Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 42

   

      "ఛా అలా మాట్లాడకు మన హాస్టల్లో ఎంతమంది అమ్మాయిలు లేరు. చెప్తేగాని వాళ్ళదే  కులమో ఎవరికీ తెలియదు. కులాన్ని ఎత్తి చూపకు" కోప్పడింది మరో అమ్మాయి.
   
    కొన్ని హాస్టల్స్ లో బి.సి., ఎస్.సి., ఎస్.టి.లకు కన్సెషన్ రేట్సు, కిలో పంచదారా, పాలూ ఫ్రీగా యిస్తారు. అయినా ఎప్పుడూ, ఎవరూ వాళ్ళమీద ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. కానీ ఈ మధ్యే రాజకీయ నాయకుల హీన చర్యలవల్ల ఇలాంటి భేదాలు బయటకొస్తున్నాయి. టాపిక్ రాజకీయంవైపు తిరిగింది.
   
    "ఈ రోజు మీ హీరోగారు వస్తున్నారటగా" వాళ్ళ లెక్చరర్ ని ఉద్దేశించి అంది. ఆ లెక్చరర్ ఒక వర్గాన్ని ప్రచారం చేస్తాడు. రాజకీయ ఉపన్యాసాలు ఇస్తాడు.
   
    "ఎక్కడికి?"
   
    "మన హాస్టల్ కే. ఎ.బి.వి.పి. మీటింగ్ వుందట మధ్యాహ్నం."
   
    "అయితే చూడాలి. పాఠం చెపుతుంటేనే ఆయన మొహం చూస్తూ కూర్చుంటావ్. ఇప్పుడు రాజకీయ లెక్చర్ యిచ్చినా అంతేనా?"
   
    "అవును చూస్తాను తప్పేమిటి? ఆ లెక్చరర్ అంటే నాకు యిష్టం అంత బావుంటాడు కాబట్టి చూస్తాను" అంది ఆ అమ్మాయి ఉక్రోషంగా హాస్టల్లో అప్పుడప్పుడు పార్టీ మీటింగులు జరుగుతుంటాయి. పి.డి.యస్. యు,ఎ.బి.వి.పి.ల మీటింగులు ఎక్కువగా జరుగుతాయి. అమ్మాయిల్లో చాలామంది పార్టీలని అభిమానిస్తారు. మీటింగులకి అటెండవుతారుగాని పబ్లిక్ గా నేను ఫలానా పార్టీ అని చెప్పుకోరు.
   
    ఇంతలో టి.వి. చూస్తున్న ఎవరో "....అదిగో వచ్చాడు. చూడండి" అని అరిచారు.
   
    రాయన్న బౌలింగ్ చేయడానికి వచ్చాడు. కిరణ్మయి నిలబడి పోయింది.
   
    "ఇప్పుడు చూడు క్లియర్ గా కనిపిస్తున్నాడు."
   
    "అతడేనా రాయన్న? కాదనుకుంటాను" అందో అమ్మాయి అనుమానంగా.
   
    "కాదు అతడే నేను చూశానుగా."
   
    "కాదంటుంటే! నువ్వు చెప్పవే....అతడేనా రాయన్న?" అన్నదా అమ్మాయి.
   
    కిరణ్మయిలో ఏదో ఉద్విగ్నత బయల్దేరింది. ఏదో జరగబోతున్నదని మనసు చెపుతోంది.
   
    "అతడే.... అతడే" చాలా స్వరాలు ఒకేసారి అన్నాయి.
   
    "కాని లక్ష్మితోపాటు హోటల్లో నేను చూసింది ఇతడిని కాదే" అందా అమ్మాయి అనుమానంగా. కిరణ్మయి గుండె వేగంగా కొట్టుకుంటూంది. అరచేతులు చెమట్లు పడుతున్నాయి.
   
    "నువ్వెప్పుడు చూశావు?" ఎవరో అడిగారు.
   
    "లక్ష్మితో హోటల్ మోహినిలో చూశాను. ఒకసారి కాదు రెండుసార్లు చూశాను. అందరూ రాయన్నది మంచి పర్సనాలిటీ అంటే అతడు ఈ రాయన్నే అనుకున్నాను. ఆ అబ్బాయిది కూడా ఇలాంటి పర్సనాలిటీయే. కాని మనిషి చాలా బావున్నాడు. హీరోలా వున్నాడు" అందా అమ్మాయి ఎగ్జయిటింగ్ గా.
   
    "అంటే లక్ష్మికి కూడా చాలామంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారన్నమాట."
   
    "చాలామంది ఏమోకాని వాళ్ళిద్దర్నీ అప్పుడు చూస్తే మట్టుకు చాలా క్లోజ్ గా వున్నట్లనిపించారు."
   
    "ఏమో బాబూ ఎవరివెనక ఏం కథలున్నాయో అర్ధం కావడంలేదు. పదండి పోదాం" అంటూ గుంపుగా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కిరణ్మయి ఆ అమ్మాయిని గుర్తుపట్టింది. పైన గదుల్లో వుంటుంది. పేరు ప్రీతి.
   
    ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవటంతో ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది.
   
    కిరణ్మయి అక్కడనుంచి లైబ్రరీకి వడివడిగా వెళ్ళింది. ఆమె మనసంతా టెన్షన్ తో నిండివుంది.... ఏదో తీగె దొరికిన భావన.
   
    ఆమె పేపర్లన్నీ తొందర తొందరగా తిప్పింది. దాదాపు అరగంట వెతికాక ఆమెకి ఆ ఫోటో దొరికింది. లోకల్ పేపర్లో, చివరిపేజీలో 'ఆంద్రప్రదేశ్ నించి భారత క్రికెట్ కి ఆశాకిరణం' అన్న హెడ్డింగ్ క్రింద వుంది ఆ ఫోటో. దాదాపు నలుగు కాలమ్స్ వ్యాసం. చూస్తూంటేనే అది డబ్బిచ్చి వ్రాయించుకున్న దానిలా వుంది.
   
    ఆ పేపర్ పట్టుకుని ఆమె వేగంగా లైబ్రరీనుంచి హాస్టల్ కి వచ్చింది.
   
    ఆ పేపర్ లో ఫోటో విజయకుమార్ ది!!!
   
    ఆమె మెట్లెక్కి పై అంతస్థులోకి వెళ్ళింది. ఆ గదిలో ప్రీతి ఒక్కతే వుంది. లోపలి వస్తున్న కిరణ్మయి వైపు ప్రీతి ఆశ్చర్యంగా చూసింది. కిరణ్మయి తన ఎగ్జయిట్ మెంట్ పైకి కనపడకుండా వుండటానికి ప్రయత్నం చేస్తూ, "మీరు అపురూపలక్ష్మి తో చూసిన అబ్బాయి ఇతనేనా?" అంది విజయకుమార్ ఫోటో చూపిస్తూ.
   
    ఆ అమ్మాయి దానికి సమాధానం చెప్పకుండా "ఎందుకు అడుగుతున్నారు ఇదంతా?" అంది.
   
    "ఇతను మాకు దూరపు బంధువు. అందుకని ఇంటరెస్టు."
   
    ప్రీతి ఆ ఫోతోవైపు తదేకంగా నిముషంపాటు చూసింది. ఆ నిముషం కిరణ్మయి తన జీవితకాలంలో సుదీర్ఘమైన కాలంగా భావించింది.
   
    ఆ అమ్మాయి కిరణ్మయికి పేపరు తిరిగి ఇస్తూ "ఊహు ఇతను కాదు" అంది.
   
    "మీకు బాగా తెలుసా?"
   
    "తెలుసు అతను క్రికెట్ ప్లేయర్ కాదు. చాలా మామూలుగా వుంటాడు."
   
    "అతన్ని లక్ష్మితో కలిసి ఆఖరిసారి మీరెప్పుడు చూశారు?"
   
    ఆ అమ్మాయి అనుమానంగా చూస్తూ "విజయ కుమార్ కాదన్నానుగా" అంది. కిరణ్మయి రహస్యం చెపుతున్నట్టు, "లక్ష్మిని మీరు చెప్పిన అబ్బాయితోనే నేనూ చూశాను. పోలీసులు ప్రశ్నలు అడుగుతూంటే నేనొక్కదాన్నే చెప్పాలేమో అనుకున్నాను" అంది.
   
    పోలీసుల ప్రసక్తి వచ్చేసరికి ప్రీతి భయపడింది. మరేమీ ప్రశ్నలు వేయకుండా "అపురూపలక్ష్మి చనిపోవడానికి వారంరోజుల ముందే" అంది.
   
    కిరణ్మయి అక్కన్నుంచి వెంటనే టెలిఫోన్ బూత్ కి వెళ్ళి, వెంకటరత్నానికి ఫోన్ చేసింది. "నాకు అర్జెంటుగా రాజారావు ఫోటో కావాలి" అని వివరాలు చెప్పింది.
   
    "రెండ్రోజుల్లో సంపాదించి ఇస్తాను" అన్నాడు వెంకటరత్నం ఉత్సాహంగా.
   
                                    *    *    *
   
    వెంకటరత్నంతో మాట్లాడి, తిరిగి టి.వి. రూమ్ కి వచ్చేసరికి మ్యాచ్ అయిపోయింది. ఆమె తన గదికి వస్తూవుండగా, బయట్నుంచి రేఖ వస్తూ కనిపించింది. కిరణ్మయి ఆమెతో ఎప్పట్నుంచో మాట్లాడాలనుకుంటూంది.
   
    రేఖ బాగా అలసిపోయినట్టు కనిపిస్తోంది. కిరణ్మయి వెళ్ళేసరికి ఆ అమ్మాయి తన కళ్ళకున్న కాంటాక్ట్ లెన్సెస్ తీస్తూంది.
   
    "మే ఐ కమిన్" గుమ్మం దగ్గిర నిలబడి అడిగింది.
   
    రేఖ మొహంతిప్పి చూసి "ఎవరూ?" అంది.
   
    "నేనూ కిరణ్మయిని."
   
    రేఖ కళ్ళు చిట్లించి చూచి "ఓ! మీరా" అన్నది గుర్తుపట్టినట్టు. ".....రండి."
   
    కిరణ్మయి లోపలికివస్తూ "ఏం లేదు. మీరు లోపలి వస్తూంటే చూశాను. పలకరిద్దామని వచ్చాను" అంది నవ్వుతూ రేఖ కూడా నవ్వి "టీ తాగుతారా" అంది, కళ్ళ లెన్సెస్ పాత్రలోంచి తీసి, అల్మైరాలో పెడుతూ.
   
    "వద్దు" అని కిరణ్మయి ఆ అమ్మాయితో కొంచెంసేపు పిచ్చాపాటీ మాట్లాడి, లేస్తూ "మీకో విషయం చెప్పమంటారా" అని అడిగింది.
   
    "ఏమిటి?"
   
    "మీరు చాలా అందంగా వుంటారు."
   
    రేఖ కాస్త సిగ్గుపడి, "థాంక్స్" అంది.
   
    "మీరు కళ్ళద్దాలు వాడరా? మీ గుండ్రటి ఫేస్ కి గుండ్రటి ఫ్రేమ్ అయితే బావుంటుంది."
   
    "స్కిన్ ఎలర్జీ వున్నట్టుందండీ. అందుకే అద్దాలు వాడను."
   
    ఆ అమ్మాయితో కొంచెం సేపు మాట్లాడి కిరణ్మయి అక్కడనుంచి సరాసరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది. ఆమెని చూసి ఇన్ స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. "-ఇలా వచ్చారేమిటి?"
   
    "ఆయనమీద కేసు పూర్తిగా కోర్టుకి వెళ్ళినట్టేనా? లేక ఇంకా పరిశోధనలోనే వుందా?"
   
    "ఇంకా పరిశోధనలోనే వుంది. F.I.R వేశాం అంతే" అని ఆగి, ".....కంగ్రాచ్యులేషన్స్. మీ ఆయన బాగా ఆడుతున్నాడని విన్నాను" అన్నాడు.
   
    "నేనుకూడా ఢిల్లీ వెళ్ళాను. ఆయన మానసికంగా చాలా క్రుంగిపోయి వున్నారు. ఇన్ స్పెక్టర్ గారూ? ఒక్క విషయం చెప్పండి. ఆయనకీ కేసులో శిక్ష పడుతుందా?"
   
    'ఐయామ్ సారీ.....పడవచ్చు. కేసు బలంగా వుంది."
   
    "ఎలా చెప్పగలరు? ...." అని ఆగి, "అవన్నీ కోర్టులో చెపుతాననకండి ప్లీజ్" అంది.
   
    "అతను గదిలోంచి రావటం చూసిన వాళ్ళున్నారు. అతనికి ఆ అమ్మాయికి మధ్యవున్న పరిచయం గురించి తెలిసిన వాళ్ళున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా అతడు ఆ అమ్మాయి వుత్తరాన్ని ఫోర్జరీ చేసిన విదానం అతడిని దోషిగా నిలబెడుతుంది" అన్నాడు.

 Previous Page Next Page