Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 39

 

     "మనం అతడిని బెదిరించి రహస్యం రాబట్టాలి. అంతేకదా?"
   
    "అంతే!"
   
    "నాకో చిన్న ఆలోచన వస్తూంది."
   
    "ఏమిటి?"
   
    "మా కజిన్ ఒకడున్నాడు. పోలీస్ ఇన్ స్పెక్టర్. వరుసకి అన్న అవుతాడు. వాడిద్వారా ఆయన్ని బెదిరించి, రహస్యం కక్కించవచ్చు." రవితేజ ఒక్కక్షణం ఆలోచించి, "ఈ ఆలోచన బాగానే వుంది. కానీ ఇది ఎంత తొందరగా జరిగితే అంత మంచిది" అన్నాడు.
   
    "ఇప్పుడే ఒక గంటలో రమ్మని చెబుతాను." అని ఆమె లేచింది. అరగంట తరువాత ఇంటర్ కమ్ మ్రోగింది. ఇన్ స్పెక్టర్ వచ్చాడనీ, క్రింద ఎదురుచూస్తున్నాడని ఆమె చెప్పగానే అతడు క్రిందికి వెళ్ళాడు.
   
    "ఈయన భాస్కర్ యస్సై....." అంటూ రవితేజకి పరిచయం చేసింది.
   
    "నేను పైకి వస్తే అనవసరంగా అందరి కళ్ళూ పడతాయని రాలేదు. ప్రియంవద ఫోన్ చేసి అర్జంటుగా రావాలని చెప్పింది. ఏమిటి విషయం" అన్నాడు భాస్కర్.
   
    రవితేజకి అతను చెప్పినదాన్లో నిజం వుందనిపించింది. ఇన్ స్పెక్టర్ తన దగ్గరికి వస్తే అందరిలోనూ ఆసక్తి రేకెత్తవచ్చు. చెంచురామయ్య మనుషులు తన ఆఫీసులోనే వున్నారు.
   
    "రండి వెళ్తూ మాట్లాడుకుందాం" అన్నాడు. ముగ్గురూ కార్లో వెళుతూ వుంటే రవితేజ జరిగిన విషయం అంతా చెప్పాడు. చెప్పి "పోలీసు రికార్డుల్లోకి ఎక్కకుండా అసలు విషయం రాబట్టాలి-" అన్నాడు. "దానిదేముంది. వాడు ప్రొఫెషనల్ కాకపోతే రెండు నిముషాల్లో భయపడి అంతా చెప్పేస్తాడు. ఆ విషయం నాకు వదిలి పెట్టండి-" అన్నాడు.
   
    కారు పోస్టాఫీసు ముందు ఆగింది. భాస్కర్, "ఏం చేద్దాం" అన్నట్టు రవివైపు చూసి, "మీరు ముందే చెప్పివుంటే మామూలు డ్రెస్ లో వచ్చి వుండేవాడిని" అన్నాడు.
   
    "అలాగయితే అసలు చెప్పడు-"
   
    "ఇప్పుడు ఈ డ్రెస్ లో నేను లోపలికి వెళ్తే మళ్ళీ అదే సమస్య. అక్కడినుంచి ఈ వార్త అంచెలంచెలుగా పాకిపోతుంది" అన్నాడు యస్సై.
   
    "నన్ను చూస్తే మరీ బెదిరిపోతాడు" అన్నాడు రవి.
   
    "నేను వెళ్ళి అతడిని బయటకు తీసుకురానా?" అంది ప్రియంవద.
   
    "నువ్వా-"
   
    "అవును ఏదో ఒక మిషమీద తీసుకొస్తాను. బయట మిమ్మల్ని చూసినా పెద్ద ప్రమాదమేమీ వుండదు. భాస్కర్ ఎలాగూ డ్రెస్ లో వున్నాడు కాబట్టి జనం కూడా ఏమీ అనుకోరు. అతడిని కారు ఎక్కించి మనం తీసుకుపోవచ్చు."
   
    మిగతా ఇద్దరికీ ఈ ఆలోచన బాగానే వుందనిపించింది. ప్రియంవద లోపలికి వెళ్ళి రాఘవరావును వెతికిపట్టుకుని దగ్గరకు నడిచింది.
   
    "నమస్తే!" పని చేసుకుంటున్న తను తలెత్తి "ఎవరు కావాలి?" అని అడిగాడు.
   
    "మీ అమ్మాయి నేనూ స్నేహితులమండీ" అంది ప్రియంవద వినయంగా. "తను ఫోన్ చేసి వీలయితే ఈ రోజు ఓ రెండొందలు సర్ధమంది. 'ఇంటివరకు వెళ్ళడమంటే-దూరం కదా! మీ నాన్నగారికి అందజేస్తాను' అన్నాను. సరేనంది. మరి మీకు ఇమ్మంటారా?" అంటూ పర్స్ కోసం వెతికింది.
   
    "మా అమ్మాయి అడిగిందా?" అంటున్నాడు అతడు. అతడి మాటలు వినిపించుకోకుండా ప్రియంవద గాభరాగా "అరె-పర్స్" బయటే కార్లో మర్చిపోయినట్టున్నాను. మీరేమీ అనుకోకపోతే వస్తారా - ఇచ్చేసి వెళ్ళిపోతాను. నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి" అంటూ బయటికి నడిచింది.
   
    అతడు ఆమెను అనుసరించి, కారు దగ్గరకు వచ్చాడు.
   
    అతడు కారు దగ్గరకు రాగానే చెరోవైపునుండి రవితేజ, ఇన్ స్పెక్టర్ డోర్లు తెరుచుకుని చటుక్కున దిగారు. రాఘవరావు వాళ్ళని చూసి బిత్తరపోయి వెనక్కు తిరగబోయాడు. భాస్కర్ చెయ్యి అతడి మెడమీద పడింది. బలంగా కారులోకి తోశాడు. వెనుకసీట్లో ముగ్గురూ కూర్చోగానే రవితేజ కారు స్టార్ట్ చేశాడు.
   
    అంతా క్షణాల్లో జరిగిపోయింది.
   
    "ఏమిటిది? నాకేం తెలీదు. నన్నొదలండి" అంటూ గింజుకుంటున్నాడు అతడు. రవితేజ తాపీగా కారు నడుపుతూ, "ఎక్కడికి పోనీమ్మంటారు ఇన్ స్పెక్టర్?" అని అడిగాడు.
   
    "మా పోలీస్ స్టేషన్ కి."
   
    "వొద్దొద్దు నన్ను లాకప్ లో మాత్రం పెట్టకండి. నా ఉద్యోగం పోతుంది. పిల్లలు గలవాడిని."
   
    "బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు అది గుర్తుకురాలేదా?" ఇన్ స్పెక్టర్ గద్దించాడు. అతడు మాట్లాడలేదు.
   
    "నేను కావాలంటే ఒక ఛాన్సిస్తాను" అన్నాడు రవితేజ. "అసలు విషయం ఏమిటో వివరంగా చెప్పు. ఇందులో ఎవరెవరు వ్యక్తులు ఇన్ వాల్వ్ అయివున్నారో ఒక్కటి కూడా వదలకుండా చెప్పు. నువ్వు చెప్పిందంతా నిజమని తోస్తే కేసు ఉపసంహరించుకుంటాను."
   
    "వాళ్ళు నన్ను చంపేస్తారు."
   
    "చెప్పకపోతే మేమే చంపుతాము" ఇన్ స్పెక్టర్ గద్దించాడు. రవితేజ ఇన్ స్పెక్టర్ ని వారిస్తూ అతడివైపు తిరిగి "నువ్వు ఈ విషయాలన్నీ నాకు చెప్పావని మూడవ వ్యక్తికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు. "కావాలంటే ఈయన్ని కూడా దింపేస్తాను. నా ఒక్కడికే చెపుదూ గాని సరేనా-" అన్నాడు.
   
    ఆ వ్యక్తి మౌనంగా వుండిపోయాడు.
   
    "మిమ్మల్ని పోలీస్ స్టేషన్ దగ్గిర దింపనా?"
   
    "వద్దు, ఇక్కడ దిగిపోతాను" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
    ప్రియంవద "నేను కూడా దిగిపోతాను. ఇక్కడనుంచి ఆఫీసు దగ్గిరే కదా" అంది అతడు తెలుసుకోబోయే విషయం వినటం తనకీ ఇష్టం లేనట్టుగా రవితేజ కారు ఆపగానే వాళ్ళిద్దరూ దిగిపోయారు.
   
    రవితేజ అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. పై గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసి, "ఇక చెప్పు" అన్నాడు.
   
    అతడు వెంటనే జవాబు చెప్పలేదు.
   
    "నేను కావాలంటే ఇన్ స్పెక్టర్ కి ఫోన్ చేసి క్షణాల్లో రప్పించగలను. కేవలం నిన్నూ, నీ కుటుంబాన్ని నాశనంచేయటం ఇష్టం లేక ఇలా తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొచ్చాక కూడా నువ్వు బెట్టుసరిచేస్తే నిన్నెవరూ రక్షించలేరిక-"
   
    అతడు నెమ్మదిగా అన్నాడు- "మీరు పోస్ట్ ద్వారా పంపే చీరల్ని ప్యాకెట్లలోంచి తీసేసి దాని బదులు పాతగుడ్డలు పెట్టాలి."
   
    రవితేజ షాక్ తిన్నాడు. "ఎలా సాధ్యం ఇది? ఎన్ని చీరెలు అలా తీయగలరు? మీ మీద పై అధికారుల నిఘా వుంటుంది కదా." అతడు తలవంచుకునే సమాధానాలు చెపుతున్నాడు. "ఇన్సూర్ చేసిన ప్యాకెట్లలోంచి కూడా వస్తువులు కొట్టేసి, చెత్తా చెదారం పెట్టి తిరిగి మామూలుగా వాటిని పంపటం పోస్టాఫీసుల్లో కొత్తకాదు. రిజిష్టర్ పోస్ట్ లో అయితే మరీ సులభం-"
   
    "కానీ ఎన్ని చీరలని అలా కొట్టేస్తారు? ఎప్పటికయినా ఇది బైటపడుతుంది కదా."
   
    "ఎన్నో కాదు మేము కొట్టెయ్యవలసింది కూడా పది- పదిహేను చీరలే. వాటి అడ్రసులు కూడా మాకిచ్చారు. ఆ అడ్రస్సులకి మీరు పంపే చీరలు మాత్రం తొలగించి, వేరేవి పెట్టి పంపాలి. దానికోసం మాకు వెయ్యి రూపాయలు లంచం ఇచ్చారు."
   
    రవితేజ వినటంలేదు. మనసులో అంతకు కొన్ని రోజుల ముందు చెంచురామయ్య పాత్రికేయులకు ఇచ్చిన ఖరీదైన విందు ఫ్లాష్ లాగా గుర్తుకొచ్చింది.
   
    ఈ పథకం వెనుక వున్న రహస్యం మంచులా విడిపోసాగింది.
   
    -రవితేజ టెక్స్ టైల్స్ పోస్ట్ ద్వారా పంపే స్కీమ్ లో చెంచురామయ్య తాలూకు కస్టమర్లే పదిమంది దాకా "మాకు చీరలు కావాల"ని ఉత్తరాలు వ్రాస్తారు. వారికి పంపే పార్సిల్లో పోస్టాఫీసులోనే చీరెల మార్పిడి జరుగుతుంది.
   
    పదిమందీ కోర్టుకి వెళతారు.
   
    మా దగ్గిర వందా తీసుకొని చీరల బదులు పాత పేపర్లు పెట్టి పంపారని రవితేజ కంపెనీ మీద దావా వేస్తారు. రిజిస్టర్ పోస్టు కాబట్టి రవితేజ కంపెనీ పోస్టాఫీసుని నిలదీస్తుంది. కాని ఇదంతా ఒకవైపు. పత్రికల్లో ఈ విషయాన్ని తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తారు.
   
              
                            పోస్టుద్వారా చీరలు అమ్మే పథకం వైఫల్యం.
                           _________________________
____________
   

    "రవితేజ కంపెనీ వారు కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ద్వారా పంపే పార్సిల్స్ లో చీరలు మాయమైపోతున్నాయని కష్టమర్లు నిరాశ ప్రకటిస్తున్నారు. తమకు అందిన పార్సిల్స్ లో చీరలు లేని కారణంగా దాదాపు పదిమంది రవితేజ కంపెనీ మీద వేర్వేరు కోర్టుల్లో దావా వేశారు. కేసులు నడుస్తున్నాయి."
   
    చాలు.

 Previous Page Next Page