Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 37

 

        అనామ ముఖం కళావిహీనమైపోయింది. ఇదేమిటి జరుగుతోంది? అయ్యో దేముడా నీరసంగా గోడకు ఆనుకుంది.
   
    శివనాథరావు అతన్ని బలంగా చేతితో తోసి "బాక్సింగా? రెడీ!" అన్నాడు. ఆ వ్యక్తి నోటికొచ్చినట్లు వదరుతూ మళ్ళీ మీదకు రాబోయాడు. శివనాథరావు యిహ సిగ్గు పూర్తిగా విడిచిపెట్టి అతనికి తగిన ప్రతిఫలం యివ్వటానికి సిద్దంగా నిలబడ్డాడు. కాని ఇంతలో అనామ మధ్యకువచ్చి భర్తను అవతలికి లాగింది.
   
    "రాక్షసీ!" అన్నాడు గర్జిస్తూ.
   
    "ఆయన జోలికి పోకు నీకు దణ్ణం పెడతాను" అన్నది అనామ కళ్ళలో నీళ్ళు గిర్రున తిరుగుతూండగా.
   
    "విడిచిపెత్తనా నీ రంకుమొగుడ్ని?" అని అతడామెవైపు ఉరిమిచూశాడు.
   
    "నీ కాళ్ళు పట్టుకువేడుకుంటాను. ముందు వారిని ఇక్కడినుండి వెళ్ళిపోనియ్యి ఇరుగూ.... పొరుగూ.." ఆమె మాట పూర్తికాకుండానే అతడామెను బలంగా అవతలకు తోశాడు. ఆమె క్రిందపడి అతని పాదాలు పట్టుకుని 'నన్ను చంపు, నరుకు. వారినేం అల్లరి పెట్టకు. వారెవరో నీకు తెలియదు. నా మాట విను' అని వెక్కి వెక్కి ఏడువసాగింది. అతనామెను బలంగా విదిలించి కొట్టి సపోర్ట్ చేస్తున్నావా?...రిజువు అడిగావుగా యిన్నాళ్ళనుంచీ? తస్సదియ్య ఇవాళ వాడ్నీ, నిన్నూ కలిపి పాతెయ్యకపోతే చూడు' అని వదరుతూ యిటు తిరిగాడు.
   
    అంతవరకూ మాట్లాడకుండా వూరుకున్న కృష్ణ నిశ్చలంగా "నీకండ పుష్టి చూచి జడుసుకుంటామనుకుంటున్నావా? సీతన్నపేటవైపు పోయి కృష్ణ అంటే ఎవరో కనుక్కో నీ యిల్లు కదా అని ప్రతాపం చూపిద్దామనుకుంటున్నావా? లే అడ్డు" అన్నాడు.
   
    ఈ ధోరణిలో విస్తుపోయి ఆ మనిషి యింకా పౌరుషంకోసం ప్రాకులాడుతూ "ఏం చేస్తావ్...?" అన్నాడు.
   
    "చూడు మరి" అంటూనే కృష్ణ అతడి దవడమీద ఒక్క ప్రహరం ప్రసాదించాడు. "బాబోయ్" అంటూ అతను దవడ పట్టుకుని ప్రక్కకి వొదిగి పోయేసరికి "ఆడదానిమీద ప్రతాపం చూపించినట్లనుకున్నావా?" అని స్నేహితుడి చెయ్యి పట్టుకుని లాగి, బయటకు నిస్సంకోచంగా నడిచాడు.
   
    అనామ వెనకనుండి పరుగెత్తుకొచ్చి ఏడుస్తూ "నన్ను క్షమించండి బాబూ!" అంది హీనస్వరంతో.
   
    స్నేహితులిద్దరూ బదులు చెప్పకుండా వెళ్ళిపోయారు.
   
    వీధుల్లో జనం పల్చగా వున్నారు. వీధి దీపాలు ఎందుకనో మందంగా వెలుగుతున్నాయి.
   
    "ఎందుకు నవ్వుతున్నావు?" అని ప్రశ్నించాడు కృష్ణ.
   
    తాను నవ్వుతున్నాడా? తన పెదవులపై శుష్కహాసం ఉదయించింది కాబోలు.
   
    అతని ప్రశ్నకు జవాబు యివ్వకుండా "వారేవా! యివాళ నీ విశ్వరూపం చూశానురా కృష్ణా నువ్వు నిజంగా కృష్ణవే" అన్నాడు.
   
    "ఆమె నీకు ఎలా తెలుసు?" మరో ప్రశ్న.
   
    ఇతడా ప్రశ్నను లెక్కచేయకుండా "నన్నుగురించి నీకు చాలా విచిత్రమైన అభిప్రాయాలు చెలరేగి వుంటాయి ఏం?"
   
    "ఆమె పేరు అనామా? అదేం పేరు?"
   
    "మనిద్దరం అక్కడున్నంతసేపూ ఆ పరిస్థితిని ఎలా భరించావో పాపం. నిన్ను చాలా ఇబ్బందిపాలు చేశాను."
   
    'ఆమె ఎంత అందంగా వుంది! ఆ నవ్వు!! ఆ చూపులు!!!"
   
    "నన్ను గురించి అపోహపడుతున్నావు కదూ."   
   
    "అటువంటి అందగత్తెకు ఆ దౌర్భాగ్యుడు మొగుడా! మంచి శాస్తి చేశాను. రెండో చెంప పగలకొడితే బాగుండేది."
   
    "అబ్బ! తలుచుకుంటే విచారంగా వుంది. నా మనస్సు సున్నితం కాదు. కాదు."
   
    "అటువంటి మనిషితో నీకు పరిచయం ఉన్నట్లు యిన్నాళ్ళు చెప్పలేదేం?"
   
    "ఈ నిముషంలో శివుడు వొట్టి దగుల్భాజీ వాడన్న సత్యం నీకు బోధపడి వుంటుంది."
   
    "మీ యిద్దరకూ అంత చనువు ఎట్లా వచ్చింది? నువ్వు అసాధ్యుడివే. మళ్ళీ అతీతంగా మాట్లాడడం."
   
    "మనం అక్కడ్నుంచి వచ్చేశాక ఏం హింస పెడుతున్నాడో ఏమో."
   
    "ఆ. ఇంతకీ నేను చెప్పదల్చుకున్న చిత్రం గమనించావా? ఆమెముఖంలో మీ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మాయి పోలిక లేదూ?"
   
    "తంతున్నాడు గావును."
   
    "అదే ముఖం, అదే శరీర సౌష్టవం మీ యింటికి వచ్చిన చుట్టాలమ్మాయి. మీ యింటికి వ...చ్చి..."
   
    "...న..చుట్టాలమ్మాయి సరోజిని-....సరోజిని....!" అదిరిపడి, ఆగి కృష్ణ భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. కృష్ణ మత్తుగా ఆగి స్నేహితుడి ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
   
    "కృష్ణా" అన్నాడు. "నేనింతసేపూ ఏం మాట్లాడుతున్నాను?"
   
    అతను అమాయకంగా చూసి "నేనేమైనా జవాబులు చెప్పేనా?" అని అడిగాడు.
   
    శివనాథరావు నిరుత్తరుడైనాడు. కానీ అది క్షణికం. అతనికి అర్ధమైంది.
   
    "నవ్వుతున్నావేం?" అన్నాడు కృష్ణ మత్తు వీడినట్లు. ఎందుకు నవ్వాడు? అది శుష్కహాసంగావును. చేత్తో పెదాలు తుడుచుకోబోయి, మళ్ళీ గట్టిగా నవ్వాడు. రోడ్డువార నడుస్తోన్న యిద్దరు ముగ్గురు మనుషులు మళ్ళీ విస్తుపోయి చూశారు.
   
    "మళ్ళీ....స్"
   
    "పద" అన్నాడు శివనాథరావు. కదిలారు.
   
                              *    *    *
   
    ఆ రాత్రి భోజనంచేసి స్నేహితుడి ఇంటికి వచ్చాడు కృష్ణ మేడమీద గదిలో కూర్చుని యిద్దరూ కబుర్లలో పడ్డారు. గోవిందు రెండు గ్లాసుల్లో పాలు తెచ్చి యిచ్చాడు. మెల్లిగా పది దాటింది. "అనామ చదువుకున్న పిల్లకాదు. అయినా చాలా తెలివిగలది" అన్నాడు కృష్ణ.
   
    శివనాథరావు తొట్రుపాటుతో "వద్దు కృష్ణా అనామని గురించి మనమిద్దరం మాట్లాడుకోకూడదు" అన్నాడు.
   
    "నీకు స్త్రీ అంటే యింత చులకన, నిర్దయ ఎందుకో చెప్పు" అన్నాడతనే కాస్త విరామంతో.
   
    కృష్ణ వక్రచాలనంచేసి "నా కలాంటివేమీ లేవు. అయితే ఒకటి. స్త్రీని ప్రత్యేకవ్యక్తిని చేసి ఆరాధించను. సామాన్యంగా వుంటాను. చాలా సామాన్యంగా వుంటాను. అంతే."
       
    శివనాథరావు పరుపుమీద ఓ చెయ్యి తలక్రింద పెట్టుకుని "నేను యిలా వింటూ వుంటాను. రమ్యమైన నీ అనుభవాలు కొన్ని చెప్పు" అన్నాడు.
   
    "అవి నీకంత రుచించవు. నాది కొంచెం నాటు వ్యవహారం. అయినా యివాళ ఈ కుతూహలం దేనికి?"
   
    "అబ్బ! చెబుదూ అడ్డుపుల్లలు వేయకుండా."
   
    "నాకు చాలా సిగ్గేస్తోంది తెలుసా?"
   
    "ఏడిశావులే. ఊ, మొదలెట్టు."
   
    నిజంగానే కృష్ణ ముఖంనిండా సిగ్గుతెరలు క్రమ్మివేశాయి.,ఇప్పుడు చాలా అందంగా ఉన్నాడు. అతని ముఖంలోకి అలా చూస్తోంటే మృదువైన ఆ చిన్న మనిషిలోని ఆకర్షణ శివనాథరావుకు అవగాహనం కాసాగింది. "నువ్వు నిజంగానే మోహన కృష్ణుడవే" అనుకున్నాడు.
   
    "అవి నేను స్కూలు ఫైనల్ చదువుతోన్న రోజులు. నేనప్పుడు స్కూలు ప్యూపిల్ లీడర్నని నీకు తెలుసు. ఒకసారి మేడమీద హాల్లో ఏదో మీటింగ్ మధ్యలో నేను పనిమీద క్రిందకు వచ్చి, యింకో పది నిమిషాల్లో పూర్తి అవుతుందనగా హడావుడిగా పైకి పోతున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పాలి. మన స్కూల్ మెట్లు తెలుసుగా మధ్యలో ఒక మెలిక ఆ ప్రదేశంలో ఒక రెండుమెట్లు ఎక్కివుంటాను. ఇంతలో మేడ మెట్లపైనుంచి ఓ అమ్మాయి దొర్లుకుంటూ వచ్చేస్తోంది. గబుక్కున యింకొంచం పైకెక్కి ఆమెను క్రింద పడకుండా పట్టుకుని, ముఖంలోకి చూసి నివ్వెరపోయాను. స్కూల్ బ్యూటీ సుందరి. నావంక దీనంగా చూసి తన రెండుచేతులూ నా కంఠానికి పెనవేసింది. నాకా స్థితిలో ఏమి పాలుపోక ఆ అమ్మాయిని పైకి లేవనెత్తుతూ మీదకు చూశాను. తొంగిచూస్తోన్న రెండు తలకాయలు చప్పున ప్రక్కకి వెళ్ళిపోయాయి. సుందరిని నా చేతులమీద వేసుకుని సైన్సు లేబొరేటరీకి తీసుకువెళ్ళాను. అక్కడ పడుకోబెట్టి ముఖంమీద నీళ్ళు చల్లి, స్మైలింగ్ సాల్ట్ వాసన చూపించి ఉపచర్యలు చేశాను. చివరకు కోలుకుని, సిగ్గుపడుతూ లేచి కూర్చుంది. ఈ సుందరి యిదివరకు ఓసారి నాగురించి హెడ్ మేష్టారికి రిపోర్టు చేసింది కూడా. ఏం జరిగిందని అడిగాను. ఆమె మీటింగ్ పూర్తికాకముందే యింటికి వెళ్ళిపోదామని గబ గబ మెట్లు దిగి వస్తోందిట. ఇంతలో యివతల గోడచాటున దాక్కున్న ఓ కుర్రాడు చప్పున కాలు అడ్డం పెట్టాడు. అంతే. గట గట దొర్లిపోతోంది. అంతలో మనం వెళ్ళి రక్షించామన్నమాట. దెబ్బ తగిలిందా అని పరామర్శిస్తూ ఆమె తల నిమిరాను. ఇంటిదాకా సాగనంపి వచ్చాను. తర్వాత ఆ కుర్రాళ్ళను సుందరి కళ్ళముందు తన్నాను. ఒకడు టి.సి. తీసుకుని పారిపోయాడు. మరొకడు అపాలజి లెటర్ రాసియిచ్చాడు. తర్వాత సుందరి నన్ను కృష్ణ ఒడ్డున కలుసుకొమ్మని లెటర్ రాసింది. ఆ తరువాత కథ శ్రోతలు ఊహింతురు గాక."

 Previous Page Next Page