Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 38

 

       ....ఆ మరుసటిరోజు అతఃడు ఆఫీసులో వుండగా ఒక వ్యక్తి కల్సుకోవటానికి వచ్చాడు.
   
    "ఎవరితను?" అడిగాడు రవితేజ.
   
    "చెప్పటంలేదు. మీతోనే మాట్లాడతాడట....."
   
    "సరే రమ్మను."
   
    నిముషం తరువాత అతడు లోపలికి వచ్చాడు. కాలర్ దగ్గిర చొక్కా కాస్త చిరిగింది. గెడ్డం మాసి వుంది.
   
    "ఏం కావాలి?"
   
    అతఃడు తటపటాయించి, "ఒక అయిదు నిముషాలు మీతో మాట్లాడాలి" అన్నాడు. రవితేజ మొహం చిట్లించి, "ఏ విషయం?" అన్నాడు.
   
    "చాలా ముఖ్య విషయం నేను కూర్చోవచ్చా!"
   
    రవితేజ తలూపాడు. ఆ వ్యక్తి కూర్చుంటూ "నిన్న చెంచురామయ్య మా దగ్గరికి వచ్చాడు" అన్నాడు. 'చెంచురామయ్య' పేరు వినపడగానే రవి నిటారుగా అయ్యాడు. "మీ దగ్గిరకి అంటే ఎవరు? ఎవరి దగ్గిరికీ?" అడిగాడు.
   
    "చెప్పను."
   
    రవి ఆశ్చర్యంగా "చెప్పవా? మరెందుకు వచ్చినట్టు మా దగ్గరకి?" అన్నాడు.
   
    "మా ఆఫీసులో ఒకరికి పాతికవేలు లంచం యిచ్చాడు. మేమందరం కలిసి ఒక పని చేయటానికి."
   
    "ఏం పని?"
       
    "చెప్పను."
   
    రవితేజకి కోపం వచ్చింది. కానీ విషయం ఆసక్తికరంగా వుండటం, అందులో తన ప్రత్యర్ధి పేరు వుండటంతో తమాయించుకుని, "సరే-నీకేం కావాలి అది చెప్పు" అన్నాడు.
   
    "ఇంతకుముందు మేము ఇలాంటి పనులు చిన్న ఎత్తులో చేసేవాళ్ళం. కాని పాతికవేలు చూసేసరికి మా వాడికి కళ్ళు బైర్లు కమ్మాయి. ఇంతకుముందు మా అందరికీ సమానంగా పంచెవాడు - యిప్పుడు ఇరవైవేలు తను వుంచుకుని మిగతాది మాత్రమే మాకు యిచ్చాడు."
   
    "అసలు విషయమేమిటి? చెంచురామయ్య మీకు డబ్బు ఎందుకిచ్చాడు? మీరు పంచుకోవటం దేనికి? దీనికీ నాకూ సంబంధం ఏమిటి?"
   
    "అతని పథకం అనుకున్నట్టు జరిగితే మీకు లక్షలమీద నష్టం వస్తుంది."
   
    రవితేజ ఎదుటి వ్యక్తివైపు సూటిగా చూశాడు. బీదతనం అతడి మొహంలో దైన్యంతోపాటూ అదో రకమైన తెగింపుతనాన్ని కూడా చూపిస్తూంది. కానీ తెలివితేటలు అంతగా కనిపించటం లేదు.
   
    "నా కర్ధమైంది సరే చెప్పు, నీకేం కావాలి?"
   
    "..... పాతికవేలు."
   
    "మైగాడ్ అంత డబ్బా?"
   
    "నేనా విషయం చెప్పకపోతే మీరు అమితంగా నష్టపోతారు."
   
    "కంపెనీ తరఫున అంత డబ్బు ఇవ్వటానికి నాకు అధికారాలు లేవు."
   
    "చివరిమాట. ఇరవై వేలు యివ్వండి."
   
    రవితేజ తలవూపుతూ, "అంత కూడా ఇవ్వలేను. విషయం ఏమిటో చెపితే మా వాళ్ళకి దాని విలువ నచ్చజెప్పి ఇప్పించగలను. అసలు విషయం తెలియకుండా అంత డబ్బు ఇస్తే - తీరా నువ్వు చెప్పింది మాకు ఏ విధంగానూ లాభసాటి కాకపోతే నేను మాట పడవలసి వస్తుంది" అన్నాడు.
   
    "నేను అది చెప్పేసిన తరువాత మీరు డబ్బు ఇవ్వకపోతే-"
   
    "ఇటువంటి విషయాలు నమ్మకంమీద జరుగుతాయని నీకు బాగా తెలిసివుండాలే-" రవితేజ నవ్వాడు. "ఇప్పుడు నువ్వు చెప్పకపోతే పోలీసుల్ని పిలిపించాననుకో, అప్పుడైనా అసలు విషయం తెలుస్తుంది కదా!"
   
    "మీరు పోలీసుల్ని పిలుస్తే బయట వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది. మీ ఆఫీసులోనే చెంచురామయ్య మనుషులున్నారు. నన్ను పోలీసులు పట్టుకెళ్ళిన విషయం అతనికి తెలిస్తే, అతడు దీన్ని మానుకుని మరొకటి ఆలోచిస్తాడు. కొత్తదాన్ని కనుక్కోవటం కన్నా వున్న విషయం తెలుసుకోవటం మీకే మంచిది కదా."
   
    "నువ్వు డిటెక్టివ్ నవలలు బాగా చదువుతావనుకుంటానే-"
   
    "నాకు డబ్బు కావాలి చాలా అవసరం."
   
    "నాకు రేపటివరకూ టైమివ్వు. అంత డబ్బు కంపెనీకి చెప్పకుండా ఇవ్వాలంటే కష్టం. ఆలోచించుకోనీ" అన్నాడు రవితేజ. అతను లేచాడు. "సరే రేపొస్తాను. ఉహు నేను రాను.రేపటికి మీరేదైనా ఆలోచన చేసి నన్ను బంధించే ఏర్పాట్లు చేస్తారు. రేపు ఫోన్ చేస్తాను. డబ్బు ఎలా అందజెయ్యాలో కూడా చెపుతాను" అని గుమ్మంవరకు వెళ్ళి ఆగి, "ఇదంతా అవటానికి వారం పడుతుందేమో. ఇప్పుడే డబ్బు ఇచ్చెయ్యకూడదూ. విషయం చెప్పేస్తాను" అన్నాడు ఆశగా.
   
    "రేపు ఫోన్ చెయ్యి" అన్నాడు రవితేజ.
   
    అతడు వెళ్ళిపోయిన రెండు నిముషాలకి తనూ బయల్దేరాడు. పదిహేను నిముషాల్లో వస్తానని సెక్రటరీకి చెప్పి, క్రిందికి దిగాడు. అప్పుడే ఆ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసి సిటీబస్ ఎక్కుతున్నాడు. రవితేజ తన కార్లో అతడిని అనుసరించాడు.
   
    అతడికీ వ్యవహారాల్లో బొత్తిగా అనుభవం లేదని అతడి ప్రవర్తన చూస్తుంటేనే తెలుస్తూంది. ఒక్కసారి కూడా వెనుదిరిగి చూడలేదు. పెద్ద మార్కెట్ దగ్గర దిగి, కొంతదూరం నడిచి ఒక సందులో ప్రవేశించాడు. రవితేజ తన కారుని ఒక పక్కగా ఆపి, తనుకూడా అటు నడిచాడు. చాలా చిన్న సందు అది. ముందుకు వంగిపోయినట్లున్న ఆ యింట్లోకి అతడు వెళ్ళటాన్ని రవితేజ గమనించాడు. అది అతడి ఇల్లే అని నిర్ణయించుకుని వెనుదిరగబోతూ వుంటే, ఆ వ్యక్తి తిరిగి బయటకు రావటం గమనించి, పక్కకి తప్పుకున్నాడు. టైమ్ పదిన్నర అయింది. అతడి చేతిలో టిఫిన్ బాక్స్ బట్టి అతడు ఆఫీసుకి వెళుతున్నాడని తెలుస్తుంది.       
   
    రవితేజ అతడిని అనుసరించే ప్రయత్నమేమీ చెయ్యక, అతడు సందు తిరిగేవరకూ వేచివుండి, అతడు ఆఫీసుకి వెళ్ళిపోయాడని నిశ్చయించుకున్నాక ఆ ఇంట్లో ప్రవేశించాడు.
   
    లోపల ఒకే గది. ఆ గదిలో ఒకమ్మాయి చీరకి ఫాల్ కుట్టుకుంటూ కూర్చుని వుంది. అతడిని చూసి తల పైకెత్తి "ఎవరు కావాలండీ" అంది. "నాన్నగారున్నారా?" అడిగాడు రవితేజ.
   
    "లేరండీ" అందా అమ్మాయి. ".....ఇప్పుడే ఆఫీసుకి వెళ్ళారు. బహుశ మీకు ఎదురుపడే వుంటారే."
   
    ఆ అమ్మాయిని చూసిన వారెవరూ ఒక బ్లాక్ మెయిలర్ కూతురనుకోరు. చదువుకున్నదాన్లా వుంది. ఒక తెలియని నమ్రత ఆ అమ్మాయిలో కనపడుతూంది. రవితేజ ఫుల్ సూట్ లో వున్నాడు. డబ్బు తెచ్చే అందంకన్నా అందమైన ఠీవి అతనిలో వుంది. అలాటివాడు తండ్రిని వెతుక్కుంటూ తమ ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియక ఆ అమ్మాయి కంగారుపడుతూంది. కూర్చోమనటానికి కూడా సరయిన కుర్చీ ఆ ఇంట్లో లేదు. అందుకని ఇబ్బందిగా చూస్తూంది. తండ్రి లేడని ఆమె చెప్పగానే అతడు బయటకు వెళ్ళడానికి సిద్దపడుతూ "ఎక్కడ దొరుకుతడు ఆయనిప్పుడు? ఆఫీసెక్కడ?" అని అడిగాడు- ఏమీ ఎరగనట్టు.
   
    "జనరల్ పోస్టాఫీసు-"
   
    రవితేజ ఉలిక్కిపడ్డాడు. జ.న.ర.ల్ - పోస్టాఫీసు!!! అక్కడ పనిచేసే మనిషి తనకేదో రహస్యం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడూ అంటే చెంచురామయ్య అక్కడ ఏదో మతలబు చేసి వుండాలి. రవితేజ మనసు కీడు శంకించింది. ఇది తను అనుకున్నంత చిన్న విషయం కాదని తోస్తోంది.
   
    అతను ఆలోచనలోపడటం చూసి ఆ అమ్మాయి "నాన్నగారికేమైనా చెప్పాలా అండీ?" అని అడిగింది.
   
    "వద్దు. నే వెళ్ళి కలుసుకుంటాను. కాస్త పేరూ, సెక్షన్ అదీ వ్రాసిస్తారా" అన్నాడు. ఆ అమ్మాయి ఏదో అనబోయి, మనసు మార్చుకుని లోపలికి వెళ్ళి తండ్రిపేరూ, ఆఫీసు అడ్రసు వ్రాసి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ అమ్మాయి అక్షరాలు ముత్యాల్లా వున్నాయి, పేరు చూశాడు రాఘవరావు అని వుంది. "కొంచెం కాఫీ త్రాగి వెళ్ళండి-" అందామె కాస్త సంకోచంగా అతను వెళ్ళబోతూ వుంటే అతడు కాగితం మడిచి జేబులో పెట్టుకుంటూ "థాంక్స్, వొద్దు వెళ్ళొస్తానండీ" అంటూ గుమ్మంవైపు నడిచి, వెనుదిరిగి "మీరు ఫాల్ తిరగేసి కుడుతున్నారు. చూసుకోండి" అని అక్కన్నుంచి కదిలాడు. ఆ అమ్మాయి స్తబ్దురాలైంది. పరుగెత్తుకెళ్ళి చీరని చూసుకుంది. అతడు చెప్పింది నిజమే. అంతదూరం నుంచే ఆయనకీ విషయం ఎలా తెల్సిందబ్బా అనుకుంది. ఆమె గుమ్మం దగ్గర కొచ్చేసరికి అతడు వెళ్ళిపోయాడు.
   
                            20
   
    రవితేజ ఆఫీసు కొచ్చేసరికి పదకొండు దాటింది. ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు.
   
    అతడు దీర్ఘంగా ఆలోచిస్తూ వుండటం చూసి, "ఏమిటి అలా వున్నారు?" అని అడిగింది ప్రియంవద. అతడు జరిగినదంతా చెప్పాడు. "పోలీస్ రిపోర్టిస్తే వాళ్ళే అంతా చూసుకుంటారు కదా" అన్నది.
   
    "ముందలాగే అనుకున్నాను. కావాలనుకుంటే అతడు మన ఆఫీసుకు వచ్చినప్పుడే అరెస్టు చేయించవచ్చు. కానీ ఆ విషయం చెంచురామయ్యకు తెలిస్తే జాగ్రత్తపడిపోతాడు. అందుకని అతడి ఆచూకీ తెలుసుకోవడానికి స్వయంగా ప్రయత్నించాను. ఇప్పుడిక అతడి అడ్రస్ తెలిసింది. మూడోకంటికి తెలియకుండా అతడిని పోలీసులకు పట్టివ్వొచ్చు. వాళ్ళే నిజం కక్కిస్తారు. కానీ...." అతడు ఆగాడు. "....ఆ ఇంటిని చూడనంతవరకూ నాకూ అదే అభిప్రాయం, ఆలోచనలో వుండేది. కానీ ఇప్పుడెందుకో అలా చేయబుద్ది కావటంలేదు. ప్రియంవదా, అతడు స్వభావసిద్దంగా రౌడీకానీ, బ్లాక్ మెయిలర్ గానీ కాదు. ఒక ముసలి గుమాస్తా రేపో ఎల్లుండో రిటైరవడానికి సిద్దంగా వున్నాడు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా ఒకసారి మనం రిపోర్ట్ ఇస్తే అతడి అరెస్టు సస్పెన్షన్-ఇక జీవితం నరకమైపోతుంది. అదే ఆలోచిస్తున్నాను" అంటూ అతడి ఇంటి గురించి చెప్పాడు.

 Previous Page Next Page