"వద్దు సౌదామినీ- నేనే వెళ్ళి అటో ఇటో తేల్చుకువస్తాను".
ఆమె తల అడ్డంగా ఊపుతూ, "బ్రహ్మానంద సంగతి మీకు తెలీదు. అన్నంత పనీ చేస్తాడు. నేనే వెళతాను" అంది.
బాలూ ఆమెవైపు చూశాడు.
ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
ఎన్నాళ్ళ విషాదానికో గండి పడినట్టు-నాగలి స్పర్శకి భూదేవి విచ్చుకున్నట్టు తెరుచుకున్న కనురెప్పల మధ్య తడి ఆవేశమూ, ఆవేదనా మిళితమైన ఉద్వేగంతో అతడు ఆమెను పలుమార్లు ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె బ్రహ్మానంద కోటవైపు బయల్దేరింది.
19
"లేడీస్ ఫస్ట్ అని ఆంగ్ల సాంప్రదాయం అమ్మాయ్! ఆంగ్ల సాంప్రదాయాలని పాటించడమే ఇప్పటి ఆంధ్ర సాంప్రదాయం కదా! మొదటి ఎత్తువెయ్!" అన్నాడు బ్రహ్మానంద.
ఎత్తు వెయ్యడానికి లేచిన సౌదామిని చెయ్యి కొద్దిసేపు అలాగే నిలబడిపోయింది. త్వరితంగా ఆలోచిస్తోంది తన మనసు. గెలిస్తే కరెంట్ షాక్ తగిలేలా చేసి చంపేస్తాడు బ్రహ్మానంద. ఓడినా చంపేస్తాడు. అందుకని గెలవడానికే ప్రయత్నిస్తుంది తను. ఓడి చావడం కంటే గెలిచి చావడమే మేలు. చివరిక్షణం దాకా పోరాడటమే తన తత్వం.
ఒక నిర్ణయానికి వచ్చి చెయ్యి ముందుకి చాపింది సౌదామిని. ఆమెలో హఠాత్తుగా వచ్చిన మార్పుని గమనించిన బ్రహ్మానంద మొహంలో మార్పు కనబడింది. సదానందకి సైగ చేశాడు. వెంటనే ఒక సూదితో బాబు భుజం మీద గుచ్చాడు సదానంద. కెవ్వుమని కేకవేశాడు బాబు.
గుండెలు పిండేసినట్లయి మనసు వికలమై పోయింది. వెయ్యదలచుకున్న ఎత్తుమనసులో నుంచి మాయమైంది. కానీ బ్రహ్మానంద ఎత్తు మాత్రం అర్ధమయ్యింది సౌదామినికి. తను సరిగ్గా ఎత్తువేసే సమయానికి బాబుని ఏడిపిస్తారు వీళ్ళు. మనసు కేంద్రీకరించలేక ఆట తప్పుగా ఆడుతుంది తను. ఓడిపోతుంది తను. ఓడిపోతే...
మనసు చిక్కబట్టుకుంది సౌదామిని. తలతిప్పి బాబుని చూడాలని వున్నా అతి ప్రయత్నంమీద మనసు ఉగ్గబట్టుకుంది.
"నీ స్థయిర్యాన్ని మెచ్చుకోవాలి సౌదామినీ" అన్నాడు బ్రహ్మానంద ఆమెపట్ల వున్న ద్వేషం, తనకు సమ ఉజ్జీ అయిన ప్రత్యర్ధిపట్ల వుండే గౌరవమూ రెండూ అతని గొంతులో ధ్వనిస్తున్నాయి. ఆ తర్వాత తన పావుని జరిపాడు.
ఈసారి మెరుపువేగంతో ఒకపావుని కదిలించింది సౌదామిని. బాబు గుక్కబట్టి ఏడుస్తున్నాడు. కానీ యిప్పుడు అది ఆమెకు వినపడటం లేదు. ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్లు వుంది. చివరిక్షణం వరకూ పోరాడాలి. ప్రాణాలు దక్కించుకోవాలి.
బాబు కూడా బాధని మర్చిపోయి, తల్లివైపు చూస్తున్నాడు. వాడి చిన్ని మెదడుక్కూడా ఏదో ప్రమాదం జరగాబోతూందని తెలిసినట్టుంది. పంజరం వూచలు పట్టుకుని చూస్తున్నాడు.
సౌదామిని కళ్ళు మూసుకుంది.
అవి తన జీవితపు చివరి క్షణాలని ఆమెకు తెలుసు. ఈ గేమే ఓడిపోయి బ్రహ్మానంద ఆ తరువాత పెట్టే చిత్రహింసలు భరిస్తూ చచ్చిపోవటంకన్నా- ఇలా షాక్ వల్ల చనిపోవటమే మంచిది. ఇన్ని సంవత్సరాలుగా తనమీద పెరిగిన పగనీ, కక్షనీ బ్రహ్మానంద ఏ యే పద్దతుల్లో తీర్చుకుంటాడో వూహిస్తేనే ఆమెకి వళ్ళు జలదరిస్తుంది. అతడు వేసిన ప్రతీ ఎత్తుకీ పై ఎత్తువేస్తూ ఇన్నాళ్ళూ తన భర్తని రక్షించుకుంది. ఆ విషయం కూడా అతడు మర్చిపోడు.
తనకు దూరంగా వున్న భర్తని మనోనేత్రంలో ఒకసారి చూసుకుంది. ఆమె కళ్ళని నీటిపొర కప్పేసింది. తడి కళ్ళు, చూపుని నిరోధిస్తూండగా బ్రహ్మానంద నవ్వుతూ మసగ్గా కనిపిస్తున్నాడు. క్షణం పాటు దేవుణ్ణి ప్రార్దించింది.
...మృత్యువుకి మరో రూపంలో కనిపిస్తూన్న కింగ్ పిన్ ని పట్టుకోవటానికి చేయి సాచింది.
* * *
సౌదామిని వెళ్ళిన దారివైపే చూస్తూ ఉండిపోయాడు బాలు.
తనవాళ్ళకి చివరి వీడ్కోలు చెప్పి యుద్దానికి బయలుదేరిన సైనికుడు గుర్తొచ్చాడు.
కానీ అక్కడ జరిగేది యుద్ధంకాదు. కుత్సితమైన వ్యూహాలతో అసహ్యకరమైన పద్దతుల్లో శత్రువులు అల్లిన వికృతమైన సాలెగూడు.
అందులోకి ప్రవేశించింది సౌదామిని. తనేమో ఏమీ పట్టనట్టు ఇక్కడ ఉండిపోయాడు.
అటో ఇటో తేల్చుకోవడానికి తన దగ్గిరున్న గొప్ప ఆయుధం- మొండితనంతో కూడిన ధైర్యం! అది చాలు. సౌదామిని తనకి దక్కకపోతే, బ్రహ్మానంద కూడా భూమ్మీద మిగలడు. అతడు కూడా బయలుదేరాడు.
కోట తాలూకు గోడలు నిస్తేజంగా కనిపిస్తున్నాయి. అతడు వాటి మీదనుంచి లోపలికి దూకాడు. లోపలంతా గడ్డి - దూరంగా కిల్న్ లోంచి పొగ-కోడి అరుపులు-హోరుమని శబ్దంచేస్తూ గాలి. పొంచివున్న మృత్యువు ఆహ్వానిస్తూన్న భావం.
అతడు అంతకుముందు కోటలోకి ప్రవేశించి వుండటం వల్ల కాస్త పరిచయం వుంది. కోళ్ళఫారం నుంచి పక్కనున్న గోడౌన్ వైపు వచ్చాడు. కొన్ని వందల వేలగుడ్లు అక్కడ వున్నాయి. కిటికీ పక్కనుంచి వెళ్తూ అతడు లోపలికి చూశాడు. అక్కడి దృశ్యంలో ఏదో అస్వభావికత కనిపించింది. అక్కడ కూర్చున్న వృద్దులు ప్రతీ గుడ్డునీ గుడ్డల్తో తుడుస్తున్నారు.
పక్కనే సూదులున్నాయి.
సూదులు?
అతడు తల కాస్త లోపలికి పెట్టి చూశాడు. అతడి ఒళ్ళు జలదరించింది. తెల్లటి పొడి.
బ్రౌన్ షుగర్.... మార్జువానా....
గుడ్డు లోపలి ద్రవాన్ని తీసేసి, దాన్ని గంజాయితో నింపి ఎగుమతి చేస్తున్నారు. అద్భుతమయానా ఆలోచన.... దారుణమైన పన్నాగం...
బ్రహ్మానంద రెండు సంవత్సరాల క్రితం తను అన్నమాటలకి ఎందుకు భయపడ్డాడో అర్ధమైంది. సౌదామినిని తీసుకొచ్చేస్తూ, "నువ్వు నన్ను ఏమైనా చేశావంటే - నేను ముందే అంతా ఉత్తరం వ్రాసి వుంచాను. అది పోలీసులకి అందుతుంది? అంతా చూశాను నేను".
"ఏం చూశావు నువ్వు?"
"కోడిగ్రుడ్లనీ- లేడిపిల్లనీ-"
తను అప్పుడు మామూలుగా అన్నాడు. లోపలి అర్ధం తెలీదు. బ్రహ్మానంద ఆ గంజాయి విషయం భయపడ్డాడు. అందుకే తనని గానీ, సౌదామినిని గానీ డైరెక్ట్ చంపే ప్రయత్నం చేయలేదు. తనతో సౌదామినిని చంపించి, తను ఉరికంబం ఎక్కేలా ప్లాన్ వేశాడు. అప్పుడింక ఈ కోట రహస్యం సజీవ సమాధి అయిపోతుంది.
బ్రహ్మానంద...
గొప్ప తెలివితేటలున్న నరరూప రాక్షసుడు. ఇంత తెలివితేటలున్నవాడు మంచి మార్గంలో వుంటే, దేశానికి ఒక గొప్ప వ్యక్తి లభించి వుండేవాడు.
కోటలో జరుగుతూన్న కార్యకలాపాల అసలు రహస్యం అతడికిప్పుడు బోధపడింది. దొంగ బంగారం చుట్టూ ఇటుక అచ్చు. బోన్ పౌడర్ లా కనపడే బ్రౌన్ షుగర్...
అతనికి సౌదామిని మీద గౌరవం మరింత హెచ్చింది. ఇదంతా ఆమెకు తెలుసు- అయినా తనకి చెప్పలేదు. నైతిక ధర్మాన్ని నిర్వర్తించింది.
అతడికి సౌదామిని గుర్తురాగానే, తను ఆలస్యం చేస్తున్నానన్న విషయం కూడా గుర్తొచ్చింది. అక్కడినుంచి వెనుదిరిగి, వెనుకున్న మనిషిని చూసి స్థాణువైపోయాడు.
వెనుక ఆంజనేయులు నిలబడి వున్నాడు. కుందేలు వెనుకే పొంచివున్నా పులిలా నిలబడి వున్నాడు.
బాలూ ఆలస్యం చేయలేదు. బుల్లెట్ లా దూసుకు వెళ్ళి అతడి కడుపులో తలతో పొడిచాడు. అకస్మాత్తుగా జరిగిన సంఘటనకి ఆంజనేయులు బిత్తరపోయాడు. అతడు బాలూ ఇంత తొందరగా రియాక్ట్ అవుతాడని వూహించలేదు.
బాలూ ఏమీ ఆలోచించలేదు.
తన ఇంటి చుట్టు ప్రక్కల నిలబడి, కేవలం తనకి అనుమానం కలిగించటమే ధ్యేయంగా పెట్టుకొని తనని మానసికంగా నరకయాతన పెట్టిన ఆంజనేయులి మీద కసి హిమాలయంలా పెరిగి పోయింది. పక్కనే వున్న రాయి రెండు చేతుల్తో పైకెత్తాడు.
లేవబోతున్న ఆంజనేయులు జరిగింది గుర్తించేలోపులో ఆ రాయి అతడి మొహం మీదకు జారింది. ఆంజనేయులు కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ తరువాత చిన్న శబ్దం.
ఏం జరిగిందీ చూడలేదు బాలు.
ఇంకొక్క క్షణమే వుంది.
అరక్షణం...
పావుక్షణం.
* * *
సౌదామిని చెయ్యి కింగ్ పిన్ వైపు సాగటాన్ని బ్రహ్మానంద చిరునవ్వుతో చూస్తున్నాడు.
అతడి పెదాలమీద చిరునవ్వు కదుల్తూంది. ఆమె మరణాన్ని కళ్ళారా చూడటానికి కుర్చీలో ముందుకి వంగాడు. ఆమె ఈ రకమైన మరణాన్ని కోరుకోవటం అతడికి సంతోషంగా వున్నట్టుంది. బాబు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. వాడి చిన్న మెదడుక్కూడా- ఏదో అపాయం జరగబోతూందని తెలిసినట్టుంది.
గుండెల్నిండా వూపిరి బలంగా తీసుకుని సౌదామిని కింగ్ పిన్ పట్టుకుంది.
అంతే! లక్ష వోల్టుల షాక్ తగిలి- తన శరీరం నల్లగా కమిలి ఛిన్నాభిన్నమవుతుంది. వికృతమైన అరుపు గొంతులోంచి బయటకు పూర్తిగా వచ్చీ రాకముందే ప్రాణం పోతుంది. శరీరం కుర్చీలో నిర్జీవంగా వొదిగిపోతుంది - ఇన్ని అనుకుంది.
అదే జరగలేదు.
కింగ్ పిన్ ప్లాట్ లో కూర్చుని విజయగర్వంతో చూస్తూన్నట్టుంది. పంజరం దగ్గర నిలబడి వున్న సదానంద అవాక్కయి చూస్తున్నాడు. ఎన్నో చావుల్ని అతడు అక్కడే నిలబడి చూశాడు. ఎందరో ప్రత్యర్ధులు ఆ టేబుల్ ముందు గెలిచే స్టేజి వరకూ వచ్చి, పేలిపోయిన శరీరంతో ప్రాణార్పణం గావించటం అతడు ఎన్నోసార్లు నిర్లిప్తంగా చూశాడు.
ప్రత్యర్ధి చచ్చిపోగానే బ్రహ్మానంద కుర్చీ కోడుమీదవున్న టవల్ తీసుకుంటాడు భోజనం పూర్తిచేసి లేచినట్టు దాంతో మొహం తుడుచుకుంటూ అక్కడినుంచి తాపీగా వెళ్ళిపోతాడు. రాట్నం వడికే ముసలివాళ్ళు శిక్షణ పొందిన సైనికుల్లా వచ్చి, ఆ శవాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇటుకలబట్టి కిల్న్ లో పడేస్తారు. అక్కడనుంచి బోన్ - క్రిషింగ్-మిల్ కీ, ఆ పొడి అక్కన్నుంచి కోళ్ళకి ఆహారం...
అయిదు- పది నిముషాల్లో తంతు పూర్తవుతుంది.
నిశ్శబ్దంగా - మౌనంగా-
ప్రతీసారీ జరిగేది అదే. ఈసారి జరగలేదు.
సదానంద తెల్లబోయి తన యజమానివైపు చూశాడు. బ్రహ్మానంద మొహంలో కూడా విస్మయం కనబడుతూంది. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు సౌదామిని వేపు చూశాడు.
"ఏమిటిది" అన్నాడు.
సౌదామిని మాట్లాడలేదు. ఆమె కూడా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు.
బ్రహ్మానంద కింగ్ పిన్ ని చేతిలోకి తీసుకుని పరీక్షించాడు.
"నేనింక బాబుని తీసుకొని వెళ్ళొచ్చా" అంది, అప్పటికే తేరుకున్న సౌదామిని. బ్రహానంద తన కసినంతా చూపిస్తూ కింగ్ పిన్ ని ప్లాట్ లోకి బలంగా తోశాడు.
అప్పుడు అతడు పెట్టిన కేకకి ఆ గది ప్రతిధ్వనించింది. అతడి శరీరం గజగజ వణుకుతూ కుర్చీలోంచి బంతిలా లేచింది. ఆ తరువాత ఉడికిన మాంసపు ముద్దలా కూలిపోయింది.
అతడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ఆ దృశ్యం చూడగానే భయపడి పారిపోయాడు సదానంద.
ఇప్పుడు అక్కడ సౌదామినీ, బాబూ మాత్రమే మిగిలారు.
అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది.
ఆ నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ నెమ్మదిగా అడుగుల చప్పుడు. అనుమానంగా కుర్చీలోంచి లేచి నిలుచుంది సౌదామిని.
అడుగుల చప్పుడు దగ్గరయింది.
ఆత్మరక్షణకోసం ఆయుధం ఏదైనా దొరుకుతుందేమోనని అటూ ఇటూ చూసింది సౌదామిని. ఏమీ కనబడలేదు. మళ్ళీ తలుపు వైపు చూసింది.
కిర్రుమన్న శబ్దంతో నెమ్మదిగా తెరుచుకుంది తలుపు.
బాలూ నిలబడి వున్నాడు అక్కడ.
"మీరా!" అంది సౌదామిని సంభ్రమంగా.
"నీ వెనకనే నీ కోసం వచ్చాను సౌదామినీ! నువ్వు కింగ్ పిన్ ని స్లాట్లో పెట్టే టైంకి కరెంట్ ఆఫ్ చేశాను. బ్రహ్మానంద తికమకపడి దాన్ని స్లాట్ లో పెట్టి చూసే టైంకి మళ్ళీ కరెంట్ ఆన్ చేశాను అంతే" అన్నాడు.
ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది సౌదామిని.
"పోలీస్ కంట్రోలు ఫోన్ నెంబర్ ఎంతో, 100 అనుకుంటా?" అన్నాడు బాలు.
ముగ్గురూ కోటలోనుంచి బయటికి వచ్చి టెలిఫోన్ వున్న ఒక షాపువైపు నడిచారు. అయిపోయింది
---****---