Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 41


    ఆ సమయంలో అక్కడ గోపీకొంతమందితో ప్రత్యక్షమయ్యాడు.
    ఎడ్వర్డు, అతడి మనుషులు పారిపోయారు.
    అప్పటికి చౌదరి, అతడి ముఖ్యానుచరులు అంతమయ్యారు. మిగిలిన కొద్దిమందికీ గోపీపట్ల అతడి నాయకత్వంపట్ల నమ్మకం కలిగింది. అప్పటికప్పుడు అతడు తనను ముఠా నాయకుడిగా ప్రకటించుకుని "నాయుడి అంతం చూస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ!" అన్నాడు. ఆ మాటలు అతడు మనస్ఫూర్తిగానే అన్నాడు.
    ఎందుకంటే చౌదరిముఠా ఇప్పుడు పూర్తిగా అతడి అధీనంలోనికి వచ్చింది. పాత మనుషులు చాలామంది అంతం కావడంతో-ముఠానిండా ఇప్పుడు అతడి మనుషులే ఉన్నారు. ఫిరంగిపురంలో పూర్తి శాంతి భద్రతలు నెలకొనాలంటే అతడు అంతం చేయాల్సినది నాయుడినొక్కడినే! అంటే తను తలపెట్టిన కార్యం సగానికి సగం నెరవేరింది.
    అలాగని గోపీ చౌదరిని అసహ్యించుకోలేదు. చౌదరిపట్ల అతడు తన భక్తి ప్రపత్తులను ప్రకటించుకున్నాడు. చౌదరి శవం నగరమంతటా ఘనంగా ఊరేగించబడింది. చౌదరి చేసిన ఘనకార్యాలగురించి చెప్పడానికి గోపీ పెద్ద సభ ఏర్పాటు చేశాడు. తను చౌదరి పంథాలోనే నడిచి ఆయనపేరు నిలబెడతాననీ-ఆయనను అంతంచేసిన దుష్టశక్తులను నిర్మూలిస్తాననీ పదిమందిలోనూ నొక్కి చెప్పాడు.
    చౌదరికి అంత్యక్రియలు మహానాయకులకు జరిగే విధంగా ఎంతో ఘనంగా జరిగాయి.
    ఇవన్నీ చేస్తూనే గోపీ తన ముందు కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నాడు. మొదట్నించీ తను నాయుడికి ఎదురు తిరిగాడు. చౌదరితో కలిశాడు. చౌదరిని బుట్టలో వేసుకుని-అతడి రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. చివరకు చౌదరిని అంతం చేశాడు.
    అంతవరకూ బాగానే ఉన్నది. కానీ నాయుడి విషయంలో అదంతా సులభంకాదు. ఎంత ప్రయత్నించినా తనకు నాయుడి గురించి ఏమీ రహస్యాలు తెలియడంలేదు.    
    అప్పుడప్పుడు గోపీ అనుకుంటూండేవాడు-"నేను ముందు నాయుడి పక్షంలో చేరవలసింది-" అని. అయితే అపరిచితులకు నాయుడి పక్షంలో చేరడం అంత సులభంకాదు. అదీకాక చౌదరి, నాయుడు ఇద్దరూ పరస్పరం కలహించుకొనడంవల్లనే తన పని సులభమయిందని అతడికి తెలుసు.
    నాయుడి విషయం ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో గోపీకి అతడినుంచి సందేశం అందింది. ఆప్రకరం గోపీ నాయుడికి ఫోన్ చేయవలసి ఉన్నది.
    
                                          23
    
    "వృద్ధ జంబుకం గంతించింది నాకు నీతో విరోధంలేదు. మనమిద్దరం చేతులు కలిపితే ఈ ఫిరంగిపురంలో మనకు ఎదురుండదు-" అన్నాడు నాయుడు.
    "అంటే?" అన్నాడు గోపీ.
    "మనమిలా ఒకరితో ఒకరు తలపడడంవల్ల ఇద్దరమూ నష్టపోతాం. ఈ ఊళ్ళో రెండు ముఠాలువద్దు. ఇద్దరమూ కలిసి ఒకే ముఠా నడుపుదాం-"
    "అప్పుడు బాస్ ఎవరు?"
    "ఇలాంటి విషయాలు ఫోన్లో ఎందుకు? బల్లకటూ యిటూ కూర్చుని కబుర్లాడుకుంటే ఎటువంటి సమస్యనైనా చిటికెలో తేల్చేయవచ్చునని నా అభిప్రాయం. వెంటనే బయల్దేరి మా ఇంటికి రా-" అన్నాడు నాయుడు.
    "నిన్ను నేను నమ్మను. నువ్వు నన్ను నమ్ముతావని అనుకోను. నేను నీ యింటికి తప్పకుండా వస్తాను. నీతో మాట్లాడతాను. కానీ అంత వరకూ నీ కొడుకు అశోక్ నా అనుచరులమధ్య ఉంటాడు. నీతో మాటలు పూర్తి చేసుకుని బైటకు రాగానే నీ అశోక్ నీ యింటికి చేరుకుంటాడు. అంగీకారమేనా?"
    "నిర్మలమైనమనసుతోనిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. నీషరతులన్నీ నాకు అంగీకారమే-" అన్నాడు నాయుడు.
    వెంటనే ఆ ప్రకారం ఏర్పాట్లు జరిగాయి.
    గోపీ హోటల్లో ఆసాయంత్రం ఒకనృత్య ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. దానికి నాయుడు అశోక్ ను పంపాడు. హోటల్లో నృత్య ప్రదర్శన ఆరంభించబడిన సమయానికి గోపీ నాయుడిగదిలో ఉన్నాడు. గోపీతోపాటు ఇద్దరు అనుచరులున్నారు.
    "ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సినదినం. రెండు మరఫిరంగులు ఒక్కటై-పోలీసులకు ప్రళయనాదాన్ని వినిపించబోతున్నాయి-" అన్నాడు నాయుడు.
    "మరఫిరంగులసంగతి తర్వాత-ముందు నీవద్దఆయుధాలేమైనాఉంటే బయటకు తీసేయాలి-" అన్నాడు గోపీ గంభీరంగా.
    "ఎందుకని?"
    "నీ అనుచరులు నన్నీగదిలో ప్రవేశపెట్టేముందు నన్ను పూర్తిగా చెక్ చేశారు-" అన్నాడు గోపీ.
    "సరే-చెకింగ్ కు నేనూ సిద్దంగానే ఉన్నాను-" అన్నాడు నాయుడు.
    గోపీ అనుచరులు నాయుడిని పూర్తిగా చెక్ చేశారు. అతడిజేబుల్లో వారికి ఒకసిగరెట్ కేసుమాత్రం దొరికింది.
    "అదిక్కడే ఉంచు. కావాలంటే సమావేశం అయ్యేవరకూ నీదగ్గరే ఉంచు. నాకు కావలసిందల్లా అందులోని సిగరెట్ మాత్రం-" అన్నాడు నాయుడు.
    గోపీ సిగరెట్ కేసు తనవద్ద ఉంచుకున్నాడు. అతడి అనుచరులు మొత్తం గదంతాచెక్ చేశారు. వారికి ఏ విధమైన అనుమానమూకలుగలేదు.
    "వాళ్ళను వెళ్ళిపొమ్మను. మనం కూర్చుందాం-" అన్నాడు నాయుడు.
    గోపీ తన అనుచరులకు సైగచేశాడు.
    గదిలో బల్లఉన్నది. బల్లమీదఫోన్ కాక యాష్ ట్రే ఉన్నది. బల్ల కటూ ఇటూ చెరో కుర్చీలో నాయుడు, గోపీ కూర్చున్నారు.
    "నీ నల్లమందు వ్యాపారం ఎలా నడుస్తున్నది?" అన్నాడు నాయుడు.
    "చౌదరి పోయాక బాగా మందగించింది-" అన్నాడు గోపీ- "కానీ నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నెల్లాళ్ళలో పుంజుకుంటుంది-"
    "నువ్వు గట్టివాడివి-" అన్నాడు నాయుడు.
    "నీ ఇసుక బస్తాల యురేనియం ఎగుమతి ఎలాగుంది?" అన్నాడు గోపీ మాటమార్చుతూ.
    "నీ బంగారం బిస్కట్లలాగే-" అన్నాడు నాయుడు-"ప్లీజ్ నాకు సిగరెట్ కావాలి-కావాలంటే నువ్వూ ఒకటితీసుకో-"
    గోపీ నవ్వి సిగరెట్ కేసు నాయుడివైపు తోశాడు. నాయుడు కేసు లోంచి సిగరెట్ తీసిపెదాలమధ్య ఉంచుకున్నాడు. కేసునే లైటరుగా వాడి వెలిగించాడు. తర్వాత అతడికుడిచేయి యాష్ ట్రేని గిరగిరా తిప్పుతున్నది.
    గోపీ ఏదో అనబోయేలోగా బల్లమీద ఫోన్ మ్రోగింది.

 Previous Page Next Page