"అమ్మా!" కంచంలో భోజనం వడ్డిస్తోన్న తల్లిని పిలిచాడతను.
"ఊ!" ప్రశ్నార్ధకంగా అతనివేపు చూసిందామె.
"నువ్వు చెప్పింది నిజమేనమ్మా! నేను తప్పు చేశాను! ఆ తప్పుని సరిదిద్దుకుంటాను!" ఆమె కళ్ళలో ఆనందంనిండిపోయింది. గడపదగ్గర నిలబడి ఆ మాట విన్న తండ్రిపైపంచతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
* * * * *
"ఇక్కడ కూర్చుందామా?" అడిగాడు చంద్రకాంత్. తలూపిందామె. ఇద్దరూ పార్కులోని సిమెంట్ బెంచీమీద కూర్చున్నారు.
"బావ తన స్నేహితులను తీసుకొస్తానన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు వసుంధరలో కూడా కొంచెం మార్పు వచ్చింది. తనూ బావతోపాటు వస్తానని చెప్పింది......"
ఆమె ఏమీ మాట్లాడలేదు. ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయామెని.
"హేమా! రేపే మన వివాహం మరి ఇవాళ కూడా నీకా ఉత్సాహం, ఆనందం కలగటంలేదా?" చిరునవ్వుతో అడిగాడతను.
ఆమె ఆలోచనల్లోనుంచి బయటపడింది.
అతనిని చూస్తే జాలివేసిందామెకి. ఎంత ప్రయత్నించినా తనకెందుకో ఉత్సాహం కలగటంలేదు. మనసుకి ఆనందంలేదు ఎప్పుడూ ఏవేవో ఆలోచనలు!
తనకోసం, ప్రేమాభిమానాలతో అతను చేస్తున్న సాహసం తననతనికి బందీగా చేసింది జీవితాంతం అతనికి కృతజ్ఞురాలిగా ఉండిపోతుంది తను.
"హేమా!" తిరిగి పిలిచాడతను.
"ఊ!"
"ఒకవేళ నేను కూడా శ్రీనివాసరావులా మారిపోతానేమోనని అనుమానంగా ఉందా?" ఆమె నవ్వేసింది.
"అదేమీలేదు! అయినా శ్రీనివాసరావ్ సాహచర్యంవల్ల నాకిప్పుడెంత తెగింపు ఏర్పడిందో తెలుసా? అలాంటి శ్రీనివాసరావుల్ని వందమంది నయినా ఎదుర్కోగలను.....
"మరింకేమిటీ ఆలోచన?"
"ఏమో! నాకే తెలీదు! ఇంకనీకెలా చెప్పేది?"
చంద్రకాంత్ నవ్వేశాడు.
"అలా అర్ధం లేకుండా ఆలోచించడం ఆరోగ్యానికి మంచిదికాదు!"
"సరే! మానేస్తాను! నువ్వేమయినా కబుర్లు చెప్పు!"
"పెళ్ళవగానే నా కార్యక్రమం ఏమిటో తెలుసా? ఉద్యోగం కోసం వెతకడం! ఏదయినా ఉద్యోగం సంపాదించుకుని మన రెక్కల మీద మనం నిలబడేవరకూ నాకు ఇబ్బందిగానే ఉంటుంది. మా ఫ్రెండ్ రెడ్డి అనే అతను వాళ్ళ ఇండస్ట్రీలోనే టెంపరరీగా ఏదోక ఉద్యోగం ఇస్తానన్నాడనుకో."
చాలాసేపు ఏవేవో విషయాలు చెప్తూనే ఉన్నాడతను.
"ఇంకవెళ్ళిపోదామా" అందామె టైం చూసుకుంటూ.
"సరే నేను రేపు ఉదయం మా బావ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని హోటల్ కి తీసుకెళ్ళి ఆ తరువాత నీ దగ్గర కొస్తాను. అప్పుడు అందరం కలిసి రిజిష్ట్రాఫీసుకివెళదాం...."
ఇద్దరూ పార్కునుంచి బయటకు నడిచారు.
ఆమె రిక్షాలో ఇంటికి బయల్దేరింది.
ఇంటిలో అడుగుపెట్టేసరికి ఎదురుగ్గా కనిపించిన దృశ్యం ఆమెను ఉక్కిరిబిక్కిరిచేసింది. తనపాప వరండాలో కూర్చుని ఆడుకుంటోంది. ఆమె ప్రక్కనే సోఫాలో శ్రీనివాసరావ్ కూర్చుని ఉన్నాడు. కంపిస్తోన్న అడుగులతో అతన్ని దాటి ఇంటిలోకి నడువబోయిందామె.
"హేమా" నెమ్మదిగా పిలిచాడతను లేచి నిలబడుతూ ఆమె అక్కడే నిలబడి వెనక్కు తిరిగి అతనివేపు చూసింది.
"దయచేసి నీతో అయిదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వు హేమా! రిక్వెస్ట్ చేస్తున్నాను....." అతని గొంతు వణికింది.
ఆ మాట అంటూంటే లోపల్నుంచి హేమ తండ్రి బయటికొచ్చాడు.
"హేమ నీతో మాట్లాడదనీ, బయటకు పొమ్మనీ చెప్పినా వినిపించుకోకుండా బ్రతిమాలుతూ కూర్చున్నాడు....." శ్రీనివాసరావ్ వంక అయిష్టంగా చూస్తూ అన్నాడతను. తామందరి వంకా కలవరంతో చూస్తున్న పాపను చూసేసరికి హేమహృదయం కెలికినట్లయింది.
"ఏమిటి నువ్వు మాట్లాడదల్చుకుంది?" కటువుగా అడిగిందామె.
"నేను నిన్ను క్షమార్పణకోరడానికి వచ్చాను హేమా!" తలవంచుకుని అన్నాడతను.
"నువ్వెవరివో నేనెవ్వరినో ఇప్పుడు క్షమార్పణ లెందుకు?" వ్యంగ్యంగా అందామె.
"నా మనశ్శాంతి కోసం హేమా! జరిగిందంతా తల్చుకుంటే చిత్రవదగా వుంది. అసలు నేనెందుకంత అమానుషంగా ప్రవర్తించానో. నిన్నెందుకు అలా హింసించానో అంతా ఆగమ్యంగా వుంది. సుధీర్ వేసిన ప్రశ్న నా గుండెల్ని తొలిచివేస్తోంది నిజమే! ఏరి కోరి నిన్ను వివాహం చేసుకుంది ఎందుకు? ఇలా పగబట్టినట్లు దూషించి అవమానపరచడానికా? నిన్ను దూరంచేసుకోడానికా? నా మూర్ఖత్వం కాకపోతే భార్య భర్తల్లో ఎక్కువ తక్కువ లేమిటి? ఇద్దరూ బండికి రెండు చక్రాల్లాంటివారు కదూ!"
అతను నెమ్మదిగా, గంభీరంగా మాట్లాడుతుంటే విస్తుపోయి వినసాగిందామె.
"నేనిప్పుడు అదివరకటి మనిషికాదు హేమా! పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న మనిషిని! చేసిన పాపానికి జీవితమంతా నిన్ను నా గుండెల్లో ఉంచుకుని పూజిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మాటలు కేవలం నీ మనసు మార్చాలనీ, మనిద్దరం ఒకటవాలనీ చెప్పటం లేదు. నిజానికి అలాంటికోరిక కోరే అర్హత కూడా నాకు లేదు. అయినా గాని ఏమూలో మినుకు మిణుకు మంటున్న ఆశనన్ను నీ దగ్గరకొచ్చేలాచేసింది"
హేమకు అతని మాటలు నమ్మబుద్ది కావటంలేదు. అతనిలో ఇంత మార్పా? అసలతని ధోరణేమారిపోయింది. ఏదో బలమయినసంఘటన జరగబట్టే అతనిలో ఈ పరివర్తన కలిగింది. బహుశా జరిగిన దానికి అతను నిజంగానే పశ్చాత్తాపపడుతూండిఉండవచ్చు.
అతనిలోని 'చెడు' శాశ్వతంగా తొలిగిపోయిఉండవచ్చు.
అయినాగాని ఇప్పుడు తనెం చేయగలదుగనక? తను మైనపుబొమ్మకాదు అతను ఎలా కావాలంటే అలా మలచడానికి అతనిని శాశ్వతంగా తనమనసు నుంచి తొలచివేసింది తను. అతని మీద తనకున్న అభిప్రాయాలు అన్నీ వ్యతిరేక అభిప్రాయాలే అతనిని తలుచుకుంటే తన హృదయం ప్రతీకార వాంఛతో రగులుతుంది గాని ఎలాంటి అభిమానం ఆప్యాయతకలుగవు.
"హేమా! మాట్లాడవే? నామీద నమ్మకం కలగటంలేదా?" దీనంగా అడిగాడతను. హేమకి ఏం మాట్లాడాలో తన మనసులోని ఆలోచనలు అతని ముందెలా ఉంచాలో అర్ధం కావటంలేదు. బహుశా తనూ చంద్రకాంత్ ఆ మర్నాడే వివాహం చేసుకోబోతున్నవిషయం అతనికి తెలిసుండదు.
"హేమా! ఈ మౌనం నేను భరించలేను! దయచేసి నీ అభిప్రాయమేమిటో చెప్పు!" ఆదుర్దాతో అడిగాడతను.
హేమకు జవాబివ్వక తప్పలేదు. "మనం మళ్ళీ ఒకటవటం అసంభవం! నా మనసేనాడో విరిగిపోయింది. ఒకవేళ నీలో పరివర్తన నిజమైనదని నమ్మి మనం ఒకటయినా అది నాటకం అవుతుందిగాని సంసారంకాదు."
"కానీ హేమా...." ఏదో మాట్లాడబోయాడతను. కానీ హేమ అతనిమాట వినకుండానే తను మాట్లాడేసింది. "అదీగాక ఇంకో విషయం నువ్వు తెలుసుకోవడంమంచిది. ఎందుకంటే ఆనాడు "భర్తను వదిలిన ఆడదాని గతి అధోగతే" అని హేళన చేశావ్ గదా! నేనూ చంద్రకాంత్ రేపు రిజిస్టారాఫీసులో వివాహం చేసుకుంటున్నాము."
శ్రీనివాసరావ్ నివ్వెరపోయాడు. అతనిమొఖం పాలిపోయింది. ఏదో అన్నట్లుగా గొణిగాడు. "అతను నన్నుమగాడి అవసరాలు తీర్చేమరమనిషిలా కాకుండా తనతోటి మనిషిగా గౌరవిస్తాడన్న నమ్మకంనాకుంది!" సగర్వంగా అందామె.
శ్రీనివాసరావ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయేడు. తనలాంటివాడికి జరగాల్సిన శాస్తే ఇది. చేతులారా గాజు బొమ్మనుపగలగొట్టి మళ్ళీ ఆ ముక్కలతో బొమ్మను చేయాలనుకోవడం తన అవివేకం తనుచేసిన అక్రమాలను హేమే కాదు మరే స్త్రీ కూడా తనను క్షమించదు.
"ఓ.కే.హేమా! నాకిదిసరయిన శిక్షే! ఇందుకు నేను నిన్ను నిందించను! చేతులు కాలాక ఆకులు పట్టుకోడానికి ప్రయత్నిస్తే ఫలితమేముంటుందీ? ఇదిగో! పాపను నీకివ్వడానికి తీసుకువచ్చాను. కనీసం తల్లినీ, బిడ్డనీ విడదీసిన పాపాన్నయినా పోగొట్టుకోమని అమ్మచెప్పింది. వస్తాను....
"అన్నట్లు రేపు నీ మారేజ్ కదూ! విష్ యూ హాపీ మారీడ్ లైఫ్!" అనేసి వడివడిగా బయటకు నడిచి చీకట్లో కలిసిపోయాడు.
హేమ అక్కడే ప్రతిమలా నిలబడి అతను వెళ్ళినవేపు చూస్తూండిపోయింది. పాప నెమ్మదిగా పాకుతూ ఆమె దగ్గరకొచ్చి చీర అంచుపట్టుకుని లాగింది. చటుక్కున తేరుకుని పాపను ఎత్తుకొని గాఢంగా తన గుండెలకు హత్తుకుందామె.
ఆమె కళ్ళ నిండుగా చేరిన నీరు రెండు కన్నీటిబొట్లుగా జారిపోయింది.
----: సమాప్తం :----