"పిలిచారట" తనని రమ్మని పిలిచి, కావాలనే సీరియస్ గా ఫైల్స్ తలపెట్టి, ఓవరాక్షన్ చేస్తోన్న మేనేజర్తో అంది.
"ఓహ్...ప్రనూషా.....కమ్.కమ్, కూచో....అన్నాడు. అప్పుడే గమనించినట్లు ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ. 'ఫర్లేదు చెప్పండ్సార్..." అంది ప్రనూష నిలుచునే..
'ఏంటీ...యివ్వాళ ఎయిత్ వండర్ క్రియేట్ చేశావు..."అన్నాడు.
అది వ్యంగ్యమని అర్ధమైంది. తను కరెక్ట్ టైంకు రావడాన్ని అలా ఎత్తి చూపుతున్నాడని తెలిసింది.
'కనీసం అప్పుడప్పుడైనా "వండర్స్ చేయాలని నా ఉద్దేశం సార్'
ఏమాత్రం తొట్రుపాటు లేకుండా అంది ప్రనూష.
ప్రనూష యిలాంటి విషయాల్లో 'షార్ప్'గా వుంటుంది. ఏమాత్రం అణిగి మణిగినట్టున్నా పరిస్థితి విషమిస్తుందని తెలుసు.
"గుడ్ వెరీగుడ్ నీలో నాకు నచ్చే గుణమే ఇది. దేన్నయినా స్పోర్టివ్ గా తీసుకుంటావు. లేదా సెటైర్ గా రియాక్టవుతావు...." అంటూ తనే సీట్లోనుంచి లేచి, ప్రనూష దగ్గరికి వచ్చి అన్నాడు.
"థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. మీ సీట్లో వుండి కూడా ఈ కాంప్లిమెంట్ ఇవ్వొచ్చు." వినయంగానే అన్నా అందులో చురక తొంగిచూస్తోంది.
"నీ మెదడు చాలా షార్ప్ గా వచ్చేస్తుంది సుమా." అంటూ ఆమె భుజంమీద చేయేసాడు.
"నా చేయి అంతకన్నా షార్ప్ గా పన్చేయకముందే, మీ చేయి నా భుజంమీదినుంచి తీసేయండి సార్..' అంది సీరియస్ తో కూడిన వినయంతో.
"అబ్బా....ఏంటిది ప్రనూషా చిన్నపిల్లలా...నీకు మంచి ఫ్యూచర్ వుంది. అవసరమైతే నీకు ఇమిడియట్ గా ప్రమోషన్ కూడా ఇవ్వగల్ను....కొన్ని విషయాలు నీకు ఒక పట్టాన అర్ధం కావు...." అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.
ప్రనూష పైట జారకుండా, బ్లౌజుకు, పైటకూ మధ్య పెట్టిన సేఫ్టీ పిన్ తీసింది.
గుడ్లప్పగించి చూస్తున్నాడు వేదాచలం, అతనికి కలలా అనిపిస్తోంది. ఇప్పుడు ప్రనూష ఏం చేయబోతోంది. పైట తీసి తనను ఆహ్వానిస్తుందా! ఆ ఆలోచననే అతనిలో చెప్పలేని ఉత్సాహం కలిగిస్తోంది.
అంటే తన మాటలకు పాజిటివ్ గా రియాక్ట్ అవుతోందా? అతని అంచనా తప్పని మరునిమిషంలో తెలిసింది. ఆ సేఫ్టీ పిన్నుతో, తన ఎడమ భుజం మీద చేయివేసిన వేదాచలం చేతిమీద గట్టిగా నొక్కిపెట్టింది.
పెద్ద కేక అప్రయత్నంగా వేదాచలం నోట్లోనుంచి వెలువడింది. ఎంతగా అంటే...
క్యాబిన్ బయట ఆసక్తిగా లోపల ఏం జరుగుతోందా? అని ఎదురుచూస్తోన్న స్టాఫ్ మొత్తానికి వినిపించేంత...
* * *
ఫ్యూన్ పరిగెత్తుకొచ్చాడు కంగారుగా... ఆ వెనకే స్టాఫ్......వాళ్ళు రావడంతోనే తన పైట సర్దుకుని సేఫ్టీపిన్ తన పిడికిట్లో బిగించేసింది.
"ఏమైంది సార్?" అంటూ మేనేజర్ వైపూ, ప్రనూషవైపూ చూసాడు ఫ్యూన్.
స్టాఫ్ మోహంలో క్యూరియాసిటీ. వాళ్ళ మొహాల్లో ఆందోళన, కంగారులాంటివి మచ్చుకైనా లేవు.
ప్రనూష సంగతి స్టాఫ్ కి తెలుసు.
ఏ విషయాన్ని అయినా "ఫట్ మని మొహంమీద కొట్టినట్టు తేల్చేస్తుందని.... మేనేజర్ గారు సబ్బులను ఎలా కొత్తరకంగా మార్కెటింగ్ చేయాలో చెబుతున్నారు. నేను వారు చెప్పేది ఆసక్తిగా వింటున్నాను. మేనేజర్ గారు ఫైల్ కోసం టేబుల్ సొరుగు లాగారు. లోపల చేయి పెట్టారు. ఎప్పుడు దూరిందో దొంగ ఎలుక. మేనేజర్ గారి చేతిలోనుంచి, కోటులోకి వెళ్ళింది. మీకు తెలుసుగా.... మన మేనేజర్ గారు ఫులే...అయినా ఎలుకలంటే భయమని..." అద్భుతమైన యాక్షన్ తో డైలాగ్ పార్ట్ పూర్తిచేసింది ప్రనూష.
స్టాఫ్ కు ఆమె చెప్పింది నమ్మబుద్దికాలేదు. కాకపోతే వేదాచలానికి ఎలుకలంటే భయమని తెలుసు. ఆఫీసులో జాయినైన తొలిరోజే చెప్పాడు మేనేజర్. ఆఫీస్ నీట్ గా లేకపోయినా సహిస్తానుకానీ, ఆఫీసులో ఒక్క ఎలుక ఉన్నా తను సహించనని....అతనికి ఎలుకలంటే ఎంత భయమో తెలుసు.
"హయ్యో ఆ ఎలుక ఇంకా మీ కోటులోనే ఉందా సార్?" ఫ్యూన్ అమయాకంగా అడిగాడు మూలనున్న కర్ర తీసుకుని.
వేదాచలం గుర్రుగా ప్రనూషవైపు చూశాడు. ఏమీ చేయలేని పరిస్థితి. తనే మాత్రం ప్రనూష చెప్పిన విషయాన్ని ఖండించినా ఇంకా ఆ దొంగ ఎలుక తనకోటులోనే వుందని కర్రతో కొట్టించగలదు కూడా...
అందుకే ఓ వెర్రి నవ్వు నవ్వి "డోంట్ వర్రీ మీరెళ్ళండి" అన్నాడు వేదాచలం.
"సర్....నేను కూడా వెళ్ళేదా?" చాలా సాలైట్ గా అడిగింది ప్రనూష. వస్తోన్న కోపాన్ని దిగమింగుకుని వెళ్ళమన్నాడు" వేదాచలం గత్యంతరం లేక.
* * *
పగలబడి నవ్వసాగారు కామాక్షి. ప్రసూనాంబలు. క్యాబిన్ లో ఏం జరిగిందో వివరంగా చెప్పింది ప్రనూష.
"అయితే సేఫ్టీపిన్. నీ శీలాన్ని సేఫ్టీగా కాపాడిందన్నమాట..." అంది నవ్వుతూ కామాక్షి.
ప్రసూనాంబ నిస్ఫారిత నేత్రాల ప్రనూషవైపు చూస్తూ "ప్రనూషా యూ ఆర్ గ్రేట్. ఆ మేనేజర్! కి భలే బుద్ది చెప్పావు. నీలాంటివాళ్ళు ప్రతీ ఆఫీసులో ఒక్కరైనా వుండాలి అంది సీరియస్ గా.
"నాలాంటివాళ్ళు వుండాలి కాదు. ప్రతీ అమ్మాయి నాలా తయారవ్వాలి. మనం భయపడితే భయపెడ్తారు. కాకపోతే, నాకు ఉద్యోగం తప్పనిసరి కాదు. అయినా నా మీద నాకు నమ్మకం వుంది. ఇక్కడ కాకపోతే, మరోచోట ఉద్యోగం సంపాదించుకోగల్ను"
"కానీ అందరూ నీలా సాహసించలేకపోతున్నారు" అంది ప్రసూనాంబ.
'అందుక్కారణం భయం. భయం....ప్రసూనాంబగారూ....బాస్ ఏం చేస్తాడోనన్న భయం....ఉద్యోగం పోతుందేమోనన్న భయం. ఉన్న ఒక్క ఆధారమూ పోతే ఎలా అని భయం."
"ఆఫీసులో జరిగిన విషయం భర్తకు చెబితే..." నువ్వు సరిగ్గా వుంటే మీ బాస్ నీతో అలా ఎందుకు ప్రవర్తిస్తాడని ఎదురు ప్రశ్నేసి, తననెక్కడ శల్యపరీక్ష చేస్తాడేమోనని భయం. ఆ భావంలో నుంచి. అభద్రతా భావంలోకి వచ్చి అనుక్షణం ఆ భద్రతా భావంలో చచ్చేవరకూ చస్తూ బ్రతుకుతారు..."