అయినా మళ్ళీ పత్రికాఫీసుకి బయలుదేరాడు రాత్రి తొమ్మిది గంటలవేళ ...... రాష్ట్రంలో ఉధృతమైపోతున్న ఉద్యమం కాస్త తగ్గుముఖం పట్టాలీ అంటే కృష్ణ మరణంలోని అసలు రహస్యం తెలుసుకోగలగాలి.
ప్రెస్ లో అడుగు పెడుతూనే తెలుసుకున్నాడు-ఈరోజు మరో నలభైరెండు ఆర్టీసీ బస్సులు తగలబడ్డాయి. వివిధ జిల్లాల్లో చాలాచోట్ల జూనియర్ కాలేజీల శలవులు ప్రకటించారు. బడలికగా తన ఛాంబర్లో అడుగు పెట్టాడు. అర నిమిషం గడిచిందో లేదో ఫోన్ రింగయింది.
"త్యాగి హియర్"
"నేను......సౌందర్యని"
"హల్లో! హౌడూయూడూ"
"ఫైన్....... మీ కోసం ప్రయత్నించడం యిది నాలుగోసారి"
"రేపు మీటింగ్ గురించేగా?"
"దానికి వస్తానని మాటిచ్చారుగా"
"నిజానికి రావాలని ఆసక్తి లేకపోయినమాట నిలబెట్టుకుంటాను."
"అసలు నేను ఫోన్ చేసింది అది గుర్తు చేయటానికికాదు"
"మరి......"
"ఈరోజు ఉదయం అబ్జర్వర్ లో మీ కాప్షన్ చూసేను అదే యువతి మానభంగం వ్యవస్థ రాజకీయం...... బాగా కోయిన్ చేశారు."
"నేను చేసింది ఇంగ్లీషులో"
"అంటే మీకు మంచి ఇంగ్లీషు వచ్చనినాకిప్పుడు బోధపడింది."
"నేను సైకాలజీలో పిజి చేస్తున్నాను"
"లిటరేచర్ లో కాదుగా"
"అంటే మీరు పొలిటికల్ సైన్స్ పోస్టు గ్రాడ్యుయేట్ కాదన్న మాట!"
నవ్వుకున్నాడు త్యాగి. సౌందర్య ఇక్కడ తానూ లిటరేచర్ పీజి చేయని విషయం గుర్తుచేస్తూంది తెలివిగా "యస్......! నేను పొలిటికల్ సైన్స్ తో పోస్టు గ్రాడ్యుయేట్ నే కాని లిటరేచర్ బాగాచదివాను."
"ఆపని నేనూ చేసి వుండొచ్చుగా?"
"అఫ్ కోర్స్"
"దీన్నిబట్టి మీకో విషయం అర్ధమయ్యుండాలి"
"ఏమిటి"
"మిమ్మల్ని మీరు మాత్రమే ఎక్కువ అంచనా వేసుకోవడం మంచిది కాదని."
మళ్ళీ తన సహజ ధోరణిలో అవహేళనకి సిద్దపడుతుంది. "సో..... మీ మేధస్సుని గుర్తించితీరాలనుకుంటాను."
"కాదు మేధస్సు ఏ ఒక్కరి సొత్తూకాదని తెలియచెప్పాలనుకుంటున్నాను."
తనపై ఒక చిన్న గెలుపు కోసం ఆమె ఎంత తపించిపోతున్నదీ అర్ధమయిన త్యాగి చర్చని ఆపదల్చుకోలేదు. "సైకాలజీలో PRIVATEI" అనే ఓ కాంప్లెక్స్ గురించి మీకు తెలిసివుండాలి సౌందర్యా!"
"దాని గురించి మీకెంత తెలుసో తెలుసుకోవాలనుంది."
"వెల్...... అయితే వినండి......మనిషి సామాన్యంగా అహంకారమనే ఎస్కేప్ ప్రూఫ్ షెల్లో తననుతాను బంధించుకొని తిరుగుతున్న భూగోళానికి తనే సీలగా అనుకుంటాడు....... ముఖ్యంగా మీలాంటి అమ్మాయి......కాబట్టి యిలా మాట్లాడాలని కోరుకుంటారు....."
"పత్రికలో మీ రాతలు అహాన్ని ప్రదర్శించుకోటానికి కాదు...... నా ఎదుటి మనుషుల్లోని అతడు, ఆమె, వారు అనే పదాల్లో 'నేను' ను చూసుకుంటూ ఒక నష్టం తర్వాత 'నేను' పొందిన బాధ అతడు, ఆమె, వారు అర్ధం చేసుకోవాలని....."
"విశ్లేషణ జటిలంగా వుంది."
"దాన్ని PRIVATE కాంప్లెక్స్ అంటారు మరి."
"జీవితంలో ఒంటరితనం ఇలామాట్లాడిస్తుందంటాడు ఓ ప్రముఖ సైకో అనలిస్ట్......"
మృదువుగా నవ్వాడు త్యాగి "ఈ లోకంలో ప్రతి మనిషి ఒంటరివాడే సౌందర్యా!"
"అదిపుట్టేటప్పుడు"
"కాదనకండి...... మీ క్లాస్ రూం లో ఏభైమంది స్టూడెంట్స్ మధ్యమీరు కూర్చునుండొచ్చు. అయినా మీరు ఒంటరివాళ్ళే......"
"అదేమిటి"
"రోజూ ఉదయాన్నే క్లాసులో అడుగుపెడుతూ హవ్వార్యూ అంటూ అంతా పలకరించుకుంటారు. కానీ నిజానికి మీరు ఎలా వున్నదీ ఎంత మందికి చెప్పుకోగలుగుతున్నారు? ఉదాహరణకి మనమధ్య వున్న కేసెట్ బంధాన్నే తీసుకోండి...... ఏ ఒక్కరికైనా చెప్పుకోగలిగారా.....అలాంటప్పుడు మీ చుట్టూ వున్న ఏభై మందిలో మీరు కూర్చున్నా మీ ఆలోచనల్ని మనసు విప్పి పంచుకోలేకపోవడం ఒంటరితనమేగా?"
అరక్షణం నిశ్శబ్దం తర్వాత అంది "అలాంటి స్థితిని అధిగ మించాలంటే ఏం చేయాలి?"
"సింపుల్.....మీ చుట్టూ వున్న మనుషుల్ని మీరు ప్రేమించగలగాలి. ఈ ప్రపంచంలో మోస్ట్ డిజలైకబుల్ పర్సన్ ప్రపంచాన్ని డిజ్ లైక్ చేసే వ్యక్తే......"
అని అందించాలనుకున్న సందేశాన్ని అవకాశం తీసుకుని తెలియచెప్పాడు.
"నేను ప్రపంచాన్ని ద్వేషించేశాడిస్ట్ ను కాను"
"మార్పుకనిపిస్తూందిప్పుడిప్పుడు"
"అదెలా"
"మొన్న 'నువ్వు' అంటూ మాట్లాడిన మీరు యిప్పుడు 'మీరు' అని సంబోధిస్తూ మాట్లాడారు కాబట్టి....."
"మీరూ అలానే మాట్లాడారుగా"
"ఎస్...... ఈ వూరికి ఆ వూరెంత దూరమో ఆ వూరికి ఈ వూరూ అంతే దూరంగా ......"
"థేంక్యూ....."
"మెన్షన్ నాట్"
"రేపు డయాస్ మీద యింత ధాటికి మీరు జవాబులు చెప్పాలి."
"వెల్ కమ్"
ఫోన్ క్రెడిల్ చేసిన త్యాగి అదృష్టవశాత్తు పట్టించుకోలేదు......
రేపు వేదికపై కూర్చునేది వక్తగా..... జవాబులు చెప్పే వ్యక్తిగాకాదు..... అందుకే ఆమె పథకం ఆ క్షణంలో అర్ధం చేసుకోలేకపోయాడు.
* * * *
సరిగ్గా అదే సమయం.....
తలుపుతట్టిన చప్పుడు విని ద్వారం తెరిచిన పార్వతి ఎదురుగా నిల్బడి వున్న ఇన్స్ పెక్టర్ ను చూసి కంగారుపడింది......
అప్పటిదాకా ముగిసిన తమ్ముడి కథ అమ్మకి తెలియకుండా బుజ్జగించిన పార్వతి అమ్మ నిద్రపోవడం గమనించింది ఉద్విగ్నంగా బయటకువచ్చింది.
"మీ అమ్మగారు....."
గొంతు స్థాయి తగ్గించి అంది "నిద్ర పోతూంది."
"చెప్పాల్సిందంతా సాయంకాలమే స్టేషన్ లో చెప్పాను. ఇంటికొచ్చి అమ్మకి విషయం తెలిసేట్టుచేయొద్దని ప్రాధేయపడ్డాను......ఈ రాత్రి వేళలో మళ్ళీ ఎందుకొచ్చారు"
ఆమెకళ్ళనీళ్ళ పర్యంతమైపోతూంది.
ఆ వీధిలో కృష్ణ మరణం గురించి తెలిసిన అందరికాళ్ళూ పట్టుకుని ప్రాధేయపడింది...... రేపో మాపో ఇల్లు ఖాళీ చేసి మరోచోటకో, వూరికో వెళ్ళిఅమ్మను రక్షించుకోవాలనుకుంటూందికూడా...
రాత్రిపది గంటలు కావడంతో వీధిలో అంతగా జనసంచారం లేదు. కాని ఒకటీఅరా యిళ్ళ ముందు నిలబడి యస్సైతో ఆమె చర్చించటాన్ని గమనిస్తున్నారు కొందరు.
"కావాలంటే నన్ను స్టేషన్ కి తీసుకెళ్ళండి"
"క్షమించండి....." ఆమెను అర్ధం చేసుకున్నట్టు నెమ్మదిగా అన్నాడు. "మీ స్థితి తెలిసీమిమ్మల్ని మరి కాస్త యిబ్బంది పెట్టాల్సివస్తూంది. పై అధికారుల ఆదేశంలో మరి కొన్ని విషయాలు రాబట్టాలని ఇలా వచ్చాను."
"అడగండి!"
"ఇందాక పోలీస్ స్టేషన్ లో కృష్ణ గురించి మీ అభిప్రాయమే అడిగి తెలుసుకున్నాం తప్ప కృష్ణ తెచ్చిన డబ్బు గురించి....."
దిగ్భ్రాంతిగా చూసింది.
"కృష్ణ డబ్బు తేవడమేమిటి. వాడు దొంగ కాదు....."
"ఆవివరాలు ఇప్పుడప్పుడే చెప్పలేం మేడమ్....... కాని కృష్ణ చాలా పెద్దమొత్తంలో డబ్బు తెచ్చి మీకిచ్చాడని తెలిసింది."
పార్వతి కళ్ళ నుంచి బొటబొటనీళ్ళు రాలేయి.
"లేదు....... వాడు డబ్బు తేలేదు. అంత డబ్బే సంపాదించగల సమర్దుడైతే వాడలా కాలిచావాల్సిన అగత్యం లేదు...... సర్....." వెక్కిపడి పోతూంది" ఓ తల్లికి కడుపుకోతని, వున్న ఒక్కగానొక్కతోబుట్టువుకి నూరేళ్ళ శోకాన్ని మిగిల్చి చితాభస్మంగా మారిపోయినవాడ్ని అనుమానిస్తూన్న మమ్మల్ని అనుమానించకండి. కావాలంటే ఇల్లు సోదా చేసుకోండి. అమ్మ నిద్ర లేచినా ఫర్వాలేదు. కాని నిద్రలేచి అడిగితేనన్నో దొంగగా అనుమానిస్తున్నట్టు చెప్పండి గాని మాతమ్ముడి గురించి మాట్లాడకండి......"
ఆమె మాటలలోని ఆర్తిని అర్ధం చేసుకున్నట్టు చూశాడు యస్సై,