ఉపసంహారం
సూర్యుడు పడమటి కొండల్లోకి జారిపోతున్నాడు.
నీడలు పొడుగ్గా పాకుతున్నాయి.
బాలూ మేడమీద చూస్తున్నాడు. ఎదురిల్లు నిర్మానుష్యంగా వుంది.
వెనుకే సౌదామిని వచ్చి నిలబడింది.
బాబు క్రింద ఆడుకుంటున్నాడు.
చాలాసేపు మౌనంగా వున్న తరువాత నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సౌదామిని అంది-
"బాగా ప్లాన్ వేశాడు. సిగరెట్ పెట్టెలు పెట్టడం....ఆసెయ్య బురదతో బూట్ల గుర్తులు అద్దటం- అంతకన్నా ముందు- ఏదో గొప్ప సహాయం చేస్తున్నట్టు మృదుల తన నర్సింగ్ హోమ్ కి నన్ను డెలివరీకోసం తీసుకువెళ్ళటం....అన్నిటికన్నా ముఖ్యంగా, నా రక్తాన్ని పరీక్ష చెయ్యాలని అనుకున్నప్పుడు జానకి భర్తకి రక్తం కావల్సినట్టు నటించటం- అంతా చాలా పకడ్బందీగా చేశారు".
అతడు మాట్లాడలేదు. ఆమె 'నీ తప్పేంలేదు. ఆ స్థితిలో ఏ భర్త వున్నా అలాగే చేస్తాడు' అనే భావాన్ని తనలో కలిగించటానికి ఆ విధంగా మాట్లాడుతూ వుందని అతనికి తెలుసు.
మానసికంగా అతడు బాగా క్రుంగిపోయి వున్నాడు.
కోపం, బాధ, ఉక్రోషం, దిగులు- వీటన్నిటికన్నా మనిషికి పెద్ద నరకం- తప్పు చేశానన్న ఫీలింగ్.
"సౌదామినీ- నన్నొక ప్రశ్న అడుగుతావనుకున్నాను" అన్నాడు.
"ఏమిటది?" చిరునవ్వుతో ప్రశ్నించింది.
"నీమీద అనుమానం వచ్చాక. నీకూ ఆంజనేయులకీ ఏదో సంబంధం వున్నదన్న పాడు ఆలోచన నా మనసుని తొలుస్తూ వుంటే.... నేను జానకి వలలో అప్పుడు పడ్డానా - లేక ముందే ఆమెతో రాసలీల కొనసాగించానా అన్న అనుమానం నీకు రాలేదా సౌదామినీ?"
ఆమె వెంటనే జవాబు చెప్పకుండా-నెమ్మదిగా తరువాత అంది-"నేను దాని గురించి ఆలోచించలేదు బాలూ! నువ్వుకూడా ఇక అదంతా ఓ పీడకలగా మర్చిపోవటం మంచిది".
అతడు స్థబ్దుడై చూశాడు.
అనివార్యమైన చీకటి ఆహ్వానిస్తూ సూర్యుడికి దిగులుగా వీడ్కోలు చెపుతోంది. ఈ భూమికీ స్త్రీకీ తేడా ఏముంది! ఆమె జీవితం ఎప్పుడూ మొగవాడి దయాదాక్షిణ్యాలమీదే ఆధారపడి వుంటుందని కాబోలు దేముడు ఆమె గుండెల్లో అంత క్షమాగుణాన్ని దయనీ నింపాడు. తను చేసిన తప్పే తన భార్య చేస్తే - కనీసం చేసిందన్న అనుమానం రాగానే ఆమెని కిరాతకంగా చంపటానికి ప్రయత్నించాడు తను! ఎదురింట్లో ఒక ఆడది నవ్వుతే ఆ ఆహ్వానాన్ని తన గొప్పతనంగా భావించి సరసం సాగించాడు. అదే తన భార్య చేస్తే...
అతడు తల విదిలించాడు.
కొన్ని ఇబ్బందికరమైన ఆలోచన్లు అనలైజేషన్ కి పనికి రావు. వాటి గురించి ఆలోచించకుండా వుండటమే మంచిది. జీవితంలో ఏ రంగంలో ఎంత సాధించిన ఏ మొగవాడైనా, గుణవతి అయిన భార్య అంత గొప్పవాడు కాలేడు. చాలామంది ఆ గొప్పతనాన్ని గుర్తించరు. గుర్తించటానికి MALE-EGO అడ్డు వస్తుంది. దాన్ని స్త్రీ చేతగానితనంగా భావిస్తారు. అలాంటి గుణవతి దొరకటం తన అదృష్టం అని భర్త గుర్తించిన రోజు- ఆ సంసారం కన్నా సుఖప్రదమైనది మరొకటి వుండదు. డబ్బు, కీర్తి, వీటన్నిటికన్నా గొప్ప అదృష్టం - అలాంటి భార్య దొరకటం తను అదృష్టవంతుడు కాబట్టి అలాంటి భార్య దొరికింది. తనతోపాటు దారిద్ర్యాన్ని పంచుకుంది. తనకి నిచ్చెనలా నిలబడింది. తనకి స్ఫూర్తినిచ్చింది. పోయే తన పరువుకి అడ్డంగా నిలబడి బ్లాక్ మెయిలర్ కి ఆభరణాలు అర్పించింది. ఆ విషయం తెలిస్తే తనలో కళాకారుడు ఎక్కడ దెబ్బతింటాడో అని, తనకు తెలియకుండా జాగ్రత్తపడింది. అటువంటి భార్యని తను చంపాలనుకున్నాడు.
అతడు చేయిసాచి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు.
అతడి మనసులో భావాల్ని గుర్తించినట్లుగా ఆమె అభ్యంతరం చెప్పలేదు. ఎవరన్నా చూస్తున్నారేమో అని కూడా వాళ్ళు అనుకోలేదు. ఆ డాబామీద అలాగే ఒకరి పరిష్వంగంలో ఒకరు ఒదిగిపోయి కాలాన్ని ప్రశ్నిస్తున్నట్లు చాలాసేపు వుండిపోయారు.
గుండెల్లో ప్రేమ పొంగి పొర్లుతూంటే ఆమె మెడ వంపులో మొహం దాచుకుని అతడు ప్రపంచాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ అతడు మనసులో అనుకున్నాడు.
"ఒంటరిగా వున్నప్పుడు కూడా
నీ ఆలోచన్లు నన్ను ఒంటరిగా మిగల్చవు.
నువ్వెంత గొప్పదానివంటే
నీ సహచర్యంలో
నా గొప్పతనం ఏమిటో నాకు తెలిసేలా
చేసేటంత గొప్పదానివి!
నీ గురించి ఆలోచించేకొద్దీ-
నా నిద్రకి నేనే శత్రువు నవ్వుతున్నాను.
ఏ భర్తకయినా-
నిన్ను తప్ప ఇంకెవర్ని చేసుకున్నా
నేనింత ఆనందంగా వుండేవాడిని కాను,
అన్న ఆలోచనని కలిగించగల్గే
భార్య కన్నా గొప్ప ఎవరు?
అలాటి భార్య గుణవతి,
గుర్తించలేకపోతే
నాకు నేనే శత్రువుని".
---*****---