Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 37

    హోమ్ ఆవరణలోనే షామియానాలు కట్టి స్టేజ్ తయారుచేసారు. ఆ స్టేజ్ మీద ముందు ఆరు కుర్చీలు వేసారు. ఎవరో మంత్రిగారిని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఆ మంత్రిగారు రాబోతున్నారని పోలీసుకాపలా మత్రిగారు ఎప్పటికీ ఊడిపడరు. ఆయనగారు వేంచేసేవరకూ మిగిలిన వి.ఐ.పి.ల ఉపన్యాసాలు వేదికమీద వారు వాగుతోంటే, సభలో ఎవరి ముచ్చట్లు వాళ్ళు చెప్పుకొంటున్నారు. మైకుముందు గొంతెత్తి "ప్రజా సేవ" గురించి అరుస్తోంటే, సభలో కొత్తచీరల గురించీ, ఊరగాయపచ్చళ్ళ గురించీ, సినిమా తారలగురించీ గోలగోలగా కబుర్లు....    
    మంత్రిగారు వస్తున్నారని కాబోలు వి.ఐ.పి.లు చాలామంది రాసాగారు. స్టేజిమీద ఆరుకుర్చీలూ చాలక కార్యకర్తలు హడావుడి పడసాగారు. వాలంటీర్లుగా వున్నా అమ్మాయిలను పరుగెత్తించసాగారు.    
    "ఇప్పుడు సెక్రటరీగారొచ్చారు. మెత్తలకుర్చీ పట్రండి." అని కాస్సేపు- "డాక్టరుగారొచ్చారు. మామూలుకుర్చీ పట్రండి_చాలు" అని మరి కాస్సేపు..... ఇలా చూస్తూ ఉండగా కుర్చీల సంఖ్య పెరిగిపోయింది. స్టేజినిండా దడికట్టినట్లు కుర్చీలే. ఈహడావుడిలో కొన్నికుర్చీలు వెనక్కు పోవలసివచ్చింది. మరికొన్ని కుర్చీలు ముందుకొచ్చాయి. వెనుకకుర్చీలలో వి.ఐ.పి. లు తమను వెనక్కు తోసేసినందుకు కోపగించుకొని మూతులు ముడుచుకుని రుసరుసలాడసాగారు. మరికొందరు ఎలాగో ఒకలా మంత్రిగారి పక్కన ఒక కుర్చీ దొరికితే చాలని తాపత్రయ పడసాగారు.    
     ఎట్టకేలకు మంత్రిగారు వేంచేసారు. ఆహ్వానాలు, స్వాగతాలు, సంభ్రమాలు, ఆ తరువాత మత్రిగారి ఉపన్యాసం.    
    "ఇప్పుడు మనమంతా నడుంకట్టి ఇట్లాంటి అభాగ్యుల సేవకి గట్టి దీక్ష వహించాలి."    
    మంత్రిగారినోట "వుప్పుడు" అని ఇప్పుడుకు మారుగా విని తన చెవులను తాను నమ్మలేకపోయింది. 'ఇంత ఏస ఉంటుందా, నాగరికుల మాటల్లో!' అనుకుంది.    
    ఇప్పుడీ యువకుడు ప్రయత్న పూర్వకంగా నేర్చుకొన్న ఏస- ఆనాడు మంత్రిగారు ఎంతో తంటాలుపడి కమ్ముకోవాలని ప్రయత్నించిన ఏసకంటె వెయ్యిరెట్లు బాగుంది. అందరికీ తెలియజెప్పాలనే ఆశయంతో ప్రయత్నించి సాధించిన ఏస ఇది.    
    ఒక్కొక్కరూ, మాట్లాడి మిగిలినవాళ్ళతో సమంగా కింద కూచుంటున్నారు. అందరిలో తాము ఒకరయినట్లు మెలుగుతున్నారు.    
    అదయిన తరువాత భోజనాల కార్యక్రమం సాగింది. పెళ్ళివిందులో ఇది కలిసిపోయింది. ఆ ఆటవిక గ్రామీణులతో కలిసిపోయి బంతులుదీరి కూచున్నారు-రాజు, మొదలైనవారందరూ వాళ్ళలోనే కొందరు వడ్డనకు పూనుకున్నారు. రాజుకూడా వడ్డనపాత్ర అందుకున్నాడు. శామితో కలిసి కిందకూచుని, విస్తరాకులో భోజనం చెయ్యటం ఎలాగో అనిపించి శకుంతలకి, అక్కడినుంచి లేచి పారిపోవాలనీ అనిపించింది కానీ, వడ్డిస్తున్నది రాజు బహుశః అతడు ఇలాగే తింటాడేమో! తిన్నవాళ్ళలో కొంతమంది, వడ్డిస్తున్నవాళ్ళకు తర్వాత వడ్డిస్తారేమో!    
    శకుంతలకి ఆనాడు తమ హోమ్ లో జరిగిన విందు కార్యక్రమం గుర్తువచ్చింది. ఆ విందులో తమ కెవరికీ ప్రవేశం లేదు. బిరియానీ, స్వీట్స్, చికెన్, మొదలైనవి తెప్పించారు. ఎంత తిన్నారో అంత వదిలేశారు. వాళ్ళు వదిలేసినవి కూడా హోమ్ లో వాళ్ళకి దక్కలేదు. ఎవరు తీసుకెళ్ళారో తెలీదు. ఆ విందుకి వెయ్యి రూపాయలు ఖర్చయిందన్నారు. నిజంగా ఎంత ఖర్చయిందో, మిగిలినది ఎవరెవరి జేబులలోకి ఎంత వెళ్ళిందో ఎవరికీ తెలీదు అదంతా తమ సొమ్ము, ఏ ఆశ్రయంలేని నిర్భాగ్యుల పేరిట చందాలు తెచ్చి జమచేసిన సొమ్ము అనాథలపేరు చెప్పి ప్రజలనుండి వసూలుజేసిన సొమ్ము శకుంతలలాంటి కొందరి బంధువులు తమవారి సౌకర్యంకోసం ఇచ్చిన సొమ్ము.    
    వడ్డన పూర్తయింది. ఫేంట్లలో ఉన్న గర్ల్ గైడ్స్ ఉత్సాహంగా ఏదో మాట్లాడుతున్నారు - ఆటవిక గ్రామీణులతో వాళ్ళంతా ఒకచోట కూర్చోలేదు. ఆటవిక గ్రామీణులతో కలిసిపోయి కూచున్నారు వాళ్ళతో కబుర్లు చెప్పుతూనే భోజనం చెయ్యసాగారు. అందరూ తింటోంటే, శకుంతల ఒక్కత్తే అన్నం కలుపుతూ కూచుంది రాజు గిన్నె, గరిటె పట్టుకొని శకుంతల దగ్గిరగా వచ్చి "ఏంకావాలి?" అన్నాడు.    
    కళ్ళెత్తింది ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. కలుసుకుని కొన్ని క్షణాలు నిలిచిపోయాయి.    
    శకుంతల కళ్ళలో మెరుపులు!    
    రాజు కళ్ళలో బెదురు.
    కొంచెం ముందుకు వంగి, "తిను!" అనేసి ముందుకు సాగిపోయాడు. అప్పుడు తినటం మొదలుపెట్టింది. "తిను!" అన్న రాజు మాటలు చెవిని పడగానే, విస్తరాకులో ఉన్న ఆ అన్నం, పప్పూ అద్భుతంలా తోచాయి.    
    'రాజు తనను గుర్తుపట్టాడు. అది చాలు తనతో మాట్లాడలేదు, ఫర్వాలేదు.'    
    రాజు శకుంతలతో "తిను!" అనటం శామీకూడ వింది. ఆమె మనసు స్థిమితపడింది. పంక్తిలో విమల్ లేకపోవటం గమనించింది శకుంతల. 'ఎక్కడుంది? వంటింట్లో ఉందా? ఎలా తెలుస్తుంది? ఇక్కడ మాట్లాడనని శామీకి వాగ్దానమిచ్చింది కాని, తల్లిని మరోసారి చూడాలి! ఎలా?    
    భోజనాలు ముగిసాయి. శకుంతల ఊహించినట్లే రాజూ మరి కొందరూ కూచుంటే, మిగిలినవాళ్ళు వడ్డించసాగారు. ఈ అనాగరికులతో, దరిద్రులతో, ఇంతగా కలిసిపోవటం సాధ్యమని తనకళ్ళతో చూసినా నమ్మలేకపోతోంది. రాజునే చూస్తూ నిలబడ్డ శకుంతలని చూసి శామీ కంగారుపడింది.    
    అతి నెమ్మదిగా- "నాతో రా! మా వూరంతా చూపుతా." అని చెయ్యిపట్టుకు లాక్కుపోయింది. గుడిశెలుతప్ప చూడడానికేమీ లేదు.    
    ఇక్కడి విశేషం మురికి లేకపోవటం. పెద్ద పెద్ద సిటీలలో సహితం గుడిశెలకు కాస్తదూరంగా సగంవరకే గోడలున్న మరో పెద్ద గుడిశెవుంది.
    "అదేమిటీ?" అడిగింది శకుంతల.    
    "అదే మా బడి రా! చూద్దువుగాని, ఇయ్యాల బడి లేదు" శామి ముందుకు దారి తీసింది. ఆసక్తితో శకుంతల అనుసరించింది.    
    ఆ బడిలో అడుగుపెట్టగానే, మరోసారి బొమ్మలా అయిపోయింది ఒక ఈతాకుల చాపమీద కూచుని వుంది విమల, ఆమెచుట్టూ పిల్లలు వూడిపోతున్న లాగులతో, గోచీలతో, చింపిరి జుట్టులతో, చీమిడిముక్కులతో, చిరిగిన చొక్కాలతో అంతా ఆమెచుట్టూ కొందరు మీదకెగబాకుతూ, కొందరు ఒళ్ళో కూచుంటూ, కొందరు చేతులు పట్టుకొని వూపుతూ, అంధరితో చిరునవ్వుతో మాట్లాడుతోంది. వాళ్ళ ప్రశ్నలు ఓపిగ్గా వింటోంది. సమాధానాలు చెపుతోంది. ముక్కుచీమిడి ఎలా తుడుచుకోవాలో చూపిస్తోంది.    
    'తన తల్లిలో ఇంత సహనం ఉందా? ఇంత ఆదరంగా ఈ పిల్లలందర్నీ నిజంగా ప్రేమించగలుగుతోందా? లేకపోతే, వీళ్ళంతా అంత చనువుగా ఎలా ఉండగలరు?'    
    మధ్యలో ఒకసారి విమలతలెత్తి శామివంక చూసింది. ఏంమాట్లాడ కుండా తలదించుకొని మళ్ళీ పిల్లలతో మాటలలో పడిపోయింది. వెంటనే శామీ శకుంతల చెయ్యి పట్టుకొని బరబరా ఈడ్చుకొచ్చేసింది అక్కడి నుంచి. అప్పటివరకూ శామీలో అంతబలం వుందని శకుంతలకు తెలీదు. ఎంత విడిపించుకోవాలని ప్రయత్నించినా విడిపించుకోలేకపోయింది. బడికి కొంత దూరంగా మద్దిచెట్ల మధ్యకొచ్చాక అప్పుడు విడిచిపెట్టింది.    
    "ఏమిటిది?" కోపంగా అంది శకుంతల.

 Previous Page Next Page