Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 43


    "ఉన్నాదానివల్ల సంసారం నాశనంచేసుకోవాల్సిన అవసరంలేదంటాను! కొంతవరకూ నువ్వూ మరికొంత ఆమె రాజీకొచ్చినట్లయితే విడిపోవాల్సిన అవసరం ఎందుకొస్తుంది? నువ్వు ఏరికోరి హేమనుచేసుకున్నది ఎందుకు? ఆమెనన్ని అవస్థలు పెట్టి విడాకులు తీసుకోడానికా? కాదే! జీవితాంతం ఆమెతో ఆనందంగా గడపాలని! అవునా? మరి ఆ ప్రేమ ఆ కోరిక ఆమె మీద చేయిచేసుకున్నప్పుడు ఏమయిపోయేయి? ఆమెనినిర్దయగా ఇంటినుంచి బయటకు గెంటినప్పుడు అవేమీ ఆలోచించలేదా?"
    శ్రీనివాసరావ్ ఉక్కిరిబిక్కిరయిపోయాడు! అతనికేం సమాధానంచెప్పాలో తెలీటంలేదు. ఇదే మరొకరయినట్లయితే తనను ఇన్ని మాటలంటున్నందుకు తగిన బుద్దిచెప్పి వుండేవాడు కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చుండిపోయేరు.
    సర్వర్ బిల్లు తీసుకొచ్చివారి ముందుంచేడు. అది చెల్లించిబయటకు నడిచారిద్దరూ.
    "సారీ శ్రీనూ! నిన్ను నొప్పించాలని నేనీ మాటలు మాట్లాడటం లేదు. నామనసులో వున్నదున్నట్లు అడిగేను! ......" కొంతదూరంనడిచాక అన్నాడు సుధీర్.
    "దట్సాల్ రైట్!" అనుకోకుండా జవాబిచ్చేడు శ్రీనివాసరావ్.
    "నేనికవెళ్తాను! బస్ కి టైమవుతోంది!"
    "అప్పుడేనా!"
    "అవును వచ్చినపని అయిపోయింది!"
    శ్రీనివాసరావ్ కి అతని మాటలు అర్ధం కావడం లేదు. సుధీర్ బస్ స్టాండ్ వేపు వడివడిగా నడిచేడు.
    ఇప్పటికి గాని తనకు మనశ్శాంతిచిక్కలేదు. శ్రీనివాసరావ్ చేసిన తప్పుల్ని ఎత్తిచూపాలనీ, జరిగినదానికి పూర్తి బాధ్యత అతనిదే అని అతనికి తెలియజెప్పాలనీవారు విడాకులు తీసుకున్నరోజునుంచే ఎదుర్చూస్తూవచ్చాడు తను. తన కోరిక ఇన్నాళ్ళకు నెరవేరింది. బస్ స్టాండ్ లో హైద్రాబాద్ బస్ సిద్దంగా వుంది ఎక్కి కూర్చున్నాడతను.
    సుధీర్ వెళ్ళిపోయాక శ్రీనివాసరావ్ పరిస్థితి మరింత దారుణమయిపోయింది. సుధీర్ తన మీద వేసిన నిందల్లోనిజం వుందన్నవిషయం అతని మనశ్శాంతిని పూర్తిగా కరువు చేసింది.
    అవును! అతను హేమగురించి తననుముందే హెచ్చరించాడు. ఆ హెచ్చరికను లక్షపెట్టకుండా వ్యవహరించి ఈ స్థితి కొచ్చాడు. తనకున్న అభిప్రాయాలకూ, ఇష్టాలకూ అనుగుణంగా మసిలే యువతులనెవరయినా ఎన్నుకుని వివాహంచేసుకున్నట్లయితే ఏ సమస్యా తెలెత్తేదికాదు. హేమ అన్నివిధాల తనకు వ్యతిరేకస్వభావురాలని తెలిసికూడా ఆమెకు తన అంతరంగం తెలీకుండా వివాహంచేసుకుని ఆ తరువాత ఆమెను హింసించడం తను చేసిన పాపం కదూ? తన గురించి ముందే తెలిపివున్నట్లయితే హేమ అభిప్రాయాలు ఏకీభవించే వ్యక్తినే చేసుకుని సుఖంగా వుండేది!
    ఇల్లుచేరుకొని చాలాసేపు ఖిన్నుడయి కూర్చుండిపోయేడతను. బస్ ఉయ్యూరు చేరుకునేసరికి సాయంత్రం నాలుగయిపోయింది. గడప దగ్గర ఒంటరిగా ఆడుకుంటోన్న పాపను చూచేసరికి ఒక్కసారిగా వాత్సల్యం పెల్లుబికిందతనికి. సూట్ కేస్ అక్కడే వదిలి అమాంతం పాపను రెండుచేతుల్తోనూ ఎత్తుకుని గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. అతన్ని చూచి కెవ్వుమంటూ ఏడుపు మొదలు పెట్టింది పాప. ఆ ఏడుపుకి అతని తల్లీ, తండ్రీ, తమ్ముడూ అంతా పరుగుతో వచ్చారక్కడికి.
    శ్రీనివాసరావ్ ని చూడగానే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎవరూ అతనిని పలుకరించలేదు. వారి ప్రవర్తన ఆశ్చర్యం కలిగించిందతనికి. తను ఇంటికి వస్తేచాలు సంబరపడిపోయే తల్లీ, తనను ఆప్యాయంగా పలుకరించి కుశల ప్రశ్నలు వేసేతండ్రీ తనచదువు గురించి కబుర్లు చెప్పే తమ్ముడూ అందరూ అతనితో తమకేమీ ప్రమేయం లేనట్లే మౌనంగా ఎవరిదారినవాళ్ళు అక్కడ నుంచిలోపలకు వెళ్ళిపోయారు. ఏడుస్తోన్న పాపాయిని ఎత్తుకుని తల్లి వెంబడేనడిచాడు శ్రీనివాసరావ్.
    "పాపాయిని తీసుకుంటావా అమ్మా?"
    ఆమె మౌనంగా పాపాయిని అందుకుంది. పాపాయి ఠక్కున ఏడుపు ఆపేసింది.
    "అలా ఉన్నావేం అమ్మా! వంట్లోబాగుందా?" అడిగాడతను అనుమానంగా.
    "ఎందుకు బాగుండదు? నాలాంటివాళ్ళను అంతత్వరగా కరుణించడు దేముడు" కోపంగా అందామె.
    "ఎందుకమ్మా అలా అంటావ్?" బాధగా అన్నాడు శ్రీనివాసరావ్.
    "అవున్రా! లేకపోతే ఈ వయసులో మాకీ మనస్తాపం ఏమిటి? నువ్విలా ఇల్లూ, సంసారంలేనివాడివవడమేమిటి? హేమను అన్యాయంగాగెంటింది కాక ఈ పసికందుని తల్లిలేనిదాన్ని చేశావ్ ఈ పాపం చూళ్ళేకపోతున్నాము మేము....."
    "అమ్మా" కోపంగా అన్నాడతను.
    "హేమను అన్యాయంగా గెంటివేశానా? ఎందుకమ్మా అలా మాట్లాడుతావ్? హేమకున్న పొగరు, దాని కొవ్వెక్కిన చేష్టలు మర్చిపోయావా?"
    "మరి ఆ పిల్లే కావాలని పట్టుపట్టిపెళ్ళి చేసుకున్నప్పుడు ఈ జ్ఞానం ఎక్కడికిపోయింది?" వెనకే వచ్చి నిలబడ్డ తండ్రిఅడిగేసరికి అతనికేం సమాధానంచెప్పాలో తెలీలేదు. తన తల్లిదండ్రులిద్దరూ తననే తప్పుపట్టడం అతనికి చిరాకుకలిగిస్తోంది.
    "నువ్వు చదువుకున్నవాడివనీ, మనకుటుంబాల్లో నీలాచదువుకున్నవారెవ్వరూ లేరని గర్వపడ్డాము. నువ్వు ఎంతో విజ్ఞానవంతుడవనీ మాకు తెలీని ఎన్నో విషయాలు నీకు తెలుసనీ భావించి నువ్వు చెప్పిందే వేదవాక్యంగా గౌరవించాము.
    కానీ ఇప్పుడు తెలుస్తోంది. నీలాంటి చదువుకున్న మూర్ఖుడికన్నా మాలాంటిచదువు సంధ్యలులేనివారే నయం! వివాహానికి ముందు మీ నాన్నగైర్ని నేను చూళ్ళేదు. నన్ను మీ నాన్నగారు చూళ్ళేదు. అయినా ఇంతవరకూ ఒకరినొకరు పల్లెత్తుమాట అనుకున్న పాపాన పోలేదు. ఇది ఆడదాని పని అని ఆయనా, ఇది మొగాడి పని అని నేనూ ఏనాడూ ఆలోచించలేదు. వాదులాడుకోలేదు. నేనుపొలంలో పని చేసిన రోజులున్నాయ్. మీ నాన్న ఇల్లూ పశువులు కనిపెట్టుకున్న రోజులు వున్నాయ్...."
    "కానీ ఈ గొడవలన్నీ హేమమూలానే వచ్చాయి...." తల్లి మాటలకు కోపంగా అడ్డుపడ్డాడతను.
    "నీ ప్రేరణ లేకుండా కాదు. ఇద్దరి మధ్యా 'ఎక్కువ' 'తక్కువ' అన్న తేడాలు నీకుండబట్టే హేమ అలా తయారయింది. నేనూ మీ నాన్న ఎంతగా నచ్చజెప్పినా నీకు అర్ధం కాలేదు. మనసులువిరగడం తేలికే మళ్ళి అతకడం కష్టం అంటే హేళనగా నవ్వావ్....." ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను! ఈ పాపను తీసుకెళ్ళి తల్లికిచ్చెయ్! తల్లీ బిడ్డలను విడదీసిన పాపం నాకొద్దు. లేదా నువ్వే తీసుకెళ్ళి ఏమయినా చేసుకో నా దగ్గరమాత్రం ఉంచవద్దు."
    శ్రీనివాసరావ్ నిశ్చేష్టుడయిపోయాడు. అక్కడినుంచి నెమ్మదిగా బయట గదిలోకి నడిచి కూర్చుండిపోయాడు నీరసంగా. అటు సుధీర్, ఇటు తన సొంత తల్లిదండ్రులూ అందరూ తననే దోషిగా నిలబెట్టడం తనకు మతిపోగొడుతుంది. లేచి బయటకొచ్చి నిలబడ్డాడతను. ఎండ పూర్తిగా తగ్గిపోయి సంధ్య అలుముకుంది.
    దూరంగా మెయిన్ రోడ్ మీద బస్ లు, లారీల శబ్దాలుసన్నగా వినబడుతున్నాయి. ఆ శబ్దాలకు దూరంగా పొలంగట్లవేపు నడిచాడతను. పంట కాలువ ఒడ్డులను ఒరుసుకుంటూ ప్రవహిస్తోంది. తమతోటలోకి నడిచికలువ ఒడ్డునపచ్చని పక్క పరచినట్లున్నగడ్డిమీద కూర్చున్నాడతను.
    చిన్నప్పుడు ప్రతిరోజూ సాయంత్రం ఇక్కడికే వచ్చేవాడు అతను. కాలువలో కాగితపు పడవలువదులుతూ అతి వేగంగా నీటితో పాటు ప్రయాణిస్తోంటే ఎంతో ఆనందించేవాడు. ఆనాటి ఆనందం, ఆనాటి ఉత్సాహం, ఆనాటి సరదాలు అవన్నీ ఎటు పోయినయ్?
    హేమతో వివాహం అసలు తనను కాకుండా చేసింది. ఆమెతో తగవులు నిర్లక్ష్యం తననుమరింత ఉసిగొలిపేవి దాంతో లోలోపల తన అంతరాత్మకు తనుచేస్తుంది తప్పనితెలిసినా ఆమెని మరింత అవమానించడం, హింసించడం చేసేవాడు. అందువల్ల ఇద్దరి మధ్యా దూరం పెరిగిపోవడం, చిన్నచిన్న వివాదాలే చిలికీచిలికి గాలివాన అవడం జరిగింది. ఆ తరువాత తననేదో పైశాచిక శక్తి అవహించేసింది. ఆమెను తన భార్యాలాకాక బడ్డ విరోధిలా ట్రీట్ చేశాడు. తనుగానీ, హేమగానీ ఇద్దరిలో ఎవరు ఓర్పు వహించినా పరిస్థితి ఇంతదూరంవచ్చేది కాదు.
    తన మొండితనం అహంకారమే తన సంసారాన్ని సగం నాశనంచేసినయ్. హేమపోతే నాగమణి తన  భార్య అవుతుందనీ, ఆమె కాకపోతే మరెవరయినా సరే తనను చేసుకోడానికి ఆనందంగా ముందుకొస్తారనీధీమా పడ్డాడు. కానీ నాగమణి తిరస్కృతి తన ఆలోచనలకు గొడ్డలిపెట్టు అయింది. చంద్రం, నాగమణిల ఎదుట తను పొందిన అవమానం తనమీద తనకే అసహ్యం కలుగజేసింది. తను ఎన్నుకున్న మార్గంసరయినది కాదన్న అనుమానం కలగజేసింది.
    మనసంతా అల్లకల్లోలంగా తయారయిందతనికి, అందరూ ఒకవేపు తానొక్కడూ మరోవేపూ నిలబడివున్నట్లు అనిపించసాగింది. క్రమేపీ చీకట్లు అలుముకుపోసాగినయ్. నిజానికి స్త్రీ పురుషుల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఆలోచించడమే హాస్యాస్పదం. తనమనసులో "మగాడు చెప్పినట్లు ఆడది వినాలి" అన్నభావం ఎలా నాటుకుపోయిందో తెలీదు. బహుశా తన చుట్టూవున్న మనుషులు, వాళ్ళు కుటుంబాల్లోని వాతావరణం తనుచదివిన సాహిత్యం, తను చూసిన సినిమాలు తనను ప్రభావితంగావించి ఉండవచ్చు.
    బలంగా నాటుకున్న ఈ భావాలకు హేమ ప్రరవ్తన హఠాత్తుగా పెద్ద విఘాతం కలిగించింది. తను తట్టుకోలేకపోయాడు. రాక్షసుడిగా మారిపోయాడు. ఆమెలో మొండితనం పెరుగుతున్నకొద్దీ తనలో మరింత క్రూరత్వం చోటు చేసుకుంది.
    "అన్నయ్యా!" లాంతరు పట్టుకుని ఎదురుగ్గా నిలబడ్డాడు తమ్ముడు. ఉలిక్కిపడిలేచి నిలబడ్డాడు శ్రీనివాసరావ్.
    "ఏమిటి?"
    "చీకటిపడిపోయింది అమ్మ పంపించింది నన్ను....." చుట్టూ నల్లగా చీకటిఅలుముకుపోవడం తను గమనించనేలేదు. టైము చూసుకున్నాడతను. తొమ్మిదయిపోతోంది.
    "ఇంటికివెళదాం పదన్నయ్యా!"
    "పద!"
    ఇద్దరూ లాంతరు వెలుగులో ముందుకి నడిచేరు. తల్లీ తండ్రీ బయటే నుంచుని అతనికోసం ఆత్రుతగా ఎదుర్చూస్తూ కనిపించారు.
    "ఇంతపొద్దుపోయేవరకూ ఆ చీకట్లో వుండిపోయావా? పురుగూ, పుట్రా వుండేచోటు ఆదుర్దాగా అందామె బట్టలు మార్చుకొని భోజనానికి కూర్చున్నాడతను.

 Previous Page Next Page