Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 40

  

      "సుజాతా! నిన్ను ప్రేమించాను."
   
    "ఉష్! ఇది బజారు."
   
    అతనామె చేతిని మృదువుగా పట్టుకుని "నన్నర్ధం చేసుకోవేం నువ్వు? నువ్వు నన్ను తిరస్కరిస్తే ఏ దూరతీరాలకైనా పారిపోతాను. నేను వంటరిగాడ్ని. 'ఇతను లేడే' అని విచారించే ప్రాణిలేదు ఈ భూమ్మీద" అన్నాడు గద్గద స్వరంతో.
   
    సుజాత కలవరపడింది. ఇదేమిటి ప్రభాకరం? తనెక్కడికో ఎత్తుకు పోతున్నాడు, నిరాకరిద్డామనుకుంది. కాని తనకు తెలియని ఏదోశక్తి తననలా చేయొద్దని ఆజ్ఞాపిస్తోంది. రెండేళ్ళ సన్నిహితత్వం తమది. ఏ విధంగా చూసినా లోటులేని మనిషి ప్రభాకరం. కానీ....ఆమె అధరాలు కంపించాయి. ఏమీ జవాబు చెప్పకుండానే నడక సాగించింది.
   
    ఇంటికి వచ్చి పడుకున్నాక చాలాసేపటివరకు ఆలోచిస్తూ గడిపింది. ఇంతమంది మధ్యవున్నా ఎందుకో యీ వంటరితనం? ఆమె కళ్ళలో నీళ్ళు నిండుకొచ్చాయి.
   
    "అక్కా!" అన్నది సన్నని కంఠంతో.
   
    అనూరాధకి మెలకువ రాలేదు.
   
    "అక్కా!" అని పిలిచింది మళ్ళీ కొంచెం గట్టిగా.
   
    అక్క నిద్రలేచి "ఊ" అంది బద్దకంగా.
   
    "నువ్వెప్పుడైనా ఎవర్నైనా ప్రేమించావా?"
   
    "ఉష్! పడుకో ఏమిటాప్రశ్న? ప్రేమాలేదు, చట్టబండలూ లేదు నా జీవితానికి" అని అనూరాధ మత్తుగా అటుతిరిగి పడుకుంది.
   
                              15
   
   క్కొక్కసారి చూస్తూండగానే ఆకాశమంతా మేఘావృతమై ముసురులు కమ్మివేస్తుంది. ఏదో సంకల్పించుకుని వున్నవాళ్ళంతా ఉత్సాహమంతా దిగజారిపోయి, ముఖాలు వ్రేలాడేసుకుని, బెదిరిపోతారు. తీరా చూస్తే కొంతసేపటికి మేఘాలు విచ్చి నీలాకాశపు సహజ సౌందర్యాన్ని వ్యక్తపరుస్తాయి. మరోసారి నిర్మలంగా వుంటుందనుకున్న గగనసీమ వెలుగు మాయకుండానే గబగబ నాలుగు మేఘధూళికలు చేరి, చినుకులు కురిపింపచేస్తుంది.
   
    ఈ రెంటికి ఎంత వ్యత్యాసం ఉందో నేను విసృతంగా చెప్పలేను. రెండు నాగరికతలమధ్య నలిగి, అహంకారంతో అప్పుడప్పుడూ అట్టహాసంచేస్తూ, మళ్ళీ మత్తుగా మన్నుతిన్న పాములా మత్తుగా పడివుండే ఈ హైదరాబాదు నగరంలో - యూనివర్సిటీ హాస్టలును విడిచి, సుల్తాన్ బజారులో ఓ యిరుకు సందులోని మేడమీది గది తీసుకొని, శివనాథరావు ఒంటరిగా ఆలోచిస్తూన్నప్పుడు రెండు విభిన్న దృక్పధాలు అతన్ని దహించివేస్తూండేవి. విశాలమైన ఈ నగరంలో అంతులేని ఇరుకుసందులూ, ఒక దారీ తెన్నూలేని వీధులూ ఎన్నో వున్నాయి. ఓ దారంట వెళితే అది ఏమూలకు, ఎంత దూరానికి తీసుకుపోతుందో కొత్తవాడు కనుక్కోలేడు. ఒకరిప్రక్కన ఒకరు నడిస్తే వెడల్పు నిండిపోయేటట్లు వున్న రోడ్లు కోకొల్లలు. ఈ అంతూపొంతూ లేని గొందులవెంట పడిపోవటం, ఎక్కడో తేలి ఎలాగో గదికి రావటం శివనాథరావు దినచర్య అయింది. అతను నివాసమున్న ఇంటి యజమానురాలు "ఇయ్యాల రేపు దొంగోళ్ళెక్కువగా ఉండారు. బేగి వచ్చేస్తూ వుండండి" అని సలహాకూడా యిచ్చింది. కానీ అతను లెక్కచేయకుండా, నిర్లక్ష్యంగా సంచరించినందుకు ఓసారి శాస్తి జరిగింది. నిశిరాత్రివేళ టార్చి వెలిగించుకుంటూ వస్తున్నాడు గదికి. ఇంతలో ఉన్నట్లుండి దారి బంద్ అయింది. ఉలికిపడి ఆగి చూసేసరికి ఎదురుగా రెండు మానవాకారాలు నిలబడి వున్నాయి. ఒకడు కత్తితీసి బెదిరించాడు, వేరొకడు ఉన్నదేదో బయటపెట్టమని గర్జిస్తున్నాడు. ఆ రోజున శివనాథరావు రిస్టువాచీ పెట్టుకుని రాలేదు. జేబులో పెన్, అయిదురూపాయల దాకా డబ్బు వున్నది. అతను ఇవ్వకుండా వాళ్ళే చెయ్యిపెట్టి తీసుకున్నారు. అసలు దెబ్బలాడుదామన్న ఆలోచన రాలేదు శివనాథరావుకు. చోద్యం చూస్తున్నట్లుగా నిలబడ్డాడు. వాళ్ళు ఉర్దూలో ఏదో తిట్టుకుంటూ పోయారు. అతను గదికి వచ్చి పడుకున్నాడు.
   
    అనుకున్న విధంగా నివశించటానికి ఈ ప్రదేశమే అనుకూలంగా ఉంది. ఆ యింటి యజమానురాలూ, అందులోనే కాపురముంటున్న మరి రెండు కుటుంబాలవాళ్ళూ తెలుగువాళ్ళు మిగిలినవాళ్ళు మహారాష్ట్రులూ, గుజరాతీయులూ, మహమ్మదీయులూ ఇలా చాలా తెగలకు చెందినవాళ్ళు. అందరూ పేదరికంతో సతమతమవుతున్న వాళ్ళు. వీళ్ళలో ఒక సుగుణం వుంది. రోజూ ఒకర్నొకరు తన్నుకుంటారు. మళ్ళీ సాయంత్రమయ్యేసరికి భాయి అంటే భాయి అనుకుని ఒకరి భుజాలమీద ఒకరు చేయి వేసుకుని తిరుగుతారు. సాయంత్రం పిట్టగోడదగ్గర నిల్చుంటే చుట్టూ పరిసరాలన్నీ గోచరిస్తాయి.
   
    పేరుకు చాలాభాగం మేడలే. లోపలభాగాలు, గదులు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో వర్ణించలేరెవరూ, కొంతమంది ఎక్కడ కాపురముంటున్నారో ఎవరికీ తెలియదు. బిలాలు, పాఠాళగృహాలూ గుర్తుకొస్తాయి. స్త్రీలు స్నానంచేసే ప్రదేశాలు ఎంత మరుగుగా ఉంటాయంటే ఖర్మంగాలి ఉదయం పదింటిలోపున ఎప్పుడైనా పిట్టగోడదగ్గర నిల్చోవటం తటస్థిస్తే కళ్ళు మూసుకుని పడివుండాల్సిందే. ఒకసారి ఇదే జరిగింది. ఆదివారం ప్రొద్దున్న ఎనిమిది గంటలవేళప్పుడు, అక్కడ నిల్చుని అన్యమనస్కంగా వున్నాడు. ఇంతలోనే మరాఠీవాడు క్రిందనుండి అరుస్తూ సౌంజ్ఞలుచేస్తూ తనని పిలవటం కనబడింది. శివనాథరావు ఏమిటన్నాడు. మరాఠీవాడు మరీ మరీ గట్టిగా హిందీలో కేకలు పెడుతున్నాడు. శివనాథరావుకు మతిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ నిలబడ్డాడు. ఇంతలో క్రిందవున్న అతని చుట్టూ అయిదారుగురు మనుషులు పోగయినారు. అతను వాళ్ళయింటివైపు చూపిస్తూ చేతులూపుతూ వివరిస్తున్నాడు-అతని భార్యామణి జలకమాడుతోంటే యీ యువకుడు మిర్రిమిర్రి పైనుంచి చూస్తున్నాడట. శివనాథరావు క్రిందికి దిగి వచ్చాడు. అక్కడ మూగిన అయిదారుగురూ యితనంటే సదభిప్రాయం వున్నవాళ్ళే. ఆ మరాఠీవాడ్నే చివాట్లు పెట్టి, అక్కడినుంచి బరబర యీడ్చుకు పోయారు. ఇంతలో యింటి యజమానురాలు కూడా బయటకు వచ్చి మరాఠీ వాడిమీద తిట్లు లంకించుకుంది. 'మర్యాదస్తులతో ఎలా మాట్లాడాలో తెలీదూ, చచ్చినోడా....' శివనాథరావు దగ్గరకు వచ్చి 'ఈ మరాఠీవాళ్ళంతా యింతేనండి. పొగరుబోతులు. ఈళ్ళతో మీరేగలేరు బాబూ' అంటూ లోపలకు తీసుకెళ్ళింది.
   
                             *    *    *
       
    పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. ఈ ఏడంతా చదువు సరిగ్గా సాగలేదు. సరిగ్గా ఇంకా రెండు నెలలున్నాయి. దీక్షగా చదువుదామంటే ఏకాగ్రత కుదరట్లేదు...రాత్రి రెండుగంటలవరకు అతని గదిలో లైట్లు వెలుగుతుండేవి. పుస్తకాలు ముందేసుకుని వాటితో సతమతమవుతూ వుండేవాడు. ఒక్కోసారి ఉద్రేకం వచ్చేది 'ఎందుకు చదవలేను?' అనుకునేవాడు. తెల్లవార్లూ అలా కుర్చీలో కూర్చుని కష్టపడుతూ వుండేవాడు.
   
    హాస్టల్ లో వుండగా పూర్వం స్నేహితులతో సులభంగా కాలక్షేపం అయిపోయేది. ఇప్పుడితనికోసం యింతదూరం ఎవరూ రారు. ఇతను గది విడిచి ఎక్కడకు పోడు. మిగతాస్టూడెంట్స్ అంతా నిరంతరం ఆడపిల్లలతో పరిహాసోక్తులు ఆడుతూ, చేతులు పట్టుకుని తిరుగుతూ వుండేవాళ్ళు. మొదటి రెండు సంవత్సరాలూ ఈ అమ్మాయిలు అంత చనువుగా వుండేవాళ్ళు కాదు. ఏ స్టూడెంటయినా వచ్చి పలకరించినా అవసరమైనంతవరకు జవాబులు చెప్పి పోతూ వుండేవాళ్ళు. క్లినికల్ కోర్సులోకి వచ్చాక వ్యవహారం అంతా తారుమారయింది. స్టెతస్కోపులు మెడల్లో తగిలించుకుని ఒకరి భుజాలను ఒకరు రాసుకుంటూ లిఫ్ట్ లో పైకీ క్రిందికీ పోతూ చలాకీగా వుండేవాళ్ళు. ఇంక పబ్లిక్ గార్డెన్స్ కు, సినిమాలకు సరేసరి. అయిదారుగురు లవ్ మేరేజి చేసుకున్నారు. శివనాథరావు వాళ్ళతో అంత పూసుకుని తిరక్కపోయినా దూరంగా ఎప్పుడూ లేడు. కాకపోతే వాళ్ళను వెంటేసుకుని షికార్లు కొట్టేవాడు కాదు.
   
    ఈ నాలుగేళ్ళలోనూ మెడికల్ కాలేజీలో అతన్తో బాగా తిరిగిన యువకుడి పేరు ప్రతాప్. అతను తెలంగాణావాడు. ఆంద్ర ప్రాంతంనుంచి వచ్చిన మనుష్యులంటే ద్వేషం వుండేది. శివనాథరావు అంటే మట్టుకు యిష్టపడుతూ వుండేవాడు.
   
    సరిగ్గా పరీక్షలు యింకో రెండు నెలలున్నాయనగా నగరంలో అల్లర్లు బయలుదేరాయి. ఆంద్ర-తెలంగాణా ఏకం చేస్తారని, వ్యతిరేకంగా అలజడులు రేగాయి.  ప్రతాప్ చాలా ఆవేశపరుడు. చిన్నతనమునుంచీ కూడా ఏదో ఉద్యమంలో పాల్గొంటూ ఉండేవాడు. అతని జీవితచరిత్ర కూడా చాలా చిత్రమైనది. ఏ గదిలోనూ నిలకడగా రెండు నెలలపాటు వుండేవాడు కాదు. కొన్నాళ్ళు ఓ చేపలవాళ్ళ పాకలో వాళ్ళతో కలసిమెలసి జీవించాడు. ఇంటి యజమాని, అతని భార్య, తాగివచ్చి తానా తందనాలు త్రొక్కి మరునాడు లేవంగానే అతని కాళ్ళుపట్టుకుని వలవలా ఏడ్చేవాళ్ళు. వయస్సు వచ్చిన అతని కూతుళ్లిద్దరూ ప్రతాప్ ని అన్నా అన్నా అని పిలుస్తుండేవాళ్ళు...కొన్నాళ్ళకు అక్కడినుండి వెళ్ళిపోయాడు. రజకార్లటైములో అక్కడే వుండి తన ప్రాణాలను లెక్కచేయకుండా ఎంతమందినో కాపాడటానికి ప్రయత్నించాడు. అప్పటికతను బాగా చిన్నవాడు. అయినా ఒకటిరెండుసార్లు మృత్యుముఖం చూశాడు. పోలీస్ యాక్షన్ జరిగాక-ఓ యిరవైమంది హిందువులు ఒక్కుమ్మడిగా ఓ రజాకారు నాయకుడి యింటిమీద దాడిచేసి, అతన్ని బయటకు యీడ్చి కొట్టి, చంపేశారు. అంతకు క్రితం రోజువరకూ అతను చేసిన కిరాతకృత్యాలకు, ఘాతుకలకు అంతులేదు. ఎందరి స్త్రీలనో బలవంతంగా నాశనం చేశాడు. అతను మంచంక్రింద దూరి దాక్కుంటే అతని భార్య 'ఇదిగో యీ దుర్మార్గుడు మీ ఇష్టం వచ్చినట్లు చెయ్యండి. శని విరగడై పోతుంది' అంది. అతన్ని హతమార్చాక వీళ్ళ కళ్ళు ఆమెమీద పడినై. ఆమె పరమ సౌందర్యవతి. వీళ్ళ ఉద్దేశం కనిపెట్టి ఆమె ఓ మూలకు ఒదిగిపోతూ నిల్చుంది. ఒకరిద్దరు యువకులు వికటాట్టహాసం చేస్తూ ముందుకు వచ్చారు. ఆ సమయంలో ప్రతాప్ వెళ్ళి ఆమెకు అడ్డం నిల్చున్నాడు. అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయ్ 'వీల్లేదు' అన్నాడు. వీళ్ళు పెంకెతనం చేయబోయారు. తను కత్తి తీశాడు. పెద్దవాళ్ళు యువకుల్ని వారించి 'సిగ్గులేదు' అన్నారు. ఆ యువకులు ప్రతాప్ ని తిడుతూ వెళ్ళిపోయారు. ఆ యువతి అతని పాదాలమీద పడి ఏడ్చి తనని పాకిస్తాన్ చేరవేయమన్నది. ఆమెను తీసుకుని, కాపాడుతూ పాకిస్తాన్ బోర్డర్ దాకా వెళ్ళి దింపివచ్చాడు. ఓసారి ఓ మారణహోమంలో పదేళ్ళ పిల్లవాడిని శత్రువులు బూడిద చేయబోతోంటే, అతన్ని ఎత్తుకుని రెండు మైళ్ళు తుప్పల్లో, అడవుల్లో పరిగెత్తాడు.

 Previous Page Next Page