"అఫ్ కోర్స్! వాళ్ళూ మనుష్యజాతికి చెందినవారే! కరెక్ట్! అయితే ఇప్పుడేమంటావ్?"
"వీడు రాయబోయే నవల్లో ఈ హిప్నాటిజం గిప్నాటిజం, మంత్రాలూ, మాయలూ, అంతా ట్రాష్ అని మెసేజ్ ఇస్తున్నాడండీ"
"అవునండీ! ఆ నవల మీకే అంకితం ఇవ్వాలని కూడా అనుకుంటున్నానండీ" తనూ అందుకుంటూ అన్నాడు సింహాద్రి.
కర్నల్ మెత్తబడ్డాడు.
"ఓకే! మీ విషయం తర్వాత ఆలోచిస్తాను. మిస్టర్ ధనుంజయ్.... మేడమీదకు పద! అన్నట్లు బేబీ! నేను వీడిని రెండు నిమిషాల్లో కాల్చేసి కిందకొస్తాను. ఈలోగా నా జోక్ బుక్ రడీగా ఉంచు! ఇలాంటివాళ్ళను కాల్చినప్పుడు ఓ జోక్ చదువుతేగాని మూడ్ రాదు మళ్ళీ"
ధనుంజయ్ భయపడిపోయాడు.
"బాబోయ్! ఇంకెప్పుడూ నవలలు రాయను. నన్నొదిలేయండి"
ఈలోగా శ్రీదేవి ఆలోచనల్లోనుంచి బయటపడింది.
"డాడీ"
"యస్ బేబీ"
"నేను సింహాద్రిని మారేజ్ చేసుకుంటాను డాడీ"
"వాట్..... ఈ డెకాయిట్ నా?"
సింహాద్రికి ఆ కొటేషన్ నచ్చలేదు.
"నేను డెకాయిట్ కాదండీ! జర్నీలో క్రాఫ్ చెదిరిపోవడం వల్ల అలా కనబడుతున్నాను. అద్దం, దువ్వెనా ఇప్పిస్తే..."
"షటప్" అరచాడు కర్నల్. "ఇలాంటి దొంగవేషాలేసే వాడిని పెళ్ళి చేసుకుంటావా బేబీ!" ఆశ్చర్యంగా అడిగాడు కర్నల్.
"అది వాడి ప్రొపెషన్ కాదండీ! జస్ట్ పార్ట్ టైం, ఒరిజినల్ గా వాడి బిజిలీ అండ్ బిజిలీ కంపెనీలో ఎకౌంటెంట్ అన్నాడు చిరంజీవి.
"ఇలాంటివాడిని ఎకౌంటెంట్ గా పెట్టుకుని ఆ కంపెనీ ఎలా మూతపడలేదో నాకర్ధం కావటం లేదు" అన్నాడు కల్నల్.
"ఇందులో అర్ధం కాపోడానికేముందండీ! వీడు ఎక్కువగా ఆబ్సెంట్ అవుతుంటాడు కదా?"
కర్నల్ కి అర్ధమయింది.
"దట్ మస్ట్ బీ ది రీజన్" అన్నాడు తలపంకిస్తూ.
"అవునండీ! దటీజ్ ఓన్లీ ది రీజన్" అన్నాడు చిరంజీవి.
"అయినాగాని ఆఫ్టరాల్ ఓ బిజిలీ అండ్ బిజిలీ కంపెనీ ఎకౌంటెంట్ ని నువ్వు పెళ్ళి చేసుకోవడం నాకిష్టం లేదు" అంతలోనే తేరుకొని నిష్కర్షగా చెప్పేశాడు కర్నల్.
సింహాద్రి నీరు కారిపోవాలనుకున్నాడు గానీ, అలా నీరు కారిపోతే ఫారిన్ తివాచీ తడచిపోవటం, దానివల్ల కల్నల్ కి మళ్ళీ తిక్కరేగి పిస్టల్ ని తనవేపు తిప్పడం జరుగుతుందని ఆగిపోయాడు.
"కాని డాడీ.. అతనికింకా మంచి ఉద్యోగం దొరుకుతుందేమో కదా" అంది శ్రీదేవి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ.
"ఆ! అవునండీ! మా ఫ్రెండ్ ఒకడు ఇలాగే అప్పడాల కంపెనీలో పద్దులు రాసే వాడండీ! అలాంటి వాడు సడెన్ గా అయ్.ఏ.యస్.కి సెలక్టయిపోయాడు. అంచేత మనం ఎవరి భవిష్యత్తు ఎలా వుంటుందో చెప్పలేమండీ" అన్నాడు చిరంజీవి.
"ట్రాష్" అరచాడు కర్నల్ "నేన్నమ్మను"
"మొదట్లో నేనూ నమ్మలేదండీ! కానీ వాడు ఆర్డర్స్ తీసుకొచ్చి నాకు చూపించి ఏడ్చాడండీ!"
"ఏడ్చాడా?
"అవును..."
"ఏడవటం ఎందుకు?"
"ఆనందం పట్టలేకండీ"
"అయ్ సీ!"
"అవునండీ!"
"వాడి పేరేమిటి?"
"పేరా పేరూ.....ఛిస్పేలపాడియా"
"ఎక్కడ వర్క్ చేస్తున్నాడో చెప్పు. నువ్వు చెప్పేది నిజమో కాదో ఇప్పుడే తేల్చుకుంటాను" అన్నాడు కర్నల్ రిసీవర్ చేతిలోకి తీసుకుంటూ.
చిరంజీవి కంగారుపడ్డాడు.
"అబ్బే వాడిప్పుడు ఎక్కడా పని చేయటం లేదండీ!"
"ఏం ఎందుకని?" అనుమానం ఎక్కువయిపోయింది కర్నల్ కి.
"ఎందుకంటేనండీ- పాపం వాడు చచ్చిపోయాడు."
"వ్వాట్? చచ్చిపోయాడా?"
"అవున్సార్ పూర్ ఫెలో! ఆర్డర్స్ తీసుకుని రైల్లో మసూరీ వెళ్తుంటే ఆ రైలుకి ప్రమాదం జరిగి చచ్చిపోయాడు" కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు చిరంజీవి.
"పోతేపోనీ! స్టిల్ అందరూ ఛిస్పే కపాడియాలు కాలేరు! దిసీజ్ మై ఒపినియన్" అన్నాడు కర్నల్.
"అఫ్ కోర్స్- అఫ్ కోర్స్" అన్నాడు చిరంజీవి ఇంకేమనాలో తెలీక.
"అందులోనూ ఇలాంటి డెకాయిట్స్ ఛస్తే ఐఏఎస్ కి సెలక్ట్ కాలేరు. నేను రాసిస్తానలా అని"
"అబ్బే! రాయనవసరంలేదండీ! మా మాట మీద నాకు చాలా గురి"
"అవున్సార్! మీ మాటంటే నాకూ గౌరవం!" అన్నాడు సింహాద్రి.
శ్రీదేవికి ఉక్రోషం ముంచుకొచ్చింది. తండ్రిని ఎలా కన్విన్స్ చేయాలో ఏమాత్రం అర్ధం కావటం లేదు.
"కాని డాడి అతనికి వాళ్ళ కంపెనీలోనే ప్రమోషన్ వచ్చి మేనేజర్ అయిపోవచ్చు కదా!" అంది మరో పాయింట్ పట్టుకుని.
చిరంజీవి ఠక్కున అందుకున్నాడు.
"అవునండీ! మీకు చెప్పటం మర్చిపోయాను. వీడు ఏ క్షణాన్నయినా మేనేజర్ అయిపోవచ్చు"
"ఎలా అవుతాడు? యింత పనికిరానివాళ్ళు ఎక్కడయినా మేనేజర్లు అవుతారా?"
"అందరి సంగతీ నాకు తెలీదుగానండీ, వీడు డెఫినెట్ గా అవుతాడు-"
"ఎందుకని?"
"ఎందుకనంటే- ఎందుకనంటే- ఆ! వీళ్ళ కంపెనీని మన ప్రభుత్వం తీసేసుకుంటోంది-"
"తీసుకుంటే?"
"ప్రభుత్వం రంగ సంస్థల గురించి మీకు తెలీందేముంది సార్! వాటిల్లో పెద్ద హోదా గల ఉద్యోగాలన్నీ ఎందుకూ పనికిరాని వాళ్ళకేగా యిస్తారు?"
"అఫ్ కోర్స్- అఫ్ కోర్స్" అన్నాడు కర్నల్. అతనికి చిరంజీవి మాటల్లో చాలా నిజం కనిపించింది.
"స్టిల్ అయ్ డోంట్ డైజెస్ట్....." అంటూ సింహాద్రిని చూసి ఏదో చెప్పబోయాడు. శ్రీదేవి చప్పున అడ్డుపడింది.
"డాడీ! ఇంకేమీ చెప్పకండి డాడీ! ప్లీజ్-" అంది బ్రతిమాలుతూ. కర్నల్ కి శ్రీదేవిని చూస్తే జాలేసింది.
"నువ్ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా బేబీ?" అడిగాడు అనుమానంగా.