Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 41


                                     చావూ పుట్టుకా
    
    అదో వూరు. ఆ వూళ్ళో ఒక ఆసుపత్రి.
    ఇదో వూరు. ఈ వూళ్ళో ఒక పోలీసు స్టేషన్.
    ఆ వూళ్ళో. ఈ వూళ్ళో ఆంద్రదేశం అంతటా అది ఆర్దరాత్రి!
    ఆసుపత్రికి నొప్పులు పడుతున్న ఒక గర్భవతిని తీసుకువచ్చారు. ఆమె
    వయస్సు నలభై.
    పోలీసు స్టేషన్ కు బేడీలు వేసిన ఒక కుర్రవాన్ని తీసుకువచ్చారు. అతని
    వయస్సు ఇరవై.
    గర్భిణి బాధపడుతోంది. ఏడుస్తోంది.
    కుర్రాడు బాధపడుతున్నాడు. కాని, నవ్వుతున్నాడు.
    ఆసుపత్రిలో వైద్యులు ఆశాజనకంగా మాట్లాడుతున్నారు.
    స్టేషన్లో పోలీసులు కారుకూతలు కూస్తున్నారు.
    "నీకేం భయం లేదమ్మా! కేసు కొంచెం కఠినమైనదే, కాని ప్రమాదం ఏమీ లేదు."
    "లంజ కొడకా! మావో పుస్తకాలు చదువుతావూ? లోకాన్ని మరామత్తు చేస్తావూ? ముందు నిన్ను హజామత్తు చేస్తాం జాగ్రత్త!"
    వైద్యులు శస్త్రచికిత్సకు ఉపక్రమించారు.
    పోలీసులు కత్తులూ, కటార్లూ నూరుతున్నారు.
    రెండుచోట్లా హింసా ప్రయోగమే జరిగింది.
    
        కాని సూర్యోదయంలో
            అక్కడ ఆసుపత్రిలో ఒక జననం!
        ఇక్కడ తెల్లారగానే
            పోలీసు స్టేషన్లో ఒక మరణం!
    
                                        ---౦౦౦---

 Previous Page Next Page