ఇప్పుడతనికి చేతినిండా పని తగిలింది. వాళ్ళ కార్యక్రమాలకి ఓ కార్యాలయం ఏర్పాటయింది. ప్రొద్దస్తమానమూ అందులోనే వుంటూ ఆ కార్యకలాపాల్లో మునిగి తేలుతూవుండేవాడు. ఎక్కడెక్కడో చాలామందితో తిరిగి వస్తూండేవాడు. ఆంద్ర-తెలంగాణ మిళితం కావటం అతనికి ఇష్టంలేదు. తమ ప్రాంతాలకు జరుగబోయే అన్యాయాలు, గురికాబోయే నష్టాలగురించి గంటలుగంటలు వాదిస్తూండేవాడు. శివనాథరావు ఓరోజు అతన్ని నిలవేసి కాలేజీ ఎగ్గొడుతున్నందుకు చివాట్లు పెట్టి పరీక్షలు దగ్గరకొస్తున్నాయన్న విషయం గురించి హెచ్చరించాడు. అతను నిర్లక్ష్యంగా చిరునవ్వు నవ్వి, 'శివా! స్నేహితుడిగా సలహా యిస్తున్నాను. చీకటి పడ్డాక బయట ఎక్కువగా తిరగమాక. రోజులు బాగాలేవు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం' అన్నాడు.
అతను చెప్పినమాట నిజమే. నాలుగేళ్లనుంచీ అక్కడ వుంటున్నా అతనా ప్రాంతానికి కొత్తవాడే. అతన్ని అక్కడివాళ్ళెవరూ తమవాడిక్రింద జమకట్టరు. ఓ రాత్రి అతను హోటలునుంచి వస్తుంటే ఎవరో తుంటరి రాయికూడా విసిరాడు.
* * *
ఓ రోజు ప్రొద్దున్న నిద్రలేచేసరికి చాలా నీరసంగా ఉన్నట్లు తోచింది. ప్రక్కమీదనుంచి లేవలేకపోయాడు. ఓ పావుగంట అలానే కళ్ళు మూసుకుని పడుకుని, మెల్లిగా ప్రయత్నించి లేచాడు. అంతకుముందురోజు కూడా పనిమనిషి రాలేదేమో గదంతా ధూళీ, దుమ్మూ నిండి అసహ్యంగా వుంది. పుస్తకాలు నేలంతా చెల్లాచెదురుగా పడివున్నాయి. అలాగే ఓపిక చేసుకుని ముఖం కడుక్కువచ్చి కూర్చున్నాడు. తల చాలా భారంగా వుంది. కాఫీ త్రాగాలని వుంది. ఇంటి యజమానురాలి సలహా కోరటం యిష్టంలేదు. ఆమె వృద్దురాలు అతనిట్లా సందిగ్ధావస్థలో వుండగా తలుపు తెరుచుకుని ఓ వయస్సులో వున్నా పిల్ల లోపలకు వచ్చింది.
ఈ యింటికెదురుగా వున్న పాకలో ఆమె నివసిస్తోంది. వాళ్ళు బెస్తవాళ్ళు వాళ్ళ నాయన రోజూ మూసీనదికి పోయి చేపలుపట్టి, తెచ్చి అమ్ముతూంటాడు.
"ఏం కావాలి?" అన్నాడు శివనాథరావు.
"యాదమ్మ ఇయాలకూడా రాదంట. నన్నెల్లి పని సెయ్యమన్నాది" అన్నదా అమ్మాయి గది నలువైపులా చూస్తూ.
"సరే, ఈ కుర్చీ తీసుకెళ్ళి డాబాలో వెయ్యి" అన్నాడు. వేశాక, తూలుకుంటూ పోయి దానిమీద కూలబడ్డాడు. ఆ అమ్మాయి చీపురు తీసుకుని గది ఊడుస్తోంది.
ఓ పదినిముషాలు గడిచాక పని ముగించుకుని అతని దగ్గరకొచ్చి "ఇంకో గంట పొయ్యాక నల్లానుంచి నీళ్ళు తీసుకొస్తాను. ఇంకేదైనా పనివున్నదా అయ్యా?' అంది.
"నీ పేరేమిటి?"
"తాయారు" అంది సిగ్గుతో తలవంచుకుని.
"తాయారూ! ఓ పనిచేసి పెడతావా?" అన్నాడు సంకోచిస్తూ.
"చెప్పయ్యా" అంది తల ఎత్తి.
"నాకు చాలా నీరసంగా వుంది. జ్వరమొచ్చిందనుకుంటాను. హోటలు నుండి కాఫీ తెచ్చి పెడతావ్?"
"తెస్తానయ్యా"
శివనాథరావు 'ఆ రేక్ పైన ఫ్లాస్క్, క్రింద అరలో చిల్లర వుంటాయి తీసుకెళ్ళు' అన్నాడు.
ఆమె వెళ్ళిపోయాక "యిలా వయస్సులో వున్న అమ్మాయిని హోటళ్ళకు పంపటం ఏమీ బాగుండదు. ఆ సర్వర్ వెధవలు ఏదో మాట అంటారు. వెకిలినవ్వులు నవ్వుతారు. పాపం" అని బాధపడ్డాడు. తాయారు పదినిముషాలలో వచ్చింది. తననే కప్పులో పోసి యిమ్మన్నాడు.
"తాయారూ" అన్నాడు.
"ఏమయ్యా" అంది.
"యాదమ్మ ఎందుకు రాదట?
"ఆళ్ళ కొడుక్కి జబ్బుగా వుందట."
ఆమె ఎంత అమాయకురాలో ముఖం చూసీ చూడగానే చెప్పొచ్చు "నువ్వు చేపలకూర బాగా వండుతావటగా?" అన్నాడు.
ఆమె సంతోషంగా "మా అయ్యా చెప్పిండా?" అంది.
"అవును. మీ అయ్యా చెప్పిండు"
"మీక్కూడా తెచ్చియ్యమందురా అయ్యా" అంది మరీ ఉత్సాహంగా.
"ఆఁ ఆఁ నాకు చేపలు తినాలని వుంది తాయారూ!"
కాఫీ త్రాగటం పూర్తయ్యాక కప్పుతీసుకుని కడగటానికి తాయారు వెళ్ళిపోయింది. మళ్ళీ ఒంటరిగా మిగిలాడు. కాస్త నీరసం వదిలినట్లయింది. మెల్లిగా లేచి గోడదగ్గరకు వెళ్ళి క్రిందకు చూశాడు. తాయారు పంపుదగ్గర ఎవరివో అంట్లు తోముతోంది. పైనుంచి పడిన నీడ గమనించి పైకిచూసి అమాయకంగా నవ్వింది. ఎండా చుర్రుమంటోంది. అతను లోపలకు వచ్చేశాడు.
మధ్యాహ్నానికి జ్వరతీవ్రత ఎక్కువైంది. వళ్ళు తెలియకుండా అలా పడుకుని వున్నాడు. ఎప్పుడో ఒకసారి మెలకువ వచ్చింది. కణతలు ఎగిరిపోతున్నాయి. "అమ్మా...!" అన్నాడు ఒక్కసారి. మళ్ళీ కళ్ళు మూసుకుని పోయాయి.
ఏం జరిగిందో తెలీదు కానీ ఓ స్త్రీ తాలూకు దుర్భలహస్తం తల నిమురుతుంటే ప్రయత్నంమీద కళ్ళుతెరచి చూశాడు.
"ఏం బాబూ, ఒక్కసారి పిలువాకూడదా? ఇలాగైతే యీ యింట్లో నువ్వేం ఉండక్కర్లా....అసలే ఇయ్యాళ రేపు జొరాలెక్కువగా వుండాయి కదా ఊళ్ళో అంటుంది వృద్దురాలు.
"బా...గా...నే...వుం...ది"
"ఊ, ఏం బాగో? వల్లంతా కణకణమని పేలిపోతుంటేనూ? తాయారూ! డాకటర్ గార్ని పిల్చుకురా."
"వ...ద్దం....డీ" అన్నాడు బలహీనంగా.
"ఉహు. అదేం సాగదు-నా బొందిలో ప్రాణముండగా ప్రొద్దుటికాడినుంచీ బయటకు రాకపోతే ఏదోలే అని ఊరుకుండా. ఇంతలో తాయారొచ్చి చెప్పింది. ఎన్ని పిలుపులు పిల్చినా పలకలేదండి అంటూ కంగారుతో నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి చెప్పింది. వసే! యింకా యిక్కడే నిల్చుండావూ! పిల్చుకు రమ్మంటే"
ఇహ వారించి ప్రయోజనం లేదని ఊరుకున్నాడు. టైమెంతయిందో తెలీదు. సాయంత్రమయిందేమో ఏమో మరి!
* * *
అలా జ్వరంతో కొన్ని రోజులు గడిచాయి. దీన్నిగురించి అతను యింటికేం ఉత్తరాలు రాయలేదు. ఇంటి యజమానురాలే రాత్రింబవళ్ళు అక్కడ కూర్చుని సపర్యలు చేసేది. అతను సిగ్గుపడుతుండేవాడు. వారించడానికి ప్రయత్నించేవాడు.