"క్షమించండి...... మాకు అందిన ఆధారాన్ని బట్టి కృష్ణ డబ్బుతీసుకుని ఇంటికి వచ్చాకనే ఆత్మాహుతికి సిద్దపడ్డాడు."
"లేదు ఇది అబద్దం."
"పోనీ..... మీ వాడి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులెవరయినా వున్నారా?"
చెప్పింది విల్సన్ గురించి అనాలోచితంగా.
ఆ మాత్రం చాలన్నట్టు వెళ్ళిపోయాడు యస్సై
కృష్ణ చివర రాసిన ఉత్తరంలోని హామీని, ఇప్పుడు యస్సై అడిగిన డబ్బుకి సంబందించిన వివరాల్ని సమన్వయపరచుకుంటూ అర్ధంకాని సందిగ్ధంలో నిలబడిపోయింది తప్ప విల్సన్ గురించి నోరుజారి తనెంతపొరపాటు చేసిందీ తెలుసుకోలేకపోయింది.
వచ్చినవాడు యస్సై అన్నది నిజమేకాని నిజానికి వచ్చింది పరిశోధనకి కాదు......
మరణించేముందు కృష్ణ తన విషయాన్ని మరో మనిషి కెవరికయినా తెలియపరిచాడా అన్నా నిజం తెలుసుకుని త్యాగి ఇన్వెస్టిగేషన్నే పై ఎత్తు వేసి ప్రతిఘటించాలని.
ఆ యస్సైని పంపించి బ్రహ్మాజీ.....అదీ పరమహంస ఆదేశంపై. త్యాగి తెలుసుకోవాలనుకున్న వాస్తవానికి విఘాతం ఏర్పడింది ఇక్కడే
* * *
సాయంత్రం ఆరుగంటల సమయం......
ప్రారంభోత్సవం పూర్తయిన యూనివర్శిటీ ఆడిటోరియం విద్యార్ధుల తో కిక్కిరిసి వుంది.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వాగతోపన్నాసం పూర్తి చేసి ముఖ్యు అతిధి గౌరవనీయులైన విద్యాశాఖామంత్రి సింహాచలం ప్రక్కన ఆసీనులయ్యారు.
ముఖ్యవక్త త్యాగి ఆడిటోరియం ముందు వరుసలో కూర్చున్న సౌందర్యనిగాని,
ఇక్కడ మరికొన్ని నిమిషాలలో ఓ 'దాడి' ని ఎదుర్కోబోతున్నానని గాని ఆలోచించడం లేదు. నిజానికి ఇలాంటి సమయంలో అలవాటు లేని ఫంక్షనుకి రావడం అతడికీ యిష్టంలేని విషయమే..... అయినా కాదనలేకపోయాడు. కేవలం సౌందర్యకోసం.....
"మహాజనులారా" సింహాచలం బరువైన పూలదండని యింకా మెడలోవుంచుకునే తన ఉపన్యాసం ప్రారంభించాడు" అసలీరోజు సేనా మంచిరోజని యిలా యెలిపోచ్చిశానుగని పెబుత్వానికిది తీరికలేనిరోజని నేను మనవిసేస్తావున్నాను ..... అసలుసదువంటే యేటి...... అచ్చరాలు నేర్చుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించడమేగాని యిలాగ యిధ్యార్దిలోకం అల్లర్లకి పూనుకోడం నాకే కాదు పూజ్యబాపూజీకీ నచ్చని యిసయమని మనవిసేస్తావున్నాను...."
"ఈరోజు ...... అచ్చరాస్యత వుండి సదువుకున్నోలంతా బస్సుల్ని తగలెట్టిఒంటిమీద పెట్రోలు పోసేసుకుని పెబుత్వాల్ని పడగొట్టేయాలనుకోడం సేనా దారుణమని మనవి సేస్తూ అక్కడ నాకు సీప్ మినిస్టరుగారి తోటి సమావేశముంది కాబట్టి యిక శలవు తీసుకుంటాననిసెప్పి యెల్లిపోతున్నా" అంటూనే వేదికపై నుంచి క్రిందికి దిగాడు.
అత్యవసర సమావేశం వున్నమాట నిజమే గాని యిప్పుడు విద్యాశాఖామాత్యుడు భయపడింది. తన భాష వింటూ ఏ క్షణంలో అయినా 'మోత' కి సిద్దపడే విధ్యార్దుల గురించే కాదు స్టేజీమీద వున్న త్యాగిగురించి కూడా.
వెనకాముందూ చూసుకోకుండా ఎడాపెడా వాయించడంలో సిద్దహస్తుడని ముఖ్యమంత్రితో సహా చాలామంది త్యాగి గురించి మాట్లాడుకోవడం విన్నవాడు కావడంతో అర్జెంటుగా జరుకున్నా వైస్ ఛాన్సలర్ తో బాటు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంటుతోడు వెళ్ళగా.
వైస్ ఛాన్సలర్ కి సైతం విద్యాశాఖామంత్రిగారు వెళ్ళాక డయాస్ పై కూర్చోవడం యిష్టంలేదు. తనపదవీ కాలం పొడిగింపు గురించి కారులో తోడు వెళ్ళి అడగాలనుకుంటూనే అవకాశం లేక వెనక్కి వచ్చాడు.
అప్పటికే మాట్లాడుతున్నాడు త్యాగి మైక్ ముందు నిలబడి "ఉపనిషత్తులు ఇతి హాసాలతో ప్రపంచ ప్రజల మన్ననల్ని పొందడమే గాక ప్రపంచంలోని మొదటి గ్రంథంగా ప్రస్తుతింపబడే ఋగ్వేదం పుట్టినవేదభూమి యిది. సున్నాని తొలిసారి కనిపెట్టినదాని స్థాన విలువని నిర్ణయించి ప్రపంచగణిత శాస్త్రాన్ని ఓ అసాధారణమైన మలుపు తిప్పిన భరత ఖండమిది. స్వరాజ్య సాధనకోసం వీరోచిత పోరాటాలు కొనసాగించి ఆత్మత్యాగాల చరిత్రలతో ప్రపంచ సంస్క్రుతికే తలమానికమైన భగవద్గీత యిది...... ఏ మౌతూందిప్పుడు....."
చీమచిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం ......
"ఈదేశం ఎటువైపు ప్రయాణం చేస్తూంది. వేలిముద్రలు పెట్టడం చేతకాని వాడు యిక్కడ విద్యాధికుల్ని ఆదేశించగల శాసనకర్త. భగత్ సింగ్ ని ఎందుకు వురి తీసిందీ తెలీనివాడు విప్లవ యోధుడు...... హృదయకవాటాలను తెరిచి పీడితమన్యవాసుల కోసం పోరాడి ప్రాణాలొడ్డిన అల్లూరి సీతారామరాజు ఏ ఊరివాడో తెలీనివాడు అతడి పేరిట జరిగే ఉద్యమానికి మూలకర్త. ప్రాథమిక హక్కుల గురించి విధుల గురించి తెలియని వాళ్ళు పదవుల్లో ఉంటారు ఆమరణ నిరాహారదీక్షలకి ఆత్మాహుతులకి అర్ధంతెలీని వ్యక్తులు చేసే హత్యలు యిక్కడ నిరక్షరాస్యులైనా ప్రజలకి శిరోధార్యాలు..... శాసనోల్లంఘనంతో తెలుగు ప్రజల్ని ఉప్పు సత్యాగ్రహంవేపు మళ్ళించిన కాళేశ్వర్రావుని తెలీనివాళ్ళు మనతెలుగు నేతలు."
అది ఉపన్యాసం కాదు..... సంక్షుభిత హృదయ ఘోషలా ఉంది.
"ఇక్కడ రాజకీయం ఓ గేంబ్లింగ్...... దానికి పెట్టుబడిగూండా యిజం ..... కనీస విద్యార్హతని నిర్దేశించని రాజ్యాంగం యిక్కడ ప్రతి వ్యక్తీ రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశ మిచ్చింది, మంచీ చెడూ విచక్షణ తెలీని అజ్ఞులకీ, యిక్కడ ఓటు హక్కు వుంది. వారు కొనబడే అవకాశంగా పేదరికమూ యిక్కడ అనుక్షణం తాండవిస్తూ వుంటుంది. కాబట్టి అప్రయోజకులు నాయకులౌతారు...... ప్రభుత్వాలను ఏర్పరచడానికి మెజారిటీలేనివాడు ముందు ఓటర్లని కొన్న నాయకులు ఆ తర్వాత ఎన్ని కైన సభ్యుల్ని కొంటారు.....ఆ కొనడానికి కేపిటలిస్టుల దగ్గర డబ్బుని పెట్టుబడిగా వాడుతారు...... ప్రభుత్వంలో చీలికలు వస్తేవాళ్ళ బేరసారాలలో విఘాతమేర్పడితే లోక్ సభల్ని రద్దు చేస్తారు. వేయికోట్లఖర్చుతో మరోసారి ఎన్నికలు జరిపించి యీ దేశంలోపుట్టిన పాపానికి మీ ఖర్మకి భారాన్ని మీరే భరించండంటూ సగటు జీవన ప్రమాణంగల ప్రజల బ్రతుకులతో చెలగాటమాడుతుంటారు. POLITICS IS A BLOODY SPORT ....." క్షణం ఆగేడు.
"అందుకే ఈ రోజు ఓ కృష్ణ హత్యచేయబడ్డాడు..... మనిషి వ్యక్తిత్వాన్ని నాశనం చేసే ప్రక్రియ వేరే రాజకీయం! కాబట్టే విద్యార్ధులకి రాజకీయ అవగాహన తప్ప రాజకీయ జోక్యం కూడదంటాడు ఒట్టోవాన్ బిస్ మార్క్..... ఇది ఈ దేశపుసూక్తేకాదు.
అన్నిదేశాల రాజకీయాలకీ అన్వయించాల్సింది ..... నదిలేని చోట కూడ బ్రిడ్జిలు కడతాననే వ్యక్తి వేరే రాజకీయనాయకుడన్న నికితాకృశ్చేవ్ ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్టు మాటాడేదే రాజకీయమన్న బెర్నార్డ్ షా లాంటి ప్రముఖుల అభిప్రాయమూ అదే."
అప్పుడు చూశాడు త్యాగి ......
చప్పట్ల మధ్య సౌందర్య వేగంగా డయాస్ పైకి వస్తూంది.....
స్టేజ్ పై వున్న వ్యక్తులగురించి ఆమె పట్టించుకున్నట్టులేదు.