Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 38

  

       "సుందరి ఏమయింది?"
   
    "ఏమవుతుంది? అందరి ఆడవాళ్ళలాగే పెళ్ళిచేసుకుని అత్తారింటికీ వెళ్ళిపోయింది. మొదట నన్ను పెళ్ళి చేసుకొమ్మని అడిగింది. నా ఆసక్తి వెల్లడి చేశాను. ఆమె కోపగించలేదు. తనకు పెళ్లయినా ప్రేమించడం మాననని చెప్పింది. జ్ఞాపకచిహ్నంగా నా వ్రేలికి వున్న ఆకుపచ్చరాయి ఉంగరం అడిగి తీసుకుంది. వెళ్ళిపోయింది సుందరి."
   
    "తరువాత ఎప్పుడూ కనబడలేదా?"
   
    "ఉహు. ఉత్తరాలు వ్రాసేది. ఇప్పుడు ఎక్కడుందో జాడ తెలియదు."
   
    "నీకు బాధగా ఉండదూ?"
   
    కృష్ణ ఓ చిత్రమైన నవ్వు నవ్వుకున్నాడు. "బాధ నిజమే" అన్నాడు.
   
    "మరో అనుభావం విను - ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో-నీకు తెలిసే వుంటుంది. కాలేజీలో ఏదయినా ఫంక్షన్ అయినరోజున అమ్మాయిల్ని యిళ్ళదాకా దిగబెట్టే బాధ్యత కొంతమంది కుర్రాళ్ళకు అప్పగించారు. అప్పగించే దేమిటి? కుర్రాళ్ళు తీసుకున్నారు. చిత్రమేమిటంటే, వీళ్ళంతా రౌడీలుగా కొంచమో, గొప్పో పేరు సంపాదించినవాళ్ళే దీనివల్ల ఓ సదుపాయం ఆడపిల్లలకు కలిగింది. ఇదివరకటిలాగా వాళ్ళను ఏడిపించడం మానేశారు. సహాయం చేస్తున్నట్లు వాతావరణం వచ్చిందిగా తాము ఎవర్నెవర్ని ధించాలో ఎవరిమటుకు వారే నిర్ణయించుకునేవారు. నేను ఓ రాత్రి సువర్చల అనే అమ్మాయిని నిర్ణయించుకున్నాను. ఊరికి రెండుమైళ్ళు వుంది కదా. ఎనిమిది దాటితే రిక్షాలూ, బస్సులూ ఉండవు. కటిక చీకటి. ఇద్దరం ప్రక్క ప్రక్కన నడుస్తున్నాము. నేను ఏవో కబుర్లు చెప్పసాగాను. కాలేజీ ఎలక్షన్ల గురించి, లెక్చరర్లగురించి, స్టూడెంట్సుగురించి-యిలా ఏవో! ఆమె ఆలకిస్తూ మధ్య మధ్యన నవ్వుతూ వెంటవస్తోంది. ఉన్నట్లుండి 'అమ్మో' అంది అంతే. నన్ను భయంతో గట్టిగా కౌగలించుకుంది. బురదపామో ఏదో ఆమె పాదాలక్రింద నుంచి ప్రాకుతూ పోయింది. చటుక్కున నా బూటుతో త్రొక్కి చంపేశాను. 'భయంలేదు, చంపేశాను సువర్చలా' అన్నాను లాలనగా. ఆమె సిగ్గుపడి దూరంగా జరిగి నిల్చుంది. మళ్ళీ మాట్లాడకుండా నడవసాగాము. ఆమె యిల్లు వచ్చింది. "వెడతాను" అన్నాను. "వెళ్ళొద్దు" అందామె నవ్వుతూ. నేను నవ్వి ఆమెను బుగ్గమీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాను...తర్వాత..."
   
    "తరువాత తెలుసు. చెప్పొద్దు."
   
    ఓ గంటదాకా అలా కృష్ణ చెప్పుకుపోతూనే ఉన్నాడు హుషారుగా చివరకు శివనాథరావు "అబ్బ! ఇక వద్దు" అన్నాడు. "నీవు ఎవర్నీ మనస్ఫూర్తిగా ప్రేమించలేదా?" అన్నాడు.
   
    "ఉండు. ఆలోచించనియ్యి...ప్రేమిస్తున్నట్లే వుందిరా యిప్పుడు!"
   
    "ఎవరా వ్యక్తి?"
   
    "అనామ!"
   
    "ఏమిటి?" శివనాథరావు ఉలిక్కిపడ్డాడు.
   
    "అవును ఆమెను మిగతా ఆడవాళ్ళ మాదిరి చూడలేకపోతున్నాను. ప్రేమో, ఏమో-మొత్తానికి కొత్తరాకింగా వుంది యీ స్పందన."
   
    శివనాథరావు ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని పడుకున్నాడు. "ఏం పని జరిగింది?" అన్నాడు నీరసంగా.
   
    "శివా! నీకు నిద్ర వస్తున్నట్లుందే?"
   
    "ఊ"
   
    "నేను వెడతానురా యింక."
   
    శివనాథరావు కళ్ళు విప్పిచూశాడు. కృష్ణ నవ్వి "శివాయ్! నీదొట్టి పిరికి గుండెరా" అన్నాడు.
   
    "అందుకే కాబోలు కృష్ణా, నేను ధైర్యంగా ఆలోచిస్తాను."
   
    "నువ్వు రేపు రాత్రికదూ పోతున్నావ్? సరే రేపు సాయంత్రం కలుస్తాను. వస్తా గుడ్ నైట్." అంటూ కృష్ణ క్రిందకు దిగి వెళ్ళిపోయాడు. మెట్లమీద లైటు వెలగడం, తేలికగా అడుగులచప్పుడు, హుషారుగా ఈలపాట, క్రింద గేటు తెరుచుకోవటం శివనాథరావుకు తెలుస్తూనే వుంది.
   
    అతను లేచి నిలబడ్డాడు. కిటికీ దగ్గరకు పోయి చీకట్లో నడిచిపోతున్న కృష్ణను చూస్తూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ అలాగే వుండిపోయాడు.
   
    ఓ అరగంట అలా నిలబడి వున్నాడు. అంత నిశ్శబ్దంలో క్రింద ఏదో అలికిడి అయినట్లు తోచింది. చప్పున యివతలికి వచ్చి మెట్లు దిగి చూశాడు. హాల్లో చిన్నలైటు వెలుగుతోంది. ప్రక్కగది తలుపులు తెరచివున్నాయి. ఆ గేటు ప్రక్కన ఏదో నీడ కదిలినట్లయింది.
   
    సావిత్రి గదిలోంచి బయటకు వస్తోంది. అక్కడ శివనాథరావుని చూసి నిర్ఘాంతపోయి, మరుక్షణంలో నవ్వుతూ "శివా! ఇక్కడ నిల్చున్నావేం?" అంది.
   
    శివనాథరావు ఆమెవంక పరీక్షగా చూస్తూ "నిద్ర పట్టలేదు" అన్నాడు.
   
    ఆమె నవ్వుతూ "ఏం, సరోజిని గుర్తుకు వచ్చిందా?" అంది.
   
    "పిన్ని!" అని అరిచాడు. ఉత్తర క్షణంలో ఆవేశంతో ఆమెను సమీపించి "ఏం జరిగిందీ నాకు చెప్పు పిన్నీ ఇంతవరకూ నీతో ఎప్పుడూ యిలా మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను నీకేమైనా ద్రోహం తలపెట్టానా?" అన్నాడు దుఃఖంతో వణుకుతున్న గొంతుకతో.
   
    సావిత్రి ముఖం రక్తంలేనట్లు పాలిపోయింది. "నేనేం చేశాను?" అంది వడిగా.
   
    "నేను సరోజిన్ని చేసుకుంటే నీకేమైనా నష్టం వుందా?"
   
    "శివా! నీకేమైనా పిచ్చెక్కిందా? వాళ్ళ సంబంధం చేసుకోవటం మీ నాన్నగారికి ఇష్టంలేదు. నా యిష్టాయిష్టాలతో ఆయనకు ప్రమేయం లేదు. ఆయన చెప్పమన్న విషయం నేను సరోజినికి చెప్పాను. నేను ఆడదాన్ని నన్ను అపరాధిని చేయడానికి ఈ విషయం మీ నాన్నగారు నాతో చెప్పించారు" అభిమానంతో ఆమె కంఠం వడవడ వొణికింది.
   
    శివనాథరావు కొంచెం ముందుకు వచ్చి "ఎందుకని? నాన్నగారికెందుకని యిష్టంలేదు?"
   
    "అవి మీ కుటుంబ రహస్యాలు బాబూ! నాకెలా తెలుస్తుంది?"
   
    "ఏం మాట మాట్లాడావు పిన్నీ! నువ్వు మా కుటుంబంలోదానివి కాదా!"
   
    ఆమె ముఖం మరింత నల్లబడింది. ఏమీ సమాధానం చెప్పలా.
   
    "నాన్నగారికి నువ్వు నచ్చచెప్పలేవా పిన్నీ! నేను సరోజిన్ని తప్ప యింకెవర్నీ పెళ్ళి చేసుకోనని నీకు తెలీదూ?"
   
    సావిత్రి ప్రేమగా అతని జుట్టు నిమురుతూ "నేనేం చెయ్యను బాబూ!" అంది వేదనగా.
   
    అతను విషాదంగా "అంతేనా పిన్నీ...పోనీ నీకెందుకు యిష్టంలేదో చెప్పవేం?"
   
    ఆమె మళ్ళీ ఓసారి అదిరిపడి "ఎవరు చెప్పారు శివా నీకీ కల్పితాలు?"
   
    "తెలుసు నాకు."
   
    "ఏమిటి?" ఆమె ముఖం మరింత రక్తహీనమైంది.
   
    "నువ్వు ఏదో దాస్తున్నావు పిన్నీ నా దగ్గర. నీకూ ఎందుకో యిష్టంలేదు. ఏదో ఉంది నీ మనస్సులో చెప్పవూ?" అన్నాడతను దీనంగా.
   
    ఆమె నిశ్చింతగా నిట్టూర్చింది. 'ఛీ! ఏం అనుమానం శివా?' అంది.
   
    అతను సిగ్గుపడ్డాడు. ఓ నిముషం ఆలోచిస్తూ ఊరుకున్నాడు. ఉన్నట్లుండి అతని కనులు మెరిశాయి. "అవును, నేనెందుకు భయపడాలి? నా జీవితం ఎందుకు దుఃఖభాజకం చేసుకోవాలి? నేను సరోజిన్ని తప్ప మరొకర్ని చేసుకోనని నాన్నగారితో చెబుతాను" అంటూ తండ్రి పడుకున్న గదివైపు పోబోయాడు.
   
    "ఇప్పుడా?" అంది సావిత్రి తెల్లబోయి.
   
    "అవును యిప్పుడే."
   
    అతను గబగబ గదిలోకి వెళ్ళాడు. తండ్రి గాఢనిద్రలో వున్నాడు. "నాన్నగారూ!" అన్నాడు. ఆయనకు మెలకువ రాలేదు. మళ్ళీ ఒకసారి పిలుద్దామంటే అతనికి నోరు స్వాధీనం కాలేదు. ఒకవేళ తండ్రి నిద్రలేచాడనుకో ఎట్లా అడుగుతాడు? అతని గుండె ఝల్లుమంది. అసమర్దునిలా బయటకు వచ్చి, కళావిహీనమైన ముఖంతో మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు.

 Previous Page Next Page