్టి ఆ గది విడిచి మేడ మీద మరో రూమ్ లోకి వచ్చి అక్కడవున్న యీజీ చెయిర్లో మేనువాల్చి ఆలోచనా సముద్రంలోకి నెమ్మదిగా జారుకున్నాడు.
"ఈ ఇన్ స్పెక్టర్ గాడు గొప్పదొంగ పెద్ద ఆశబోతు. డ్యూటీ సక్రమంగా చేయటం తప్పించి మిగతాఅన్ని పనులు చేస్తాడు. ఠాకూర్ గడు నన్ను దెబ్బతీసి వాడి బలం పుంజుకోవాలని చూస్తున్నాడు. ఈసమయంలో ఇన్ స్పెక్టర్ లాంటి వాళ్ళని దువ్వితే నా బలం పడిపోతుంది. యిది గ్రహించి ఠాకూర్ ఇన్ స్పెక్టర్ కననరావుని విస్కీతో తలంటి స్నానం చేయించి అందమైన సుందరి శిరోజాలతో దూపం వేసి వుంటాడు. ఆ దెబ్బతో అయిసయి వుంటాడు వీడు.
వీడి ఆటలు నా ముందా! ఇలాంటి సమయంలో కోపగించుకొని ప్రయోజనం లేదు కనుక....నేను కూడా బంగారు పళ్ళ దువ్వెనతో వేడిని నిలువునా దువ్వి వెధవముఖానికి ఫారెన్ పౌడర్ కొట్టి నీవే సర్వం నాయనా!.... నీటముంచినా పాలముంచినా నీకే చెల్లింది అంటూ ఓ ప్రక్కస్తోత్రం చదువుతూ వెనుకనుంచి మాడుపగిలేలా దెబ్బ తీయాలి. వీడివలన తనకి మిగిలింది అవమానాలు బోలెడు ఖర్చు...కనుక సాధ్యమైనంత త్వరలో వీడి రోగం కుదర్చకపోతే తనబతుకు వ్యర్ధం కాబట్టి__
బన్సీలాల్ యిల ఆలోచిస్తుండగానే అతను వూడిపడ్డాడు.
నవ్వుతూ ఆహ్వానించాడు బన్సీలాల్.
"మీ మాట కాదనలేక వచ్చాను. అందమైన ఆడపిల్లనయినా బాగుండేది. తళుకు బెళుకులు చూపి మీరు నా మాట వినేలా చేసుకునే వాడ్ని" జోక్ గా మాట్లాడుతూ అతను వచ్చి సోఫాలో ఆశీనుడు అయ్యాడు.
అయిదు నిమిషాల తర్వాత...
అతను విషయంలోకి వచ్చాడు.
"ఠాకూర్ దగ్గరకు వెళ్ళాను... అతను మర్యాదగా ఆహ్వానించాడు. గోపన్న అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు... చేతికి మాత్రం కట్టు వుంది. అతనికి నేనెందుకు వచ్చానో చెప్పకుండా గోపన్న గురించి అడిగాను. గోపన్న చిన్నప్పటినుంచీ తనకి బాగా తెలుసుట. తన దగ్గర నౌకరుట.... మధ్య మధ్య చేస్తుంటాడుట. మధ్య మధ్య మానెస్తుంతాడుట. గోపన్న నిజాయితీగల మంచి వ్యక్తిట. తనని ఎన్నోసార్లు ఆపదలోంచి రక్షించాడుట. అందువల్ల అతను పనిచేసినా చేయకపోయినా తనకి యిష్టమేట.