"బ్రహ్మాండంగా నిద్రపోవాలని వుందండి."
"ఎందుకు అలా ఉంది?"
"ఈ ఊరునుంచి దూరంగాపారిపోయే ప్రయత్నంలో కాసేపుకూడా విశ్రాంతి తీసుకోకుండా అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని వీలయినప్పుడు ముందుకు సాగటమే సరిపోయిందండీ!"
"నీవు బాగా అలసిపోయావు. నిద్ర ముంచుకు వస్తున్నది....శరీరం విశ్రాంతి కోరుతున్నఃది....అవునా?"
"అవునండీ....కరెక్టుగా శెలవిచ్చారు."
కోళ్ళదొంగ మాట పూర్తి చేశాడో లేదో! అంత వరకు నిదానంగా ప్రశ్నలు వేస్తున్న ఇన్ స్పెక్టర్ ఏదో పూనకం వచ్చినట్లు చేతిలోవున్న బెల్టుతో కోళ్ళదొంగ వంటిమీద వీరవిహారం సల్పాడు.
కోళ్ళదొంగ అరుపులతో పోలీసుస్టేషనంతా ప్రతి ధ్వనించింది. అయితే ఆ విషయం పట్టించుకున్న నాధుడు లేడు. అక్కడున్న వాళ్ళకది సర్వసామాన్యం.
"నన్ను చంపకండి బాబో. నాకేం తెలియదు నాయనోయ్. వాళ్ళు పోతుంటే నేనూ పోయాను దేముడోయ్" అంటూ సోకాలుపెట్టాడు కిందపడి దొర్లాడు.
"లే. లేచి సరీగా నుంచో" అంటూ ఇన్ స్పెక్టర్ రంకె వేశాడు.
కోళ్ళ దొంగ లేచి నుంచున్నాడు.
"ఈ దెబ్బలకే ప్రాణం పోతున్నదిరా వేషాలు వేస్తున్నావా?"
"ఊహూ నేనెప్పుడూ కోళ్ళు తప్ప యింకేమీ దొంగతనం చేయలేదు...రెండుసార్లు పోలీసులు పట్టుకున్నారు కదండీ. అప్పుడేమో నేను దొంగిలించిన కోళ్ళు లాక్కుని జైలులో పెట్టకుండా వదిలేశారండి...అప్పుడు ఈ స్టేషన్ లో యింకో ఇన్ స్పెక్టర్ గారు వుండేవారు. ఇప్పుడేమో మీరు డ్యూటీలో గట్టివారుటండీ అందువల్ల నేను దొంగిలించిన ఆరుకోళ్ళని తీసుకుని నన్ను జైలులో పెట్టారు. నేను చేసిన దొంగతనం వెంటనే ఒప్పుకోబట్టి నా వంటి మీద దెబ్బలు పడలేదు. నేను దెబ్బలు ఎప్పుడూ తినలేదండి....కాస్త దెబ్బ తగిలినా ప్రాణం విలవిల లాడిపోతుందండి. బుద్ధి గడ్డితిని పారిపోయాను. ఇంకెప్పుడు పారిపోనండి....మీ ఇష్టమొచ్చి నన్నాళ్ళు జైలులో పెట్టండి. నన్నుమాత్రం కొట్టకండి బాబో" అన్నాడు కోళ్ళదొంగ.
కోళ్ళ దొంగ పెద్ద నాటకం ఆడుతున్న విషయం ఆ క్షణంలో ఇన్ స్పెక్టర్ గ్రహించలేదు.
"నీవు నిజం చెపితే కొట్టేపని వుండదు" ఇన్ స్పెక్టర్ అన్నాడు.
"నేను నిజమే చెప్పను కదండీ!"
"నిజమంటే అదికాదు....నేను అడిగిన ప్రశ్నలకి తడుముకోకుండా వెంటనే జవాబు ఇవ్వాలి."
అలాగే నన్నట్లు భయభక్తులతో తల తాటించాడు కోళ్ళదొంగ.
"నీవు నిజం చెప్పటం లేదన్న అనుమానం నా కొచ్చిందో ఈ బెల్టు నీ వంటిమీద భరతనాట్యం చేస్తుంది. అంతేకాదు, సీమ మిరపకాయల కరం తెప్పించి కళ్ళలో కొట్టిస్తాను. మిరియాలపొడి ముక్కు కంతలనిండా కూరి గాలి ఆడకుండా బిరడాలు పెట్టిస్తారు....అరగ్లాసు పండుమిరప కాయల కారంనీళ్ళు తాగిస్తాను....ఈ చెవిలో చీపురుపుల్ల దూర్చి ఆ చెవిలోంచి బయటికి లాగుతాను..."
"వద్దు వద్దు....అంతా నిజమే చెపుతాను" శిక్ష పేరు వింటూనే విలవిల లాడుతూ ఇన్ స్పెక్టర్ కాళ్ళమీద పడ్డాడు కోళ్ళదొంగ.
ఇన్ స్పెక్టర్ చిద్విలాసంగా నవ్వాడు.
"ప్రశ్న లడుగుతాను. లేచి సరీగ నిలబడు" సీరియస్ గా ముఖం పెట్టుకుని అన్నాడు.
కోళ్ళదొంగ లేచి నుంచున్నాడు. అలాగే నన్నట్లు తల తాటించాడు. చేతులు కట్టుకుని మర్యాదగా.
"జైలులోంచి పారిపోవటానికి పధకం పన్నింది ఎవరు?"
"తన పేరు చెపితే పాపన్న తంతానన్నాడు."
"చెప్పకపోతే నేను తంతాను."
"హత్యకూడా చేస్తానన్నాడు."
"ఏడిచాడు వెధవ బెదిరింపు. ఇప్పుడు నీవు చెప్పే నిజంవల్ల వాల్లుగాని పాపన్నగాని పట్టుబడితే వాళ్ళమీద హత్యానేరం మోపి జీవితాంతం జైలుపాలు చేస్తాను...నిన్ను విడిచిపెడతాను. చాలా, ఇంకా ఏదైనా హామీ కావాలా?"
"నిజంగానండీ?"
"ఆ...అయితే నీవు చెప్పిందాంట్లో చిన్న అబద్దం కూడా దొర్లకూడదు. నీతోపాటు పారిపోయిన వాళ్ళలో ఇంకొకడు దొరికాడనుకో వాడిని అడుగుతాను నీవు చెప్పిన కధ వాడు చెప్పిన కధ సరిపోవాలి."
"ఓవేళ వాడు అబద్దం చెపితే?" కోళ్ళదొంగ అణుమానం వెళ్ళగక్కాడు.
"వెధవ తెలివితేటలు చాలానే వున్నాయి....ఎవడు నిజం చెపుతున్నాడో, ఎవడు అబద్దం చెబుతున్నాడో ఆ మాత్రం గ్రహించలేకపోతే ఈ ఉద్యోగం దేనికి"? ఇన్ స్పెక్టర్ కించిత్ గర్వంగా అన్నాడు.
కోళ్ళదొంగ లోలోన నవ్వుకున్నాడు.