Previous Page Next Page 
జీవనయానం పేజి 41


    ఇక్కడ ఒక విషయం వివరించాలి. నాయన చాదస్తం - అలా అనలేం. ఆనాటి సమాజం సంప్రదాయపు సంకెళ్లలో అంతా ఇరికి ఉంది. ముస్లిం వేషం వేయకుంటే ప్రభుత్వం గుర్తించదు! సంప్రదాయ వేషధారణకు దూరం అవుతే పెద్దలు గుర్తించరు.

 

    సాధారణంగా నాగరక వేషం తలవెంట్రుకల సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అప్పటికి పిలకగల బోడిగుండే సంప్రదాయ వేషం. క్రాఫింగుకు ఇంకా ప్రాచుర్యం రాలేదు. రామానుజాచార్యులు అనే ఒక వకీలు క్రాఫింగు పెట్టుకున్నాడు. నాయన అతనిని "ముందరి జుట్టువాడు" అని వెక్కిరించేవాడు. సంప్రదాయం ప్రకారం వెనుక పిలక - జుట్టు ఉండాలి. అందుకు ముందరి జుట్టు వెక్కిరింత!

 

    రామానుజాచార్యులవారు అర్వపల్లివారి సత్రంలో శ్రీమద్రామానుజుల తిరునక్షత్రం ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేశారు. వారు తనకు పోటీకి దిగారనే అభిప్రాయం నాయనకు ఏర్పడింది. 'ముందరి జుట్టువాడు తిరునక్షత్రం చేయరాదు. అక్కడికి ఒక్క వైష్ణవుడూ వెళ్లరాదు' అని నాయన నిషేధం విధించారు. అంతే! అక్కడికి ఒక్క వైష్ణవుడూ వెళ్లలేదు. వకీలుగారి తిరునక్షత్రం భగ్నం అయింది. వారిని మా ఇంటి తిరునక్షత్రానికి రానివ్వలేదు.

 

    అంతటి మూర్ఖపు సంప్రదాయంలోంచి బయటపడడం ఎంత దుస్తరమో ఊహించాల్సిందే - వ్రాయడం అసాధ్యం!

 

    మా యింట్లో శ్రీమద్రామానుజుల తిరునక్షత్రం అత్యంత వైభవంగా - ఒక పెండ్లిని మించి జరిగింది. చేరలకొద్ది నేమి - పిండి వంటలు - తీపి పదార్థాలు - కూరలు - పప్పులు - పులుసులు - పెరుగుతో అనేకమందికి సాపాట్లు. పచ్చకప్పురం, జాజికాయ, జాపత్రి తాంబూలాలతో సాపాట్లు ముగిశాయి.

 

    పందిళ్లలో వరుసలుగా కూర్చున్న స్వాముల వంటికి చందనాదులు సమర్పించడం. ఆ తరువాత ఉచ్చైస్వరంతో తిరునామాలు - మంగళహారతులు - అంతటితో తిరునక్షత్ర సంరంభం ముగిసింది.

 

    రాత్రివరకు - పెళ్లి తరువాత ఇల్లులా, కాళీ అయింది. ఇల్లు వెలవెల బోయింది. అనేక రోజుల ఏర్పాట్లకు మంగళం పలకడం జరిగింది. సంరంభం ముగిసింది. మేమే మిగిలాం.

 

    ఇంటి ముందర వసారా గడపమీద లాంతరు పెట్టుకున్నాం. ఒకపక్క నేను - ఒకపక్క అన్నయ్యా - చదువుకుంటున్నాం. చెల్లెళ్లు నిద్రపోయినట్లున్నారు. అమ్మా - నాయన - నాయనమ్మ ఇంటివెనుక దొడ్లో ముచ్చట్లలో ఉన్నారు.    

 

    అమాంతంగా అమ్మ పెట్టిన గావుకేక వినిపించింది. అది విని మేమిద్దరం పరిగెత్తాం. ఆ ఆతురతలో మా కాలి తాకిడికి లాంతరు బోర్లపడి - కిర్సనాయిలు క్రిందపడి - మంట అంటుకున్నది గమనించనేలేదు. మేము అటువెళ్తుంటే మా నాయన ఇంటి ముందుకు వెళ్తున్నారు. తరువాత తెలిసిన విషయం ఏమంటే, వారు - బజారు జనం రాకుండా - ఇంటి ముందు తలుపుకు తాళం వేసి - కిరసనాయిలు మంట ఆర్పివచ్చారు.   

 

    మేము వెనక్కు వెళ్లి చూస్తే అమ్మ రక్తం మడుగులో ఉంది! బాధకు తాళజాలక మొత్తుకుంటూంది. నాయనమ్మ నోరుమూసి - 'ఇరుగు పొరుగు వాళ్లు వస్తారు అరవకు' అని వారిస్తూంది. మేము నిర్విణ్ణులం అయినాం. ఏమయిందీ అర్థం కాలేదు. క్షణం నోటమాట రాలేదు. తరువాత అమ్మమీద పడి గొల్లుమన్నాం. ఆ రొదకు చెల్లెళ్లు కూడా లేచారు. వాళ్లూ అమ్మ మీద పడి ఏడ్చారు.

 

    మా ఏడుపుకు ఇల్లు ప్రతిధ్వనించింది.

 

    నాయన వాకిలి బంధించి వచ్చి మమ్ములను గద్దించారు. అంతే. అందరం నోళ్లు మూసుకుని - ఏడుపును నిలువరించుకొని అమ్మ ప్రక్కన నుంచున్నాం.

 

    అమ్మ మోకాలి ఎముక పగిలింది. రక్తం ప్రవహిస్తున్నది. పక్కనే - రక్తసిక్తమయిన - ఇనుప అట్లకాడ పడి ఉంది! నాయన అట్లకాడతో అమ్మను కొట్టారు అని అర్థం అయింది.

 

    నాయన ఇంగువ నీళ్లల్లో కలిపి, నిరంతరం గాయం మీద పోస్తున్నారు. రక్తం కట్టడం లేదు.

 

    కాలానికి మాన్పే శక్తి ఉంది. క్రమంగా రక్తం కట్టింది. అది కాళరాత్రి! ఆకలి నిద్రలు ఎగిరిపోయాయి! ఇలాంటి అనుభవం ఎ పసిపిల్లలకూ కలుగరాదు.

 

    తెల్లవారి నాయన ఒక కాంపౌండరును పిలిపించారు. అమ్మకు వళ్లంతా సలుపులు, జ్వరం! కాంపౌండరు కట్టుకట్టి మందిచ్చాడు.

 

    నాయన కొన్నాళ్లున్నారు. ఎవరో కాలక్షేపం సాయించడానికి ఆహ్వానిస్తే - అమ్మ గాయాన్ని కాంపౌండరుకు అప్పగించి వెళ్లిపోయారు.

 

    అమ్మ చాలాకాలానికిగాని కోలు కోలేదు. అన్నయ్యా, నేనూ ఇంటి పనీ - వంటా చేసేవాళ్లం. మాకు ఉపనయనాలూ - సమాశ్రయణాలూ అయినాయి కాబట్టి, నాయనమ్మకు అభ్యంతరం ఉండేది కాదు. ఏటినుంచి మంచినీళ్లు తేవడం - ఇంటిపని - వంటపని - స్కూలు - ట్యూషన్లు - వీటితో మాకు సరిపోయేది.  

 

    ఇంతకూ నాయన ఎందుకు కొట్టారో తరువాత తెలిసింది. తిరునక్షత్రానికి తెచ్చిన సామానులో మిగిలింది దుకాణాలకు తరలిస్తానన్నారట నాయన. పిల్లలు ఉపవాసాలుంటారు అమ్మవద్దందట అమ్మ. ఆ విషయం మీదే మాటా మాటా పెరిగింది. పక్కనున్న ఇనుప అట్లకాడ విసిరారు. అది మోకాలికి తగిలి ఎముక పగిలింది. మా అదృష్టాన డొక్కలో గుచ్చుకోలేదు! అదే జరిగి ఉంటే......!

                                                                                                                                        

                                                      ఎనిమిది

    తేయాకు - టీ - చాయ్:

 

    ఇంగ్లండులో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని నాటి కవులు - రచయితలు - కళాకారులు హర్షించలేదు. వారి వ్యధ నాటి నవలల్లోనూ - కవితల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రాబిన్ సన్ క్రూసో, డాన్ క్విక్సాట్  నవలలు గోల్డ్ స్మిత్, వర్డ్స్ వర్త్, షెల్లీ, బైరన్ల కవితలు ఇందుకు ఉదాహరణలు.

 

    యాంత్రిక నాగరకత సాహితీస్రష్టల - మేధావుల భావనలను లెక్కచేయదు. పొగ చిమ్ముతూ, కూత పెడ్తూ - వారి ధ్వనిని మూలుగుగా మారుస్తుంది. అది రోడ్ రోలర్ వలె అన్నింటినీ అణగదొక్కుతూ సాగిపోతుంది.

 

    యంత్రం మనిషిని మనసులేని మరగా మార్చింది. ఈ నాగరకతకు దురాశ - దుష్టనిత్తం మూలం. డబ్బు దీని ప్రధాన సూత్రం. డబ్బు - పెత్తనం కోసం అది మానవ జాతిని అంతం చేయడానికి సైతం వెనుకాడదు.

 

    యంత్రం ఉత్పత్తిని పెంచుతుంది. పెరిగిన ఉత్పత్తిని అమ్ముకోవడానికి మనిషిని అలవాట్లకు బానిసను చేస్తుంది. ఆలోచనలను చంపి, అలవాట్లను పెంచడం ఈ నాగరకత. ఇది నాగరకత కాదు - ఉత్పత్తి విధానపు ప్రధాన లక్ష్యం. మనం ఈనాడు వాడుతున్న పదార్థాలలో వాస్తవంగా జీవితానికి అవసరం అయినవి అతికొద్ది మాత్రమే!

 

    ఆంగ్లేయులు తమ మార్కెటును విస్తరించుకోవడానికి జనాన్ని తేనేటికి బానిసలను చేశారు. ఈ విధానం ఎలాంటిదంటే - అది బానిసలను చేస్తుంది. మనసు బానిసలం అని గుర్తించనీయదు.

 

    టీ - ఛాయ్ - తేనీరు ప్రచారం చేయడానికి వారు అవలంబించిన విధానం తెలుసుకుంటే - ఆధునిక ప్రచార సాధనాలద్వారా అన్నింటికీ అదే విధానం అనుసరించారని అర్థం అవుతుంది.

 

    మూడో దశకంలో ఖమ్మంలో తేనీటి ప్రచారం ప్రారంభం అయింది. ప్రతి కూడలివద్దా ఒక టేయిలు -దానిమీద తలపాగా చుట్టుకున్న - ఆనందం వలకబోస్తున్న భారత రైతు - కప్పులో పొగలు చిమ్ముతున్న చాయ్ చప్పరిస్తుంటాడు. నేలమీద కిర్సనాయిల్ స్టౌ వెలిగిస్తారు. స్టౌ - దాని ధ్వని - దాని మంట ఒక వింత! స్టౌమీద తెల్లగా తోమిన ఇత్తడిగిన్నెలో నీళ్లు, గిన్నెమూతమీద టీ పొడి. నీరు మెల్లగా వేడి అవుతుంటుంది.

 

    జనం వినోదం చూడటానికి గారడివాడి చుట్టువలె మూగుతారు. ఆంగ్లేయ వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఇంగ్లీషులో ఒక్కొక్క వాక్యంగా టీ చేసే విధానాన్ని వివరిస్తాడు. పక్కనున్న భారతీయ వేషధారి దాని తెలుగు అనువాదం చెపుతుంటారు. వారు చెప్పే విధానం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. జనం చుట్టూ మూగుతారు.

 

    ఆంగ్లేయుడు తన అధికార దర్పం కనబరుస్తూ కదలదు. భారతీయుడు మరుగుతున్న నీటిని చూపుతాడు. టీ పొడి వేయడాన్ని వివరిస్తాడు. వేస్తాడు. విధానం వివరిస్తూ డికాక్షన్ వడపోస్తాడు. చక్కర - పాలు కలుపుతాడు. కప్పులతో పోసిన చాయ్ అక్కడ కూడినవారికి అందిస్తాడు.

 

    విచిత్రం ఏమంటే - అంతదాకా వింత చూచిన జనం టీ అందుకోకుండానే చెదిరి పోతారు. ఒక్కడూ టీ త్రాగడు. చేసిన టీ సాంతం పారబోస్తారు. మళ్లీ కార్యక్రమం ప్రారంభం! ఇలా విసుగూ - విరామం లేకుండా చాలకాలం కొనసాగింది. తరువాత టీ తాగిన వారికి కప్పులు ఉచితంగా ఇచ్చారు. కొంతకాలానికి జనంలో కొందరు - కప్పులకోసం - టీకి అలవాటు పడ్డారు. కప్పు నేటి బోనసులాంటిది!

 Previous Page Next Page