అభిరాంకి అతనున్నా స్థితిలో చూసి ఒక్కక్షణం దిగులేసింది. డాక్టర్ మళ్ళీ తలుపు మూసి వెనుదిరిగాడు.
ఇద్దరూ డాక్టర్ గదిలో కూర్చున్నారు. కొంచెంసేపు మానం రాజ్యమేలిందక్కడ. ఆ మౌనాన్ని భరించలేనట్లు అన్నాడు అభిరాం....
"మహదేవ్ కి తలకి గాయమైందన్నారు. మరేమి ఫర్వాలేదా డాక్టర్?" ఏదో దీర్ఘాలోచనలో వున్న డాక్టర్ వులిక్కిపడ్డట్టు అభిరాం వంక చూశాడు. మళ్ళీ తన ప్రశ్నని రిపీట్ చేశాడతను. దానికి వెంటనే ఏం సమాధానం చెప్పలేదు ఆ డాక్టర్.
అతని ముఖం ఏదో విషయాన్ని చెప్పటానికి సందేహిస్తున్నట్టుగా గుర్తించాడు అభిరాం. ఎందుకో అతని వెన్నులో జలదరింపు.... మహదేవ్ గురించి ఎటువంటి విషయం వినాల్సి వస్తుందోనని.
డాక్టర్ ఏదో చెప్పడానికి సంసిద్దుడైనట్లు ముందుకు వంగాడు. అభిరాం ధైర్యాన్ని కూడదీసుకుని అతను చెప్పే విషయాన్ని వినటానికి రెడీ అయ్యాడు.
"ఎక్స్ క్యూజ్ మీ డాక్టర్! మిమ్మల్నోసారి చీఫ్ రమ్మంటున్నారు" ఓ నర్సు వచ్చి చెప్పింది.
"ఎక్స్ క్యూజ్ మీ" అని బయటికి నడిచాడతను. అభిరాం నిట్టూర్చాడు. క్షణాలు నిముశాలుగా రూపాంతరం చెంది అభిరాం సహనాన్ని పరీక్షిస్తున్నాయి.
ఇంతలో ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు- అభిరాం ద్వారం వంకే చూస్తున్నాడు.
అక్కడ ప్రత్యక్షమయ్యాడు వరప్రసాదం. అతన్ని చూడగానే కొండంత ధైర్యమొచ్చినట్టనిపించిందతనికి. అయినా బయటికి మాత్రం "అరే! విశ్రాంతి తీసుకోపొయారా?" అన్నాడు.
"ఇంటి దగ్గరేం తోస్తుంది. అందుకే అన్ని పనులు త్వరత్వరగా ముగించుకుని వచ్చేశాను. మహదేవ్ విషయంలో డాక్టర్ చెప్పేదేమిటి!" అభిరాం పక్కనే కూర్చుని అడిగాడతను.
ఆ మాటతో మళ్ళీ అభిరాం మొహం పాలిపోవటం గమనించి మహదేవ్ పరిస్థితి విషమించిందా?' అనుకున్నాడు వరప్రసాదం.
"డాక్టర్ మహదేవ్ ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్పాడు" అన్నాడు అభిరాం.
"అలాగా" తేలిగ్గా అన్నాడు వరప్రసాదం.
"కానీ..." అంటూ ఆపాడు అభిరాం.
"ఆఁ... కానీ?" ఆతృతగా అడిగాడు వరప్రసాదం.
"మహదేవ్ ప్రాణానికేం భయంలేదని చెబుతున్నా మరేదో విషయం ఆయన చెప్పేలోగా చీఫ్ నుంచి ఆయనకు పిలుపొచ్చింది. ఇంతలో మీరొచ్చారు..." జరిగింది వివరించాడు అభిరాం. వరప్రసాదం మౌనంగా వుండిపోయాడు. దీర్ఘాలోచనతో అతని భ్రుకుటి ముడిపడింది.
ఇంతలో డాక్టర్ వస్తున్నట్లు బూట్ల శబ్దం విన్పించింది. అభిరాంకి ఆ శబ్దం విన్పించగానే తన గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం తెలుస్తోంది.
వరప్రసాదం కూడా ఆతృతగా చూడసాగాడు. డాక్టర్ వచ్చి తన సీట్లో కూర్చున్నాడు.
"మీరు కూడా వచ్చేశారా?" చిరునవ్వుతో పలకరించాడు వరప్రసాదాన్ని.
మౌనంగా తలూపాడతను.
"మహదేవ్ హెల్త్ కండిషన్ బాగానే వుంది" వరప్రసాదం వంక తిరిగి అన్నాడు డాక్టర్.
అభిరాంకి విసుగూ, కోపం వచ్చాయి.
చెప్పాలనుకున్నదేదో చెప్పెయ్యొచ్చుకదా! ఎందుకు దాస్తున్నాడు? అనిపించిందతనికి.
కొన్ని క్షణాలు మౌనం తర్వాత ఇలా అన్నాడు డాక్టర్- "మన మెదడు వెయ్యి కంప్యూటర్ల కన్నా గొప్పది. ఎన్నో కణాల కూర్పుతో, సెల్స్ తో, ప్రపంచంలోనే అద్భుతమైనవాటి అన్నిటికంటే మహాద్భుత మైనది. మనిషి మెదడులో జ్ఞాపకశక్తికీ, తెలివితేటలకి సంబంధించి ఎన్నో భాగాలూ, జన్యుఉలూ వుంటాయి. వీటిలో ముఖ్యమైనవి రెండు. అందులో మొదటిది "హిప్పోక్యాంపస్, రెండవది సెరెబ్రల్ కార్టెక్స్..."
డాక్టరెందుకా విషయాలు చెబుతున్నాడో అర్ధంకాలేదు వాళ్ళకి. డాక్టర్ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. "అలాగే మెదడులోని ఫ్రంట్ లోబ్ వ్యక్తిత్వాన్నీ, ఎమోషన్స్ నీ, నిర్ణయాలు తీసుకోవటాన్నీ అదుపు చేస్తుంటుంది. పరియెటల్ లోబ్ భాషనీ, తర్క విజ్ఞానాన్నీ కలుగజేస్తుంది. మనిషి మెదడులోని సెల్స్ సమాచారాన్ని ప్రింట్ చేసుకుంటాయి.
వృద్దాప్యం ముంచుకొస్తున్న కొలదీ సెల్స్ చచ్చిపోతుంటాయ్. సెల్స్ లో ఒకదానికీ మరొకదానికీ ఇంటర్ కనెక్షన్స్ వుంటాయి. అంటే చచ్చిపోయిన సెల్ లో నిక్షిప్తమైన సమాచారం పూర్తిగా కానీ, కొంతగానీ వేరొక సెల్ లో వుండవచ్చు.
సాధారణంగా మనం మన మెదడు సామర్ధ్యంలోని కేవలం మూడు నుంచి నాలుగుశాతం మాత్రమే ఉపయోగించుకుంటున్నాం మెదడు గురించిన పనితనం డాక్టర్లకి తెలిసింది చాలా తక్కువ మాత్రమే.
విషపదార్ధాల మూలంగా మెదడు కణజాలం దెబ్బతినకుండా కాపాడే గుణం ఈస్ట్రోజెన్ కుంది, గర్భాశయంలో వున్న పిండం మెదడు అభివృద్ధి చెందడంలో ఈస్ట్రోజెన్ వుపయోగపడుతుందని ఇంతవరకూ అనుకునే వారు. అంతేకాదు పెద్దవారిలో కూడా జ్ఞాపకశక్తిని పెంపొందించ గల సామర్ధ్యం ఈస్ట్రోజెన్ కు వుందని శాస్త్రవేత్తలు పరి శోధనల్లో తెలుసుకున్నారు.
అయితే జ్ఞాపకశక్తి పెరగడానికి ఎక్కువ మోతాదులో ఈస్ట్రోజెన్ తీసుకుంటే స్త్రీలలో అయితే క్యాన్సర్ వ్యాధి, మగవాళ్ళలో అయితే స్త్రీ లక్షణాలు పెరిగే ప్రమాదం కూడా వుందని గమనించిన పరిశోధకులు ఈస్ట్రోజెన్ ప్రభావం కేవలం మెదడుపైనే వుండే విధంగా తక్కువ మోతాదులో దాన్ని మెదడుకి అందించాలని పేర్కొంటున్నారు..." ఆగాడతను విరామం కోసమన్నట్లు.
డాక్టర్ ఎందుకు మెదడు గురించి మాట్లాడుతున్నాడో అర్ధంకాక మళ్ళీ మనసులో గుంజాటన పడ్డారు అభిరాం, వరప్రసాదం లిద్దరూ.
డాక్టర్ చెప్పటం మొదలుపెట్టాడు- "కొన్ని కేసుల్లో భయం, జుగుప్స కలిగించే సంఘటనలు, విపరీతమైన బాధవల్ల మన మెదడులోని సెల్స్ నిద్రలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏ విషయాల వల్లనైతే మనిషి మెదడులోని సెల్స్ నిద్రలోకి వెళ్ళిపోయాయో తెలుసుకుని ఆ విషయాలని చర్చిస్తూ ఆ సెల్స్ ని తిరిగి రివైన్ చేయవచ్చు. ఉదాహరణకు మనం రోడ్డుమీద వెళుతుండగా చూసిన అతిభయంకరమైన మర్డర్, ఏక్సిడెంటులు వంటి సంఘటనలు. ఆ సంఘటన చూసిన అందరికీ బ్రెయిన్ సెల్స్ నిద్రలోకి వెళ్ళిపోయి జ్ఞాపకశక్తి పోవడం వంటివి జరగకపోవచ్చు.