ఇన్ స్పెక్టర్ కి విషయం బాగానే అర్ధం అయింది- పాపన్న ఠాకూర్ మనిషి....గోపన్నని జైలులోంచి తప్పించటానికి పాపన్నని పంపాడు. ఠాకూర్ ఏదో ఒకటి చాలుగా తనకి సమర్పిస్తే తను ఏ గోల లేకుండా గోపన్నని ఉపాయంగా బయటికి పంపించేవాడు. తాను బన్సీలాల్ ఫ్రెండ్ కావటంతో ఠాకూర్ కి తాను శతృవయ్యాడు....తాను బన్సీలాల్ కి ఓ కట్టుకధ చెప్పాడు...విచిత్రంగా అదే నిజమయింది. ఇప్పుడు మళ్ళీ బన్సీలాల్ కి కొత్త కధ సృష్టించి నమ్మేలా చెప్పాలి....కధ చాలా పకడ్ బందీగా ఉండాలి.
ఇన్ స్పెక్టర్ అలా ఆలోచించి కోడి దొంగని మరికొన్ని ప్రశ్నలు వేశాడు__వాడు యిచ్చిన సమాధానాలు సంతృప్తి కలిగించాయి. ప్రస్తుతానికి వాడిని జైలులోనే వుండమన్నాడు.
ఇన్ స్పెక్టర్ కి తెలియంది ఇక్కడ ఒకటుంది.
శక్తిమాయి మనిషి పాపన్న....పధకం ప్రకారం జైలుకి వచ్చాడు. గోపన్నని విడిపించుకు వెళ్ళాడు .....కోళ్ళ దొంగకి మిగతా ఇద్దరు దొంగలకి అసలు విషయానికి మరికొంత మెరుగులు జోడించి కొత్తకధ చెప్పాడు. ఖర్మకాలి వీళ్ళలో ఎవడైనా పట్టుబడితే పోలీసులకి ఏం కధ చెప్పవలసింధీ వివరంగా బోధించాడు పాపన్న.
కోళ్ళదొంగ పట్టుబడటము జరిగింది__అలా పట్టుపడటం కూడా ప్లానులోభాగమే, చెప్పమన్న కధని చక్కగా చెప్పటము సరిపోయింది. ఇన్ స్పెక్టర్ నమ్మటము జరిగింది.
ఈ కొత్త కధవల్ల శక్తిమాయి పాపన్నని గోపన్నని విడిపించిందని తెలియకపోగా ఠాకూర్ తన మనిషిని రహస్యంగా పంపి గోపన్నని తెలివిగా జైలునుంచి తప్పించి నట్లయింది.
"ఠాకూర్ మనిషి గోపన్న. అంటూ కొత్త అనుమానం ప్రవేశపెట్టి ఠాకూర్ నీమీద పగబట్టాడు. మనిద్దరం స్నేహంగా వుండటం చూడలేకపోతున్నాడు...ఇలాంటి కల్పితాలతో బన్సీలాల్ బుర్రని పాడుచేశాడు ఇన్ స్పెక్టర్. ఆ కల్పిత కథకి ఈ కథకి చక్కగా సరిపోయింది."
ఇదేమి తెలియని ఇన్ స్పెక్టర్ మరింతగా బన్సీలాల్ ని నమ్మించడానికి కొత్తపధకం వేస్తున్నాడు .... ఠాకూర్ జోలికి తనుపోతే ప్రమాదం., అందువల్ల బన్సీలాల్ ని మాయ మాటలతో ఠాకూర్ పైకి ఎగదోస్తే రెండు మీరుపర్వతాలు ఢీకొంటాయి. జరగబోయేది తను చూస్తూ వుండవచ్చు...
అతని ప్లాను అది.
సక్సెస్ అవుతుందా కాదా అనేది వేరే విషయం.
వేచి చూడాల్సిందే.
24
సాయంత్రం
బన్సీలాల్, ఇన్ స్పెక్టర్ కల్సుకున్నారు.
"ఇది చదవండి..." అన్నాడు బన్సీలాల్ కవరు అందిస్తూ.
"ఏమిటి?" ఏమీ తెలియనట్లు అడిగాడు అతను.
"బెదిరింపు లేఖ" ముఖం గండుపిల్లిలా పెట్టుకుని ఎర్రబడ్డ కళ్ళతో ఆవేశంగా అన్నాడు బన్సీలాల్.
"ఈ రోజు పోస్ట్ లో వచ్చింది అవునా?" అతను ఏడ్వలేక నవ్వుతూ అడిగాడు.
"మీ కెలా తెలుసు?"
"నాకు ఇంకా చాలా తెలుసు లాల్ జీ!"
"అంటే?"
"ఆ లేఖ మండిపడే సూర్యుడు అనే ఆకాశరామన్న గారు మర్యాద పూర్వకంగా రాసి వుంటారు....యామై కరెక్ట్?"
"ఈ విషయం మీ కెలా తెలిసింది?"
"మీరలాఅనుమానంగా అడిగితే లాభంలేదు లాల్ జీ నాకు తెలిసింది అంటే ఏదో పెద్దకథ వున్నట్లే కదా!"
"విషయమేమిటో చెప్పండి... నాకంతా అయోమయంగా వుంది" బన్సీలాల్ బలవంతానా చేదు తిన్నట్లు ముఖంపెట్టి అన్నాడు.
"జరిగేది జరక్కమానదు లాల్ జీ! మీ లేఖ సంగతి నా కెలా తెలుసని కదూ మీ అనుమానం? అది యిప్పుడే తీరుస్తాను...లేకపోతే మీరు అపోహపడి నన్ను అనుమానిస్తారు. నాకు ఈ రోజు పోస్ట్ లో ఓ కవరు అందించి...ఆ విషయం మీతో చర్చించటానికి నేను మీ యింటికివచ్చాను మీరు కవరుతీసి చూపంగానే కథ అర్ధమైంది. నా కవరు మీద ఎడ్రస్ పచ్చయింకుతో రాసి వుంది. మీ కవరుమీద ఎడ్రస్ కూడా అలాగే వుంది__యింకు కలర్ చూడంగానే బెదిరింపు లేఖ నాకే కాదు మీకూ వచ్చిందని అర్ధమైంది."