Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 4


    "తమ్ముడూ! ఆ వెన్నపూస గిన్నె అన్నా తీసుకెళ్ళరా!" సగం చచ్చి అంది దుర్గమ్మ.
    "మీ సొమ్ము మాకేం అక్కర్లేదు. ఆయన్నే తిని కొవ్వెక్కనియ్" అని విసురుగా వెళ్ళిపోయాడు దుర్గమ్మ తమ్ముడు.
    అలా వెళ్ళిపోయినా తమ్ముణ్ణి తల్చుకుని దుర్గమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది. భర్తకు అన్నంపెట్టి వసారాలోకి వచ్చి కూర్చుంది. అవసరమైనా పెళ్ళాన్ని పిలవకుండా సాంబయ్య అన్నం తిని లేచాడు. పొద్దు పోయినా అన్నం తినకుండా కూర్చుంది దుర్గమ్మ. తెలిసికూడా కనీసం అన్నం తినమనైనా అనకుండా వెళ్ళి పడుకున్నాడు సాంబయ్య. కొంచెంసేపటికే దుర్గమ్మకు సాంబయ్య గుర్రు వినిపించింది.
    ఏం మనిషి?  మనిషా పసరమా?
    ఆమె కడుపులో వున్న బిడ్డ కదిలాడు. దుర్గమ్మను ఏదో తెలియని భయం ఆవహించింది. మంచంమీద ఒత్తిగిలి పడుకుంది.
    
                            2
    
    
    సాంబయ్య పంటకాలవదాటి రోడ్డెక్కాడు. ఈపాటికి తన భార్య ప్రసవించి ఉంటుంది. ప్రొద్దుట నంగ నొప్పులు ఆరంభమైనవి రామి చెప్పింది. ఇంతకీ చాకలి రత్తి ఇంటికెళ్ళి కాన్పు చేసిందా? ఏం బిడ్డో? ఆడపిల్ల! కాదు - మగబిడ్డే! దుర్గమ్మ ఆ రోజు అన్నదిగా, వారసుణ్ణి - హక్కుదారున్ని ఇవ్వబోతున్నానని?
    తను పట్టింది బంగారం అవుతోంది. తనకు అదృష్టం కలిసి వస్తోంది. వారసుడే- వంశోద్దారకుడే పుట్టి వుంటాడు.
    ఆలోచనలతో సాంబయ్య హృదయం ఆనందనిలయం అయింది.
    తన తండ్రి కట్టుబట్టల్తో ఈ వూరు వచ్చాడు. తను పుట్టేనాటికి తన తండ్రికి రెండెకరాలు మాత్రమే వుంది. ఇప్పుడు తన కొడుకు ఎంత ఆస్తికి వారసుడు అవుతున్నాడో! నాలుగెకరాల మాగాణి- మూడెకరాల మెట్ట, ఇళ్ళ స్థలమూ, దొడ్లూ- దోవలు తనూ ఊళ్ళో వున్న సన్నకారు రైతుల్లో ఒకడుగా నిలబడ్డాడు. పిల్లవాడి అదృష్టం. ఈ సంవత్సరం బంగారం పండింది. తన తండ్రి కౌలుకు చేసిన కాంతమ్మ పొలం అమ్మకానికి వచ్చింది. కాంతమ్మ మరణానంతరం భర్త తరపు వారసులు తగూలాడుకొని ఏకాడికయినా అమ్మాలనే ప్రయత్నంలో వున్నారు. నిలవ రొక్కం, పంటమీద వచ్చేదీ కలిపి ఆ పొలం కొనుక్కోవచ్చు! అప్పుడు తన కొడుకు పదమూడెకరాల ఆసామి బిడ్డ. వాడికేం? అదృష్టజాతకుడు!
    ఇంటిముందు కొచ్చిన సాంబయ్య ఆలోచనలు ఆగిపోయినయ్. నట్టింట్లో నలుగురైదుగురు ఆడవాళ్ళు హడావిడిగా తిరగటం గమనించిన సాంబయ్య, చేతిలో కర్ర అవతల పారేసి గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. గదిలో నుంచి బయటికి వచ్చిన మంత్రసాని రత్తిని, కళ్ళతోనే ప్రశ్నించాడు.
    "కొడుకు పుట్టాడు సాంబయ్యగోరూ, కొడుకు!" దాని గొంతులో సంతోషం, విషాదం మిళితమై వున్నాయి.
    "నేనూ, అదీకూడా కొడుకే అనుకుంటున్నాంలే!" గర్వంగా అంతకంటే వేరే జరగటానికి వీల్లేదన్నట్టుగా అన్నాడు సాంబయ్య.
    "కాని, కాన్పుచాలా కష్టంమీద అయిందయ్యగోరూ!" అంది మంత్రశాని. అప్పటికిగాని సాంబయ్య బుర్రకెక్కలేదు. సాంబయ్య భార్యవున్న గదిలోకి వెళ్ళాడు. ఊడిపోతున్న తలగుడ్డను లాక్కుని "రత్తీ! ఇలా అయిందేంటే? అయ్యవార్లకు కబురు చేశారా?" అన్నాడు.
    రామి వరదాచార్యుల కొడుకు రామాచారిని వెంటబెట్టుకొని వచ్చింది.
    రామాచార్యులు దుర్గమ్మ నాడి పరీక్షించి "శీతలం కమ్మింది. బాలింతరాలకు శీతలం కమ్మకూడదు" అన్నాడు.
    దుర్గమ్మకు బరువుగా వుందని ఆనోటా ఆనోటా ఊరంతా వ్యాపించింది. సాంబయ్య కుటుంబంతో పెద్దగా సంబంధం లేనివాళ్ళుకూడా చూట్టానికి వచ్చారు.
    రామాచార్యులు కల్వంలో మందు నూరుతున్నాడు. సాంబయ్య దిగాలుపడి మందు నూరుతున్న ఆచారికేసి చూస్తూ కూర్చున్నాడు.
    "సాంబయ్యా! దుర్గమ్మను పట్నం తీసుకెళ్ళటమే మంచిదేమో?" వచ్చినవాళ్ళలో ఓ పెద్ద ముత్తయిదువు సలహా ఇచ్చింది. పట్నం ఆసుపత్రి అనగానే సాంబయ్య బిత్తరపోయాడు. అలోచించాడు. అంతగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదనిపించింది.
    పట్నం తీసుకెళ్ళి ఆసుపత్రిలో వుంచాలంటే చాలా ఖర్చు అవుతుంది. తను కూడా వెళ్ళటం అంటే పొలంలో పంట, ఈనగాచి నక్కలపాలు చేసినట్టే! అయినా తన కుటుంబంలో ఇంతవరకు అయ్యవార్ల మందులుతప్ప మరొకటి ఎరుగరు. ఈ రోజు పట్నం మందులు మాత్రం పనిచేస్తాయా?
    సాంబయ్య మొండితనానికి అమ్మలక్కలు ముక్కుమీద వేలేసుకున్నారు. గుసగుస లాడుకున్నారు.
    "షావుకారు రామయ్య భార్య పట్నం ఆసుపత్రిలోనేగా మరణించింది. ఐదొందలు ఖర్చు పెట్టాడు. బిడ్డా తల్లీ కూడా దక్కలేదు. ఇంతకీ ఆయుషుండాలి. డాక్టర్లు మందులైతే ఇస్తారుగాని ప్రాణంపోస్తారా ఏం?".
    సాంబయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలకు చాలామంది ఏకీభవించినట్లే తలలు ఊపారు. అయితే మధ్యాహ్నానికి చూడవచ్చిన ఇరుగుపొరుగువాళ్ళు తప్పుకొన్నారు. మంత్రసాని రత్తీ, రామీమాత్రం దుర్గమ్మను కనిపెట్టుకొని వున్నారు. రామాచార్యులు రోజుకు మూడుసార్లు వచ్చి చూసి పోతున్నాడు.
    మూడోరోజు తెల్లవారుఝాముకు దుర్గమ్మకు తెలివి వచ్చింది. భర్తను పిలిచి కుర్రాణ్ణి ఎత్తుకు రమ్మంది. సాంబయ్య పిల్లవాణ్ణి చేతుల్లో పెట్టుకొని, భార్య మంచంపక్కనే గొంతు కూర్చున్నాడు.
    "నే పోతున్నా! వాణ్ణయినా సరిగా చూసుకో!" దుర్గమ్మ చెంపలు కన్నీటితో తడిసినయ్. సాంబయ్య గుండెల్లో కలుక్కుమంది. దుర్గమ్మను తను సరిగా చూసుకోలేదా?
    సాంబయ్య పరుగెత్తికెళ్ళి రామాచార్యులను నిద్రలేపుకొచ్చాడు.
    దుర్గమ్మ వళ్ళు నీటికుండలా అయిపోయింది. ఎక్కడో నాడి క్షీణంగా కొట్టుకుంటున్నట్లనిపించింది రామాచార్యులకు.
    "సాంబయ్యా! చూడు, ఆఖరి ప్రయత్నం చేద్దాం! ఏమంటావ్?"
    సాంబయ్య రామాచారి చేతులు పట్టుకొని "ఎట్టాగయినా బతికించండి. మీ రుణం ఉంచుకోను" అన్నాడు.
    "అయితే గరళ ప్రయోగం చేస్తాను." ఆగ్నేయాస్త్రం ప్రయోగించబోతూన్న ద్రోణాచార్యులవారిలా అన్నాడు రామాచార్యులు.
    "దాని అదృష్టం మీ హస్తవాసి. కానివ్వండి తొందరగా." అన్నాడు సాంబయ్య.
    దుర్గమ్మ నోరు బలవంతాన తెరిచాడు సాంబయ్య. రామాచారి నాగుబాము విషం చనుబాలులో రంగరించి పోశాడు దుర్గమ్మ అంగిట్లో.
    "సూర్యోదయం అయేసరికి గుణం తెలుస్తుంది." పిండితో చేతులు రుద్దుకొని తుడుచుకుంటూ చెప్పాడు రామాచారి.
    సూర్యోదయమయింది. దుర్గమ్మకు విషం పనిచేసింది. భవబంధాల నుంచి విముక్తురాలయింది.        సాంబయ్య తల్లీ తండ్రీ పోయినప్పుడు బాధపడ్డాడు కాని, కంటి వెంట నీరు కార్చలేదు. దుర్గమ్మ చావును భరించలేకపోయాడు.
    నులకమంచంలో, పొత్తిళ్ళలో ఉన్న పసిగుడ్డును చూసుకునేసరికి సాంబయ్య నవనాడులూ కుంగిపోయాయి.
    పిల్లాడు తల్లిలేనివాడైపోయాడు. అది తలపుకు రాగానే సాంబయ్య బిడ్డను గుండెలకు అదుముకొని కుమిలిపోయాడు. సాంబయ్య నిజంగానే ఏడ్చాడు. అయినా అతని కంటివెంట నీటిచుక్క రాలలేదు. చూపులు చెమ్మగిల్లాయి అంతవరకే.
    
                               3
    
    సాంబయ్య భార్యకు విషం పోయించి చేతులారా చంపించాడని ఊళ్ళో చెడ్డవాళ్ళతోపాటు మంచివాళ్ళుకూడా చాలామంది చెప్పుకున్నారు. పిసినారి సాంబయ్య రెండువందలు ఖర్చు పెట్టి వైద్యం చేయించటానికి వెనకాడి ఆ పని చేశాడనీ, లేకపోతే దుర్గమ్మ బతికేదనీ సాంబయ్యను అర్ధంచేసుకొన్న కొద్దిమంది మంచివాళ్ళూ అన్నారు. అయితే అందరూ "సాంబయ్య కర్కోటకుడు" అనే అన్నారు.
    ఊళ్ళో ఎంతమంది ఏమనుకొన్నా సాంబయ్యకు వచ్చిన నష్టమేమీ కన్పించలేదు. సాంబయ్యకు ఏనాడూ ఇరుగు పొరుగు వాళ్ళతో సంబంధాలు లేవు. తనేమో, తన పొలమేతప్ప మరొహటి ఎరగడు. ఊళ్ళోవాళ్ళ జోలి పట్టించుకోడు. తన వ్యవహారాల్లో ఇతరులు జోక్యం కలిగించుకోవడం ఇష్టం ఉండదు, సాంబయ్యకు కావలసిందల్లా తన పొలం పక్కపొలం ఎవరిదీ, వాళ్ళేమయినా అమ్మే ఆలోచనలో ఉన్నారా అన్నంతవరకే.

 Previous Page Next Page