"విమాన ప్రయాణం అంటే ఎందుకు భయం?" కాఫీ తాగుతూ అడిగాడు.
"పడిపోతుందని" నవ్వుతూ అంది.
"చావు రిస్క్ ఎక్కడయినా వుంటుంది! ఇంటిలోంచి బయటకు వెళితే ఈ ట్రాఫిక్ లో తిరిగొస్తామని నమ్మకంలేదు. ఇంటిలో వున్నా భూకంపం వచ్చి ఇల్లు కూలిపోవచ్చు. ఎలక్ట్రిక్ షాక్ కొట్టవచ్చు. పట్టపగలే దొంగలు ఇంట్లోకొచ్చి మర్డర్ చేసి ఏమయినా ఎత్తుకుపోవచ్చు. ఇవేమీ లేకుండా బ్రేక్ ఫాస్ట్ చేస్తూ గుండె ఆగి ఎగిరిపోవచ్చు - ఏమంటావ్?"
"అఫ్ కోర్స్! యు ఆర్ కరెక్టు"
"ఇప్పుడు నెర్వస్ నెస్ పోయిందా!"
"చాలావరకూ"
సెక్యూరిటీ ఎనౌన్స్ మెంట్ వినిపించింది స్పీకర్ లోంచి.
ఇద్దరూ సెక్యూరిటీలోకొచ్చారు.
"ఇంకేమయినా బాగేజ్ ఉందా?"
"రెండు సూట్ కేసులే"
వాటిని సెక్యూరిటీ బెల్టుమీద పడేసి లోపలకు నడిచారు.
ఇంకా బోర్డింగ్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. లాంజ్ లో రిలాక్సయ్యారు. ఆమె నెర్వెస్ గా ఫీలవకుండా ఉండటానికి సంభాషణ లోకి దించాడు.
"జీవితంలో నీ యాంబినేషన్ ఏమిటి?"
"గెట్ రిచ్ కిక్"
"అది నాకు తెలుసు. కానీ ఎందుకు?"
"జీవితంలో ముఖ్యమైన భాగం - అంటే మొదటి ఇరవయ్ సంవత్సరాలు అతి భయంకరమైన దరిద్రంలో గడిచిపోయింది. చివరి ఇరవై సంవత్సరాలూ డబ్బున్నా లైఫ్ ఎంజాయ్ చేయలేం! ఇక మిగిలింది ఇరవయ్ ఏళ్ళే గనుక 'గెట్ రిచ్ కిక్' తప్ప ఇంకో మార్గంలేదు....." అన్నాడు.
బోర్డింగ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.
"కమాన్" కావాలనే ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్ళసాగాడు.
సీట్స్ లో కూర్చున్నారు.
"చాలా పెద్ద బస్ లాగుంది "కిటికీలోంచి బయటకు చూస్తూ అందామె.
"నాతో ఇంత పెద్ద స్కీమ్ లోకి దిగాక- నీకేం భయం వేయటంలేదా!"
"లేదు"
"ఎందుకని?"
"అయితే రిచ్ అవుతాను, లేకపోతే ఇంతకంటే భయపడే పార్టీ ఎలాగూ లేదుగనుక నాకొచ్చే నష్టం ఏమీలేదు"
"ఇలాంటి సాహసాలు చేయాలని నీకు ఎప్పుదయినా అనిపించిందా?"
"అవును! మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఇంగ్లీషు పిక్చర్సు చూసేదాన్ని చాలా సినిమాలు ఇలాంటి ఇన్ స్పిరేషన్ కలిగించినయ్"
"చిన్నప్పటినుంచీ సాహసాలు చేయాలనిపించేదా?"
"అవును! మా పిల్లలగాంగ్ లో నేనే లీడర్ని! మగపిల్లలు కూడా చేయలేని పనులు నేను చేసేదాన్ని అందరూ నన్ను మగరాయుడని పిలిచేవాళ్ళు"
ఆమె నడుముచుట్టూచేయి పోనించి సీట్ బెల్టు పెట్టటం నేర్పిస్తోంటే మొదటిసరిగా నూతన్ లో ఆమె స్పర్శ రక్తాన్ని వేడిగా వేగంగా ప్రవహించేట్లుచేసింది.
విమానం రన్ వే మీద పరుగెడుతోంది.
హటాత్తుగా గాల్లోకి లేస్తోంటే ఆమె చేయి అతని చేతినిగట్టిగా పట్టుకుంది.
"మైగాడ్! కళ్ళు తిరుగుతున్నట్లుంది"
"నీ ఫీలింగ్! అంతే!" ఆమె చేతిని అందుకుని మృదువుగా ప్రెస్ చేశాడు.
ఆమె కిటికీలోనుంచి త్రిల్ అయి మబ్బుల్లో తేలుతున్న విమానం రెక్కల్ని చూస్తోంది.
"అబ్బ! ఎంత అద్భుతమయిన దృశ్యం! అందుకే నాకు డబ్బు అంటే ఇష్టం. ఇలాంటి త్రిల్స్ ఎన్నో కనుక్కోవచ్చు అనుభవించవచ్చు.
నూతన్ ఆమె మాటలు వినిపించుకోవటంలేదు.
తన చేతులతో ఇమిడిపోయిన ఆమె చేతి స్పర్శ కలిగిస్తోన్న వెచ్చని ప్రకంపనాలను ఆస్వాదిస్తున్నాడు.
ఎంతకాలం? మూడేళ్ళయిందేమో సెక్స్ లైఫ్ అనుభవించి.
అంత భయంకరమయిన సెక్స్ ఇంకెవరూ అనుభవించి వుండరు.
రాత్రింబగళ్ళు.....
మీరానాయర్ పగలు.....
గోపికారాణి రాత్రి.....
అదొక లైఫ్!
జీవితంలో అదొక ఫేజ్! అప్పట్లో అదే లైఫ్ అనుకున్నాడు. గోపికా రాణితో ఆ రాత్రి రెండుగంటల సమయంలో - సడన్ గా కాంప్ నుండి ఇంటికి చేరుకున్న ఆమె భర్తకు దొరికిపోయి తన ప్రాణానికి ముప్పు ఏర్పడినపుడు పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటినుంచి ఒడిదుడుకులే!
సెక్స్ మీద విరక్తి కలిగింది.
ఉద్యోగం కోసం తిరిగి తిరిగి, తిండికి కూడా గడవని పరిస్థితి వచ్చేక అర్ధమయింది జీవితమంటే ఏమిటో!
అప్పటినుంచి డబ్బు సంపాదించటం కోసం పథకాలు తయారు చేయటం ప్రారంభించాడు. అక్రమ పద్దతుల ద్వారా ఎంతోకొంత డబ్బు సంపాదించటం కష్టంకాదు. కానీ పెద్ద ఎత్తున ఒకతరానికి సరిపడేంత డబ్బు సంపాదించటం తేలిక కాదు.
అందుకే పెద్ద పెద్దపధకాలు చాలా ఆలోచించాడు.
బాంక్ రాబరీ! గొప్పోళ్ళపిల్లలను కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించటంబ్లాక్ మెయిల్. కానీ అవన్నీ ప్రమాదంతో కూడుకున్నవే! ఎక్కువ రిస్క్ దొరికితే ఎక్కువ జైలు శిక్ష పైగా నూటికి నూరుశాతం సక్సెస్ అయే అవకాశం లేదు.
అప్పుడు వచ్చిందీ ఆలోచన.
ఎయిర్ హోస్టెస్ ఫలహారాల ట్రేలు తెచ్చిచ్చింది.
ఇద్దరూ మాట్లాడుతూ తిన్నారు.
మరి కాసేపట్లో విమానం ఢిల్లీలో లాండ్ అయింది.
టాక్సీలో హోటల్ కు చేరుకున్నారు.
రూమ్ చాలా పెద్దదిగా, విశాలంగా వుంది.
"మైగాడ్! ఒక్కరోజుకి రెండువేలా?"
"యస్! కానీ అంత డబ్బువేస్ట్ అని మనం ఫీలవుతాం"
ఆమె టి.వి. ఆన్ చేసింది.
స్టార్ టి.వి. ప్రోగ్రామ్స్ వస్తున్నాయ్.
"డ్రస్ మార్చుకో! రెస్టారెంట్ కెళదాం"
ఆమె డ్రస్ మార్చుకుంది.
ఇద్దరూ ఫ్రెష్ అయి రెస్టారెంట్ కెళ్ళారు. భోజనం ఆర్డర్ చేశాడతను.
"ఇంత డెలిషియస్ భోజనం నా జన్మలో తినలేదు" నవ్వుతూ అంది. "ఇకనుంచీ రోజూ ఇలాంటిభోజనమే చేస్తావ్"
"అవును"
మళ్ళీ గదిలోకొచ్చారు.
చెరో మంచంమీద పడుకుని టి.వి. చూస్తున్నారు. నూతన్ లో ఇంకా ఆమె స్పర్శ కలిగించిన అలజడి సద్దుమణగటం లేదు. సెక్స్ ప్రాబ్లెమ్స్ ని తెస్తుందని తనకు అనుభవ పూర్వకంగా తెలుసు. అందుకే దానిని దూరంగా వుంచాడు.