Previous Page Next Page 
మధుకీల పేజి 4

    రెండూ పది!
    ఇక లాభంలేదని రోడ్ క్రాస్ చేసి వెళ్ళాడు సుధాకర్.
    మరో నిమిషం తర్వాత వచ్చిన బస్ అందుకుని సినిమాకి వెళ్ళిపోయేడు.
                                            *        *        *

    "భూమి గుండ్రంగా వుంటుందని వూరికే పాఠం నూరిపోస్తారు. కానీ బస్ లోనో కారులోనో కూచోపెట్టి తిప్పితే పిల్లలకి బాగా అర్ధమౌతుంది, చూడండి. మనం వెళుతోంటే చెట్లూ చేమలూ ఎలా గిర్రుని తిరిగి వెడుతున్నాయో" అంది కారు డ్రైవ్ చేస్తూ మధు పక్కన కూర్చున్న మణి.
    "టెలివిజన్స్ ద్వారా చదువు చెపుతారటలే! ఆరోజు వచ్చేసరికి ఇదీ వచ్చేస్తుంది" అన్నాడు మధు.
    "అవును ఆ పద్ధతే బావుంటుంది. సినిమా చూసినట్టు చూడొచ్చు. కాలేజిల్లో వెధవ బోర్. లెక్చరర్ ముఖం బావుంటే సరే! లేకపోతే ఆ వెధవ ముఖాలు చూస్తూ పాఠం వినాలంటే నరకంలో వున్నట్టుంటుంది."
    "బావుంది. మనం ‍ఒక ముఖం చూడటానికే అంత యిదవుతే పాపం ఆయన వందముఖాలు చూడాలికదా" అన్నాడు నవ్వి మధు.
    "మన ముఖాలు చూసినందుకు వాళ్ళకు నెల నెలా జీతాలిస్తారు తెలుసా మనం టెర్మ్ టెర్మ్ కి ఫీజ్ కట్టి కాలేజికి వెళతాం."
    "అందుకే పాసయితే డిగ్రీ ఇస్తారు"
    ఆ మాటకి ఉడుక్కుంది మణి. ఆమె కాలేజిలో ఐదేళ్ళు చదివినా డిగ్రీ రాలేదు. ఆ కోపంతో జవాబు చెప్పలేదు మణి.
    మధు రెట్టించలేదు.
    కాలవగట్టుకి తిరిగింది కారు మెయిన్ రోడ్ నించి.
    "పొలాలు ఎంత బావున్నాయో చూడు! ఇలా పంటలు బాగా పండుతున్నా రైతులింకా బీద అరుపులే అరుస్తారు" అన్నాడు మధు.
    "ఊఁ ఫాక్టరీకి బళ్లు బళ్లు చెరుకుతోలి మీ ఆదాయాన్ని పెంచుతుంటే బళ్లకి డబ్బివ్వటానికి ఏడుస్తారు. పాపం రైతులకి ఏం గిడుతుంది? మొన్న కృష్ణయ్య నాన్నతో చెపుతూ వుంటే విన్నాను. నాలుగెకరాలు వరి నాటితే బ్లాస్ట్ వచ్చి సర్వనానమైపోయిందట. 4-14 నాటాడట. నాలుగెకరాలకి పాతిక బస్తాలుకూడా వచ్చేట్టుగా లేదట. అంతా చెరుకు నాటటానికి తగినంత పెట్టుబడి లేదట. ఏమైనా కాస్త అప్పిప్పించమని అడుగుతున్నాడు. వాళ్ల బంధువులు వాళ్లని"
    జవాబు చెప్పలేదు మధు.
    అంతలో ఎవరో వ్యక్తి కనిపిస్తే కదిపింది మణి.
    "కృష్ణప్రసాద్ గారి పొలాలెటువేపు చెపుతారా?"
    "అల్లదిగో ఆ మావిడి తోపు దాటాక ఆరంభమయ్యే చెరుకుతోటంతా ఆరిదే"
    "థాంక్స్" అని కారు కదిలించింది మణి."
    ఆ మాటకి అర్ధం బోధపడక అలాగే తెల్లబోయి నిలుచుండిపోయాడు ఆ రైతు.
    చెరుకు తోపు సమీపించగానే కారాపి దిగింది మణి. మధు కూడా కారు దిగేడు.
                                             *        *        *
    మరురోజు కాలేజికి వెళ్లేడు సుధాకర్.
    శుక్ర, శని, సోమవారాల్లో అతను కాలేజి మాట తలపెట్టాడు. ఇక ఆదివారం సరేసరి! సాయంకాలం మాట్ని వుండే రోజుల్లో ఎంత డబ్బిచ్చినా అతను కాలేజి ముఖం చూడడు. ఫాల్స్ ఎటెండెన్స్ యివ్వటానికి ఎవరో ఒకరు వుంటారు.

    పరీక్షల్లో అతని పద్ధతి సామాన్యునిగా దంచటం. అది తప్పితే చించటం. మనిషిని చూస్తే చాలా సభ్యుడిలా వుంటాడు అయ్యో! ఇతను కాపీ చేయగలడా అనిపిస్తుంది. కాని అతను దౌర్జన్యంగా పరీక్షల్లో పక్కవాళ్లషీట్లకి షీట్లు అందుకుని దంచేస్తుంటే ఎవరూ కనుక్కోలేరు.
    అతను కాలేజి ముఖం చూసేది మంగళ బుధ గురువారాలు మాత్రమే. పరీక్షల్లో కావలసింది నలభై పర్సెంట్. యాభై పర్సెంట్ అటెండయితే ఫానుకు ఢోకా లేదనేది అతని సిద్ధాంతం.
    అతని సబ్జక్ట్ సైన్స్ కాదు. ఆర్ట్స్ ఔరంగ జేబుపాఠం బాబరు తర్వాతవిన్నా షాజహాన్ తర్వాతవిన్నా అర్థంకాదంటూ వుండబోదుకదా! ఎలాగో పరీక్షలు దాటిస్తూ వుండటంతో సుందర్రావు అతన్ని గురించి పట్టించుకోరు.
    మంగళావారం నాడు అతను కాలేజికి వెళ్ళేసరికి దాదాపు పదిగంటలు పైనే అయింది. బస్సుదొరకటం ఆలస్యం కావటమే కాదు అన్నపూర్ణ అన్నంతో బాటు చివాట్లుకూడా పెట్టటం ఒక కారణం. నిన్న సాయంకాలం మాట్నికి వెళుతున్న అతన్ని చూసి ఎవరో ఆమెతో చెప్పేరు. చచ్చేట్లు చివాట్లు పెట్టిందామె.
    అచిరాకుతో వచ్చిన అతనికి లాస్ట్ పిరియడ్ లో తెలుగు మాష్టారిగారి పాఠం సగం అయిపోవటం అంత బాధ కలిగించలేదు కానీ ఆయన చూపులే అతన్ని బాధించాయి.
    తిడితే పోట్టాడొచ్చు. కోపగించుకుంటే వాదించొచ్చు కానీ అసహ్యమంతా వుట్టిపడేలా చూసే చూపుని ఓర్చుకోవటం కష్టం.
    అది సహించుకోలేక పోయాడు సుధాకర్.
    'కమిన్' అనగానే దగ్గరిగావెళ్ళి ఎవరికీ వినిపించకుండా ఆయనకి మాత్రమే వినిపించేటంతలో గొంతుకలో"మాష్టారూ క్లాసుకి ఆలస్యంగా రావటం గొంతులు కోసేటంతనేరంకాదు.  ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని ఎగవేయటంకాదు. మరీ అంత పురుగులా చూడకండి" అని వెళ్లిపోయి తన సీట్లోఎవరోవుండటంతో  తిట్టుకుంటూ వెళ్ళి ఆఖరు బెంచిలో కూర్చున్నాడతను.

 Previous Page Next Page