Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 36

తలవంచుకునే హరీన్ దగ్గరికి వచ్చాడు దేశింగ్. చటుక్కున హరీన్ చేతులు పట్టుకున్నాడు.
"న తప్పు నాకు తెలిసింది హరీన్! మనిషిగా పుట్టటం గొప్ప కాదు. నిజమైన మనిషిగా బతకడమే చాలా గొప్ప. నీ ప్రవర్తనలో నాలో పరివర్తన తెచ్చింది హరీన్! ఇది నిజం!"
ఆప్యాయంగా అతని భుజం తట్టాడు హరీన్.
దేశింగ్ నెమ్మదిగా నాయకుడి దగ్గరికి వచ్చి అతని పాదాల దగ్గర మోకరిల్లాడు.
"అధికారవ్యామోహం నా కళ్ళకు మసకలు కమ్మెటట్లు చేసింది నాయకా! నన్ను క్షమించు."
వంగి దేశింగ్ ని అభిమానంగా పైకి లేవదీశాడు నాయకుడు. "తప్పులు అందరం చేస్తూనే వుంటాం దేశింగ్. కానీ వాటిని దిద్దుకుని ఒప్పులుగా మార్చుకోవడంలోనే వుంది గొప్పదనం. జరిగినదంతా మర్చిపో.....బాధపడకు!"
"నా తప్పులు నాకు తెలిసేలా చేసింది ఈ హరీన్ నాయకా. ఇంకా నాకు నాయకత్వం కోసం పోటీపడి కుట్రలు పన్నాలనే కోరికా పోయింది. బతికి వున్నంత కాలం నువ్వే నాయకుడివి!" అన్నాడు దేశింగ్.
అప్పుడు వినబడ్డాయి వాళ్ళకి చిక్ లీ వెక్కిళ్ళు.
ఆమె దగ్గరికి నడిచాడు హరీన్. అబిమానంగా ఆమె తల నిమిరాడు. "చిక్ లీ! నిన్ను నేను చిక్ లీ అని పిలవను! చెల్లీ అని పిలుస్తాను........సరేనా?"
ఇంకా వెక్కిళ్ళు పెడుతూనే వుంది చిక్ లీ.
హరీన్ అన్నాడు "చెల్లీ! నేను మొదటినుంచి చెబుతూనే వున్నాను. నేను నీ జింబురూని కాను. సినిమా యాక్టర్ హరీన్ ని అని. కానీ నువ్వు నమ్మలేదు. దురదృష్టవశాత్తు నీ జింబురూ నిజంగానే సింహంవాత పడ్డాడమ్మా. నువ్వు జింబురూని పెళ్ళాడాలనుకున్నావు. కానీ జింబురూ ఇకలేడు. ఈ దేశింగ్ నిన్ను మనువాడాలనుకున్నాడు. చెల్లీ.....పెద్దలు ఏం చెప్పారో తెలుసా? నువ్వు ప్రేమించిన వాళ్ళని పెళ్ళాడటం కంటే నిన్ను ప్రేమించినవాళ్ళని చేసుకోవడం ఎంతో సుఖదాయకమని.........అందుకని నువ్విటురా!"
దగ్గరికి వచ్చాడు దేశింగ్.
చిక్ లీ చేతిని దేశింగ్ చేతిలో పెట్టాడు హరీన్. "దేశింగ్ .......మా చెల్లిని చల్లగా చూసుకో. ఏమంటావ్?"
దేశింగ్, చిక్ లీ ఇద్దరి మొహాల్లో మొహమాటంతో కూడిన చిరునవ్వు కనపడింది. నాయకుడు ఆశీర్వచనం చదువుతున్నట్లు వాళ్ళ భాషలో ఏదో అన్నాడు.
అప్పటిదాకా చెక్కబొమ్మల్లా నిలబడి ఉన్న పోలీసులవైపు తిరిగాడు హరీన్. "ఇంక మనం వెళదామా?"
అది వినగానే చిక్ లీ ఆదుర్దాగా అంది - "హరీన్! నీ భుజంలో బాణం గుచ్చుకుంది. ఇంకొక్కరోజు ఈ లోయలోనే ఉంటే మూలికా వైద్యంతో అది నయమైపోతుంది. సరేనా?"
కరుణ వైపు చూశాడు హరీన్. తను వైద్యం కోసం మరొక్కరోజు ఈ లోయలో ఉండిపోతే, అనుకోని మరో సంఘటన ఏదన్నా జరిగి పరిస్థితి తారుమారైపోవచ్చు. తన మూలంగా కరుణా పోలీసులూ మళ్ళీ అపాయాలలో చిక్కుకోవడం ఎందుకు?
అందుకని వద్దన్నట్లు తల అడ్డంగా తిప్పాడు హరీన్. కరుణ ఏదో అనబోతున్నా ఆమెను వారించాడు.
అతని భావాన్ని అర్ధం చేసుకున్నట్లు మౌనంగా ఉండిపోయారు కరుణా, చిక్ లీ.
అందరూ హెలికాప్టర్లలోకి ఎక్కడం మొదలెట్టారు.
కరుణ, హెలికాప్టర్ లోకి ఎక్కబోతుంటే , ఎండబెట్టి పండ్లు రెండు అందించింది చిక్ లీ. "మొదటిరాత్రి మర్చిపోకుండా తినండి మీరు. స్వర్గం బెత్తెడు దూరంలోకి వచ్చేసినట్లు అనిపిస్తుంది" అంది చిలిపిగా.
కరుణ మొహం ఎర్రబడింది.
మరో అయిదు నిమిషాల తర్వాత హెలికాప్టర్స్ గాలిలోకి లేచాయి.
సిటీకి తిరుగు ప్రయాణం మొదలయింది.
కానీ సిటీకి చేరుకున్నాక, అక్కడ మరణం కంటే ఘోరమైన పరిస్థితి తనకు ఎర్పడబోతోందని అప్పట్లో తెలియదు హరీన్ కి.
    
                                                             29

హరీన్ వస్తున్న హెలికాప్టర్ సిటీలో దిగగానే గుంపులు గుంపులుగా జనం చుట్టేశారు దాన్ని. ఆ జనంలో ఎక్కువశాతం మంది హరీన్ అభిమానులే. హరీన్ బతికే ఉన్నాడనీ, రఘుపతీ బృందం అతన్ని వెదుక్కుంటూ మళ్ళీ లోయలోకి వెళ్ళిందనీ తెలిసింది వాళ్లకి. అప్పటినుంచి అక్కడే పడిగాపులు కాస్తున్నారు చాలామంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా కొంతమంది వచ్చారు గానీ, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఆ వచ్చిన వాళ్ళలో కూడా చాలామంది అభిమానంతో, ఆరాటంతో వచ్చిన వాళ్ళు కాదు. ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంతో వచ్చిన రకమే ఎక్కువ. కొత్త సూపర్ స్టార్ కిశోర్ అక్కడి పరిస్థితిని అంచనా వేసి అరాతియ్యడానికి తన గ్రూపు మనుషులని కొంతమందిని పంపాడు. ఇప్పుడే కాదు - ఇండస్ట్రిలో ప్రతి మూలా అతని వేగులవాళ్ళు ఉంటారు. ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల మీద కిశోర్ కి తెలిసిపోయింది. ఈరోజుల్లో ఏ రంగంలో రాణించాలన్నా టేలెంటుకంటే,మ్ శక్తి సామర్ధ్యాల కంటే కూడా రాజకీయాలూ , గ్రూపులూ, కుట్రలూ, ఎత్తుకి పైఎత్తులూ అత్వవసరం అని అర్ధం చేసుకున్నవాళ్ళలో కిశోర్ ఒకడు. అతనికి ఆ విద్య చేపపిల్లకి నీళ్ళలో ఈదడం చేతయినంత సహజంగా పట్టుబడింది.
అలాంటి తంత్రాలు ప్రయోగించడం హరీన్ కి చేతకాదు. అసలు అతనికి ఏనాడూ అలాంటి అవసరం రాలేదుకూడా.
హరీన్ పిక్చర్స్ వరసగా నాలుగు ప్లాపయినా కూడా ఇంకా అతనికి జనంలో వున్న ఫాలోయింగు చూసి కొంచెం గాభరాపడ్డారు. కిశోర్ మనుషులు. పరిస్థితిని ఆకళింపు చేసుకుని, అక్కడి వార్తలు కిశోర్ కి చేరవెయ్యడానికి త్వరత్వరగా వెళ్ళిపోయారు.
తన అభిమానులకి నమస్కరించాడు హరీన్. గాయమై భుజం నొప్పిపుడుతున్నా ఆప్యాయంగా కరస్పర్శలు చేశాడు వాళ్ళతో.
తర్వాత జనాన్ని కలయజూశాడు హరీన్. వచ్చిన కొద్దిమంది సినిమావాళ్ళలో హీరోయిన్ మధుమతి వుంది. తనని చూసిన ఆనందంతో వెలిగిపోతోంది ఆమె మొహం.
అంతే!
ఆమె తప్ప తన వాళ్ళనుకుంటున్నవాళ్ళు మరెవ్వరూ రాలేదు.
అక్కడికి వచ్చిన విలేఖరుల్లో సెన్సేషనల్ జర్నలిస్టు ధనుంజయ్ కూడా ఉన్నాడు. అతను ఉబలాటాన్ని ఆపుకోలేక హరీన్ చెవిలో ఊదేశాడు.
"మీ పిక్చర్స్ వరుసగా నాలుగు సూపర్ ప్లాపయిపోయాయి. అయిదో పిక్చరు రేపు రిలీజు ఉంది. ఒపెనింగ్స్ అంత ఆశాజనకంగా ఉండేటట్లు కనబడటం లేదు" అని.
విని నిర్వేదంగా తల పంకించాడు హరీన్.
సో........ఇలా ఉంటుందన్నమాట ప్లాపువాసన అంటే - అనిపించింది అతనికి. అతను చిత్రరంగంలో అడుగుపెట్టాక వేసిన ప్రతి అడుగూ ముందడుగే అయింది గానీ వెనకడుగు వెయ్యడం అంటూ జరగలేదు. అతని పిక్చర్సూ ఎప్పుడూ మూడు రకాలుగా ఉండేవి. బాగున్నవి. చాలా బాగున్నవి. అద్బుతంగా ఉన్నవి. అంతే!
ఫేయిల్యుర్స్ తాలుకు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తను ఎరగాకపోయినా, ఫేయిల్యుర్స్ తాలూకు ఎఫెక్ట్ ఎలా వుంటుందో చాలాసార్లు ప్రత్యక్షంగా గమనించి చూశాడు హరీన్.
మంచి స్వింగులో ఉన్న సినీప్రముఖుడు తన కొత్త పిక్చరు తాలూకు టాక్ ఎలా ఉందో తెలుసుకుందామని ఆంధ్రాకి వెళుతుంటే ఆయన్ని సాగనంపడానికి యాభైకార్లు వచ్చాయి ఎయిర్ పోర్టుకి.
చాలా ఘోరంగా ఫ్లాపయిపోయింది ఆ చిత్రం. ఆ తర్వాత అయన మద్రాసు తిరిగి వచ్చాడు.
అయన వెళుతున్నప్పుడు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన యాభై మందిలో ఒక్కరూ రాలేదు - ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి తన సొంత కారు తప్ప మరో కారు రాలేదు ఎయిర్ పోర్టుకి.
ఈ ఇండస్ట్రిలో విజయానికి ఇచ్చే ఆదరణ, అపజయంపట్ల చూసే తృణీకారం అంతస్పష్టంగా , అంతవేగంగా కనబడిపోతుంటాయి.

 Previous Page Next Page