Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 38

తలుపులు దభాల్న తెరచుకున్నాయి భయపడుతూ చూసింది. గూడ కట్టుతో అజానుభాహుడైనా వ్యక్తీ నిలబడ్డాడు గుమ్మాని కడ్డంగా . అతని కళ్ళు భాగా ఎఱ్ఱగా వున్నాయి. ఆ కళ్ళు చూడగానే జాన్ కళ్ళు గుర్తొచ్చాయి రాగకి. భయం వేసింది. బుగ్గ మీసాలు అక్కడక్కడ నెరిసిన జుట్టు మొరటుగా వున్న చేతులు "ఏయి పిల్లా! ఏట్టున్నావు?" అరవ యాసలో పలుకరించాడు. మాట్లాడలేదు రాగ.
"భయం లేదులే నిన్నిక్కడెవరు ఏం చెయ్యరు? ఏ కావాలన్నా నన్నడుగు. వస్తానే వుంటాను. "సైరన్ కుసినట్టు కయ్యిమని అన్నాడు. అతడు మాట్లాడుతున్నప్పుడల్లా రాగకి భయంతో ప్రాణాలు పోతున్నట్లనిపిస్తాయి. అతడు జేబులోంచి ఐదు రూపాయలు తీసి ముందుకు చాచి పట్టుకుని, "ఇంద తీసుకో," అన్నాడు. భయంతో బిగుసుకుపోయి నిలబడింది రాగ.

                                  ..............................................................

మొదట్నుంచి అణుకి ఒంటరిగానే ఎక్కువ అలవాటు. మర్యాద కోసం అరగంటో, గంటో పదిమంది మధ్య గడుపుతుందేమో కాని, ఎప్పుడూ పదిమంది మనుష్యులు గుమిగూడి వుండటం గోలగోలగా మాట్లాడుకుంటూ గందర గోళంగా వుండటం ఏమాత్రం భరించలేదు. రాగ తప్పిపోయి, మనసంతా అశాంతిగా వుండి ఒంటరిగా కాస్సేపు వుండాలనుకుంటే కుదరడం లేదు. రెండు గదుల ఆ ప్లాట్ ఎప్పుడూ జనంతో సందడిగానే వుంటోంది. ఇంటికి ఎవరో ఒకరు రావడం, రాగ తప్పిపోవడానికి సంబంధించి ఏవో సానుభూతి మాటలు మాట్లాడటం, వెంటనే అత్తా ఆడపడుచులు చెరో వైపు రాగాలందుకోవడం మాములు అయిపొయింది. పాపం వాళ్ళు ఏడుపు నటించడం లేదు వాళ్ళు సంస్కారం అలాంటిది. పిలిస్తే పలుకుతాయి కన్నీళ్ళు.
రాగ నించి 'సారీ మమ్మీ!' అన్న మెసేజ్ అందుకున్నాక చేతులు ముడుచుకుని కూర్చోలేకపోయింది అణు ఎలాగైనా రాగకి తన సమాధానం అందాలి. మనోహర్ తో సంప్రదించి ఇంగ్లీషు డైలీ లన్నిటిలోను ఒక ఉత్తరం పబ్లిష్ చేయించింది.
"రాగా నా బంగారు తల్లీ!
నువెందుకు నాకు సారీ చెప్పడం? నువే మీ తప్పు చేయలేదు, నాకు నీ మీద ఏమి కోపం లేదు. దైర్యంగా వుండు. నిన్ను తిసుకోచ్చేస్తాను. డాడీ కూడా వస్తారు. భయం వేస్తె చిన్ని కృష్ణుడ్ని ధ్యానం చేసుకో. ఆ కృష్ణయ్య నీకు తప్పక సహాయం చేస్తాడు. తొందర్లో మనం కలుసుకుందాం.

                                                                                                                     నీ
                                                                                                                  "మమ్మీ."
ఇది ఆ ఉత్తరం. ఉత్తరం ప్రచురించాక మళ్ళీ ఎన్నో సందేహాలు. రాగ ఆ ఉత్తరం చదువుతుందా? రాగ ఉన్నచోటికి ఇంగ్లీషు డైలీ వెళ్ళే అవకాశం వుందా? ఒకవేళ ఉత్తరం రాగ చదవడానికి బదులుగా రాగని కిడ్నాప్ చేసిన క్రిమినల్ చదివి పాపని మరింత హింస పెడ్తాడా? ఇంతకీ ఏ దశలో వుంది రాగ?
ఏ పని చేస్తున్నా యీ ఆలోచనలు ఆమె మనసును గజిబిజి చేస్తూనే వున్నాయి. అయినా నిలదొక్కుకొని ముందు ఏం చెయ్యాలో అని ఆలోచిస్తుంది. ఆ రోజు మనోహర్ , జలజ, అణు కూర్చుని చర్చించుకుంటున్నారు.
"ఆ సోదెమ్మ మళ్ళీ రాలేదా?" అడిగాడు మనోహర్.
"రాదు రాదని నాకప్పుడే తెలుసు. ఆ సోదెమ్మ చాలా తెలివైనది. నిస్సందేహంగా ఆ గ్యాంగ్ లోదే. ఇక్కడి వాతావరణం కనిపెట్టడానికి వచ్చింది. పాప అంటే సింపతి వుందేమో? అతి తెలివిగా పాప మెసేజ్ అందించి వెళ్ళిపోయింది" అంది జలజ.
"మీరు వెంటనే నాకు తెలియపర్చి వుండవలసింది" అన్నాడు మనోహర్.
"ఎలా? పాప సారీ చెప్తోంది అనే వరకు నా కనుమానమే రాలేదు. మా అణుకైతే ఆ సోదెమ్మ లో నమ్మకం కూడా ఏర్పడిపోయింది. తల్లి ప్రేమ ముందు విచక్షణ చిత్తుగా ఓడిపోయింది. ఆ ఒక్క మాటా చెప్పేసి సోదెమ్మ వెళ్ళిపోయింది. నేను వెంటనే మీకు తెలియబర్చాను. ఏం లాభం? మనం అనుమానించినట్లే ఆ సోదెమ్మ మళ్ళీ రాలేదు" అంది జలజ.
"అప్పుడు కాదు ఇప్పుడైనా మీరు ఆ సోదెమ్మని అరెస్టు చేస్తానంటే నేనొప్పుకొను. ఆవిడ గాంగ్ లో మనిషయితే కావచ్చును. కాని పాపని సింపతటిక్ గా చూస్తోంది. పాప దొరికేవరకు ఆవిడ కూడా పాపతో వుంటేనే మంచిది. మీరు అరెస్ట్ చేసారంటే అవతల పాప యోగక్షేమాలు ఆలోచించకుండా మీ మెదడ్స్ అన్నీ ఉపయోగించేస్తారు. నిజం రాబట్టుకోవడం దోషిని అరెస్టు చెయ్యడం ఇవి రేండే ప్రధానం మీకు."
"మరీ సున్నితంగా ఆలోచిస్తే మేము దోషులని పట్టుకోలేము అసలు. దాన్ని తీసికెళ్ళి మా పద్దతుల్లో మేము నిజం చెప్పెంచే వాళ్లం ఈపాటికి పాప ఎక్కడుందో తెలుసుకునేవాళ్ళం." అన్నాడు మనోహర్. జలజ కల్పించుకుని "జరిగిపోయిన దాని గురించి తర్కించుకుని ఏం ప్రయోజనం? జరగవలసింది ఆలోచించుకోవాలి. మనోహర్ గారూ! నేను చుట్టుపక్కల పల్లెటుళ్ళలోను సరదాగా తిరిగోస్తాను. రాగని కిడ్నాప్ చేసిన వాళ్ళకి నేనెవరో తెలియదు గనుక అనుమానం రాదు" అంది.
"గిరీశంగారితో వెళ్ళలేదా?'
ఆ అనుభవాలు తల్చుకుని నవుకుంది జలజ. "ఆ ప్రవరాఖ్యుడు నాతో యిహ రానన్నాడు. ఆ కిడ్నపర్ గిరీశం గుండాయే కనక అయన గుర్తుపడ్తారేమోనని ఆశపడి ఆయన్ని వెంట తీసికెళ్ళను. ఒట్టి పప్పుసుద్ద మీరు నాకు చూపించిన ఫోటోలని బట్టి సన్యాసి వేషంలో వొచ్చింది జాన్ గోవింద్ కావచ్చని నేను అనుమానించి వెంబడించాను. కానీ ఆ మహానుభావుడుకి ఆ ఆలోచనే రాలేదు. అతడికి నన్ను చూడ్డంతోనే సరిపోయింది. నన్ను గురించి వేసుకున్న అంచనాలన్నీ తారుమారు అయిపోయినట్లున్నాయి. తెగ నిరుత్సాహపడిపోయాడు. పాపం "మళ్ళీ నవింది అప్పటి గిరీశం మొహం గుర్తొచ్చి.
"అజాన్ గోవింద్, లేక అబ్దుల్లా, లేక బాస్టిన్ లేక అజిత్ సింగ్ చాలా తెలివైనవాడు. ఇంకా ఆ ప్రాంతాలలోనే వుంటాడనుకోను."
"ఆ టూరిస్టు అణుకి ఉత్తరం వ్రాసినట్లు జాన్ గాడికి ఎలా తెలుస్తుంది? మీరన్నట్లు అతడు తెలివైనవాడయితే ఆ పరిసర ప్రాంతాలలోంచి కదలడు. ఎందుకంటె అన్ని బస్ స్టాప్ లలోను, రైల్వే స్టేషన్ లలో, పోలీసు స్టేషన్ లలోను మనం రాగ ఫోటో తో సహా వార్తలు పంపినట్లు అతడికి తెలిసి వుంటుంది. ఇది ఓ పెన్ సిక్రెట్ ఆ చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళున్నాయి. జీడి మామిడి తోటలున్నాయి. జీడి మామిడి తోటల్లో పనిచేసే కూలీల కుటుంబాలున్నాయి. అడవుల్లో గిరిజన ప్రాంతాలున్నాయి. అక్కడెక్కడైనా పాపని దాచి వుంచారేమో?"
"కోణార్క్ దేవాలయానికి దగ్గిర్లో పల్లెటూళ్ళు లేవు. అన్నీ దూరంలో ఉన్నాయి. అంత దూరం నుంచి ఎనిమిదేళ్ళ పిల్ల దేవాలయానికి రాగలిగి వుండేదా?" ఆలోచిస్తూ అన్నాడు మనోహర్.
"అవసరం మనుష్యుల చేత ఎలాంటి అద్బుతాలనైనా చేయిస్తుంది. పొలిసాఫీసరైన మీకు నేనీ విషయం చెప్పనక్కర్లేదు."

 Previous Page Next Page