Previous Page Next Page 
డెత్ ఛాంబర్ పేజి 3


    అచ్చం ఆలాంటి లెటర్స్ నాలుగు అసమ్మతి గ్రూపులలీడర్లకు రాశాడతను. వాటిని కవర్లలో ఉంచి సీల్ చేశాడు. తరువాత వాటిని తీసుకుని అక్కడికి దగ్గర్లోనే వున్న కొరియర్ సర్వీస్ ఆఫీస్ కి చేరుకున్నాడు.
    "వీటిని అర్జంటుగా ఈ చిరునామాలకు ఈరోజే చేరేలా చూడాలి. కావాలంటే స్పెషల్ మెసెంజర్ ని పెట్టండి. ఎక్ స్ట్రా డబ్బు నేనిస్తాను.
    అతను ఆ లెటర్స్ మీద అడ్రస్ లు చూశాడు.
    "అన్నీ లోకలేనా?"
    "అన్నీ లోకలే-"
    "ఒక్కొక్క లెటర్ కీ యాభైరూపాయలవుతుంది!"
    నూతన్ రెండు వందలరూపాయలు అతనికిచ్చేశాడు.
    "ఎంత సేపట్లో చేర్తాయ్?"
    "రాత్రి ఎనిమిది లోపల..."
    "నిజానికి నిన్న ఢిల్లీకొరియర్స్ నుంచి పంపాల్సింది కానీ నేను ఢిల్లీ నుంచి హైద్రాబాద్ వస్తూండటం వల్ల ఇక్కడి నుంచయితే ఖచ్చితంగా ఈరోజే ఈ లెటర్స్ వాళ్ళకు చేరతాయని స్వయంగా తీసుకొచ్చాను. కనుక మీరివి 'ఢిల్లీ' నుంచి వచ్చాయనే చెప్పవచ్చు"
    "సరే"
    "నేను రాత్రి ఎనిమిదింటికి మీకు ఫోన్ చేస్తాను. డెలివరీ అయిన విషయం నాకు కన్ ఫరమ్ చేయాలి!"
    "ఓ.కే"
    అక్కడినుంచి అబిడ్స్ లోని టైలర్ దగ్గరకు చేరుకున్నాడు.
    "సూట్ రడీ అయిందా?"
    "అయింది సార్"
    షోకేస్ లో హాంగర్స్ కి తగిలించివున్న సూట్ ని పాక్ చేసిచ్చాడు.
    అతనికి డబ్బిచ్చి ఆటోలో గదికి చేరుకున్నాడు అప్పటికేకుర్రాడు హోటల్ నుంచి కారియర్ తెచ్చిసిద్దంగా ఉంచాడు. విపరీతమయిన ఆకలిగా ఉండటం వల్ల త్వరగా భోజనం చేశాడు.
    ఆ తరువాత మళ్ళీ టేబుల్ ముందుకూర్చున్నాడు. త్వరత్వరగా ఓ ఫైల్ తయారు చేయటం ప్రారంభించాడు.
    అందులో అసమ్మతివాదులందరిపేర్లు, వివరాలు, వారి చిరునామాలు, ఫోటోలు అన్నీ  చేరుస్తున్నాడు. అవన్నీ న్యూస్ పేపర్ ఆఫీస్ లో సేకరించటం అంత కష్టమేమీ కాలేదు. కొంచెండబ్బు ఖర్చయింది అంతే!
    రాత్రి రెండింటికి ఫైల్ రడీ అయింది.
    అదే తనకు ముఖ్యమయిన ఆయుధం. తనను వాళ్ళంతా నమ్మటానికి సైకలాజికల్ గా తనుచేస్తున్న ప్రయోగం. తను ఢిల్లీలో కొద్దికాలం ఆ కాంగ్రెస్ నాయకుడి ఆఫీస్ లో పనిచేయటం వల్ల తను ఆ పార్టీ పద్దతులు, వైఖరి, పాలసీ కార్యక్రమాలు అన్నీ అవగాహనచేసుకోగలిగాడు.
    అక్కడ పెద్ద చేప-చిన్న చేప స్కీమ్ బాగా పనిచేస్తుంటుంది.
    తెల్లారుజామున అయిదింటికి అలారం పెట్టుకుని పడుకున్నాడతను.
    ఉదయం అయిదింటినుంచే మళ్ళీ కార్యక్రమం మొదలయిపోయింది.
    ఎస్.టి.డి. బూత్ కెళ్ళి ఢిల్లీ ఫోన్ చేశాడు. సి.కె. శర్మ ఇంటిదగ్గరే ఉన్నాడు.
    "శర్మాజీ! నేనే-నూతన్ ని!" హిందీలో మాట్లాడాడు.
    "మీ ఫోన్ కోసమే చూస్తున్నాను....."
    "లెటర్స్ పంపించాను. బహుశా ఇవాళ వాళ్ళు నలుగురూ మీ ఆఫీస్ కి ఫోన్ చేస్తారనుకుంటాను."
    "ఫర్లేదు, ఇవాళ నేనొక్కడినే ఆఫీస్ లో ఉంటాను కనుక మానేజ్ చేస్తాను! నో ప్రాబ్లెమ్---"
    "ఓకే! ఉంటాను--"
    వరుసగా మరో అరడజనుమంది అసమ్మతివాదులకు ఫోన్ చేశాడు. తను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నట్లూ వాళ్ళంతా ఆ మర్నాడు ఉదయం ఎయిర్ పోర్ట్ కొచ్చి కృష్ణకాంత్ అనే అతనిని రహస్యంగా రిసీవ్ చేసుకోవాలనీ, అతనికి అన్ని విధాలా సహకరిస్తే రాష్ట్రనాయకత్వం మారే అవకాశం వుందని చెప్పాడు.
    సాయంత్రం వరకూ ఢిల్లీ ప్రయాణానికి అవసరమయిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడతను. సాయంత్రం నాలుగింటికి హోటల్ ఎయిర్ కాజిల్ ప్రొప్రయిటర్ సామిరెడ్డికి ఫోన్ చేశాడు.
    "ఢిల్లీ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మా స్పెషల్ అబ్జరర్ కృష్ణ కాంత్ ని హైద్రాబాద్ కి పంపిస్తున్నాం! ఆయనకోసం రెండు సూట్ లు రిజర్వ్ చేసి వుంచండి! అయితే ఈ విషయం ఎవరికీ తెలీకూడదు! టాప్ సీక్రెట్!"
    "అలాగే! అన్ని అరేంజ్ మెంట్సూ నేను చేస్తాను! ఎవరు మాట్లాడుతున్నారు?"
    "మహాజన్"
    "ఓకే - సంగతేమిటో తెలుసుకోవచ్చా?"
    "ఎవరికి తెలియనీయవద్దని ప్రధానమంత్రి ఖచ్చితంగా చెప్పారు. అయినా మీ దగ్గర దాయటం బావుండదు. ఎందుకంటే మీరు ఇన్నర్ సర్కిల్ కి చెందినవారు కదా!"
    "థాంక్యూ"
    "మరేంలేదు. డిసిడెంట్స్ ప్రెషర్ ఎక్కువయి పోయింది నిజంగానే లీడర్ షిప్ మారే అవసరం వుందేమోపరిశీలించడానికి....."
    "అర్ధమయింది!"
    ఎయిర్ పోర్ట్ చేరుకున్నాడు అనంత్.
    మయూరి బుక్ స్టాల్ దగ్గర మాగజైన్స్ చూస్తోంది. ఆమె డ్రస్, ఆ డ్రస్ లో విపరీతంగా పెరిగిన ఆకర్షణ నూతన్ ని చకితుడిని చేసినయ్.
    మయూరితో ఈ కొద్దిరోజుల్లో క్లోజ్ నెస్ ఏర్పడినా ఎప్పుడూ ఆమె అందం తనను కదిలించలేదు.
    "హల్లో" చిరునవ్వుతో పలుకరించింది.
    "యూ లుక్ మార్వలెస్"
    "థాంక్యూ-"
    "ఎలా మానేజ్ చేశావ్?"
    "జస్ట్ డ్రస్ అండ్ హెయిర్ స్టయిల్"
    "ఎప్పటికీ ఇదే మెయింటెయిన్ చేస్తే బావుంటుందేమో"
    "పది లక్షలూ వస్తే- ఐ థింక్ - ఇటీజ్ నాట్ ఇంపాజిబుల్"
    "పదిలక్షలు సంపాదించటంకూడా ఇంపాజిబుల్ కాదని నా నమ్మకం..."
    "లెటజ్ హోప్ స్"
    "టికెట్స్ బుక్ చేశావా?"
    "యస్ - ఇప్పుడే బోర్డింగ్ టికెట్స్ కూడా తీసుకున్నాను"
    "సెక్యూరిటీ చెక్ ఎనౌన్స్ చేశారా?"
    "ఇంకా లేదు"
    "యూ లుక్ నెర్వస్! కదూ?"
    ఆమె నవ్వేసింది "నెర్వస్ గా కనపడకుండా ఉండాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. అయినా దొరికిపోయానన్నమాట"
    "నా అబ్జర్వేషన్ కొంచెం రిజర్వ్ డ్ గా వుంటుంది"
    "ఇదే ఫస్టు టైం విమానం ఎక్కడం - అందుకని"
    "పద కాఫీ తాగుదాం! కొంచెం రిలాక్స్ అవుతావ్"
    ఇద్దరూ పైన వున్న రెస్టారెంట్ లోకి నడిచారు.           

 Previous Page Next Page