"నాకు తెలుసండీ- నాకు తెలుసు. మందు ప్రభావం! మగువ పొందుకావాలి, కావాలి, అనిపిస్తున్నది కదూ!"
"సీతా!" రామకృష్ణ ఖంగు తిన్నాడు.
"ఎందుకు అరుస్తారు? అవునులెండి - ఉన్నమాట అంటే ఎవరికయినా ఉలుకే. బాగా మందుమీద వున్నారు కదా- మగువ పొందు కావాల్సి వచ్చింది. కాసిని కట్టుకధలు చెప్పి అవసరం తీర్చుకుందురు గాని. అంతేనా!"
అర్ధరాత్రి అంకమ్మ శివాలని - ఓ పక్క ఒంటిగంట కావస్తున్నది. మరోపక్క చాలా అలసిపోయి వున్నాడు. నిజం చెప్పినా కూడా అర్ధం చేసుకోకుండా వితండవాదం చేస్తున్నది. జరిగిందేదో జరిగిందని ప్రేమగా దగ్గరకు తీసుకోబోతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నది. రామకృష్ణకి కోపం వచ్చింది. అయినా కోపం వెళ్లగక్కలేదు. చిరాకుగా అన్నాడు-
"సీతా! నీవు పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అన్నంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు."
ఈ మాట చాలు - మరో బాంబు బద్దలు కావటానికి. సీతలాంటి వాళ్లకి కోపంవస్తే ఎదుటివాళ్ళు నోరు మూసుకోటం వుత్తమం. ఎందుకంటే సీతలాంటి వాళ్ళు వెనుకా ముందూ ఆలోచించకుండా మాటకి మాట అంటారు. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గిపోయి, ఏళ్ళ తరబడి బాధపడ్డా బాధపడతారు. ఏదీ అనకుండా వుంటే నిమిష నిమిషానికి వాళ్ళే ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. అంటేనే వస్తుంది చిక్కంతా.
సీత గుణం రామకృష్ణకి బాగా తెలుసు. మౌనంగా వుంటే తెల్లారేసరికి అదే తగ్గేది. రామకృష్ణ మనిషే - ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించటం ఎవరికీ కుదరదు.
రామకృష్ణ బాగా అలసిపోయి వున్నాడేమో - పెదవి కదిపాడు.
అదే వచ్చింది చిక్కు.
మొదటికే మోసం అయింది.
రామకృష్ణ ఏమన్నాడు - "నీవు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు సీతా!" అన్నాడు. అదేమి అంత కానిమాట కాదు. ఓ భర్త ఓ భార్యని అనరాని మాటేంకాదు.
అయినా -
మాటకి మాట తెగులు, నీటికి నాచు తెగులు
సరీగా ఇప్పుడు అదే జరిగింది.
"అవును. బాగా చెప్పారు. నేను మూర్ఖురాలిని కాబట్టే మీరు అల్లిన కట్టుకధ నమ్మాను!" సీత వ్యంగ్యంగా అంది.
"ఎక్కడ నమ్మావు? నేను ఏం చెప్పినా విపరీతార్ధం తీస్తూ ఇంకేదో అంటుంటివి!" రామకృష్ణ చిరాకు అణుచుకుంటూ అన్నాడు.
"మీరేం చెప్పినా.... అంటే అర్ధం ఏమిటి? అసలు విషయం దాచి ఏదో ఒకటి చెప్పినా అనే కదా?"
"నీ ఇష్టం. నీవెలా అనుకున్నా సరే - అర్ధం చేసుకోనప్పుడు చెప్పేదేముంది?"
"మీరు చెప్పిందాంట్లో నిజమూ, అర్ధమూ వుంటే అలాగే ఒప్పుకుందును. మీరు చెప్పిందే నిజం అయితే...... పొరపాటు అంటున్నారు కాబట్టి - నిజం చెప్పేవారు. తలనొప్పి..... అమృతాంజనం..... ఈ దొంగనాటకం ఆడేవారు కాదు."
"నాది.... నాది..... దొంగనాటకమా?"
"ముమ్మాటికీ."
"మంచిది. చాలా గొప్పగా అర్ధం చేసుకున్నావు. నిన్ను బాధపెట్టడం యిష్టం లేక, నీవు అపార్ధం చేసుకుంటావేమో అని భయపడి దొంగనాటకం ఆడాల్సి వచ్చింది నీమీద ప్రేమ లేకపోతే యింత నాటకం ఆడేవాడిని కాదు. నిజం చెప్పాలంటే నేను సంపాదిస్తున్న మగాడిని. తాగి తందనాలాడితే ఏం చేయగలవు? తాగి వచ్చి నానా యాగీ చేస్తూ నీమీద చేయి చేసుకుంటాను. అప్పుడు ఏమీ చేయగలవు?" ఇలా యిదంతా అని చివరికి - "సీతా! నేను అలాంటి వాడిని కాను" అని చేపుదామనుకున్నాడు రామకృష్ణ.
మధ్యలో అందుకుంది సీత-
"ఏమి చేయగలవు అని ఎంత ధీమాగా అంటున్నారండీ! ఎస్ - ఇది పురుష సమాజం! నాలాంటి ఆడది ఏం చేస్తుంది? మొగుడు తాగొస్తాను, తంతాను అని ధీమాగా చెపుతుంటే ఏం చేస్తుంది?- భోరున ఏడుస్తుంది. ఇప్పుడు నాకు మిగిలింది యిదే. నేను చేసేది యిదే!" అంటూ సీత భోరుమంది ఒక్కసారిగా.
రామకృష్ణ తెల్లబోయాడు.
వాళ్ళు పెళ్ళయి కాపురం పెట్టిం తరువాత వారి మధ్య ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా పోట్లాట, కోపతాపాలు, అపార్ధాలు రాలేదు. ఇలాంటి సంఘటన కూడా జరగలేదు. ఏ మాటంటే ప్రసన్నురాలవుతుందో, ఏ మాటంటే ఏడుస్తుందో - సీత మనసు యింకా పూర్తిగా అనుభవం లేదు రామకృష్ణకయినా.