Previous Page Next Page 
కనబడుటలేదు పేజి 37

"సేహభాష్! అణు! ఇప్పుడే వెళ్ళి జీవన్ కి చెప్పోస్తాను. నువు గిరీశాన్ని చేసుకోబోతున్నావని పాపం ఆనందిస్తాడు." అణు చటుక్కున జలజ చెయ్యి పట్టుకుని "నీకు పుణ్యముంటుంది ఆ పని చెయ్యకు. జీవన్ కి అస్సలు ఆలోచన లేదు. నమ్మినా నమ్మేస్తాడు." అని టి.వి వాళ్ళని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుంది. టి.వి ప్రోడ్యుసర్ తెల్లబోయింది మొదట. తర్వత "ఇది బాగానే ఉంది కూతురు గురించి చెప్తూ దుఖంతో మాట్లాడలేక అబ్రప్ట్ గా వెళ్ళిపోయారు. అని వ్యాఖ్యానించోచ్చు" అంది.
"అవును అదే బాగుంటుంది. మీ ఇంటర్యూ ప్రోగ్రాం ఎంతో బాగుందని ప్రశంశలు కురిపిస్తూ లక్షలాది ప్రేక్షకుల నుంచి ఉత్తరాలోచ్చేస్తాయి. "నవకుండా సీరియస్ గా చెప్పింది జలజ. టి.వి బృందం వెళ్ళిపోయింది.
లవర్స్ పారడైజ్ బీచ్ లో నరకం అనుభవిస్తున్నాడు గిరీశం. చకచకా అటునించి యిటూ , యిటూ నుంచి అటూ పరుగులు తీస్తున్నట్లు నడుస్తోంది జలజ. నిజానికి జలజతో బయలు దేరుతున్నప్పుడు చాలా చాలా కలలు కన్నాడు. ఆ అమ్మాయి తనంతట తనే సన్నిహితంగా వస్తుందని. అప్పుడు, "అమ్మా! ఇది మంచి పని కాదు. నేను వివాహితుడ్ని "అని బుద్ది చెప్పాలని అయినా ఆపిల్ల వినిపించుకోకుండా తన మీద పడి కౌగలించుకుంటుందని......ఇలా సాగేయి అతని ఉహలు.
ఈ ఉహల మధ్య అతడికి చాలాసార్లు శరీరం పులకరించింది కూడా. కాని జలజ అతడితో డబ్బు ఖర్చు పెట్టించడం తప్ప అతడో మనిషే కాదన్నట్లు ప్రవర్తిస్తోంది. కోణార్క్ సూర్యదేవాలయం మాత్రమే గాక కొంతదూరంలో ఉన్న మాయాదేవి ఆలయం ఇంకా కొన్ని చిన్న చిన్న దేవాలయాలు అన్నీ తెగ తిరుగుతోంది. గిరీశం దేవాలయం మీద శృంగార భంగిమల్ల్లో ఉన్న జంటల శిల్పాలు చూస్తూ  తన్మయుడై ఉండగా జలజ అక్కడ్నించి చంద్ర భాగా నది తీరానికి వెళ్ళిపోయాక ఆ గట్టు వెంట నడవడం మొదలు పెట్టింది.
అంత "మంచి శిల్పాలు" తనతో కలసి చూడనందుకు జలజ మీద కోపం కూడా వచ్చింది గిరిశానికి. ఏం లాభం? ఎంత కోపం వచ్చినా అతడు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి వెళ్ళలేక పోతున్నాడు. "కర్తవ్యం" అని తనని తన్ను నమ్మించుకుంటున్నాడు. ఆ అమ్మాయి అశాంతిగా ఎందుకలా తిరుగుతుందో అతనికి అంతు పట్టడం లేదు.
"జలజగారు! ఒకవేళ మీరేవరైనా మొగస్నేహితులకోసం నాతో కలిసి యిక్కడికి వచ్చారా?" అని అడిగాడు.
 ఏదో అలోచిస్తున్నట్లున్న జలజ మొదట అర్ధం కానట్లు తెల్లబోయి చూసి, అంతలో నవి, "తప్పు తప్పు బోయ్ ఫ్రెండ్ కి తెలుగు మగ స్నేహితుడు కాదు, బాలక స్నేహితుడు" అని మళ్ళీ నవింది.
"ఇంతకు మీరు నన్ను ఎందుకు రమ్మన్నారో నాకర్ధం కాలేదు"
"ఈ మగవాళ్ళు" మనసులో పళ్ళు నురుకుంది జలజ. పైకి అమాయకత్వం నటిస్తూ "ఇక్కడ నన్నే మగవాడేనా బలాత్కారం చేస్తే మీరు నన్ను కాపాడతారని, కాపాడలేక పొతే కనీసం పారిపోయి పోలిస్ రిపోర్ట్ యిస్తారని రమ్మన్నాను"
ఆ అమ్మాయి తనని ఆటలు పట్టిస్తోందని అర్ధమైంది గిరిశానికి. అతడికి ఉడుకు మోత్తనం వచ్చింది.
"అయితే నే వెళ్ళిపోనా?" ఉక్రోషంగా అడిగాడు.
"వెళ్ళండి. ఇంకెప్పుడూ అణుతో "మీకేం సాయం కావాలన్నా చేస్తాను" అనకండి."
"ఇలా మీతో తిరగడం అణుగారికి సాయమా?"
"కాదా! మీరు నాతో తిరగకపోతే నేను జీవన్ దగ్గిర ఉండేదాన్ని. అది అణు కి నష్టం కలిగించేది మీకు తెలియకుండానే మిరామెకి ఎంత సాయం చేస్తున్నారో తెలుసా?"
గిరిశానికి కళ్ళనీళ్ళ పర్యయంతం అవుతోంది. ఆమెతో మాటలో అతడేప్పుడు గెలవలేడు. జలజ ఉన్నట్టుండి చటుక్కున ఒక గెడ్డం సన్యాసిని అనుసరించడం మొదలు పెట్టింది. ఆ సన్యాసిని పరుగు లాంటి నడకతో నడుస్తుంటే జలజ కూడా అంతే వేగంతో నడుస్తోంది. గిరిశానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. "ఆ పిల్ల యీ గెడ్డం సన్యాసి వెంటపడి ఎందుకు పోతున్నట్లు? ఏదైనా పిచ్చిగాని యెక్కలేదు కదా!" చేసేది లేక ముఖశాలలో అరుగుమీద కూలబడి స్థంభానికానుకుని కునికి పాట్లు పడడం మొదలు పెట్టాడు. దాదాపు అర గంట తరువాత జలజ వచ్చి భుజం మీద తట్టి, " లేవండి యిక పోధాం" అంటే ఉలిక్కిపడి లేచి "ఏంటి?" అన్నాడు.
"ఇహ వెళ్దాం అంటున్నాను. రేపోద్దాంమళ్ళీ"
"రేపు మళ్ళినా? రానంటే రాను."
"అణుకి సాయం చేస్తానంటారా?"
"అననంటే అనను"
'అయితే మీ ఖర్మ నేను పోతున్నాను. మీరు రావాలనుకుంటే రండి" అతని లక్ష్యం లేనట్టు వెళ్ళి అటో మాట్లాడుకుని ఆటోలో కూర్చుంది. గిరీశం ఖంగారుగా వెళ్ళి ఆమె పక్కన కూలబడ్డాడు.
గోప్ దగ్గర చిన్న పల్లెటూరు అక్కడొక చిన్న పాక హొటల్ వెనక దొడ్లో నేలమీద గొంతుకు కూర్చుని అల్యూమినియం కాఫీ కప్పులు ఒక్కొక్కటి లేత చేతులతో కడుగుతోంది రాగ. "ఏయ్ పిల్లా! తొందరగా కడిగిన గ్లాసులు తీసుకురా! గిరకిలు వచ్చారు" అచ్చమైన తెలుగులో అంది హొటల్ యజమానురాలు. ఆ ప్రాంతంలో అదొక్కటే తెలుగు కుటుంబం. కూలి నాలీ చేసుకుంటూ నెమ్మది నెమ్మదిగా బస్ స్టాప్ కి దగ్గరలో పాక హొటల్ కట్టుకున్నారు. గ్లాసులు, గిన్నెలు కడిగి ఒక్కొక్కటి ముందు గదిలోకి తెబోయింది. యజమానురాలు హిడింబిలా గుమ్మానికి అడ్డుగా నిలబడి, "ఏయ్! పాడు మొహమా! ముందు గదిలో కొచ్చావంటే కాళ్ళు విరగ్గోట్టాను. అక్కడే వుండు" పాప చేతిలోంచి గ్లాసులు లాక్కుని తట్టలో సర్ది తలుపు దగ్గిరగా లాగి ముందు గదిలోకి వెళ్లిపోయిందావిడ.
అక్కడే ఒక యిటిక రాయి మీద కూర్చుని వీళ్ళంతా ఎవరో, తనక్కడి కెందు కొచ్చిందో ఎలా వచ్చిందో, రాగ కేమి అర్ధం కావడం లేదు. రాత్రి యమ్మాయమ్మ పక్కన పడుకుంది. తెల్లావారేసరికి.....ఈవిడ తట్టి లేపింది. బయట ముందు గదిలోకి ఎవరెవరో వస్తున్నారు వెళ్తున్నారు. వీళ్ళు తనని వంటగది, దొడ్డి దాటి ముందుగదిలోకి రానియడం లేదు. బొగ్గుతో మొహం కడుకున్నాక నీళ్ళ లాంటి టీ యిచ్చారు. వాళ్ళు. బోర్నవిటా తప్ప మరొక్కటి తాగడం అలవాటు లేని రాగ చిన్న గ్లాసుతో యిచ్చిన ఆ టీ ఆవురావురు మంటూ తాగి గ్లాసు ముందుకు జాపి "ఇంకొంచెం!" అంది.
అవసరం మనుష్యులని ఎలా మార్చేస్తుంది?
హొటలు యజమానురాలికి తెలుగు తిట్లు బాగా వచ్చు రాగని ఒకపాడు తిట్టు తిట్టి, "ఇంకా కావాలేం? ఎవడు తెచ్చి పోస్తాడనుకున్నావు? ఈ తాతయ్య గాడొకడు దొరికాడు మా ప్రాణానికి శని లాగా" మెటికలు విరిచింది. ఆవిడ మాటలు రాగకి పూర్తిగా అర్ధం కాకపోయినా తనకి ఆ వేడినీళ్ళ టీ కూడా దొరకదని అర్ధమైపోయింది. ఆకలితో నిస్సాహయంగా చూస్తున్న రాగ ముందుకి ఈతాకుల చీపురు పడేసి "దొడ్డంతా వూడు బొమ్మలా నిలబడకు," అని కసిరింది. చిపురేలా పట్టుకోవాలో కూడా తెలియదు రాగ్కి. ఆ పసిపిల్ల వీపు మీద ఒక్కటి చరిచి ఎలా వూడవాలో చూపించింది. ఆ చీపురు పట్టుకొని దొడ్డంతా వుడ్చింది రాగ. ఆమె చేతులు ఎర్రగా కందిపోయాయి. కదిపోయిన చేతులు యమ్మాయమ్మ కుట్టిన గౌనుకు తుడుచుకుంది. ఏమైపోయింది ఈ యమ్మాయమ్మ? మమ్మీ తనకోసం వెదుకుతోందా? స్కూల్లో లేదని తెలిసి తనకోసం వేడుకుతున్నారా? ఆలోచిస్తూ ఆకలి మర్చిపోడానికి ప్రయత్నించింది.
ఆ క్రితం రోజు చేసిన మిగిలిపోయిన ఇడ్లీలు మూడు ఆకులో వేసి నీళ్ళలాంటి పచ్చడి వేసి రాగ చేతులో పడేసి "మింగు" అంది యజమానురాలు. ఇడ్లీలు కంపుకొడ్తున్నాయి. ఆకలి ముందు శుచి, శుభ్రం , సంస్కారం ఏమి పనిచేయలేదు. వాసన రాకుండా ముక్కు గట్టిగా చేత్తో పట్టుకుని ఇడ్లీలు ముక్కలు తుంపుకుని నీళ్ళ పచ్చడిలో ముంచుకుని తినేసింది. నోరంతా కంపు కొడ్తున్నట్లనిపిస్తే గ్లాసుతో కుండలో నీళ్ళు ముంచుకుని పుక్కిలించి ఉమ్మింది. ఆ నీళ్ళు కూడా ఏదో కంపుకొడ్తున్నాయి.

 Previous Page Next Page