విశ్వనాథం ఇలా లాభంలేదని కల్నల్ ని బతిమాలాడాడు.
"ఒక్క సర్టిఫికెట్ రాయనీండి సార్"
"వాట్? సర్టిఫికెట్ ఎందుకు?"
"వీడికి పిచ్చి ఉందని" అన్నాడు సింహాద్రిని చూపిస్తూ.
"ఉంటే సర్టిఫికెట్ ఎందుకు?"
"ఆ సర్టిఫికెట్ ఉంటే వాడి చేతికి ఆస్తి ఇవ్వాల్సిన అవసరం ఉండదు"
"ఆస్తా? ఆస్తేమిటి?"
ఆ మాటతో సింహాద్రి అదిరిపోయాడు. చిరంజీవి వంక కంగారుగా చూశాడు.
"ఆ సర్టిఫికెట్ చెల్లదు" అన్నాడు చిరంజీవి గంభీరంగా.
"ఎందుకు చెల్లదు?"
"ఎందుకంటే ఆ సర్టిఫికెట్ ఇచ్చే వాళ్ళ మానసిక పరిస్థితి బాగుండాలి కనుక!"
"అంటే నాకు పిచ్చి ఉండాదంటావా?" కోపంగా అన్నాడు భావయ్య.
"అవును! లేకపోతే వీడికి పిచ్చి ఉందని సర్టిఫికెట్ ఇస్తారా ఎవరయినా?"
"ఏమయ్యా ఏమిటి సెప్తావు? నువ్వే వాడికి పిచ్చి ఉండాదని అన్నావు" అన్నాడు భావయ్య.
"డాడీ! ఆ రోజు ఇతనినే సింహాద్రి హిప్నటైజ్ చేసి రన్నింగ్ రేస్ పెట్టాడు" అంది శ్రీదేవి.
కల్నల్ ఆశ్చర్యపోయాడు.
"రన్నింగ్ రేసా?"
"అవును డాడీ"
"రన్నింగ్ రేసేమిటి?"
"ఈయనా, సింహాద్రీ, చిరంజీవిగారూ, కుక్కా...."
"కుక్కా?"
"యస్- ఎ కంట్రీడాగ్"
"కంట్రీ డాగ్ రన్నింగ్ రేస్ చేస్తుందా?"
"చేసింది డాడీ"
"ఇక్కడేమయినా కుక్కలున్నాయా" కుక్క విషయం గుర్తురాగానే భయంగా అడిగాడు విశ్వనాథం.
"ఎందుకు? రేస్ స్టార్ట్ చేస్తావా?" అడిగాడు కల్నల్.
"భావయ్య గారూ! ముందు మీరు సర్టిఫికెట్ రాయండి" అన్నాడు విశ్వనాథం.
"విట్ నెస్ ఎవరుంటారు?"
"ఎవరో ఒకరుంటారు. ముందు రాయండి"
"ఆయన వద్దంటున్నాడుగా?" అన్నాడు భావయ్య కల్నల్ ని చూపుతూ.
"సార్! కొంచెం రాయనీండి!" ఇది ఇలా అర్జంట్"
"వాట్ అర్జంట్?"
"సర్టిఫికెట్ అర్జంట్"
"వాట్ సర్టిఫికెట్?"
"వీడికి పిచ్చి ఉందని"
"నా యిల్లు అడ్డమైన రాస్కెల్స్ సర్టిఫికెట్లు రాసుకునే సత్రం కాదు. గెటవుట్! రెండు నిమిషాల్లో కాంపౌండ్ బయట ఉండాలి! లేపోతే ఇద్దరూ అవుట్. ఇప్పుడు టైమ్ ఒంటిగంటా ఇరవై రెండు నిమిషాలయింది" అన్నాడు కల్నల్ టైమ్ చూసుకుంటూ.
"సరే పదండి! బయట రోడ్డుమీద కూర్చుని రాసుకుందాం" అన్నాడు విశ్వనాథం.
"ఏమయ్యా! ఏమిటయయా సెప్తావు? మేజిస్ట్రేట్ ని రోడ్డు మీద సర్టిఫికెట్లు రాస్తునా? నిండా బుద్దిలేదేమి నీకు?"
"ఫరవాలేదండీ ఈ ఒక్కసారికీ"
"ఇంటిగంటా ఇరవై మూడు" అన్నాడు కల్నల్.
"అప్పుడే ఒక నిమిషం అయిపోయిందప్పా" గాబరాగా అన్నాడు భావయ్య ఇంతలో హడావుడిగా నలుగురు కానిస్టేబుల్స్, ఓ సబిన్ స్పెక్టర్ వచ్చేశారు లోపలికి.
"గుడ్ మార్నింగ్" అన్నాడు ఇన్ స్పెక్టర్.
"గుడ్ మార్నింగ్" అన్నాడు కల్నల్.
"ఎవరు పిచ్చివాళ్ళు ఇందులో"
"వీళ్ళిద్దరూ" అన్నాడు కల్నల్ విశ్వనాథాన్ని, భావయ్యను చూపుతూ- ముందు వాళ్ళ పీడ వదిలించుకోవాలని చాలా కోరిక కలిగిందతనికి. ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
"మేమా?" అన్నాడు విశ్వనాథం.
"ఏమయ్యా సెప్తావు మేము పిచ్చివాళ్ళమా?" అన్నాడు భావయ్య.
ఇన్ స్పెక్టర్ కానిస్టేబుల్స్ కి సైగ చేశాడు.
వాళ్ళు ఇద్దరినీ రెక్కలు విరిచిపట్టుకుని బయటికి ఈడ్వటం మొదలు పెట్టారు.
"ఏమయ్యా ఏమి సేస్తారు? నేనుదా పిచ్చివాడినా? మేజిస్ట్రేటునయ్యా"
"అందరూ ఇలాగే చెప్తార్లే. నడు నడు" అన్నాడు కానిస్టేబుల్.
"అదేమయ్యా అట్లాఅంటావు? రియల్ మేజిస్ట్రేట్ ని"
"అందుకే పద అక్కడ కేసులు చూద్దూగాని"
"నిజంగానండీ! మేము పిచ్చివాళ్ళం కాదు" అన్నాడు విశ్వనాథం.
"కాపోతే మరీ ఇంటికెందుకొచ్చారు?"
"ఇదిగో ఈ న్యూస్ పేపర్లో ఈ అమ్మాయి ఫోటో వేసి ఇవాళ బర్త్ డే అని రాశారుదానే. తప్పక మా సింహాద్రి ఇక్కడ ఉంటాడని వచ్చాం"
"మీ సింహాద్రా? ఎవరతను?"
"అడుగో అతను"
"అతను నీకేమవుతాడు?"
"నాకు వరుసకు మేనల్లుడు"
"వాట్ మిస్టర్! వీడు చెప్పేది నిజమేనా?" సింహాద్రి నడిగాడు ఇన్ స్పెక్టర్.
"అంతా అబద్దమండీ! అసలింతవరకూ నేనాయన మొఖమే చూడలేదు" ఇన్ స్పెక్టర్ విశ్వనాథం వంక చూశాడు.
"ఒరేయ్ సింహాద్రీ! ఏమన్నావురా! నేనెవరో తెలీదా నీకు?" కోపంగా అరచాడు విశ్వనాథం.
"పాపం! సివియర్ మెంటల్ షాక్ తగిలి ఉంటుంది. అందరినీ మేనళ్ళుళ్ళు అనుకుంటున్నాడు" అన్నాడు చిరంజీవి.
ఇన్ స్పెక్టర్ ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళిద్దరినీ ఈడ్పించుకుంటూ బయటికెళ్ళిపోయాడు.
కల్నల్ తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు.
"మీకో విషయం అర్జంటుగా మనవి చేయాలని అనుకుంటున్నామండీ" అన్నాడు చిరంజీవి కల్నల్ తో.
"ఏమిటది?"
"వీడు ప్రస్తుతం ఓ నవల రాస్తున్నాడండీ"
"అదేమిటి? వీడసలు రచయిత కాదుగా?"
"కాపోయినా సరే! రాస్తున్నాడండీ"
కల్నల్ కి ఆశ్చర్యంగా ఉంది.
"హౌ ఇటీజ్ పాజిబుల్? రచయిత కాన్దే ఎలా రాస్తారు?"
"దాన్దేముందిసార్! రచయితలు కూడా మొదటి నవల రాసేముందు మామూలు మనుషులే కదండీ"
కల్నల్ ఆలోచించాడు.