"ఆయన అపురూపలక్ష్మి గదిలోంచి బయటకు రావటం చూసిన అమ్మాయి రేఖ- కాంటాక్ట్ లెన్సులు వాడుతుంది! అప్పుడే నిద్రలేచి బయటకొచ్చిన వాళ్ళు కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోరు. ఆ అమ్మాయికి కళ్ళజోడు లేదు. కాబట్టి మీరుకాస్త వివరంగా నిలదీస్తే అసలు విషయం బయటకొస్తుంది. 'నువ్వు చూసింది రాయన్ననేనా' అంటే అవునంది. 'కాదేమో కాస్త ఆలోచించు' అంటే 'కాదేమో' అంటుంది. క్షమించండి ఇవన్నీ మీకు తెలియనివని కాదు. నాకు తెలిసిన పరిధిలో చెపుతున్నాను."
ఇన్ స్పెక్టర్ ఆమెవైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇదంతా మీకెలా తెలిసింది?' అని అడిగాడు.
"నేనూ ఒక స్టూడెంట్ లా ఆ హాస్టల్ లో చేరాను సార్" అన్నదామె తలవంచుకుని.
పక్కలో అగ్నిపర్వతం పేలినట్టు అదిరిపడ్డాడు ఇన్ స్పెక్టర్. చాలాసేపటికి గానీ తేరుకోలేకపోయాడు. "మీరు....మీరు చెపుతూంది నిజమేనా?"
"అవును ఇన్ స్పెక్టర్ గారూ. అపురూపలక్ష్మి మరణవార్త నా భర్తే కారణమైతే అది వేరే సంగతి. అలా కాని పక్షంలో ఆ అమ్మాయి మరణం సైకాలజీ పుస్తకాల్లో ఒక కొత్త అధ్యాయమవుతుంది. మానసిక శాస్త్రవేత్తలు పరిశోధించటానికి ఒక టాపిక్ అవుతుంది!! హాస్టల్ లో కూతుళ్ళనుంచిన తల్లితండ్రులకి హెచ్చరిక అవుతుంది!!!" ఆవేశంగా అంది కిరణ్మయి. ఇన్ స్పెక్టర్ ఇకా ఆశ్చర్యంనుంచే తేరుకోలేదు.
"ఐయామ్ సారీ. ఏదో ఆవేశంలో మాట్లాడేశాను" అంది సిగ్గుపడుతూ.
"ఫర్వాలేదు. కానీ నాకింకా నమ్మకం కలగడంలేదు. ఆ 'రేఖ' అనే అమ్మాయి ఆ విధంగా ఎందుకు చెప్పింది?"
"చెప్పలేదు. మీరు చెప్పించారు!!! మీరు ప్రశ్నించిన విదానం అలావుండి వుంటుంది.... ఎటుచూసినా రాయన్న-రాయన్న-రాయన్న అన్న పేరు వినపడటంతో ఆ అమ్మాయికూడా ఆ గదిలోంచి బయటకు వచ్చింది. రాయన్నే అయి వుంటాడు అనుకుంది. మీ రింకోరకంగా ప్రశ్నించి చూడండి. ఇంకోరకమైన సమాధానం వస్తుంది."
"ఇంకో రకంగానా?"
"అవును. అపురూపలక్ష్మికి రాయన్నేకాదు. మరో స్నేహితుడు కూడా వున్నాడు."
ఇన్ స్పెక్టర్ కుర్చీ వెనక్కి జారపడి, "మీరు బాంబుమీద బాంబు వేస్తున్నారు" అన్నాడు.
కిరణ్మయి మనసులో అనుకుంది- 'మొదటి రాత్రి ఇంట్లోంచి కట్టుబట్టల్తో బయటకొచ్చి - కోర్టులచుట్టూ తిరిగి - హాస్టల్ లో అనధికారంగా చేరి-ఇన్ని బాధలు పడుతూంది మీకు విస్ఫోటనాల్లాటి సత్యాలు చెప్పటానికి కాదు- నా భర్తని రక్షించుకోవటానికి!'
ఇన్ స్పెక్టర్ అడిగాడు- "అపురూపలక్ష్మికి ఇంకో స్నేహితుడున్నాడన్న విషయం మీకెవరు చెప్పారు?"
"ప్రీతి అనే అమ్మాయి చెప్పింది! లక్ష్మి తిరిగేది రాయన్నతోనే అన్న రూమారు బాగా పాకిపోయేసరికి అందరూ 'మేం చూశా'మంటే 'మేం చూశా'మని అన్నారు తప్పుతే, అది రాయన్నతోనా కాదా అన్న విషయం ఎవరూ ధృవీకరించలేదు."
ఇన్ స్పెక్టర్ లేచి "మీరిక్కడే వుండండి. అరగంటలో వస్తాను" అని హడావుడిగా వెళ్ళిపోయాడు. అతడు తిరిగొచ్చేసరికి గంట పట్టింది.
టోపీ బల్లమీద పెడ్తూ అన్నాడు. "మీరు చెప్పింది నిజమే. ఆ రేఖ అనే అమ్మాయికి లెన్సెస్ లేకపోతే రెండడుగుల దూరం కూడా కనబడదు. తను చూసింది రాయన్ననో కాదో సరీగ్గా చెప్పలేనంది ఆ టైమ్ లో కళ్ళకి లెన్సెస్ లేవట. మరి ఈ విషయమంతా ముందే ఎందుకు చెప్పలేదు అంటే 'మీరు అడగలేదుకదా!' అని సింపుల్ గ అంది. ఇంకేమంటాం?"
కిరణ్మయి మనసుని ఒక సంతోష తరంగం కొట్టినట్టు అయింది.
"నేను ప్రీతిని కూడా కలుసుకున్నాను" అన్నాడు ఇన్ స్పెక్టరు. "మీరు చెప్పింది నిజమే. ఆఖరిరోజుల్లో అపురూపలక్ష్మి కలుసుకున్నది రాయన్నని కాదు......మరొకర్ని. ఆ విషయం ప్రీతి చెప్పగానే మొత్తం ఫోటోలన్నీ తెప్పించాను. ఆ సర్కిల్ లో వున్న మొగ స్నేహితులందరినీ తెప్పించి చూపించాను. చివరికి అతనెవరో తెలిసింది."
టెన్షన్ తో వణికేస్వరంతో కిరణ్మయి అడిగింది. "ఎవరు? ఎవరతను?"
"సారీ చెప్పలేను. అతను చాలా పలుకుబడి వున్న వ్యక్తి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో దగ్గిర సంబంధంవున్న వ్యక్తికి బంధువు. మిగతా వివరాలు అడక్కండి. ఒక్కటిమాత్రం చెప్పగలను కిరణ్మయిగారూ. ఈ హత్యతోగానీ అతనికి సంబంధంవుంటే, అతనే ప్రెసిడెంట్ అయినా నేను వదిలిపెట్టను."
ఆమె లేచింది.
ఇన్ స్పెక్టర్ కూడా లేచి అభినందిస్తున్నట్టు అన్నాడు- "చాలా కష్టపడుతున్నారు. ఒక రకంగా మా కళ్ళు తెరిపించారు. మీ పరిశోధన మీరు కొనసాగించండి. నేనూ నా అప్రయత్నం చేస్తాను."
"థాంక్స్ సార్. మీరు ఇంత ఓపిగ్గా నేను చెప్పేది వింటారనుకోలేదు. ఇంత తొందరగా యాక్షన్ తీసుకుంటారనుకోలేదు కూడా." ఆమె చేతులు జోడించి వెనుదిరిగింది. వస్తూ అనుకుంది- "పోలీస్ డిపార్ట్ మెంట్ మీద నాకున్న అపోహలు పోయాయి. ఎంత క్రూరంగా ఆలోచించానో కదా."
అదే టైమ్ కి ఇన్ స్పెక్టర్ అనుకుంటున్నాడు- "గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎంత మామూలుగా డీల్ చేస్తున్నాం ఈ కేసుల్ని...! పోలీసులకి మానసిక శాస్త్రంలో ట్రెయినింగ్ ఇస్తే బావుణ్ణుకదా."
* * *
కిరణ్మయి తిరిగి వచ్చేసరికి హస్టల్ అంతా గగ్గోలుగా వుంది. రేఖ కాంటాక్ట్ లెన్సెస్ సంగతీ, ప్రీతి టి.వి. చూస్తూ అన్న మాటల సంగతీ అప్పుడే పోలీసులకి తెలిసిపోవటం, క్షణాల్లో వాళ్ళు ఎంక్వయిరీకి రావటంతో అమ్మాయిలు బెదిరి పోయారు. అనూరాధ అయితే మరీ! ఆ అమ్మాయి ఎందుకింత కంగారు పడుతూందో కిరణ్మయికి అర్ధంకాలేదు. "నాకొక్కదానికీ ఆ గదిలో పడుకోవటానికి భయంవేస్తూంది. నువ్వువొస్తావా?" అని అడిగింది రాధ కిరణ్మయిని.
"అలాగే తప్పకుండా వస్తాను" చెప్పింది కిరణ్మయి, తనలోని సంతోషాన్ని బయటకు కనపడనివ్వకుండా! నిజానికి ఆమెకు అనూరాధతో చాలా మాట్లాడాలని వుంది.
కిరణ్మయి వెళ్ళేసరికి రాధ పక్కలు సర్దుతోంది. ఆమె ముఖం ముఖం భావరహితంగా వుంది. కాని అప్పటిదాకా ఏడ్చినట్లు ఎర్రబడిన కళ్ళు చెప్తున్నాయి.
"భోజనం చేసివద్దాం. రా, రాధా."
"నాకు ఆకలిగాలేదు. నువ్వు భోంచేసిరా, నాకు నిద్రవస్తోంది. నేను పడుకుంటాను" ఆమె అప్పటికే నిద్రమాత్రలు వేసుకున్నట్లుంది.
"రాధా! నేనో ప్రశ్న అడగనా?"
"అడుగు" అంది అనూరాధ కానీ ఎలాంటి ప్రశ్న వస్తుందో నన్న ఆందోళన ఆమె స్వరంలో కనపడింది. జవాబు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రశ్న వినడానికి కూడా భయమే.
"నువ్వెందుకిలా నిద్రమాత్రలకు అలవాటు పడుతున్నావు?"
"వేసుకోకపోతే నిద్రరాదు. నుద్ర లేకపోతే కాలేజీకి వెళ్ళలేను. చదువు కోలేను."
"అదే- నిద్రెందుకు పట్టదని? పగలంతా శ్రమపడతావ్. రాత్రిళ్ళు చదువుకుంటావ్. ఆటోమేటిగ్గా నిద్ర రావాలిగా."
అనూరాధ మాట్లాడలేదు.
"రాధా, ప్రేమరాహిత్యం మనిషినెంత బాధపెడుతుందో, క్రుంగతీస్తుందో నాకు తెలుసు. కాని నీ మనసు నర్ధం చేసుకోగలిగే స్నేహితులున్నప్పుడు కూడా బాధని పంచుకోలేకపోతే అది కాన్సర్ కంటే క్రూరమైన జబ్బుగా మారుతుంది. మరొ మందు లేనిదీ. మరొకరితో పంచుకుంటే తగ్గేది మానసిక రుగ్మతే."
"నాకన్నీ తెలుసు కిరణ్. కాని కొన్ని ఆలోచనలకు పరిష్కారాలుండవ్. కాలమే మాన్పాల్సిన గాయం అది. ఆ కాలం ప్రశాంతంగా గడిచిపోవాలంటే నిద్రమాత్రలే మందు" రాధ పడుకుంటూ అంది.
తన మౌనంతో మరొకరు ఉరికంబం ఎక్కుతారని తెలిసికూడా నోరు విప్పని ఆ అమ్మాయి మొండితనానికి కిరణ్మయికి విసుగు, కోపం వస్తున్నాయి. కాని అంతలోనే అనుమానం.... రాయన్నే హంతకుడని ఈ అమ్మాయి నమ్ముతోందేమో! అందుకే మిగతా విషయాలు బయట పడకపోతే చాలని ఆలోచిస్తోందేమో! గట్టిగా అడిగితే మొండికేసే స్వభావం రాధధి.
"నేను లైట్ వేసుకుని చదువుకుంటే నీకు నిద్రాభంగం కాదుగా ఒక గంట చదివితేగాని నాకు నిద్రపట్టదు" అని అడిగింది కిరణ్మయి.
"అబ్బే అదేం లేదు. పడుకుంటే ఉదయందాకా లేవను. నా అలమారులో నవలలున్నాయి కావాలంటే తీసుకో."
మెస్ కెళ్ళి కిరణ్మయి భోజనంచేసి వచ్చేసరికి అనూరాధ నిద్ర పోయింది.
ఆమె చెప్పిన అల్మారా తెరిచింది కిరణ్మయి. రాధ ఎలాంటి పుస్తకాలు చదువుతుందో తెలుసుకోవాలనిపించింది.
పైన అన్నీ ఇంగ్లీషు నవలలు- సిడ్నీ షెల్డన్, ఆర్ధల్ హెయిలీ, లుడ్లమ్ వగైరా, మరొపక్క క్లాసు పుస్తకాలు వాటి వెనక క్లాసు పుస్తకాలకు వేసే అట్టలు వేసిన విప్లవ సాహిత్యం...
కిరణ్మయికి షాక్ తగిలినట్టయింది.