Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 42

    క్రైమ్ గురించి బాగా తెలిసిన ఇన్ స్పెక్టర్ తను సృష్టించిన సాక్ష్యాన్ని చెరిపివేస్తాడుగాని అలా వదిలేస్తాడా? ఇప్పుడు ఆయన చేసింది ఇదే పని.
   
    బన్సీలాల్ పై తను తీయబోయే దెబ్బకి ప్రధమ అడుగుపడిందని ఇన్ స్పెక్టర్ కి తెలుసు.
   
    బరిలోకి దిగింతరువాత...
   
    గెలుపు

    ఇన్ స్పెక్టర్ దా?
   
    బన్సీలాల్ దా?
   
    అది కాలం చెప్పాల్సిన తీర్పు.
   
    ఇదేమి తెలియని బన్సీలాల్ ఇంకా దీర్ఘాలోచన చేస్తూనే ఉన్నాడు.
   
                                                  25
   
    వారం తిరక్కుండానే....
   
    మళ్ళీ
   
    బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ కలసి మంతనాలు ఆడక తప్పలేదు. అదయినా గోపన్న పెళ్ళి విషయంలో.
   
    "ఆకాశరామన్నగాడు వాడి తమ్ముడు మండిపడే సూర్యుడు ఎవడో కాడు ఠాకూర్ గాడే" అన్నాడు బన్సీలాల్ పళ్ళునూరుతూ.
   
    "ఏమిటి అంత గట్టిగా చెప్పేస్తున్నారు, సాక్ష్యాధారాలు దొరికాయా?" ఇన్ స్పెక్టర్ కన్నారావు మహా ఆతృతగా అడిగాడు.
   
    "ఆ...తిరుగులేని సాక్ష్యం దొరికింది."
   
    "అయితే మనం గెలిచామన్న మాట__?"
   
    "ఏమిటి గెలవటం నా బొంద. ఠాకూర్ నన్ను అవమానం చేస్తే..."
   
    బన్సీలాల్ ని అవమానం చేయాలనుకుంది తను...ఏ ప్లాను కుదరక ఇంతవరకు తను రంగంలోకి దిగలేదు__మరి బన్సీలాల్ కి అవమానం ఎలా జరిగింది? తను అనుమానము ఠాకూర్ మీదకి మళ్ళాలని ఠాకూర్ మీదకి నేరం నెడుతుంటే కల్పన నిజం అవుతున్నది. విచిత్రంగా ఇదెలా జరిగింది౧
   
    ఇన్ స్పెక్టర్ ఆలోచించాడు. ఏమీ అర్ధం కాలేదు. "విషయమేమిటో తిన్నగా వివరించండి లాల్ జీ!" అన్నాడు.
   
    "గోపన్న పెళ్ళి." తాపీగా శలవిచ్చాడు బన్సీలాల్.
   
    "వాట్!" అంటూ కుర్చీలోంచి ఇంతెత్తుణ ఎగిరి పడ్డాడు ఇన్ స్పెక్టర్ కన్నారావు.
   
    "ఎల్లుండి గోపన్న పెళ్ళి."
   
    "ఎవరితో ! ఎక్కడ! ఎలా?"
   
    "ఠాకూర్ ఇంట్లో పనిచేసే సూరప్ప అనే వాడి కూతురు చామంతితో అతను దగ్గరవుండి వాళ్ళ పెళ్ళి జరిపిస్తున్నాడు.
   
    "ఈ పెళ్ళి జరగదు."
   
    "జరగదు అని మీరు అరిస్తే సరిపోయిందా ఇన్ స్పెక్టర్ జీ! ఎలా జరగదు? ఎందుకు జరగదు? అదయినా శలవీయండి, నాకు అర్ధమన్నా అవుతుంది."
   
    "వాడు జైలులోంచి పారిపోయిన ఖైదీ."
   
    "వాడు జైలులోంచి పారిపోయినట్లు మీరేమన్నా నలుగురికీ చాటారా! లేదుకదా! పోలీసులకి మత్తుమందు యిచ్చి అయిదుగురు ఖైదీలు పారిపోయారంటే....ఆ విషయం లోకానికి తెలిస్తే మీ కవమానం అని ఈ విషయం రహస్యంగా దాచారుకదా! వాడు ఠాకూర్ మనిషని అనుమానం వచ్చిన తరువాతనే కదా నేను దొంగతనం నేరం మోపింది, మీరు జైలులో పెట్టిందీను."
   
    "మీ పాయింట్లు అన్నీ నిజమే లాల్ జీ! కాని వాళ్ళ ధైర్యం చూస్తుంటే మీ కేమనిపిస్తున్నది? డౌటు వస్తున్న ధా రావటం లేదా? వస్తున్నది___అయినా ఫర్వాలేదు. మూడు ముళ్ళు వేసే సమయంలో పందిట్లోకి వెళ్ళి వాడిని అరెస్ట్ చేస్తాను...ఇన్ స్పెక్టర్ కన్నారావు అంటే సింహంలాంటి వాడు అని నిరూపిస్తాను"
   
    ఇన్ స్పెక్టర్ కన్నారావు నిజంగా ఆ పని చేస్తాడో లేదోగానీ బీరాలు మాత్రం గొప్పగా పలికాడు.
   
    "మీరు గోపన్నని ఎదుర్కోవటం అంటే ఠాకూర్ ని ఎదుర్కొన్నట్లు లెక్క."
   
    "గోపన్న పారిపోయిన ఖైదీ."
   
    "కాని దగ్గర నిలబడి వాడి పెళ్ళి చేస్తున్నది ఠాకూర్."
   
    "అసలు వాళ్ళ ధైర్యం ఏమిటో నాకర్ధం కావటం లేదు లాల్ జీ!"
   
    "మన అధైర్యమే వాళ్ళ ధైర్యం. బరిలో దిగిన మనం ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే వాళ్ళు మీద మీదకి వస్తున్నారు. ఎదురునిలిచి పోట్లాడేవాడిని ఏమీ చేయలేరు. కాలికి బుద్ది చెప్పేవాడినే తరిమి తరిమి కొడతారు. అది సహజం."
   
    "అంటే...అంటే...అర్ధం ఏమిటి?"
   
    "ఆలోచించి చూడండి. ఇప్పుడు అవమానం అయింది నాకు కాదు మీకు."
   
    "నాకు అవమానమా?"
   
    "అంతే కదా మరి. పారిపోయిన ఖైదీ ఆచూకీ చిక్కినా కూడా మీరు అరెస్ట్ చేయలేదంటే అది మీకు తలంపులు కాదా? మీ డిపార్టుమెంటుకి అవమానం కాదా? మీకు చిన్నతనం కాదా? మీరు భయపడి...

 Previous Page Next Page