Previous Page Next Page 
హిమసుందరి పేజి 38

   
                                       16


    "మూడు నెలల క్రితం ఆ రోజు....." రామకృష్ణ చెప్పటం మొదలు పెట్టాడు.

    సీతకి పెద్ద అనుమానం వచ్చింది. "ఇది నిషాలో చెపుతున్న కధా? లేక వున్నది వున్నట్లా!" అనుకుంది కాని అడగలేదు.

    "..... ఆ రోజు మనం సినిమాకి వెళదాం అనుకున్నాము. మా ఆఫీసులో ఒకతనకి భాగ్యలక్ష్మి లాటరీలో అయిదువేలు వచ్చింది. అందరికీ అప్పటికప్పుడు ఆఫీసులోనే పక్క రూములో పార్టీ ఇచ్చాడు. ప్యూన్ గ్లాసుల్లో డ్రింక్ తీసుకుని వచ్చాడు. మిరపకాయ బజ్జీలు బాగున్నాయని గబ గబ తినటంతో నోరు కారం పుట్టింది. కూల్ డ్రింక్ తాగుదామని గ్లాసు ఎత్తి గట గట తాగాను. గొంతుమంట, దగ్గు, నోరంతా చేదు. గబుక్కున గ్లాసు కింద పెట్టాను.

    నన్ను చూసి ఫ్రెండ్స్ నవ్వారు. "బ్రదర్! అంత ఆత్రం కూడదు. మందు ఎప్పుడూ గుక్క గుక్కగా తాగాలి" అని ఒకడు.

    "చప్పరిస్తూ తాగాలి. నాలుక మొద్దుబారి వగరొగరుగా వుంటుంది. మధ్య మధ్య కారం కారంగా ఏదో ఒక పలుకు నోట్లో వేసుకుని చప్పరిస్తూ వుండాలి బ్రదర్!" అని ఇంకొకడు!

    "మందు మజా మనం పుచ్చుకునే విధానంలో వుంది."

    "మందు విషయంలోనే వెనకటికో మందేశ్వరరావు చెప్పాడు. నిదానమే ప్రధానం మందే దివ్య ఔషధం."

    ఇలా తలో మాట వదిలారు.

    నా బుర్ర గిర్రున తిరిగిపోయింది.

    "నేను తాగింది మందా!"

    ఇదే మాట వాళ్ళని అడిగాను.

    వాళ్ళు నవ్వారు. పైగా యిదే మొదటిసారిగా బ్రదర్! మందుచ్చుకోటం అన్నారు. నేను ఇంతవరకూ ఇలాంటిది పుచ్చుకోలేదు. మందుపార్టీ అని చెప్పక్కరలేదా! అని అరిచాను. మసాలా పకోడీలు, మిరపకాయ బజ్జీలు, కూల్ డ్రింక్ తో పార్టీ చేస్తున్నాడని అనుకున్నాగాని యిదని తెలిస్తే చస్తే ఈ పార్టీలో కలిసేవాడిని కాను. అంటూ వాళ్ళ మీద ఎగిరాను.

    "అబ్బాయిగారి మీద మందు పనిచేస్తున్నదిరోయ్!"

    "శివం పూనినట్లు తూలిపోతున్నాడు."

    "మాట చూశావా! తడబడుతున్నది."

    "రెండు గుక్కలకే అవుటవుపోయావా నాయనా!"

    "భార్యామణి కోప్పడుతుందని భయమా తండ్రీ!" ఇలా తలో మాట వదిలారు. నేను వెంటనే అక్కడ నుంచి వచ్చేశాను.

    నేను తూలుతున్నానా! నా మాట తడబడుతున్నదా! నాకేం అర్ధం కాలేదు. వెళ్ళి పార్క్ లో కూర్చున్నాను. నా తల తిరుగుతున్నట్లే అనిపించింది. అలా రెండు గంటలు గడిపాను.

    ఇంటికి రాకుండా ఎంతసేపని బయట తిరగను? నేను ఇంటికి రాకపోతే నీవు ఆదుర్దా పడతావు. చివరికి ఓ ఉపాయం ఆలోచించాను. నేను దగ్గరకి వస్తే నీవు వాసన పసిగడతావు. నిజం చెప్పినా నీవు నమ్మకపోతే వ్యవహారం చాలా దూరం పోతుంది.

    సీతా! నీ విషయం నాకు తెలిసిందే కదా! సిగరెట్టు అలవాటునే భరించలేవు. ఆఖరికి వక్కచూర వేసుకోటం కూడా దురలవాటే అంటావు. అలాంటి నీవు మందు పుచ్చుకున్నానంటే భరించగలవా! అందుకే-

    తలనొప్పి అనే అబద్ధము.

    అమృతాంజనం రాసుకునే ఫార్స్.

    నీకు తెలిసిందే అమృతాంజనం అంటే నాకెంత ఎలార్జియో. నీవెక్కడ వాసన కడుపులో తెమిలింది. దానికి తోడు నిండా దుప్పటి కప్పనేమో ఆ ముసుగులో ఉక్కిరిబిక్కిరి అయాను. దాంతో తిన్నదంతా వాంతి అయిపోయింది.

    ఆ రోజు జరిగింది అది.

    ఆపై ఏం జరిగింది నీకు తెలుసు.

    ఆ గండం అలా గడిచింది.

 Previous Page Next Page